Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అజో విభొ కందాళం ఫౌండేషన్ 31వ వార్షిక సాహితీ సాంస్కృతిక సదస్సు – నివేదిక

[ఇటీవల విశాఖపట్టణంలో జరిగిన అజో విభొ కందాళం ఫౌండేషన్ 31వ వార్షిక సాహితీ సాంస్కృతిక సదస్సుపై నివేదిక అందిస్తున్నారు శ్రీ కె.పి. అశోక్ కుమార్.]

అజో- విభొ- కందాళం మరియు రైటర్స్ అకాడమీ విశాఖపట్నం వారి సంయుక్త ఆధ్వర్యంలో 31వ వార్షిక సభలు 2024 జనవరి 4,5,6,7 తేదీలలో కళాభారతి, విశాఖపట్నంలో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అజో- విభొ- కందాళం ఫౌండేషన్ వారు ఎంపిక చేసిన వ్యక్తులకు విశిష్ట పురస్కారాలను అందజేయడమే కాకుండా, సాహితీ సాంస్కృతిక సదస్సులను, కథా నాటక పోటీలను నిర్వహించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.

జనవరి 7, 2024 ఆదివారం ప్రతిభామూర్తి పురస్కార గ్రహీత శ్రీ ఎల్లపు ముకుంద రామారావు కృషి- సమాలోచన సదస్సు ఉదయం 10 నుండి 12:30 వరకు జరిగింది. ముకుంద రామారావు గారి  రచనలపై ఈ సదస్సు నిర్వహించబడింది. మొదట అప్పజోశ్యుల సత్యనారాయణ గారు ముకుంద రామారావు పై వెలువరించిన ప్రత్యేక సంచిక ‘సాహితీ వైజయంతి’ని ఆవిష్కరించి సభికులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఆ తర్వాత  కొనసాగిన సభలో  కర్రి శ్రీనివాస చక్రవర్తి ‘అదే ఆకాశం’ మీద ప్రసంగిస్తూ, ఇందులో 52 మంది కవుల పరిచయాలు 70 కవితలతో 23 దేశాల అనువాద కవిత్వం ఉందని తెలిపారు. ఏడవ శతాబ్దం నుండి ఉన్న ప్రాచీన తాత్విక భావ సంపదను తెలుగులో ముకుంద రామారావు గారు అందించారన్నారు.

‘అదే నీరు’ మీద డాక్టర్ కెజి వేణు ప్రసంగిస్తూ – ఇతర దేశాలు, భాషలు, ప్రాంతాలు, కాలాలను సైతం ఆస్వాదించాలి అనుకునే కవులకు ‘అదే నీరు’ ఆ దాహార్తిని తీర్చే మంచినీటి సాగరం. యువ కవులకు వారి కవిత్వ అవగాహన పరిధి పెంచి, కోణాల్ని తెలియజేసే గొప్ప అనువాదాలు. కొత్త నమూనాల్ని, నుడికారాన్ని, కవిత్వ దృష్టి కోణాల్ని మాతృభాషలో మరింత విస్తరణకు సహాయపడే తెలుగు కావులకు వరప్రసాదిని అని కొనియాడారు.

‘అదే నేల’ మీద డాక్టర్ డివి సూర్యారావు మాట్లాడుతూ, ఇది కేవలం భారతీయ భాషల్లో వచ్చిన కవిత్వ అనువాద రచన మాత్రమే కాదు. కవిత్వ అనువాదంతో పాటు ఆయా భాషల సాహిత్య చరిత్రని, కవిత్వ నేపథ్యాన్ని సైతం నమోదు చేసింది. ఇదే కాకుండా అంతరించిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్న భాషల పట్ల ప్రేమతో ముకుంద రామారావు ఆయా భాషల్లో లిఖిత, అలిఖిత రూపాల్లో లభించే కవిత్వాన్ని సేకరించి మన కందివ్వడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు.

‘అదే కాంతి’లో మధ్యయుగంలోని ఆనాటి భక్త కవుల గురించి, అప్పుడు పరిఢవిల్లిన భక్తి కవిత్వం గురించి, ఆనాటి సామాజిక నేపథ్యాలను పరిగణనలోకి తీసుకుంటూ రాసిన అమూల్యమైన వివరాలు ఉన్నాయని డాక్టర్ కే ఎన్ మల్లీశ్వరి తెలిపారు.

