Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఐశ్వర్య రహస్యం-7

[ఎర్ల్ నైటింగేల్ గారు 1956లో అమెరికన్ రేడియోలో ఇచ్చిన ప్రసంగం ‘ది స్ట్రేంజెస్ట్ సీక్రెట్ ఇన్ ది వర్ల్డ్’ ఆధారంగా డా. రాయపెద్ది వివేకానంద్ అందిస్తున్న ప్రేరణాత్మక రచన.]

మీకు అర్థం అయ్యేలా చెబుతాను.

నాటకాలు, తోలు బొమ్మలు ఆడించి డబ్బు సంపాయించటం అన్న కాన్సెప్ట్ దగ్గర నుండి మన వినోద సాధనాలు మొదలయ్యాయి.

ఆ తర్వాత మూకీ సినిమాలు

ఆ తరువాత నలుపు తెలుపు మాటల చిత్రాలు

ఆపై కలర్ చిత్రాలు

ఆ తర్వాత త్రీడీ చిత్రాలు వచ్చాయి.

ఒక తోలు బొమ్మలాట వాడు గానీ, ఒక నాటక బృందం వాడు గానీ కేవలం కొన్ని వంద్ల మందికి కొన్ని గంటల పాటు వినోదం అందివ్వగలడు.

ఇప్పుడు అమెజాన్ ప్రైం వాడు గానీ, యూట్యూబ్ వాడు గానీ, ఇతర ఓటీటీ ప్లాట్‌ఫాం వాళ్ళు గానీ, చేస్తున్నది ఏమిటి, కొన్ని మిలియన్ల వీక్షకులకి ఒకేసారి వేలాది సినిమాలలో ఏదో ఒకటి ఎన్నుకుని కావాల్సిన దాన్ని తీరిగ్గా ఇంట్లోనే చూడగలిగేలా తమ సర్వీసుని అందిస్తునారు.

పూర్వం వ్రాత పత్రికలు అని ఉండేవి. ఉత్సాహవంతులైన యువకులు కొందరు చేత్తో వ్రాసి కొన్ని కాగితాలని ఫైల్ చేసి, తమ మిత్ర బృందంలో ఒక్కోడికి అందించి చదివించేవారు.

ఆ తరువాత ప్రింట్ మీడియా వచ్చింది. పత్రికలు, బుక్కులు దాని ఫలితమే.

ఆ తరువాత ఫేసుబుక్కు వచ్చింది. దానితో బాటే ఇన్‌స్టాగ్రాం, ఇతర సామాజిక మాధ్యమాలు అన్నీ ఇలాంటి పనే కదా చేస్తున్నది. ఇప్పుడు ఫేసుబుక్కు వాడు ఇతర సామాజిక మాధ్యమాల వాళ్ళు కోటానుకోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ముక్కు పిండి సంపాయిస్తున్నారు. ప్రకటన ఇచ్చే వాడికి సిద్ధంగా ప్రేక్షకులు. ఫేసుబుక్కు వాడికి ఉచితంగా కోటానుకోట్ల సబ్‌స్క్రైబర్స్.

ఓలా గానీ, ఊబర్ గానీ, జొమాటో గానీ, స్విగ్గీ గానీ ఏ ఇతర ఆప్ బేస్డ్ సర్వీస్ గాని ఇలా ఒక ఐడియా నుంచి పుట్టినవే కదా.

ఒక ఐడియా జీవితాన్నే మార్చవచ్చు అంటే ఇదే కదా.

మీ ఐడియా, మీ సర్వీసు, మీ ప్రాడక్టు ఎంత ఎక్కువ మందికి ఎంత తక్కువ సమయంలో చేర్చేలాగా మీరు కనిపెడతారో మీరు అంత ఐశ్వర్యవంతులు అవ్వచ్చు అన్న మాట. దీనికి ఎల్లలు అన్నది లేవు.

డబ్బు సంపాయించటం వల్ల విజయం రాదు.

విజయం సాధించటం వల్ల డబ్బు వస్తుంది. ఇదే ప్రకృతి నియమం. ఇదే ఫైనల్.

చాలామంది ఈ ప్రకృతి నియమాన్ని తిరగరాయాలని చూస్తారు. అధఃపాతాళానికి కూరుకుపోతారు.

ఏదో ఒక లాగా నానా గడ్డి కరిచి అయినా సరే డబ్బు సంపాయిద్దాం అనుకుంటారు. వాళ్ళ దృష్టిలో డబ్బు సంపాయించటమే విజయం కదా.

