Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అకాల మేఘం

1945-48 ప్రాంతాలలో జరిగిన ఘటన ఆధారంగా చావా శివకోటి రచించిన కథ “అకాల మేఘం“.

క్షుల రెక్కల చప్పుళ్ళు అప్పుడే మొదలైనయి. సంక్రాంతి రోజులవి. ఆడాళ్ళు పెందలకడనే లేచి వాకిళ్ళు ఊడ్చారు. కళ్ళాపి చల్లారు. రకరకాల ముగ్గురులు వేస్తున్నరు. కొందరు దూడలను విడిచి పాలు పితుకుతున్నారు. మొత్తానికి ఈ సాలుకు వ్యవసాయపు పనులు త్వరగానే పూర్తయినయి. జొన్న చొప్ప కూడా ఇళ్ళకు చేరింది. పొలాల్లోని గడ్డివాములు మాత్రం పనులు పెగలక ఇళ్ళకు చేరలేదు. గురకొయ్యలతో పాటే రైతులు బళ్ళు కట్టుకొని పొలాలకు వెళ్ళారు. హరిదాసు చిడతలు వాయిస్తూ, లయబద్ధంగా అడుగులు కదుపుతూ నడుస్తున్నాడు.

ఈశ్వరమ్మ తలారా స్నానం చేసి దేవుని ముందుకెళ్ళి దీపం వెలిగించి ధూపం వేసి, దండం పెండుకుని బయటికొచ్చింది. అప్పటికే కిర్సనాయిలు దీపం గదిన వెలుగుతుంది. లేచి మజ్జిగ చిలికేందుకు వంటింటివైపు నడిచింది. చీరెను నడుంకు బిగించుకొని చల్లకవ్వం చేతబట్టింది. నాలుగు జీవాల పాడి, వెన్న తీసేసరికి కప్పర కప్పర తెల్లారుతుంది. తూర్పు నుంచి ఎరుపు చారలు విరజిమ్ముతూ ‘ఎర్రటి ముద్దలా’ భూమిని చీల్చుకుని పైకొస్తున్నా పొగమంచు పొరల నుంచి మసకగానే కనిపిస్తున్నాడు. కిరణాలలో వాడి లేదు. కమ్ముకొన్న కావురును చెరిపి బడిన నెట్టుక రాలేకపోతున్నాయి. ఎర్రముద్ద మాత్రం ఎగబాకుతున్నది. భూమి చెరుగుపై పడిన కిరణాలు మాత్రం ఏడు రంగులుగ మెరుస్తున్నాయి. చేలల్లోని వరిగడ్డి వాముల దగ్గర చలిమంటలు కావురుకి తోడు అవుతున్నాయి. వెరసి బూడిద రంగున పరిగెడుతున్న మేఘాలలా పొగ చిక్కబడింది. అప్పుడప్పుడూ గుడి గంటల మ్రోత శ్రావ్యంగా వినిపిస్తున్నది. చెరువు నీటి కోసం కావిళ్ళు సాగినయి. కూస్త అటూ ఇటుగా గాడిదలపై బట్టల మూటలు చెరువు వాయికి చేరుకుంటున్నాయి.

ఆంబోతు రంకె వినిపించింది. జనపచేల వైపు పోయి కడుపారా మేసి ఆకలి చల్లారాక, హుషారుగా వస్తున్నట్టుంది అనుకుకొన్నాడు రామదాసు.

ఈ రామదాసు ఈశ్వరమ్మ భర్త. మొదటనే ఈశ్వరమ్మ భర్త అన్నందుకు మీరేం అనుకోవద్దు. ఆస్తి ఆవిడది. ఇల్లరికం వచ్చినవాడు రామదాసు. ఈవిడకు దూరపు బంధువైన రామదాసుది చాలా పెద్ద కుటుంబమే. అయిదారుగురు అన్నదమ్ములు, ముగ్గుర్ అక్కచెల్లెళ్ళూనూ. రామదాసు అంత పెద్ద కుటుంబం నుండి వచ్చినా తన పుట్టింటి వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు పెళ్ళినాటి నుంచి తరిగినయి.

కారణం ఏమీ లేదు. వారితో రామదాసు దగ్గరై ఉంటే ఇక్కడిది అంతో, ఇంతో తనవారికి చేరుస్తాడని ఈశ్వరమ్మ తండ్రి అభిప్రాయం. మనసులో నున్న భయం కూడా. ఆయనున్నంత కాలం ఆ జిజ్ఞాస ఆయనకు పోలేదు. అందుచేత ఒక్క పెళ్ళిళ్ళకు, చావులకు తప్ప తన కుటుంబంతో రాకపోకలు అంతగా లేవు. “ఇది చాలా అన్యాయం. ఆయన తోబుట్టువులతో కలిసి పోవడానికి మనం అడ్డు రాకూడదు కదా! అది తప్పు” అని ఈశ్వరమ్మ తన తండ్రితో చాలాసార్లు పోట్లాడింది కూడా. తండ్రి మాత్రం ‘ఆ, ఊ’ అనకుండా నవ్వి ఊరుకునేవాడు. ఊపిరి పోయేంత వరకూ ఇదే తంతు. పోయాక ఈశ్వరమ్మ ఎన్నడూ రామదాసుకు ఏ అడ్డూ చెప్పలేదు. కావల్సినంత స్వేచ్ఛ ఇచ్చింది.  కాని అప్పటికే వారి రాకపోకల అలవాటు తగ్గిపోవడాన అంతగా పునరుద్ధరింపబడలేదు. అట్నుంచి కూడా ఆ ప్రయత్నం అంతగా జరగలేదు. ఈశ్వరమ్మ మాత్రం ఈ ఆస్తి ‘తనది’ అన్న భావనను ఎప్పుడూ, ఎక్కడా రానిచ్చేది కాదు. ఏ సందర్భం వచ్చినా అంతా రామదాసు ఇష్టమని తను తప్పుకునేది. ఎప్పుడైనా రామదాసు ‘నువ్వూ ఉండు’ అన్నా, ‘మీకు తోచినట్టు చేయండి. బయటి వ్యవహారాలు నాకెందుకు చెప్పడం’ అని వెళ్ళిపోయేది. రామదాసు నడుస్తూ పశువుల కొష్టం వైపు చూశాడు. పాల కోసం లేగ దూడ ఎర్ర ఆవు పొదుగును కుమ్ముతున్నది. అదేమో దాని గంగడోలు నాకుతున్నది.

