Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అహింస

[శ్రీమతి పద్మిని నాగరాజు గారి కన్నడ కథని అనువదించి ‘అహింస’ పేరుతో అందిస్తున్నారు చందకచర్ల రమేశ బాబు.]

భుజ్ ఏర్పోర్ట్ లో అలా కూర్చుని తన ల్యాప్టాప్ పైన కళ్ళు తిప్పుతున్న సతీశ్ తన కూతురు పంపిన మెయిల్ చదువుతూనే ఉన్నాడు. ఇది పదోసారో ఏమో! ఎంత ప్రేమతో “ప్రియమైన పప్పా” అని సంబోధించింది అనుకుంటూ కళ్ళు తుడుచుకున్నాడు. పత్రికా విలేకరి అయిన తనకు ఇలాంటి మెయిల్స్ వందలాది వచ్చినా మొదటి సారిగా ఈ విధమైన మెయిల్ ఒళ్ళు గగుర్పొడిచేలా చేసింది మాత్రం నిజం. సతీశ్ మళ్ళీ మళ్ళీ దాన్నే చదువుతూ ఉన్నాదు. “మై ఇధర్ బైఠ్ సక్తా హూ” అన్న గొంతు విని సతీశ్ తల ఎత్తకుండా తన ల్యాప్టాప్ బ్యాగ్ తీసి చోటు చేసిచ్చాడు. అతడికి తన కూతురు తన్వి జ్ఞాపకాల నుండి బయటికి రావడం ఇష్టం లేక మళ్ళీ దాన్నే చదువుతూ కూర్చున్నాడు. తన్వి సతీశ్ ఇంటర్ చదువుతున్న అమ్మాయి. భార్య మంజు అతడినుండి వేరు పడిన తరువాత తన్వి అమ్మతో ఉండసాగింది. మంజు తెల్సిన బంధువుల అమ్మాయి అని సతీశ్ అమ్మ అతడికిచ్చి పెళ్ళి చేసింది. ఆమె అప్పుడే అసిస్టెంట్ కమీషనర్‌గా ఉద్యోగంలో చేరింది. మెయిల్‌లు, ఫేస్బుక్ అని పరిచయమయ్యి, మెసేజ్‌ల సహకారంతో ఇద్దరూ ఆకాశంలోకి దూసుకుపోయారు. సతీశ్ తన ఒంటరితనానికి, భావనాత్మక స్వభావానికి స్పందించే సరైనది మంజునే అని నిర్ణయించి పెళ్ళి చేసుకున్నాడు.

‘బెంగళూరుకు వెళ్ళే విమానం ప్రయాణికులు చెకిన్‌కు రావాలి’ అనే ప్రకటన రాగా సతీశ్ తన మూటా ముల్లె సర్దుకుని లేచాడు. పక్కన కూర్చున్నతను గాఢ నిద్రలో ఉండడం చూసి అతడిని లేపి “ఆప్ కహా జానే కా హై” అని తనకు వచ్చిన వచ్చీ రాని హిందీలో అడిగాడు. “బెంగళూర్ జానా హై” అని చెప్పి మళ్ళీ నిద్రలోకి జారుకోబోయిన అతడితో “ఏ ఏర్వేస్ బెంగళూర్ జాతా హై. ఆప్ ఆవోంగే?” అని అడుగుతుండగానే అతడు ఆశ్చర్యంతో “హా సాబ్, ఆప్ భీ బెంగళూర్ క్యా?” అని అడిగాడు. సతీశ్ “అభి అనౌన్స్‌మెంట్ హో గయా ఆయియే” అంటూ ముందుకు నడిచాడు. అతడి వెనుకే ఆ మనిషి కూడా లగేజ్ తీసుకుని వెంబడించాడు. విమానంలో తన సీట్లో సతీశ్ కూర్చోగానే అతడు కూడా పక్కన కూర్చున్నాడు. “దేఖో సాబ్! క్యా కిస్మత్ హై. మై భీ ఆప్కె బగల్ మే ఆ గయా” అంటూ జారగిలబడ్డాడు.

