Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అక్షర ఖడ్గం – వేములవాడ పద్యం

[శ్రీ లెనిన్ వేముల గారి ‘అక్షర ఖడ్గం – వేములవాడ పద్యం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

కొందరు కవులు రాసింది కొంచెమే ఐనా, సాహిత్య ప్రపంచంపై చెరగని ముద్రవేసి చిరంజీవులైతారు. ‘చెయ్యెత్తి జైకొట్టి తెలుగోడా’ రాసిన వేములపల్లి శ్రీకృష్ణ, ‘ఎంత చక్కని కన్నులమ్మ’ రాసిన ‘వజ్రాయుధం’ అవంత్స సోమసుదర్ ఇలా కొందరు రచయితలు చిన్నపాటి వజ్రాల్లాంటి తునకల్ని వెదజల్లి సాహిత్య లోకాన్ని మొత్తాన్నీ ప్రకశింప చేశారు. అటువంటి రచయితలు అతి ప్రాచీన కాలం నుండీ ఉన్నారు. వారిలో ఇప్పటికి మనకు దొరికిన పది పదిహేను పద్యాలతోనే ఎంతో ప్రాచుర్యం పొందిన కవులూ ఉన్నారు. అదిగో! ఆ కవులలో ఒకరు వేములవాడ భీమకవి. “వచియుంతు వేములవాడ భీమన భంగి నుద్దండలీల నొక్కొక్క మాటు; భాషింతు నన్నయ భట్టు మార్గంబున నుభయ వాక్ప్రౌఢి నొక్కక్క మాటు” అంటూ శ్రీనాధ కవి సార్వభౌముడు ఈ కవిని నన్నయ కంటే ముందుగా కీర్తించాడు. వేములవాడ భీమకవి రాసిన ‘ఖడ్గ సృష్టి’ పద్యాన్ని శ్రీశ్రీ ముందుమాటగానే కాక ఏకంగా కావ్యానికే ఆ పేరు పెట్టి ఆ పద్యాన్ని అజరామరం చేశాడు, ఆ కవిని ఆకాశానికెత్తి మెరిసే తారగా నిలుపాడు.

“గరళపు ముద్ద లోహమవ గాఢ మహా శనికోట్లు సమ్మెటల్
హరు నయనాగ్ని కొల్మి ఉరగాధిపు కోరలు పట్టుకార్లు ది
క్కరటి శిరమ్ము దా లయకాలుడు కమ్మరి వైరివీర సం
హరణ గుణాభి రాముడగు మైలమ భీమన ఖడ్గ సృష్టికిన్” — వేములవాడ బీమకవి ఖడ్గ సృష్టి

గరళపు ముద్ద = విషపు ముద్ద; అవగాఢ = దట్టమైన/ధృడమైన; అశని = పిడుగులు , ఉరగాధిపు = పాము కోరలు, దిక్కరటి = దిక్కులను కాపాడే ఏనుగులు, లయకాలుడు = పరమశివుడు; కమ్మరి = కమ్మరి; వైరివీర సంహరణ గుణాభి రాముడు = శతృ వీరులను సహరించే గుణం గలవాడు; మైలమ భీమన= చారిత్రక వ్యక్తి, ఒక మహావీరుడు.

తాత్పర్యము:
శివుడి కంఠంలో ఉన్నటువంటి విషం ఒక దృఢమైన లోహ రూపం దాల్చగా, కోట్ల సంఖ్యలో కురుస్తున్న పిడుగులు సమ్మెటలు కాగా, శివుడి కంటిలోని అగ్ని ఒక కొలిమి కాగా, శివుడి మెడలోని సర్పరాజు కోరలు పట్టుకార్లు కాగా, దిక్కులను కాపాడే ఏనుగుల కుంభస్థలాలు దిమ్మెలు కాగా, స్వయంగా పరమ శివుదు తానే ఒక కమ్మరి కాగా శతృ సంహారం చేయడానికి సృష్టి చేయబడింది మైలమ భీముని ఖడ్గం.