నిద్రలేవగానే ‘కర్రావు’ కనిపిస్తే మంచిదని బాపన నర్సయ్యగారు చెబితే కష్టమనక నాలుగైదుసార్లు సంతకెళ్ళి సుడులు, చుక్కలు చూసుకొని కర్రావును తోలకొచ్చాడు. కొష్టం దాపుకు రాగానే కొష్టంనున్న మొదటి గాటికి దానిని కట్టేశాడు. అది కన్పించాలి. అంతే. అలా కన్పిస్తేనే తృప్తి. దానిపై చేయేసి, ఆప్యాయంగా నిమిరి బయటకి నడిచేవాడు. గొడ్లపోరళ్ళు కొష్టంలో పేడ తీసి కసువు చిమ్ముతున్నారు. కొష్టం నిండుగా పశువులున్నయి. నాలుగు జతల ఎడ్లు, జత దున్నపోతులు, దూడలు వగైరా. వరిగడ్డి కోసం వెళ్ళిన బళ్ళు ఇంకా రాలేదేమని గేటు వైపు చూశాడు. జత దున్నపోతులు మాత్రం వేపచెట్టు నీడన నెమరేస్తూ పడుకొని ఉన్నయి.

ఇంతలో పెద్ద ఎడ్ల జత మెడ గంటల సవ్వడి మెల్లగా ఆ బాటన వినిపించింది. మొత్త ముందుకు రాగానే ‘బట్టెద్దు’ రంకె వేసింది. ‘వస్తున్నాయిలే’ అనుకొని లేచి అరుగువైపు నడిచాడు. బండ్లు లోనకి వచ్చినయి. “రామూడూ! చల్లపూట దున్నలను కట్టమన్నాను కదా, చిన్న జతెందుకు కట్టారు?” అనగానే, “ఈ తూరి కడతాను” అన్నాను. బళ్ళు పేడకుప్పకు వెనకనున్న ఖాళీస్థలానికి వచ్చి ఆగినయి. మోకులు విప్పి గడ్డెత్తుతున్నారు, ‘వామి’ వేసేందుకు.

‘తోవ’కొచ్చాడు రామదాసు. సీదా ఆంజనేయస్వామి గుడికెళ్ళి క్రింద నుమ్చే దణ్ణం పెట్టి అదే బాటన కరణం గారి ఇంటి దాకా నడిచాడు. ఇంటి ముందు నిలబడి లోనకి చూశాడు. షేక్ సింధ్ బయటకి వస్తున్నాడు. “జానూ! దొరగారున్నారా?” అడిగాడు.

“ఉన్నడు. పోయి తమరొచ్చినట్టు చెప్పనా?” అన్నాడు వెనక్కి మళ్ళి.

“అక్కర్లే. నే పోతా” అంటూ లోనకి నడిచాడు రామదాసు.

సీతారామయ్యగారు నీళ్ళ గాబు దగ్గర నిలుచుని వేపపుల్లతో ముఖం కడుగుతూ కన్పించాడు. రామదాసు కళ్ళబడగానే, “రా రామదాసూ, అట్టా వచ్చి బల్ల మీద కూర్చో” అన్నాడు. “మీరు కానివ్వండి, నేను ఉంటాను కదా, అయినా మీకు నేను ఒట్టిగే కనబడదామనీ, వచ్చి పలకరించి వెళదామనీను” అని బల్లవైపు నడిచాడు. గబగబా మొహం కడగడం ముగించి, భుజాన ఉన్న అంగవస్త్రంతో, ముఖం తుడుచుకుంటూ వచ్చి రామదాసు ప్రక్కన కూర్చున్నాడు. కూర్చొన్నాక, “ఆ, ఇక చెప్పు ముచ్చట్లేంటి?” అన్నాడు.

“ఒక మాట చెప్పిపోదామని వచ్చిన.”

“నేనొద్దంటినా?”

“నేను కోర్టు వాయిదాకి వరంగల్ పోతిని కదా. నేను వెళ్ళడానికి ముందురోజు మీతో చెప్పాను.”

తలూపాడు.

“ఆడ రాత్రిపూట ఉండాల్సి వస్తే హన్మకొండలోని వేయిస్తంభాల గుడిలోనే పడుకుంటా కదా.”

“నన్నూ ఒకసారి అక్కడికే పట్టకపోయి పడుకోబెడితివి కదా” అని నవ్వాడు.

“అలాగే రాత్రి ఉండాల్సి రావడంతో నేనక్కిడికే చేరి పడుకున్నా. తిరిగి తిరిగి బాగా సుడి పడతాన తెల్లారిందాకా మెలకువ రాలే. పొద్దు బారెడెక్కి చిటపటమంటే లేచిన. నే లేచేసరికి నాకు కాస్త దూరాన రాత్రి పడుకొని ఉన్న ‘ఆసామి’ నిలుచొని సూర్యుడికి దండం పెడుతూ కన్పించాడు. కొద్దిసేపటికి దేవుని పని ముగించి నా వైపుకి తిరిగి రెండు చేతులెత్తి ‘నమస్కారం’ అన్నాడు. అంతటితో ఆగక, నవ్వు ముఖంతో దగ్గరికి వచ్చాడు. నిజానికతని ముఖం నేనెన్నడూ చూడ్లేదు. అయినా సత్‌బ్రాహ్మణునిలా కన్పడ్డాక రెండు చేతులెత్తి దండం పెట్టిన. ప్రక్కకొచ్చి కూర్చున్నాడు. చూసేందుకు మనిషి బాగున్నడు. వయస్సు ముప్ఫై ఏళ్ళకు మించి ఉండదు. మొలనున్న లుంగీ భుజాన అంగవస్త్రం తప్ప మరే బట్టా లేదు వంటిన.

“మీరూ?” అన్నాడు తెలుగులోనే మరో భాష యాసలో.

“ఆ! నా పేరు రామదాసు. ఖమ్మం దగ్గర పల్లెటూరు. గోకినేపల్లి” అన్నాను.

“ఇక్కడికి తరచూ వస్తుంటారా? పనిపైన వస్తే, ఇక్కడ ఈ ఆలయంలో ఒంటరిగ పడుకోవడమేమిటి? శివుడంటే మీకంత ఇష్టమా?” అడిగాడు.