సతీశ్ చదవడానికి తెచ్చుకున్న పుస్తకం తెరిచాడు. విలేకరిగా ఉన్న సతీశ్‌కు అనేక కారణాల పైన ఊళ్ళు తిరగాల్సి రావడంతో ఒక సంచిలో తను చదవాల్సిన పుస్తకాలను, వినదలచుకున్న పాటలను డౌన్లోడ్ చేసుకుని రావడం వల్ల అతడికి ప్రయాణం విసుగు తెప్పించేది కాదు. తన అనుభవానికి వచ్చినదంతటినీ కళ్ళకు కట్టినట్టుగా రాసేవాడు. అతడి ఆర్టికల్స్, నివేదికలు ఆత్మీయంగా ఉండడంతో అపారమైన పాఠకుల బలగం అతనికుండేది. ప్రతి శుక్రవారం అతడి కాలమ్ చదవడానికి ఆతురతతో కాచుకునేవారు. తరువాత తనకు వచ్చే ప్రతి మెయిల్‌కు తప్పకుండా జవాబు రాసేవాడు.

పుస్తకం చేత్తో పట్టుకుని అలాగే కళ్ళు మూసుకున్నాడు. విమానం రన్ వేలో నిదానంగా పరుగులు తీస్తోంది. తను వెళ్ళాల్సిన దారిలోకి వచ్చి ఎగరడానికి సిగ్నల్ రాగానే తన వేగాన్ని పెంచుకుని భూమికీ తనకూ  సంబంధం తెగిందన్నట్టుగా ఆకాశానికి  రెక్కలు విప్పి ఎగిరే కౌతుకాన్ని వీక్షించడం అంటే సతీశ్‌కు అదేమో ఆశ. చిన్నప్పటి నుండి ఎప్పుడో కాని తమ ఊరి పైన కనిపించని చిన్న పక్షిలాంటి విమానాన్ని విప్పారిన కళ్ళతో పిన్నలు, పెద్దలు బయటికి వచ్చి “విమానం విమానం” అని అరుస్తూ చప్పట్లు కొడుతున్నప్పుడు, అలాంటి విమానంలో తాను ఒక రోజు కూర్చోగలను అని అనుకోవడానికి కూడా అయ్యేది కాదు. సతీశ్ తన పక్కనున్న కిటికీ నుండి బయటికి చూశాడు. పైన విమానం నిదానంగా ఎగురుతోంది. విమానం చీల్చిన మబ్బులు కింద తేలుతున్నాయి. మొత్తం ఆకాశం, మబ్బులు. అనిర్వచనీయ అనుభవాన్ని కనుగొననారంభించింది సతీశ్ మనసు. అలాగే కళ్ళు మూసుకుని తల వాల్చిన సతీశ్ కు తన ఊరి పాఠశాల కనిపించసాగింది.

“రెండా ఒకట్ల రెండు, రెండా మూళ్ళ ఆరు..” అని వెనిక్కీ ముందుకూ ఊగుతూ ఎక్కాలు ఒప్పిస్తున్నప్పుడు కట్టిమని మాస్టారు బెత్తంతో “ఏయ్ సత్యా! నువ్వు మూడో ఎక్కం చదవరా” అని అన్నారు. అప్పుడు తను గంగావతిలోని ఇస్లాంపురం ప్రభుత్వ పాఠశాలలో మూడో క్లాసు చదువుతున్నాడు. తండ్రి పశువులకు నాడాలు కొట్టడం, వాటికేదైనా రోగం వస్తే గొట్టం పెట్టి మందులు తాగించే పని చేసేవాడు. వాటితో వచ్చే పైసలతో ముగ్గురి పొట్టలు నిండేవి కావు. అందుకని తల్లి రోజూ చింతపండు దంచడానికి వెళ్ళేది. తను చినిగిన చొక్కా, చడ్డీలతోనే ప్రైమరి క్లాసులు ముగించాడు.