ఆ కత్తి ఎంత భయానక రీతిలో సృష్టి చేయబడిందో, పేరు చెబితేనే శత్రువులు వెంటనే మూర్ఛిల్లేలా ఉంది. విధ్వంసానికి ప్రతీకగా నిలిచే శివుని కంటి కొలిమిలో కాల్చబడి, కోట్ల లెక్కన పడుతున్న పిడుగులే సమ్మెటలై విషపు లోహపు ముద్దను సాగదీయగా పదును తేలి అజేయమైనదిగా తీర్చిదిద్దబడింది. పాఠుకునిలో విశ్వాసం ఉన్నా లేకున్నా ప్రతీకలతో కూడిన ఈ పద్యాన్ని మెచ్చుకోక మానడు. అందుకే కాబోలు శ్రీశ్రీ దాన్ని తన ఖడ్గ సృష్టి కావ్యంలో ముచ్చటగా ముందుమాట చేశాడు. మైలమ భీమన ఒక మహా వీరుడు యుద్ధంలో శతృవులను సంహరించి తానూ అమరుడువుతాడు పలనాటి బాలచంద్రుడివలె. సామాన్య ప్రజలు అతన్ని గురించి కథలుగా పిల్లలకు చెప్పుకుంటారు. భావకులు, మహా కవులు జాతి మొత్తం గుర్తుండే విధంగా అతని ఖడ్గాన్ని చిత్రించి చావులేని మహా వీరుడిగా ప్రజల నోళ్ళలో నిలిపారు.

కాలాలే వేరు, ఉద్దేశం మాత్రం ఒకటే. మైలమ భీముడు ఆ ఖడ్గంతో దుష్ట సంహారం చేశాడు. తానూ నేలకొరిగాడు. చేసిన మేలును గుర్తించారు సామాన్య ప్రజలు, కవులు వీర గాథలు రాశారు, అందరూ కలసి కీర్తించారు. సుమారు వెయ్యేళ్ళ తరువాత శ్రీశ్రీ అదే ఖడ్గాన్ని అందుకున్నాడు. ఆధునిక సమాజానికి కావాల్సిన అక్షరాలను దానికి గుదిగుచ్చాడు, సమాజంలోని అవినీతి అన్యాయాలపై సంధించాడు. తనూ చరిత్రలో నిలిచిపోయాడు.

“అందుకే సృష్టిస్తున్నాను
అధర్మనిధనం చేసే ఈ ఖడ్గాన్ని
కలంతో సృష్టిస్తున్న ఖడ్గం ఇది
జనంతో నిర్మిస్తున్న స్వర్గం ఇది

ఈ కత్తి బూజు పట్టిన భావాలకి
పునర్జయం ఇవ్వడానికి కాదు
కుళ్ళిపోతున్న సమాజ వృక్షాన్ని
సమూలచ్ఛేదం చెయ్యడానికి

దీన్ని
నల్ల బజారు గుండెల్లో దించు

దీనితో
కల్లకపటాలను వధించు

ఇది సమాన ధర్మాన్ని స్థాపిస్తుంది
నవీన మార్గాన్ని చూపిస్తుంది” – శ్రీశ్రీ ‘ఖడ్గ సృష్టి’

ఆశ్చర్యం! వేలయేళ్ళ తెలుగు సాహిత్యంలో ఎవరు ఎవరికి ప్రేరణ! ఆధునిక కవులకు శ్రీశ్రీ ప్రేరణ, ఆయనకు గురజాడ ప్రేరణ, శ్రీనాధుడికి వేములవాడ భీమకవి ప్రేరణ, అయానకు వేరొకరు, వారందరికీ ప్రేరణ సమాజం.. దానిలోని సాధరణ జనం, వారి కష్టాలు వారి సంతోషం వారి భాగ్యం. అదే సాహిత్యానికి మూలం.

Exit mobile version