ఆయన మాటలలో అణకువ కన్పించింది. ఇంకాసేపు ముచ్చట్లాడాలనిపించింది. అప్పుడు వివరంగా చెప్పాను. “మా కుటుంబ తగాదాల వల్ల ఇక్కడి కోర్టుకు వస్తూ ఉంటాను. వాయిదాలకు రాక తప్పదు కదా. రాత్రి పూట ఉండాల్సి వస్తే మాత్రం ఇక్కడికే వస్తా. అది నా అలవాటు. మీరేమనుకున్నా నాకిక్కడ పడుకుంటేనే కైలాసాన ఉన్న స్వామి పాదాల చెంత ఉన్నట్టనిపిస్తుంది. మనసున అప్పటిదాక పేరుకున్న తేడా, అలసటా మాయమవుతది” అని నా మనసునున్న మాట చాలా సంతోషంగా చెప్పిన.  ఎందుకు చెప్పిన్నో నాకే అర్థం కాలే. నే చెప్పింది విని “మాది కేరళ” అన్నాడు. అని “ఇప్పుడు నాకు ముప్ఫై రెండు సంవత్సరాలు. పది సంవత్సరాలుగా నేను సంచారిని. నా దేశాటనలో ఈ ఆలయానికి రావడం ఇది మూడోసారి. ఇక్కడ పరమేష్ఠి శివుడున్నాడు. మనదేశంలో ఎక్కడా లేని త్రిమూర్తులున్న ఆలయం ఇదొక్కటే. ఆలయ చరిత్రన ఇది చాలా అరుదైన విషయం” అని, “ఒక్క విషయం చెబుతాను. ఇక్కడున్న కైలాసపతికి ‘రుద్రయాగం’ చేయగలిగితే ఈ ప్రాంతం అంతా పాడిపంటలతో సుభిక్షంగా ఉంటది. నా యాత్రలో ఇక్కడకు వచ్చినప్పుడల్లా ఆ ‘యాగం’ నేనిక్కడ చేయగలనా? అనిపిస్తుంది. కాని నా జీవనయానాన చేయాలి. చరిత్ర గతిన ఈ ఆలయాన రుద్రయాగం జరిపిన దాఖలా లేదు. ఇక్కడ పరమేష్ఠి శివుడున్నాను. కాని గంగ లేదు” అని ఆగాడు పైకి చూస్తూ.

“నాకెందు చెప్తున్నావు ఇదంతా?” అన్నాను ఆయనవైపు చిత్రంగా చూసి

“ఇక్కడ ఉన్న కోనేరును గమనించారా? శిథిలమై ఉంది. నీళ్ళు గుడికి వచ్చే ఏర్పాటుంటే నేను యాగ ప్రయత్నాన్ని ఇక్కడ ఆరంభిద్దామనుకొంటున్నాను” అన్నాడు నన్నే చూస్తూ. నాకు నవ్వొచ్చింది. ఆయనకు నమస్కరించి, “నేనొక అనామకుడిని. మీరు ప్రారంభించేదేమో రుద్రయాగం. అందుకు నేనేం చేయగలను?” అన్నాను.

చెప్పాడు. నా జేబున తడిమి చూస్తే కొంత డబ్బు కనిపించింది. “గుడిలో దాకా నీరొస్తే నువ్వు యాగం ప్రారంభిస్తావు” అని ఆయన కళ్ళల్లోకి చూశాను. తలూపాడు. నమస్కరించి వెనక్కి తిరిగాను. ముఖం కడుక్కొని, స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నమస్కరించి సీదా మున్సిపల్ ఆఫీసుకెళ్ళాను. “వేయి స్తంభాల గుడిలోకి నీళ్ళు కావాలి. అంటే అక్కడికి మీ ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి” అని అడిగాను. దానికి కావల్సిన వివరాలతో సహా ఇంత డబ్బు అవుతుందని చెప్పాడు. నాకు తెలిసిన స్నేహితుడు సాహెబ్ గారిని తీసుకొని ఆఫీసుకు వెళ్ళి వాళ్ళు కట్టమన్నంత డబ్బు కట్టేశాను. ‘పైపుల సంగతీ, మిగతా సంగతులు నేను చూసుకుంటాను’ అని మా సాహెబ్ గారు చెప్పారు. “ఆలయంలో ఓ అయ్యగారున్నారు” అని ఆయన గుర్తులు చెప్పి, “ఆయన ఎక్కడిదాకా నీళ్ళు కావాలంటే అక్కడి దాకా వేయించు” అని పురమాయించి ‘నేను మళ్ళీ వాయిదాకి వచ్చేసరికి పని పూర్తి కావాలి’ అని మిగిలిన డబ్బు ఆయనకు ఇచ్చి తిరిగి వచ్చాను. మళ్ళీ వాయిదా వచ్చింది. నెలా పదిరోజులు.

ఉదయం వరంగల్ చేరాను. ఈ దఫా వాయిదా జరిగింది. వాదనలు మొదలవడం మూలాన అవి పూర్తి కాకపోవడాన నన్నుండమన్నాడు మా వకీలు. పొద్దుటే వస్తానని వకీలు గారికి చెప్పి ‘నారాయణమ్మ’ పూటకూళ్ళ హోటల్‌లో ఇంత తిని సీదా వేయి స్తంభాల గుడికి చేరాను. అరుగెక్కుతుంటే గుడిన దీపారాధన జరిగినట్టు గంథం ధూపం వాసన వేసింది. లోనకెళ్ళాను. పూజ జరుగుతున్న జాడ కన్పించింది. ఆ ‘బాబే’ పూజ మొదలుపెట్టాడా? అసలు నీళ్ళ ఏర్పాటు జరిగిందా? అని గుడి చుట్టూరా తిరిగాను. నీళ్ళ నల్లాలు రెండు కన్పించినయి. ‘అంటే ఆ బాబు కోరిక ప్రకారం గంగ శివుడిని చేరిందన్న మాట’ అనుకొంటూ అరుగుపై తృప్తిగా నిదురపోయాను. బాగా పొద్దెక్కినాక గానీ మెలకువ రాలేదు. అదీ పూజా గంట వినిపించిన తర్వాత. గబగబా వెళ్ళి స్నానపానాదులు పూర్తి చేసుకొని వచ్చాను. గుడి మెట్లెక్కుతుండగా ఆ ‘బాబే’ శివుడి సన్నిధి నుంచి బయటకొస్తూ కన్పించాడు. నేను కన్పించగానే ఆత్మీయంగా దగ్గరకి వచ్చి శివలింగ సన్నిధికి తోడ్కొని పోయి హారతిచ్చి శఠం తలపై నుంచి ఇంత ప్రసాదం చేతికిచ్చాడు. మెట్లపై కూర్చున్నాక, ‘నీళ్ళతో పాటు పూజాదికాలూ ప్రారంభించా’నన్నాడు ప్రసన్నంగా.

“నీళ్ళ పని సంపూర్తిగా చేశారా?” అడిగా. తల ఊపి, “ఒకసారి ఆయన్ని కలవండి” అన్నాడు. సరేనన్నాను.

ఇంకా పైసలు తగులుతయ్యేమోననుకొని కోర్టుకు వెళ్ళే ముందే మా సాహెబుగారిని కలిశాను. దుకాణం నుంచి ఎదురుగ లేచి వచ్చి –

“మందిర్ కో జాకే ఆయేనా సాబ్? కామ్ పూరా హువానా?” అన్నాడు నన్ను చూస్తూ.

“సలాం భయ్యా!” అని సంతోషంతో గట్టిగ కౌగిలించుకున్నాను. కుశల ప్రశ్నల తరువాత అక్కడి నుంచి లేచి వస్తూ ఇంకా ఎన్ని పైసలివ్వాలని అడిగాను.