అందుకే ఈ తిప్పలన్నీ.

మనకు ఇప్పుడు నిఖార్సైన-తిరుగులేని ప్రకృతి నియమం తెలుసు కదా. విజయం సాధించటం ద్వారా మాత్రమే డబ్బు వస్తుంది.

విజయం అంటే ఏమిటి “అతి తక్కువ సమయంలో మన మేధస్సుని ఉపయోగించి గానీ, మన సేవల్ని ఉపయోగించి గానీ, మన ప్రాడక్టుని ఉపయోగించిగానీ అతి ఎక్కువమంది అవసరాల్ని మనం తీర్చగలిగిన నాడు మనం విజయం సాధించినట్టు.”

నేను ఉద్యోగిని సార్. నాకు ఇది వర్తించదేమో అనుకుంటున్నారా? ఖచ్చితంగా వర్తిస్తుంది. మీరు మీ సమయాన్ని విక్రయిస్తున్నారు. మీ బాస్ యెక్క (కంపెనీ యజమాని యొక్క) అవసరాన్ని తీరుస్తున్నారు.

మీరే కంపెనీ యజమాని అయితే మీరు ఇంకొంత ఎక్కువ మంది అవసరాల్ని తీర్చగలరు.

ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఎక్కువ మంది అవసరాల్ని తీర్చగలిగే కొద్ది మీరు ఎక్కువ డబ్బు సంపాయించగలరు.

కాబట్టి ఇతరుల అవసరాలని తీర్చటమే విజయం. విజయం సాధించిన తరువాతే డబ్బులు వస్తాయి. ఇది ప్రకృతి నియమం.

ఒకడు పొయ్యి ముందు కూర్చుని పొయ్యితో “నువ్వు మొదట నాకు వేడిని ఇవ్వు. నేను వంట అదీ చేసుకున్న తర్వాత నీవు మండటానికి కట్టెల్ని ఇస్తాను” అన్నాడు అనుకుందాం. వాడ్ని మీరు ఖచ్చితంగా మూర్ఖుడు అంటారు కదా.

ఇప్పుడు మీరు కళ్ళు తెరిచి, ఓపెన్ మైండ్‌తో ఒకసారి మీకు సమాజంలో తెలిసిన వ్యక్తులని అనేక మందిని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళలో చాలా మంది ఇలాగే ఆలోచిస్తూ కనిపిస్తారు. మొదట డబ్బు సంపాయించాలి, ఆ తరువాత ఏదైనా విజయం సాధిస్తాను.

ఇటీవల నేను ఒక శిక్షణా కార్యక్రమం అటెండ్ అయ్యాను. రాజీవ్ తల్రేజా అనే శిక్షణా నిపుణుడు ఇలా చెప్పాడు “అడ్వర్టైజ్ మెంట్ చేయటానికి డబ్బు కావాలి కానీ, మార్కెటింగ్ చేసుకోవడానికి డబ్బు అవసరం లేదు కదా” అని.

ఆ వాక్యాలు అర్థం కావటానికి నాకు కాస్త సమయం పట్టింది.

“మీరు అందిస్తున్న సేవలు, ఉత్పత్తి తాలూకు వివరాలు తెలుపుతూ నియమబద్దంగా ఆసక్తికరమైన పోస్టులు సోషల్ మీడియాలో పెట్టటానికి గానీ, నలుగురికి తెలియజెసేలా గ్రూప్స్ లో పెట్టటానికి గానీ మీకు ఒక్క పైసా అవసరం లేదు కదా. ఇదే కదా మార్కెటింగ్ అంటే. మీ ఉత్పత్తులని, సేవల్ని కొన్నాళ్ళ పాటు ఉచితంగానో ట్రయల్ కిందనో అందజేయండి, ఇది కూడా మార్కెటింగే కదా.”

ఇది చేయటానికి డబ్బు అవసరం లేదు కదా.

ఆ తరువాత మెల్లి మెల్లిగా మీ సేవల్ని విక్రయించండి. డబ్బు వస్తుంది కదా. మెల్లిగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోండి. ఎక్కువ మంది వ్యక్తులకి మీ సేవలు అందుతాయి. ఎక్కువ డబ్బు వస్తుంది.

దీనికి పెద్దగా బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు కదా.

ప్రకృతి నియమాన్ని ఉల్లంఘించలేము కదా.