తమ బడి తడికలతో కట్టినది. వాటిని మూడూ వైపుల రాతి బునాది పైన గోడలా నిలిపారు. పిల్లలంతా చేరి ఆ తడికల గోడలకు మట్టి మెత్తేవాళ్ళు. ఆ రంధ్రాలన్నీ కనబడకుండా మట్టి పూయడం సులభమైన పనేం కాదు. పెద్ద పిల్లలు మాస్టారి కుర్చీ వేసుకుని రాయల్సి వచ్చేది. ఆ మట్టితో పాటు తమ చీమిడి కూడా తడికలకి చేరేది. ఏ క్లాసు గోడలను ఆ క్లాసు పిల్లలే కట్టుకోవాలి. ఇదంతా అయిపోయేటప్పటికి ఒక వారం పట్టేది. లోపల బయట అంతా మట్టి పూసిన తరువాత క్లాసు ఆడపిల్లలు ఊళోకెళ్ళి, పేడ తెచ్చి, నేల అలికేవాళ్ళు. వాళ్ళు స్కర్టులను మోకాళ్ళ పైకెత్తి అలుకుతూ ఉంటే, సరస్వతి మేడం “ఏయ్ గంగూ, లీలా, లంగా కిందికనుకోండి. అంతా కనిపిస్తుంది చూడండి. మూసుకోండి” అంటూ గద్దించేవారు. అప్పుడు తమకు ఏం అనిపించేది కాదు. అప్పుడు మగపిల్లలు కూడా ఉత్త చడ్డీలే వేసుకునేవారు. ఇప్పటి లాగా లోపల వేసుకునే పద్ధతి ఉండేది కాదు. డ్రాయర్లు చూసిందే ఎన్నో సంవత్సరాల తరువాత. తమకు అది అందని వస్తువు. తను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు నాన్నతో డ్రాయర్ కొనమని అడిగి తిట్టించుకున్నాను. “నా కొడుకు ఏమేం అడుగుతున్నాడు చూడు. చడ్డి కొనడానికే గతిలేదు. దాన్లోపల వేసుకోవడానికి డ్రాయర్ కావాలట. గాలి ఆడకుండా కాలిన వంకాయ అవుతుందంతే. గాలి ఆడుతూ ఉండాల. అర్థమయిందా? వెళ్ళు” అని అప్పటి తన ఆశకు నీళ్ళు చల్లాడు.  మళ్ళీ తను డ్రాయర్ వేసుకుంది కాలేజీలో చేరినాకనే. అదీ నాన్నకు తెలియకుండా. పుస్తకం కొనాలని అబద్ధం చెప్పి, సంతలో కొని తెచ్చుకున్నాడు. ఏ బ్రాండు హంగూ లేకుండా, డిగ్రీ అయిపోయేదాకా తమ ఊరి సంతలో కాసిం సాబ్ కుట్టి ఇస్తున్న డ్రాయర్లే తమకు అప్పుడు బ్రాండ్లు.