‘బస్, యే అల్లాకా కామ్ హై సాబ్, ఇమాన్ సే కియా!’ అన్నాడు. చాలా సంతోషం అన్పించింది. అక్కడ్నించి సెలవు తీసుకొని కోర్టు దిశగా నడిచాను. మనసంతా ఆనందంతో నిండింది. నడుస్తుంటే గాల్లో తేలినట్టనిపించింది. ఆ మర్నాడే తీర్పు అనుకూలంగా వచ్చింది. ఇంటికి బయలుదేరబోతూ సాహెబ్ గారిని తీసుకొని ఆ బాబు దగ్గరకొచ్చి కలిశాను. అప్పుడు చెప్పాడా బాబు. మాది కేరళనీ, మేము మలయాళీలమనీ, తన పేరు ‘నాయర్’ అనీనూ. అప్పుడు మా సాహెబ్ గారిని పరిచయం చేశాను. “ఈయన మన స్నేహితుడు. నేనా ఇక్కడ ఉండేవాడిని కాదు. మీకు అవసరం ఏదైనా కల్గితే ఈయనతో చెప్పొచ్చు. చేతనైన సాయం చేస్తాడు” అని చెప్పి అక్కడ్నించి సెలవు తీసుకుంటూ నా జేబున నా ఛార్జీలు పోను మిగిలిన యాభై రూపాయలూ నాయర్ బాబు చేతిలో పెట్టి నమస్కరించాను.

“నాకెందుకూ?” అన్నాడు.

“నువ్వు రుద్రయాగం చేయాలనే సంకల్పంతో కదా ఇక్కడకు వచ్చావ్. అందుకిది ఉపయోగపడితే నాకంతకన్నా కావల్సిందేముంది?” అన్నాను. ప్రక్కన కూర్చోబెట్టుకుని అప్పుడు నా చిరునామా వ్రాసుకున్నాడు. నేను లేచి బయల్దేరుతున్నప్పుడు ఒక మాట చెప్పాడు. “ఇక్కడ మనం రుద్రయాగం చేస్తాం, చేస్తున్నాం. యాగ నిర్ణయం జరిగాక మీకు ఉత్తరం రాస్తాను. పది రోజుల ముందొచ్చి నాతో ఉండు” అని.

నాకు ఆయన మాటలు విచిత్రంగా అనిపించినయి. ఇదెలా సాధ్యం? అన్నది మనస్సున పీకుతూ ఉన్నది. కానీ నాయర్ బాబు స్థిరంగా చెప్పిన మాటపై ఎందుకో నమ్మకం అన్పించింది. అప్పుడన్నాడు – “కాకతీయుల నాడు ముగిసిన పూజాదికాలు మీరు భగీరథుడిలా గంగను ప్రసాదించడంతో ప్రారంభమైనవి”. నాయర్ గారు అన్నది నాకంతగా అర్థం గాకున్నా సంతోషమనిపించింది. బయల్దేరాను. ఇంటికి వెళ్ళేసరికి చాలా రాత్రి అయ్యింది. ప్రొద్దుటే అలవాటు ప్రకారం గుడికెళ్ళి కరణం గారి ఇంటికి వెళ్ళాను. మంచంపై కూర్చుని ఉన్నాడు. నేను కన్పించగానే “ఎప్పొడొచ్చావ్?” అని అడిగాడు. చెప్పాను. యాగం చేస్తానన్న బాబు కలిశాడా? అని అడిగాడు అనుమానంగా. ‘నీళ్ళు వచ్చిన దగ్గర్నుంచీ ఆలయనా పూజాదికాలు ప్రారంభించాడు. ప్రారంభించాక ఒకడూ, అరా ఆలయంలోకి ప్రవేశించడం జరిగిందట. ఇప్పుడు పాతిక, ముప్ఫై మంది వరకూ గుడికి వస్తున్నారు. చాలా సంతోషమన్పించింది. ఎప్పుడు, ఎవరు, ఎందుకు కట్టారో, ఎంత వైభవంగా వెలుగొందిందో కాని ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. అక్కడ పూజాదికాలు ఆగి ఎన్ని శతాబ్దాలు అయిందో? ఈయనతో మళ్ళీ పునఃప్రారంభమైంది’ అన్నాను. నేను చెప్పింది చిత్రంగా అన్పించి, ‘నిజమా?’ అన్నట్టు చూశాడు సీతారామయ్య గారు.

అనుమానం తెగక, ‘అసలున్నాడు కదా?’ అన్నాడు,

“అదేగా చెప్పింది” అని, “ఉంటాడు. రుద్రయాగం ఏదో చేస్తాడట. అతనిని చూస్తే నిజంగా చేస్తాడనిపించింది” అన్నాను.

“రుద్రయాగం చేస్తాడా? అలా చెప్పాడా?” అని నవ్వాడు.

“యాగం ప్రారంభానికి ముందు కబురు చేస్తానన్నాడు. పది దినాల ముందనగా తప్పక రావాలని మాట తీసుకొన్నాడు.”

“అయితే వెళతావన్న మాట?”

తప్పదన్నట్టు చూశాను.

“నీకు కబురొస్తే నాకు చెప్పు” అని, “నీ కేసేమైంది?” అడిగాడు.

“మొదటి కేసున అనుకూలంగానే తీర్పొచ్చింది” అన్నాను.

“శుభం” అని లోనకెళ్ళాడు.

నేనింటికొచ్చాను. ఎందుకో తెలీని సంతోషం. మనస్సూ, శరీరం ఉల్లాసంగా అనిపించింది. రెండో కేసు వాయిదాకి వెళ్ళాల్సివచ్చి, వెళ్ళి రాత్రి గుడికి వెళ్ళాను.

గుడికి జనం బాగానే వస్తున్నారు. అదే గుడి అయినా దాని దశలో ఏదో మార్పు కన్పించింది. సంతోషమనిపించింది.

***

అనుకున్న ప్రకారం నాయర్ బాబు నుంచి కబురొచ్చింది. అదీ రెండు మాసాల తర్వాత. వెంటనే వెళ్ళి ఈ మాట కరణం గారికి చెప్పాను. రుద్రయాగ ప్రారంభమా! అని నవ్వాడు.

నాలుగో నాడు వెళ్ళి ‘రేపే ప్రయాణం’ అన్నాను.

“నన్నూ రమ్మంటావా” అడిగాదు.

“వస్తారనే చెప్పాను” అన్నాను.