డబ్బు గూర్చి అస్సలు దిగులు పడవద్దు. అదే వస్తుంది.

గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది ఇదే కదా. పని చేయి. ఫలితం గూర్చి అనవసరంగా దిగులు చెందకు. నీవు చేసుకున్నదానికి ఖచ్చితంగా ఫలితం వచ్చే తీరుతుంది.

ఇతరుల అవసరాలని తీర్చటానికి సదా సిద్ధంగా ఉండు.

నిర్మాణాత్మకంగా ఆలోచించు

అలుపన్నది లేకుండా పని చేయి

కలలు కను

కలల్ని నిజం చేసుకో

ముఫై రోజుల పాటు దీన్ని పాటించండి. నిజం చెబుతున్నాను మీరు పొందబోయే అనంతమైన సంపదలకి, సమృద్ధికి అడ్డు అన్నది ఉండదు. ఇది నిజం. ఇది నిజం. ఇది నిజం. ఇదే నిజం.

వస్తు మార్పిడి అనే వ్యవస్థ గూర్చి మీరు వినే ఉంటారు.

ప్రస్తుతం ఉన్న ఆర్థిక వ్యవస్థని మీరు చూస్తూనే ఉన్నారు.

అది వస్తు మార్పిడి అయినా, ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ అయినా ఒకే సుత్రం మీద ఆధారపడి పని చేస్తున్నాయి.

“లా ఆఫ్ మ్యూచువల్ ఎక్స్ఛేంజి”

ఇతరుల అభివృద్ధికి తోడ్పడే ప్రతి వ్యక్తీ అభివృద్ధి సాధిస్తాడు.

ఒక్కోసారి మనం సాయపడే వ్యక్తి నుంచే మనకి సాయం అందాలని కూడా లేదు. అది అనుకోకుండా ఎక్కడినుంచో, ఏదో రూపంలో కూడా మనకి అందవచ్చు. అది కూడా ప్రకృతి నియమాల్లో ఒకటి.

న్యూటన్ థర్డ్ లా మీకు తెలుసు కద. ప్రతి ఒక్క చర్యకి సరిగ్గా వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుంది.

ఈ ముప్ఫై రోజుల ఛాలెంజ్ మీరు మొదలెట్టాక ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి. మీరు మొదలు పెట్టిన పనులు ఎంత చక్కగా నాణ్యంగా చేస్తున్నారు, మీ పనుల ద్వారా ఎంత ఎక్కువ మంది అవసరాలు మీరు తీర్చగలుగుతున్నారు అన్న విషయాల ఆధారంగా మీ విజయం నిర్ణయింపబడుతుంది. ఈ విషయంగా మీరు సంపాయించే డబ్బులు ఒక కొలమానంగా మాత్రమే పరిగణలోకి తీసుకోండి. అంతే కానీ డబ్బు సంపాయించటమే ధ్యేయంగా పని చేయటం కాదు విజయం.

“నో పర్సన్ కన్ గెట్ రిచ్ హిం సెల్ఫ్ – అన్ లెస్ హీ ఎన్రిచెస్ అదర్స్” ఇది ప్రకృతి నియమం.

రిచ్ – ఎన్రిచ్ అనే పదాల మధ్య ఉన్న ప్రాస వల్ల ఇంగ్లీష్‌లో ఈ మాట చక్కగా కుదిరింది. తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను.

ఎదుటి వ్యక్తిని బలోపేతుడిని చేసే ప్రయత్నంలో నీవు అందించే సాయం ద్వారా నీవు ఐశ్వర్యవంతుడివి అవ్వచ్చు. ఇదే ప్రకృతి నియమం.

మీకు నమ్మకం లేకుంటే అలా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి రోడ్‌కి అటు ఇటూ చూడండి. వ్యాపారస్థులు కావచ్చు, ఉద్యోగస్థులు కావచ్చు ఎలా డబ్బు సంపాయిస్తున్నారో ఒకసారి గమనించండి.

ఈ పద్ధతిలో ఇది వరకు మీరు ఎప్పుడు ప్రపంచాన్ని చూసి ఉండరనుకుంటాను. ఒక ప్రయోగం లాగా చేసి చూడండి ఇది. చాలా సరదాగా కూడా అనిపిస్తుంది.

ప్రవచనకారులు – వేదాంతవేత్తలు వారికి తెలిసిన విషయాలు చెప్పి మీ అశాంతిని పోగొట్టి మీకు ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని ఇస్తారు. వారికి డబ్బు రూపంలో ప్రతిఫలం రాకపోవచ్చు కానీ వారు విశ్వసించే పుణ్యం రూపంలో వారికి లాభం చేకూరుతుంది.