“సాబ్! బెంగళూర్ మే  కౌన్ సా ఏరియా?” అని పక్కన కూర్చున్నాయన మాటలు కలిపినప్పుడు, సతీశ్ ఆలోచనా లహరి డ్రాయర్ నుండి విమానానికి దిగింది. “బనశంకరి” అన్నాడు మాటలు వద్దన్నట్టుగా. కొంచెం చిరాకుతోనే “కన్నడం రాదా? బెంగళూర్లో ఎన్ని సంవత్సరాలనుండి ఉంటున్నారు?” అంటూ ఒక విలేకరి గొంతుతో గట్టిగా అడిగాడు. “మీరు కన్నడిగులా? నేను భుజ్జిని. కన్నడం మాట్లాడతాను సాబ్. కాని మిమ్మల్ని చూసి మీరు హిందీవాళ్ళనుకున్నాను. మీ హిందీ చాలా బాగుంది. ఇక్కడికెందుకు వచ్చారు సాబ్?” అన్నాడు. “నేను విలేకరిని. ఏదో పనిమీద వచ్చాను.” అన్నాడు సతీశ్. “అంటే?” అతడి ప్రశ్న. “నేను ప్రెస్ రిపోర్టర్ని. పని ఉండింది, వచ్చాను” అన్నాడు మళ్ళీ చిరాకుతో. “ఓ! మీరు ప్రెస్ రిపోర్టర్ అని అనిపించదు సాబ్. ఆ జోష్ మీలో కనిపించదు. మీరు నిజంగా ప్రెస్ రిపోర్టరేనా?” మళ్ళీ ఒక ప్రశ్న. సతీశ్‌కు చిరాకు ఎక్కువైంది. ‘వీణ్ణి లేపడమే నేను చేసిన తప్పు. అక్కడే వదిలేయాల్సింది. తిక్క కుదిరేది. ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు? ప్రెస్ రిపోర్టర్ అని మొహం పైన రాసుకోవాలా?’ అని అనుకుంటూ మొహం గంటు పెట్టుకున్నాడు. “సాబ్! చికాకుగా ఉందా? సారీ. చూడండి. మేము భుజ్జిలం.. ఎంతోమందికి ఈ భుజ్ ఎక్కడుంది అని కూడా తెలియదు. ఎవరికైనా చెప్తే అర్థం కూడా అవదనుకోండి. మా కుటుంబ బిజినెస్ ఉంది. మా తాతగారు స్థాపించిన ‘గాంధి ప్రతిష్ఠాన్’ ను పరంపరగా నడిపిస్తున్నాము. ‘అహింస, శాంతి’ మా గురి. ప్రతి సంవత్సరం పెద్ద కార్యక్రమం చేస్తాము. గాంధీగారు మా వాళ్ళే. గుజరాతీ. కాబట్టి ఆయనంటే మాకు అభిమానం ఎక్కువ. అన్నట్టు మీరు వెజ్జా? నాన్ వెజ్జా?” మళ్ళీ ప్రశ్న. ఈ నాలుగు గంటల ప్రయాణంలో అదంతా వీడెకెందుకు అని సతీశ్ కు అనిపించినా మర్యాద కోసం “నాన్ వెజ్” అన్నాడు. “సాబ్ మీరేమైనా అనండి. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణికి బ్రతకాలనే ఆశ ఉండడం తప్పు కాదు కదా? అహింసయే పెద్ద ధర్మం. మేము అందులో విశ్వాసం ఉన్నవాళ్ళం సాబ్” అహింస అంటూనే తన మాటలతో హింసిస్తున్న అతడి మాటల వైపు నిర్లక్షం చూపుతూ సతీశ్ తను చదవడానికి తెచ్చుకున్న పుస్తకం తెరిచాడు, అప్పుడైనా అతడు నోరు మూస్తాడేమో అనే ఆశతో.

“సాబ్! మీరెన్నైనా చెప్పండి. పుస్తకాల్లో ఏం ఉంటుంది సాబ్? ఉత్త ఇమ్యాజినేషన్. మీ విలేకర్లు ఒకటికి పదింతలు చేర్చి రాస్తారు. చూడండి, నేనప్పుడే చెప్పాను కదా, మా అన్నయ్య కూతురి పెళ్ళి మాటలకు వచ్చాను అని. మా జమానాలో ఆడపిల్లలను ఇంత చదివించేవాళ్ళం కాము. ఆడపిల్లలేం ఖర్మ, మాకే ఎందుకు చదువు అని మాన్పించి అంగట్లో కూర్చోబెట్టేవారు. దేఖో సాబ్! నేను ఉత్త ఏడవ తరగతి చదివినవాణ్ణి. బెంగళూర్లో ఇరవై సంవత్సరాలనుండి హార్డ్వేర్ షాప్ నడుపుతున్నాను. కరోడోంకా బిజినెస్ కర్తా హూ సాబ్! కానీ, ఇప్పుడు చదువు రాకపోతే వరుడు దొరకడు అని చెప్పి చదువు చెప్పిస్తున్నాము. మా అన్న కూతురు సిఎ చేసింది సాబ్! ముంబైలో ఉంటుంది.”