పొద్దుటే కబురు చేశాను. బస్సు వచ్చే ముందు గబగబా వచ్చిన మా కరణం గారు నాతో పాటు బస్సెక్కాడు. చాలా సంతోషమనిపించింది. రైలెక్కి దిగాం. సీదా గుడికెళ్ళాం. పొద్దుగూకుతుంది. గుడిన జనం బాగానే ఉన్నారు. దీపధూప నైవేద్యాల వాసన ముక్కుపుటాలకు సోకింది. బయట ఉన్న నంది దగ్గర కూర్చున్నాం. దాదాపు రాత్రి పది అవుతుండగా నాయర్ బాబు బయటకు వచ్చాడు. నన్ను చూడగానే దాపుకొచ్చి “ఎంతసేపైంది” అని అడిగాడు. చెప్పాను. ఆనక లేచి కరణం గారిని పరిచయం చేశాను – ‘మా అందరికీ పెద్ద, పేరు రావులపాటి సీతారామారావు. ఊరంతా దొరవారని పిలుస్తారు’ అని. ‘సంతోషం’ అన్నాడు. పరిచయం తర్వాత లేచి, ‘మన గదికెళ్దామ’న్నాడు.

“గదెక్కడ?”

“నా వెంట రండి” అనగానే ఇద్దరం లేచాము. లేచాక ఒకసారి ‘మీరు మూడు ఆలయాలలోని మూర్తులను చూసి రండి’ అన్నాడు. నయనానందకరంగా చూసి దండం పెట్టుకొని వచ్చాం. ఆలయాన జరుగుతున్న మార్పు మనసున ఆనందం నింపింది.

“ఇంత ఆలయాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచాడు” అడిగాడు కరణంగారు నాతో.

‘ఏదైనా చేయగలడ’న్నట్టు చూశాను.

గదికి చేరుకున్నాం. అప్పటికే ఎవరో ఇద్దరు ముగ్గురు నాయర్ బాబు కోసం ఎదురుచూస్తూ కనిపించారు. ఆయన్ను చూడగానే లేచి నమస్కరించి మాట్లాడి వెళ్ళిపోయారు. గదిలోకి అడుగుపెట్టాం. మేము పడుకునేందుకు రెండు సిరిచాపలు పరచి ‘మొదట స్నానపానాదులు పూర్తి చేసి రండి’ అన్నాడు. తలారా స్నానం చేసి వచ్చి కూర్చున్నాక ‘ఈ ప్రసాదం తీసుకోండి’ అని మూడు టేకు ఆకులలో పులిహోర, దద్దోజనం పెట్టి మాకు ఇచ్చి ఒకటి తన ముందుకు జరుపుకున్నాడు. ఎంత ఆకలి మీద ఉన్నా అది ఎంతో తృప్తిగా అన్పించింది. తర్వాత తన గది బయట అరుగుమీదకు వచ్చాడు. అక్కడడిగాను – ‘పది రోజులు ముందు రమ్మని అన్నారు. వచ్చాం. మేమిక్కడ ఎలా మీకు సహకరించగలం?’ మమ్ములను చూసి నవ్వి, ‘రామదాసూ, మనిషి ఒక్కడే, దేవుడూ ఒక్కడే. మనం నలుగురం కలిస్తే గుంపు అవుతది. కానీ దేవునికి ఆ అవకాశం లేదు. ఒంటరివాడు. కాకపోతే అనేక పేర్లు. ఎవరం ఏ పేరుతో పిలుచుకొన్నా ఆయనే. ఆయన శక్తివంతుడు. మనం అశక్తులం. ఎందరున్నా మనకు తోడు అవసరం.’ అని నవ్వి, “రేపు మధ్యాహ్నం నుంచి బియ్యం, సంబారాలు వస్తుంటయి. మనం కూర్చునే దాని ఎదురుగా రేకుల షెడ్డు ఉంది కదా” అని దాన్ని చూపాడు, “వచ్చిన వాటిని మనం దానిలో దింపుకోవాలి. దాని ప్రక్కనే వంటశాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుచేత అక్కడ మీరు బాధ్యతగా వ్యవహరించాలి.  నేనుగా అక్కడికి రావలసిన అవసరం రాకూడదు. ఎవరు ఏం పంపినా సీదా మీ దగ్గరికే వస్తయి. వచ్చిన వాటిని జాగ్రత్త పరుస్తూ రాసుకోండి. అలాగే వంటవారికి ఇచ్చినప్పుడు రాసుకోండి” అని కరణంగారి వైపు చూసి, “నగదు కూడా డబ్బు ఇస్తుంటారు. దానిని మీరు చూసుకోండి. ప్రతీ పైసాకు రసీదివ్వండి. మీరుగా ఖర్చు పెట్టాల్సి వస్తే పెట్టండి, కానీ లెక్క రాస్తూ పోండి” అన్నాను. తల ఊపాడు కరణంగారు. ఆ తర్వాత పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ పడుకొన్నాము. మాకు మెలకువ వచ్చేసరికి నాయర్‌బాబు లేరు. గుడికెళ్ళినట్టుంది.

***

రుద్రయాగం ఐదు రోజులు నడిచింది. రాత్రి పది తర్వాత భోజన సమయానికి మాత్రమే నాయర్‌బాబు కన్పించేవాడు. ‘యాగం’ ముగిసే వరకూ ప్రారంభం నుంచి అన్నాదాన ప్రక్రియ సాగించి. ‘ఇలా ఇంకా రెండు సంవత్సరాలు జరుగుతుంద’ని అన్నాడు. ‘మీరు ఖర్చుల గురించి అంచనాలు వేసుకోవద్దు. అది మనకు సంబంధించిన విషయం కాదు’ అని, ‘మీరు పైకం చూస్తుననరు కదూ!’ అన్నాడు నాయర్ కరణంగారిని చూస్తూ.  తల ఊపి, ‘ఖర్చులు కూడా రాశాను’ అని, ‘ఇప్పటికి నా దగ్గర ముప్ఫై ఆరు వేల తొమ్మిదొందలున్నయి’ అన్నాడు. ‘నేను ఎంత ఉంది అని అడిగానా? ఈ యాగం ఆయనది. ఆయనకు తెలుసు దీనిని ఎలా పూరించాలో!’ అని నవ్వి, ‘ఇక పడుకుందాం. రేపు తెల్లవారుజామున మూడు గంటలకే గుడికి వెళ్ళాలి’ అన్నాడు. ఎవరి సిరిచాపను వాళ్ళు ఆశ్రయించాం. సూర్యోదయంతో పాటు లేచాం. లేవగానే, “ఏమిట్రా ఇది, నువ్వంటుంటే నేను నమ్మలేదు. ఈ సంతర్పణ ఏవిటి? యాగం ఏమిటి, ఈ డబ్బేమిటి, ఈ సంబారాలేమిటి? ఇవన్నీ ఎవరు, ఎందుకు పంపిస్తున్నారు?” అని అడిగాడు ఆశ్చర్యంగా కరణంగారు.

“నాకు మాత్రం ఏం తెలుసు? చూస్తూండటం తప్ప” అన్నాను.