మీరు ఈ పద్ధతిలో విశ్లేషణాత్మకంగా ఆలోచించటం మొదలుపెడితే, మీ భవిష్యత్తు గూర్చి ఇక ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. మీరు ఎంత చేసుకుంటే అంత ఐశ్వర్యవంతులు అవ్వచ్చు.

టీచర్ గానీ, ట్రెయినర్ గానీ జ్ఞానం ఇవ్వటం ద్వారా డబ్బు సంపాయిస్తారు

హోటల్ వాడు ఆకలిగొన్న కడుపులకి వేళకి ఆహారం అందివ్వటం ద్వారా డబ్బు సంపాయిస్తాడు.

డాక్టర్ వైద్యం చేయటం ద్వారా డబ్బు సంపాయిస్తాడు

ఇదే విధంగా నీకున్న జ్ఞానం వల్ల కావచ్చు, వస్తు ఉత్పత్తుల ద్వారా కావచ్చు, సర్వీస్ ద్వారా కావచ్చు ఎదుటి వ్యక్తి యొక్క ఇబ్బందులని తొలగించి సౌఖ్యం ఇవ్వటం ద్వారా డబ్బు సంపాయిచటం తప్పేమి కాదు. నిజానికి ఇదే సరైన మార్గం.

ఎక్కువ డబ్బు సంపాయించాలి అంటే ఎక్కువ మందికి తక్కువ సమయంలో నాణ్యమైన సర్వీస్ అందించటం ద్వారా సంపాయించగలవు.

లేదండి నాకు తక్కువ డబ్బులు సరిపోతాయి అనుకుంటున్నారా, తక్కువమందికి సర్వీస్ అందివ్వటం ద్వారా సంపాయించవచ్చు.

దీనికన్నా షార్ట్‌కట్ లేదు. మిరు ఐశ్వర్యవంతులు అవ్వాలంటె మీరు చెల్లించాల్సిన మూల్యం ఇదే.

‘ఇతరుల అవసరాల్ని తుంగలో తొక్కి, నేను ఐశ్వర్యవంతుడిని అవ్వాల’ని ఎవరన్నా అనుకుంటే వాడు తన పతనానికి దగ్గరి దారి వెదుక్కునాడనే చెప్పాలి.

ఐశ్వర్యవంతుడు అవటం అటుంచి, వాడికి కనీస అవసరాలకి డబ్బు దొరకదు. వాడికి ఆరోగ్యం క్షీణిస్తుంది, అశాంతితో వాడు జీవితం గడిపేయాల్సి వస్తుంది.

“నీవు ఏది ఇస్తావో అదే పొందుతావు” అనేది ప్రకృతి నియమం అని మనం మరువరాదు.

ఈ ప్రకృతి నియమాల్ని తిరగరాయాలని ప్రయత్నం చేయకండి. అది అసాధ్యం మాత్రమే కాదు, వినాశనానికి కూడా దారి తీస్తుంది.

జైళ్ళలో భయంకర శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు, బయటి ప్రపంచంలోని దరిద్రులు, నిర్భాగ్యులు, దారిద్ర్యం, రోగాలతో మూలుగుతూ జీవితాలు జీవిస్తున్న అనేకులు ఇలా ప్రకృతి నియమాల్ని సవాలు చేసినవారే. తమ అనుకూలంగా తమ జీవితాల్ని శాశించుకోగలమనే ధీమా, మా అంతటి వారిమి మేమే, మాకు ఎదురేముంది అని మితిమీరిన ఆత్మ విశ్వాసంతో ప్రకృతి నియమాలని తిరగరాయగలమని అహంకరించిన వీరందరూ ఓటమి పాలై దరిద్రంలో, రోగాలతో ఏకాకులుగా జీవిస్తున్నారు. చట్టాలని ఉల్లంఘించి జైళ్ళ పాలైన వారు సరే, దాటతరం కానీ ప్రకృతి నియమాలని ధిక్కరించినవారు ఇంకా భయంకరమైన శిక్షలు జీవితం ద్వారా పొందుతుంటారు.

మీ విజయానికి ఆరు సూత్రాలు ఇక్కడ ఇస్తున్నాను.