సతీశ్ ఏమైనా మధ్యలో అనాలనుకుని “అయితే అబ్బాయి మీవాడేనా? బిజినెస్ మ్యానేనా?” అన్నాడు.

“అదే చూడండి సాబ్ వచ్చింది. మా అన్న కూతురు సోనీ భుజ్ లోనే ఒక అబ్బాయిని లవ్ చేస్తోంది అని మా అన్నకు డౌట్ వచ్చి ఆమెను ముంబైకి పంపాడు. సోనీ సోనాలాంటి పిల్ల సాబ్! కానీ ఆ అబ్బాయి ఉన్నాడు కదా, హైదర్ అని, వాడు తనకు ఇక్కడే కాలేజిలో పరిచయమంట. అప్పుడే పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చాము, మా పిల్ల జోలికి రావద్దు అని. ఈ మొబైల్ ఒకటి చేతికి వచ్చిన తరువాత అంతా పాడైపోయింది సాబ్! అక్కడికి వెళ్ళినా వీడు ఆమెను వదలడం లేదు. ఇప్పుడు మా అన్న అహమదాబాద్ లో ఒక మంచి కుటుంబం నుంఛి వరుణ్ణి చూసి, మాట్లాడి వచ్చాడు. ఈ పిల్ల చూస్తే నేను ఇంకెవరినీ పెళ్ళాడను, ఆ ముస్లిం కుర్రాణ్ణే పెళ్ళి చేసుకునేది అంటుంది. ఏ మతంలో పుట్టి ఏ మతంలోకి చేరుతాను అంటుంది చూడండి. మీకేమనిపిస్తుంది సాబ్” ప్రశ్నిస్తూనే తన మాటల వేగానికి ఒక విరామం ఇచ్చాడు. “చూడండి. పెద్దవాళ్ళైన పిల్లలకు వాళ్ళ బాధ్యత తెలియదా ఏమిటి? అది వాళ్ళ ఇష్టం కదా?” అంటూ ఇక మాటలు అక్కర్లేదు అనేలా ఊరకున్నాడు సతీశ్.