కళ్యాణప్రదంగా జరిగిన రుద్రయాగాన్ని కళ్ళారా చూసి దిమ్మరపోయాడు కరణంగారు.

***

యాగం మొదటిదశ పద్ధతిగా పూర్తైంది. రాత్రి పదకొండు అయింది. ఐదు రోజుల నాడు ప్రారంభమైన అన్నదానం అప్పటిదాకా కొనసాగింది. అర్ధరాత్రి దాటుతుండగా ముగిసింది. ఆ తర్వాత నాయర్‌బాబు వస్తాడేమోనని ఎదురు చూశాం. రాలేదు.

రేకుల షెడ్డుకు తాళాలు వేసి నాయర్‌బాబు కోసం గదికి వచ్చినం. ఆయన జాడ కనిపించక, ఇంత తిని పడుకున్నాం. కరణంగారు మాత్రం ఆశ్చర్యం నుంచి కోలుకోలేదు. నిద్రపోయినా జాడా లేదు. సూర్యోదయంతో పాటే మమ్ములను లేపాడు నాయర్‌బాబు. లేస్తూనే మా సీతారామరావుగారు దండం పెట్టాడు. కళ్ళ నిండా నీరు. నాయర్ బాబేమో స్నానపానాదులు పూర్తి చేసుకుని ఆదిశంకరునిలా కనిపించాదు. ఈయన మొహం కడుక్కుని వచ్చేసరికి ఆయ్యన గుడికెళ్ళిపోయాడు. మేమూ వెళ్ళి నందీశ్వరుని ముందు కూర్చున్నాం. ఋత్విజులను, వేద పండితులను చందన తాంబూలాదులతో సత్కరించి వారి ఆశీస్సులను పొంది వెనక్కి వచ్చాడు. ఆ క్రతువు పూర్తయ్యేసరికి మధ్యాహ్నం అయింది. అయినా ఆయనలో అంతులేని ప్రశాంతత. చిన్నమంత అలసటా కనిపించలేదు. ఇంత యాగం జరిగాక అలుపెరగక, అవిశ్రాంతంగా శ్రమించిన వ్యక్తి! ఆశ్చర్యంగా అనిపించింది. ఆ తర్వాత మమ్ములను యాగం జరిపిన దగ్గరకు తీసుకువెళ్ళి, మాతో మూడు ప్రదక్షిణాలు చేయించి, ఆ వెంటనే ఆలయ దర్శనం చేయించి, ‘ఇక కూర్చుందాం. పదండి’ అన్నాడు. గుడి అరుగు మీదకు చేరాము. ఏర్పాటు చూసిన పనివాళ్ళు తప్ప జనం బాగా పలచబడ్డారు. సీతారామారావుగారు నాయర్‌బాబు వైపు తిరిగి “మొత్తం తొమ్మిదివేల విస్తర్లు లేచినయి” అన్నాడు.

నాయర్‌బాబు కళ్ళు మూసుకొని ‘ఆయన ప్రాప్తం అంతే’ అన్నాడు. డబ్బు ఎంత ఉందని అడగలేదు. “మిగిలిన సంబారాలు, బియ్యం షెడ్దున ఉంచి తాళం వేశాం” అనగానే, “ఆ మొత్తం రేపు వండించి, పేదలకు అయిందాక పెట్టండి” అన్నాడు. విచిత్రంగా ఆయన వంక చూడడం మా వంతు అయింది. ఆ పంపకం పూర్తయ్యేసరికి తెల్లవారి మధ్యాహ్నం అయింది. షెడ్డును శుభ్రం చేసి గది దగ్గరకు వచ్చేసరికి నాయర్‌బాబు గది వద్దనే ఉన్నాడు. ఆయన ముఖాన కనిపించిన ప్రసన్నతను ఆశ్చర్యంగా, ఆరాధనగా చూశాము. ఎదురుగా కూర్చొన్నాకా కొద్దిసేపాగి ‘ఇక మాకు సెలవిప్పిస్తారా?’ అని అడిగాను. ‘రేపొద్దుటే వెళుదురుగానీ’ అన్నాడు. తలూపాం.

ఆ రాత్రి మిగిలిన వేద పండితులందరినీ సంతృప్తి పరచి పంపాడు. ఈ క్రతువంతా మా దొరవారితోనే చేయించాడు. పడుకోబోయే ముందు ‘ఇక పొద్దుటే వెళతాం మేం’ అన్నాడు నెమ్మదిగా దొరవారు. అప్పుడు పైకం సంగతి నాయర్‌బాబు మాట్లాడలేదు.

‘ఈ పైకం మిగిలింది’ ని లెక్క కాగితంతో పాటు పైకం ఉంచాడు.

వివరం ఆయన అడగలేదు, ఈయన చెప్పలేదు. ఉదయం వెళ్ళేప్పుడు మాత్రం, మా వైపు చూసి “ఈ డబ్బు మీ దగ్గరే ఉంచండి. మీ ఇద్దరి సహకారం భగవంతుడు నాకు ఇచ్చాడు. నా మనస్సు ఆనందంతో నిండింది. నేను మీకుగా ఏం చేయగలను?” అని నన్ను చూపి, “ఈయన గంగనిచ్చి యాగానికి అంకురార్పణ చేశాడు. యాగ నిర్వహణకి అవకాశం ఇచ్చాడు” అన్నాడు. నిజంగా నాయర్‌బాబు ఏం మాట్లాడుతున్నాడో నాకర్థం కాలేదు. పైగా ఆయన మా పాదాల దాకా వంగుతూ, “మీరు మా పితృ సమానులు. మా తండ్రే మాకింత మేలు చేసి ఉండరు” అని నిండిన కన్నీరు తుడుచుకుని మా ఇద్దరినీ గాఢంగా కౌగిలించుకొన్నారు. ట్రైను దాకా మా వెంట వచ్చాడు. అక్కడ ఆగాకా, “మీ సీతారామారావుగారి పేరు చాలా బరువుగా ఉందయ్యా, రాముడు దశరథుడి కుమారుడే కదా, దాశరథీ అని పిలిస్తే పలుకుతాడా?” అన్నాడు. సంతోషంగా తల ఊపాడు సీతారామారావుగారు.

‘మంచిది’ అని, ‘రామదాసూ, దాశరథీ మీ దగ్గరున్న పైకంతో మీ ఆలయం దగ్గర ఒక శనివారం సంతర్పణ చేయించండి. ఆ ప్రసాదం అందరికీ అందేలా చూడండి’ అని, ‘ఇంకా రెండు సంవత్సరాలు నాతోనే ఉంటారు కదా’ అనగానే తల ఊపి, ఆయన్ చేతుల దగ్గరికి చేరాం. మా జీవితాలలో ఆనందమైన క్షణాలవే.