  1. జీవితానికి ఒక స్పష్టమైన గోల్ ఏర్పరచుకోండి
  2. మిమ్మల్ని మీరు కించపరచుకోవడం పూర్తిగా మానేయ్యండి
  3. మీరు నెగ్గడం ఎందుకు అసాధ్యమో అని చెబుతూ కారణాలు ఏకరువు పెట్టడం మానేసి, మీరు ఖచ్చితంగా గెలవటానికి ఉన్న బలమైన అవకాశాలని ప్రతీ క్షణం గుర్తు తెచ్చుకుంటూ ఉండండి
  4. బాల్యంలో మీరు ఎంత ఆశావహ దృక్పథంతో ఉండేవారో ఒక సారి గుర్తు తెచ్చుకోంది. అసలు మీ ఆత్మవిశ్వాసం ఎప్పుడు ఎందుకు దెబ్బతినిందో గుర్తు తెచ్చుకుని ఇక ఆ జ్ఞాపకాలని సమూలంగా తుడిచేసి కొత్త ఉత్సాహంతో మీ మనసుని నింపుకోండి
  5. మీరు ఎలా అయితే ఉండాలని కలలు కంటున్నారో ఆ ‘సెల్ఫ్ ఇమేజి’ని స్పష్టాతిస్పష్టంగా మీ మనసులో నిలుపుకోండి
  6. ఒక విజేతగా ఏదైతే సెల్ఫ్ ఇమేజిని మీకు మీరు ఊహించుకున్నారో, ఆ విజేత ఈ క్షణంలో ఎలా ప్రవర్తిస్తాడో అచ్చు అలాగే ఇప్పటినుండి ప్రవర్తించటం మొదలుపెట్టండి

ఈ ఆరు సూత్రాలని అమెరికాలోని వెస్ట్ కోస్ట్‌కి చెందిన ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ డేవిడ్ హెరాల్డ్ ఫింక్ గారు సూత్రీకరించారు.

మానవ నాగరిక ప్రస్తానం మొదలయ్యింది మొదలు నిపుణులు అందరూ ఏదైతే చెప్పారో అదే చేయాలి విజయం కోసం. కష్టే ఫలి – మీ గమ్యాన్ని చేరుకోవడంలో కష్టపడి పని చేయటం అనే మూల్యాన్ని చెల్లించుకుంటె మీరు సాధించలేనిది ఏదీ లేదు.

ముప్ఫై రోజుల ఛాలెంజిని మొదలెట్టండి. పూర్తి చేయండి. ఆపి మరొక్క సారి తిరిగి చేయండి. ఆపై మరొక్క సారి, మళ్ళీ ఇంకో సారి, ఇలా పునరావృతం చేస్తూ వెళ్ళండి.

మొదట్లో కాస్త కష్టాంగానే అనిపించినా పదే పదే చేయడంతో కొన్నళ్ళకి ఈ ముప్ఫై రోజుల ఛాలెంజీ మీ జీవితంలో, మీ వ్యక్తిత్వంలో ఒక అంతర్భాగం అయిపోతుంది. అసలు ఇలా కాకుండా నా జీవితాన్ని వేరే విధంగా ఎలా జీవించానబ్బా అని మీరే ఆశ్చర్యపోతారు.

ఈ విధమైన కొత్త జీవితాన్ని మొదలెట్టండి.

మీరు కలలు కంటున్న ఐశ్వర్యం, సంపదలు, అవధులు లేని సమృద్ధి, సుఖ సంతోషాలల్తో మీ జీవితం నిండిపోతుంది.

మరి డబ్బో అంటారా? డబ్బుకి కొదవే ఉండదు.

ఇవన్నీ ఎలాగూ వస్తాయి. వాటన్నిటినీ మించి శాంతితో నిండిన మనసు మీ స్వంతం అవుతూంది.

కేవలం 1% నుంచి 5% మంది మనుషులు మాత్రం పొందే జీవితం మీ స్వంతం. ఆ జీవితంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సంపదలు, సమృద్ధి కూడి ఉంటుంది.

ఈ రోజే మొదలెట్టండి మీ ముప్ఫై రోజుల ఛాలెంజి.

మీరు కోల్పోయేది ఏమీ ఉండదు. ఐశ్వర్యం, సంపదలు, విజయాలు, సమృద్ది, ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యాలు, సుఖ సంతోషాలు, డబ్బు ఇవన్నీ ఖచ్చితంగా మీ జీవితంలో భాగం అవుతాయి.

ఇక మీదే ఆలస్యం.

స్వస్తి.

Exit mobile version