1901 నుండి 2011 వరకు నోబెల్ బహుమానం అందుకున్న కవుల జీవిత కథలు సంగ్రహంగా చెప్పి, వాళ్ళ కవిత్వంలో మచ్చుతునకలు కొన్ని అనువాదం చేసి ఇవ్వడం బాగుంది. అలాగే నోబెల్ బహుమతి పొందిన 13 మంది మహిళల పరిచయాన్ని, వారి గొప్పతనాన్ని తెలియజేస్తూ వెలువరించిన  పుస్తకం కూడా బాగా వచ్చిందని మాకినీడు సూర్య భాస్కర్ వివరించారు.

బి.వి అప్పారావు గారు ‘ముకుంద రామారావు గారి వ్యక్తిత్వం’ మీద ఎంతో ఉద్వేగంతో ప్రసంగించారు. ‘ముకుంద రామారావు గారి వలసవేదనల’ను బాల సుధాకరమౌళి ఎంతో చక్కగా విశ్లేషించారు. ‘ముకుంద రామారావు జీవన తాత్వికత’ను పాయల మురళీకృష్ణ విశ్లేషించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ కవి పసునూరు శ్రీధర్ బాబు అధ్యక్షతన, ప్రముఖ సాహిత్యకారులు చేసిన ఈ ఉపన్యాసాలతో మొదటి సెషన్ విజయవంతంగా ముగిసింది.

‘ప్రతిభా మూర్తి పురస్కారోత్సవ సభ’ అనే రెండవ సెషన్ సాయంత్రం ఐదున్నర నుండి రాత్రి 8:30 వరకు కొనసాగింది. ఈ సభకు రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి స్వాగతం పలకగా, మాజీ అమాత్యవర్యులు, రచయిత, నాటక ప్రయోక్త, దర్శకుడు దాడి వీరభద్రరావు అధ్యక్షత వహించారు. భారత ప్రభుత్వ  పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ కూటికుప్పల సూర్యారావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ విశిష్ట అతిథిగా వ్యవహరించారు. ఉణుదుర్తి సుధాకర్, కెపి అశోక్ కుమార్ ఆత్మీయ అతిథులుగా ఈ సభలో పాల్గొన్నారు.

పాల్గొన్న అతిథులంతా అజో- విభొ- కందాళం వారి సేవలను కొనియాడారు. అలాగే పురస్కారం అందుకుంటున్న ముకుంద రామారావు గారిని ప్రశంసించారు. ఉణుదుర్తి సుధాకర్ ‘చర్యా పదాలు, బెంగాల్ బౌల్ కవిత్వం’ విశిష్టత – గొప్పదనం, వాటిని ముకుంద రామారావు అనువాదంలోకి తెచ్చిన తీరును వివరిస్తూ మాట్లాడారు.

కెపి అశోక్ కుమార్ తన ప్రసంగంలో ముకుంద రామారావు గారి సాహితీ ప్రయాణాన్ని స్వీయ కవిత్వం, అనువాద కవిత్వం, ఇతర రచనలు అని వింగడించి  కవిగా, వ్యక్తిగా, అనువాదకుడిగా ముకుంద రామారావు గారి గొప్పతనాన్ని తెలియజేశారు.

తర్వాత జరిగిన పురస్కార ప్రధానోత్సవ సభలో ముకుంద రామారావు గారిని భార్యా సమేతంగా పండితుల వేదమంత్రాల మధ్య సత్కరిస్తూ లక్ష రూపాయల నగదును, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. పురస్కారాన్ని అందుకున్న రామారావు గారు తన సాహిత్య కృషిని వివరిస్తూ, పురస్కార ప్రదానం పట్ల తన కృతజ్ఞతలు తెలియజేశారు. తర్వాత అతిథులందరినీ సముచిత రీతిన సత్కరించడంతో సభ ముగిసింది. ఎందరో ప్రముఖులు, కవులు, రచయితలు, నాటకకర్తలు, నటులు పాల్గొన్న ఈ సభ విజయవంతంగా ముగిసింది.

Exit mobile version