మంజు తనను వదలిపెట్టి వెళ్లడానికి ఇచ్చిన కారణం అతని కళ్ళ ముందు కదలాడింది. ఇద్దరూ ఇష్టపడి పెళ్ళి చేసుకున్న కొత్తలో సరిగ్గా ఉన్న తమ జీవితాలు తన్వి జననం తరువాత చికాకు వైపు తిరిగిందెందుకు? మాటి మాటికి డబ్బు తమ ఇద్దరి జీవితాలను ఛిద్రం చేసింది. తను మాత్రం పని చేస్తుంది, నేను బాధ్యత తెలియని తండ్రి అనే మాట చిన్నదిగా మొదలై, మాటల అగ్నికుండమై, మండి, కోర్ట్ మెట్లెక్కి విడాకుల దాకా తెచ్చికాని ఆగలేదు. తన్వి తన నెల జీతంలా సన్నబడింది. దాన్ని నెలకోసారి చూడచ్చు అని కోర్ట్ తీర్పునిచ్చింది. అదెందుకో అంత సంతృప్తికరంగా లేదనిపించి చూడాలనే ఆశను అదిమిపెట్టేసుకున్నాడు. మంజు మరో పెళ్ళి చేసుకుని కనుమరుగైంది. తను మాత్రం ఇక బంధాల జోలిక పోకుండా దూరంగా నుంచున్నాడు. పెళ్ళి, పిల్లలు అన్నీ ఒక మెరుపులాగా మెరిసి మాయమవగా, ఒక నిర్మోహిగా మారాడు. “సాబ్! ఏమైంది? ఎక్కడికో వెళ్ళిపోయారు.” ఎక్కడో తేలుతున్న అతడి మనసనే గాలిపటాన్ని పక్కనాయన సూత్రం పట్టుకుని లాగాడు. “అన్నట్టు మీ పేరేమిటి?” మొదటే అడగాల్సిన ప్రశ్నను ఇప్పుడడిగాడు సతీశ్. “మోహన్ దాస్ దుగార్. మీ పేరు?” తను అడిగాడు. “సతీశ్”. ”అయినా పేరులో ఏముంది సాబ్? భుజ్ నుండి ఇక్కడి దాకా పేరడిగేనా మాట్లాడింది? చూడండి. నేను సోనీ గురించి చెప్తున్నాను. అందరికీ మాట్లాడడానికి వెళ్ళాము అని చెప్తున్నాము కానీ నిజానికి సోనూ పెళ్ళి ముంబైలో మా అన్న చూసిన వరుడితో చేసేశాము. ఒక వారమయ్యింది. ఇది ఎవరికీ తెలీదు.” “మరి ఈ కుర్రాడి సంగతి?” సతీశ్ కుతూహలం ఉండబట్టలేక అడిగాడు. అతడు ఎవరికీ తెలియరాదు అన్నట్టు చిన్న గొంతుతో “సాబ్! మేము అయిదుగురం అన్నదమ్ములం. అంతా వేర్వేరు చోట్ల ఉన్నాము. ఒక పదిహేను రోజుల నుండి ఒక చోట చేరాము. దీనికే. హైదర్‌ను పిలిపించి మొదట బుద్ధి చెప్పాము. మీకూ మాకు కుదరదు అని కూడా చెప్పాము. వాడు ‘సోనీని వదలి బతకలేను, ఆమెకోసం నాన్ వెజ్ తినడం మానేశాను, ఆమెను తల్లి పిల్లలను చూసుకున్నంతా జాగ్రత్తగా చూసుకుంటాను’ అన్నాడు. ‘అదంతా కొత్త మోజులో బాబూ. తరువాత వేడి దిగినాక జీవితం ఏమిటి అని తెలిసేది’ అని చెప్పాము. డబ్బు ఆశ చూపాము. వాడు ఒప్పుకుంటే అడగండి” ఒక్క క్షణం ఆగాడు. “మరి” అని కుతూహలం పెరిగి అడిగాడు. “క్యా సాబ్! ఎంత చెప్పినా వాడి మాట వాడిదే. మాకూ చెప్పి చెప్పి విసుగొచ్చింది. మా అన్న కొడుకు వాడిని కార్లో కూర్చోబెట్టుకుని, మమ్మల్ని కూడ రమ్మని సైగ చేసాడు. వాడిని హిల్ గార్డన్ వద్దకు తీసుకుని పోయి, చచ్చిపోయేలా కొట్టి కొట్టి పారేసి వచ్చాము. మరుసటి రోజు పోలీసులు వచ్చారు. వాడు కంప్లెంట్ ఏమీ ఇవ్వలేదు. ఆ పోలీసోళ్ళే మమ్మల్ని బెదిరించి డబ్బులు తీసుకుని పోయారు.” అన్నాడు.