***

సీతారామారావు గారు వస్తుతః సరళ స్వభావి. కరణీకపు తత్వము ఆయన వంటబట్టలేదు. పిల్లల బడి కోసం స్థలం కావాలంటే రోడ్డుకు రెండు వైపులా ఉన్న రెండెకరాల చోటును ఉచితంగా ఇచ్చినాడు. చల్లటి చూపు, మనస్సు ఉన్నవాడు గనక ఆ బడి దినదినాభివృద్ధి చెంది ఉన్నత పాఠశాల అయ్యింది. ఏటా ఎందరో ఉన్నత చదువులు చదువుటకు అవకాశం కల్గింది. ఆయనలో ఎన్నడూ ‘ఇది నేనిచ్చిన చోటు’ అనే భావన కన్పించేది కాదు. పైగా పిల్లల చదువుల సందడిని చూసినపుడు, వారు ఉత్తీర్ణులై పై చదువులకు అర్హత పొందినపుడు ఎంత సంతోషపడేవాడో. ఆయనకు చిన్ననాటి స్నేహితుడు ఈ రామదాసు. ఎప్పుడూ కలుసుకోనిది ఇద్దరికీ అసంతృప్తిగానే ఉండేది.  వారి మంచి, చెడులలో ఇద్దరూ భాగస్వాముల్లా మెలగేవారు.

బస్సు దిగాక “అరే రాందాసూ! రేపట్నుంచి నువ్వూ దాశరథిగారూ అని పిలుస్తావట్రా?” అని అడిగాదు కరణంగారు అదోలా నవ్వి.

“పేరు పొడుగుందని నాయర్‌బాబు అలా అన్నాడు కానీ, మిమ్మల్ని పిలిచేందుకు పేరెందుకు? ఎప్పటిలాగే, నేను పోయేదాకా ‘దొరవార’నే పిలుచుకొంటా” అంటుండంగా, ఆగి, ‘ఆగు’ అని ‘నాకంటే ముందు నన్ను వదిలి వెళ్తావురా’ అన్నాడు. ఆయన కళ్ళలో నీరు. నడుం వాటేసుకుని, ‘మిమ్మల్ని వదిలి ఏడకుపోగలను?’ అన్నాను. విడివడి ఎవరి ఇళ్ళకు వాళ్ళెళ్ళిపోయాం.

సంవత్సరం తిరిగింది. మరో యాగమూ నడిచింది. ఈసారి ఇరవైవేల పైచిలుకు యాగాన్ని కన్నులారా చూసి, సంతుష్టిగా తిని వెళ్ళారు. మేమిద్దరం మా కార్యక్రమం మేం నిర్వహించి నాయర్‌బాబు వద్ద సెలవు తీసుకొని వచ్చాము.

***

కాలచక్రం ఆగేది కాదు. యాగానికి తేదీ ఖరారు కాగానే కబురొచ్చింది. ఆలయ ప్రాంగణానికి వెళ్ళేసరికి ‘న భూతో న భవిష్యతి’ అన్న తీరున దేవేంద్ర లోకంలా వెలిగిపోతోంది ఆలయం.

‘అసలీ నాయర్ ఎవరు, అతనికి ఇక్కడ ఉన్నదేమిటి? దీనికింత సోయగాన్నీ, పూర్వ వైభవాన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు? అసలీ రుద్రయాగం ఇక్కడే ఎందుకు చేస్తున్నట్టు?’ అని ప్రశ్నించుకోవడం అక్కడక్కడా వినిపించింది.

ఆ వెంటనే ‘అంతా సుభిక్షంగా ఉన్నాం. కాలమూ బాగా అవుతున్నది. మంచి జరుగుతున్నది. అయాచితంగా మనకు మంచిని ప్రసాదించే ఒక మనిషి దొరికాదు కదా. అది మన నేల చేసుకున్న అదృష్టంగా భావించుదాం’ అనుకుంటూ ఆనందంగా వెళ్ళడమూ విన్నాము.

రుద్రయాగం ముగిసింది. ఈసారి అన్నదానం కార్యక్రమం మాత్రం మరుసటి రోజు మధ్యాహ్నం దాకా నడిచింది. పూర్తి వేదోక్తంగా యాగం ముగియడాన జనం తండోపతండాలుగా వచ్చారు. కళ్ళారా యాగాన్ని చూశారు. రుద్రునికి మనసారా మొక్కుకుని ఇంత ఎంగిలి పడి మరీ వెళ్ళారు. ఈసారి ఆయన మాట ప్రకారం మిగలకుండా వండి, వార్చి పూర్తయిందాక భోజనాలు నడిచేలా చూశాడు. దాదాపు యాభై వేల విస్తర్లు అయినయి. నాయర్‌బాబు హవిస్సులు అందుకుంటూ మమ్మల్నీ వెనక ఉంచుకొని మహదానందంగా  కన్పించాడు. యజ్ఞవాటిక నుంచి ఆయన దిగి రాగానే ఇద్దరం కన్పించాం. మమ్మల్నిద్దరినీ గాఢాలింగనం చేసుకొన్నాడు సంతోషాతిరేకంతో. ‘ఏమిటిది స్వామీ’ అన్నాడు దొరవారు. నా నోట మాట రాలేదు. విడివడ్దాక ఆయన కళ్ళనిండా నీళ్ళు కనిపించినయి. మా కళ్ళూ వర్షిస్తూనే ఉన్నయి. నందీశ్వరుని ముందు దాక మమ్మల్ని తీసుకువచ్చి, ఆయనను చూపుతూ, ‘ఈయనకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నానో తెలుసా, ఉలుకూ పలుకూ లేక విన్నాడు. నాలుగోసారి నాకు మమకారం చావక మళ్ళీ వచ్చినపుడు ఇదిగో దాశరథీ నీ స్నేహితుడు రామదాసుని కలిపాడు. ఈయనతోనూ, నందీశ్వరునకి చెప్పినట్టే చెప్పాను. తెలిసే చేశాడో, తెలియకే చేశాశో స్వామి అనుగ్రహమే అలా చేయించిందో తెలియదు కానీ ఈ ఆలయానికి గంగని తెచ్చి అంకురార్పణ చేశాడు’ అని కరణంగారి భుజం మీద చేయేసి, ‘దాశరథీ ఏ మహత్తర కార్యానికైనా మొట్టమొదటి అడుగు కదపగలగాలి. అది… అది…’ అని నన్ను వాటేసుకున్నాడు. నా బ్రతుకు ధన్యమైందనుకున్నాను. మా దొరవారి వైపు చూశాను.

ఆ తర్వాత చిన్న చిన్న పనులుంటే పూర్తి చేసుకుని గదికి చేరుకున్నాం. సిరిచాప మీద బాసింపెట్లు వేసుకొని కూర్చుని మా దొరవారి వైపు చూస్తూ, ‘దాశరథీ, నే వచ్చిన పని పూర్తయ్యిందయ్యా’ అన్నాడు సంతోషంగా.

‘మంచిది’ అని తల ఊపినాడు, ‘యాగం పూర్తయ్యిందంటున్నాడ’నుకున్నాం.

సెలవు తీసుకుని ఆ మర్నాడు పొద్దుటే రైలెక్కినం.

***

‘శివరాత్రి ఇంకా నెల ఉందా?’ అనుకుంటూ ఇంటికి చేరాము. మా ఆవిడ గడపదాక ఎదురొచ్చి ‘రుద్రయాగం కన్నుల పండువగా జరిగిందట. ఆ వైభవం చూసేందుకు కన్నులు చాలవట. అదో అదృష్టమట అని అంటున్నారండీ’ అంది. ఎన్నడూ ఎదురుపడని, మాట్లాడని నా ఇల్లాలిలో అంతటి ఆనందాన్ని ఎప్పుడూ చూడలే.

‘నీ దాకా వచ్చిందా? ఎవరు చెప్పారు?’ అన్నాడు. ‘మన శివరాత్రి ప్రభ ముందు నారసాలు పొడుచుకునే లక్ష్మయ్య, బ్రహ్మం చూసేందుకు వచ్చారట. ఆ వైభవమంతా ఒక పూటంతా చెప్పారు’ అంది.

“వచ్చారా, కన్పించలేదేం?”

“తెలీదు. కానీ ఇది చెబుతున్నపుడు వారు ఎంత సంబరంగా ఉన్నారో” అని చల్లని మంచినీరు ఇచ్చి లోనకి వెళ్ళింది.

వారం తిరక్కుండానే పోస్ట్‌మ్యాన్ కిష్టయ్య రామదాసుకు ఓ కార్డిచ్చి పోయాడు. చేను దగ్గర నుంచి వచ్చాక చూశాడు రామదాసు ఆ కార్డును.

‘గౌరవనీయులైన రామదాసు గారికి మీ నాయర్ వ్రాస్తున్నది’ అన్న వరకూ చదివి, ‘ఎందుకు రాసినట్టు?’ అనుకొని తిరిగి కార్డులోకి చూశాడు. “మీ, దాశరథీ గార్ల వెన్నుదన్నుతో చిరకాల వాంఛ నెరవేరింది. వేయి స్తంభాల గుడి పూర్వ వైభవాన్ని అందుకోలేకపోయినా, ‘అప్పుడింకెలా ఉండేదో’ అన్న భావన యాగానికొచ్చిన ఎక్కువమందిలో కలిగినది. అది చాలా సంతోషం.

ఇక వెళుతున్నాను. ఎక్కడికి? అనేది నాకే తెలియదు. నా జీవితంలో ఓ అద్భుత ఘట్టానికి తెర తీసిన మీ ఇద్దరినీ నా తుది శ్వాస వరకూ మరచిపోలేను. ఈ మాట దాశరథికి చెప్పు.  నా కోసం మాత్రం వెతకద్దు.

ఉంటాను.

మీ నాయర్”

అని ఉంది.

ఉత్తరాన్ని మూడుసార్లు చదివిందాకా నాకు పూర్తిగా అర్థం కాలేదు. అర్థమయ్యాక మనసంతా చెడింది. కళ్ళెంట ఆగని కన్నీరు. గబుక్కున లేచాను. అడుగులు తడబడుతున్నా దొరవారింటికి చేరి పెద్దగా కేకేసాను.

“ఏమైంది రామదాసూ!” అంటూ అన్నం తింటున్నవాడల్లా గబగబా బయటకి వచ్చాడు. కార్డు చేతిలో పెట్టాను. ఆయన పూర్తిగా చదివి,అక్కడే చతికిలబడిపోయాడు. ‘రామదాసూ ఏమిట్రా ఇదంతా?’ అంటూ ఆయన పసివాడిలా ఏడ్చాడు. నన్ను విదిలించి, ‘పద వెళదాం’ అని బయలుదేరాడు. వెళ్ళాం. రైలెక్కాం. దిగి గుడికి చేరాం. ఎప్పటిలాగా పూజాదికాలు నడుస్తూనే ఉన్నాయి. ఏదో ఆశ మెదిలింది మనసున. గబగబా గర్భగుడి దాకా చేరాము.

పూజారిగా నాయర్‌బాబు కనిపించలేదు. ఉన్న పూజారికి నమస్కరించి మేం ఫలానా అని చెప్పాం.

‘ఆ… ఆ…’ అని అతను, ‘మీరొస్తే ఇది మీకివ్వమని ఒక పొట్లం ఇచ్చాడు’ అని ఇచ్చాడు.

ఆయన యాగవాటికలో నున్నప్పుడు ధరించినదది.

“ఎక్కడికెళ్ళాడు?” అడిగాం ఆతృతగా.

“తెలియదు. కానీ ఆయన మాత్రం నన్ను వెతికి పట్టుకుని పూజాదికాలు నాకు అప్పగించి వెళ్ళాడు. నేను ఈ గుడి పూజాదికాలు అనాదిగా చేసిన వారి వంశంలోని వాడినట. ఆయన చెప్పిందాకా నాకూ తెలీదు.”

“ఏమైనా చెప్పాడా?”

“తల అడ్డంగా ఊపాడు. అంతే! ఏమీ తోచలేదు. నందీశ్వరుడి దగ్గర కళ్ళు తుడుచుకుంటూ కూర్చున్నాం. ఏం చేద్దామన్నా పాలుపోలేదు. ఆయన గది దాకా వెళ్ళి చూశాం. సర్వం కోల్పోయిన వారిలా రైలెక్కాం. ఇంటి దగ్గర బస్సు దిగగానే ‘నాయర్ బాబుతో మనం దిగిన ఫోటో ఏదైనా ఉందా?’ అని అడిగాడు దొరవారు.

‘ఒకటీ అరా ఉండాలి, వెతికి పట్టుకొస్తాను’ అని వెళ్ళి వెతకగా ఓ ఫోటో దొరికింది. ఆతృతగా చూశాను. మేమిద్దరం ఫోటోలో బాగానే ఉన్నాము. నాయర్‌బాబు మటుకు అందులో పూర్తిగా మసకబారి ఉన్నాడు. తీసుకెళ్ళి దొరవారికి ఇచ్చాను. చూసి కళ్ళు మూసుకొని, “రామదాసూ! మనం అదృష్టవంతులంరా, కనుకనే కారణ జన్ముడైన అతడితో పరిచయమేర్పడింది. మనకు లేని శక్తి ఏదో ఆయనకు ఉంది. అందుకే బహుశా అది మసకబారి ఉండొచ్చు” అంటూ చతికిలబడ్డాడు.

Exit mobile version