“కాదు. వాడు ఒక్కడు, మీరు ఇంతమంది. వాడు ఒకవేళ చచ్చిపోయుంటే? మతకలహాలు అయ్యుంటే? మీరు అంత కొట్టినా వాడు మీ పైన కంప్లెంట్ ఇవ్వలేదంటే వాడు మీ అమ్మాయిని ఎంత ప్రేమించాడో కదా? వాడు చచ్చిపోయుంటే ఏం చేసేవారు?”, “సాబ్! మేము ఒక చీమను కూడా చంపము, ఒక మనిషిని చంపగలమా?” అంటూ మోహన్ దాస్ మౌనం వహించాడు. మాట మార్చడానిక్ సతీశే “మీకెంత మంది పిల్లలు?” అని అడిగాడు. “నలుగురు. పెద్దవాడికి పెళ్ళయింది. కోలార్ అమ్మాయి. వాళ్ళకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి.” “అయితే మీ ఆస్తికి ఒక మగ వారసుడు ఉన్నాడు అనండి” వ్యంగం ధ్వనించేటట్టుగా అన్నాడు. “ఎక్కడ సాబ్! మొదటిది ఆడపిల్ల కదా! తరువాత మూడు సార్లు అబార్షన్ చేయించాము. నాలుగోది మగబిడ్డ అని డాక్టర్ కన్ఫర్మ్ చేశాకనే ఉంచింది.” విజయం కనిపించేలా నవ్వాడు అతడు. దానికి రెచ్చిపోయిన సతీశ్ “ఏ డాక్టర్ పరీక్ష చేసింది? అలా చేయకూడదు అని చట్టం ఉంది తెలుసా?” అన్నాడు కారంగా. “అయ్యో! మీ చట్టం మా డబ్బు ముందు నిలవదు సాబ్! మీరు విలేకర్లు. మీకు ఆ ఆస్పత్రి పేరు చెప్పను. ఆ డాక్టర్ కడుపును ఎందుకు కొట్టాలి?” అన్నాడు. కడుపులోని బిడ్డను భూమి పైకి రాకమునుపే తుంచేసేవారు ఈ మాట అనాల్సిందే అనుకుని సతీశ్ మౌనం దాల్చాడు.

సతీశ్ కళ్ళ ముందు తన తండ్రి మొహం తేలి వచ్చింది. గుంజాళ గ్రామం ఓణి నాగప్పగారి ఇంట్లోని బర్రె ఈనలేకుండా కష్టపడేది చూడలేక గిడ్డబస్య వచ్చి ఆ విషయం తెలిపాడు. ఆ రోజు పశువైద్యశాలలో ఎవరూ లేనందున ఆ మూగజీవి కష్టాన్ని చూడలేక వాడు తమ ఇంటి వాకిలికి వచ్చి చెప్పాడు. నాన్న వెనకా ముందూ చూడకుండా అతడి వెంట పరిగెత్తాడు. నాన్న వద్దన్నా తను కూడా వెంట వెళ్ళాడు. బర్రె దూడ వేయడానికి కష్టపడుతూ గిర గిరా తిరుగుతూ అరుస్తోంది. నాన్నకు నాడాలు కొట్టడం, గొట్టం పెట్టి మందు వెయ్యడం మాత్రమే తెలుసు తప్ప దూడనెలా వేయించాలో తెలియదు. బస్య మాత్రం “అన్నా! చూడు. పొద్దున్నుండి ఎలా తిరుగుతోందో? రెండు కాళ్ళు బయటికి వచ్చాయి. దగ్గరికి రానివ్వడం లేదు. ఏమైనా చేయరాదా?” అని నిస్సహాయకంగా నుంచున్నాడు. చుట్టూ నిలబడి చూస్తున్నవాళ్ళను వెళ్ళమని చెప్పిన నాన్న “బసన్నా! నేను ఈ పనిని ఎప్పుడూ చేయలేదు. కానీ ఈ మూగజీవి కష్టం చూడలేకపోతున్నా. భగవంతుడి ఇచ్ఛ! వాడే కాపాడాలి. చూద్దాం. ముందు ఒక గోనెపట్టా తీసుకురా.”అన్నాడు. బస్యా తెచ్చిన గోనెపట్టాను బర్రె పృష్టభాగానికి వేశాడు. గొట్టం పెట్టి ఏదో మందు తాగించడానిక చూశాడు. బర్రె అతడిని దగ్గరకు రానీయకుండా మహిషాసురుడి మాదిరిగా బుసలు కొట్టింది. మూడు నాలుగు ప్రయత్నాల తరువాత నాన్న గొట్టం ఎత్తాడు. పది నిమిషాల తరువాత గోనెపట్టాను తడిపి దాని ఒంటిపైన వేశాడు. బర్రె ఆర్భాటం సగానికి సగం తగ్గిపోయింది. అప్పుడు నాన్న నాగప్పగారిని పిలిచి బయటికి వచ్చిన రెండు కాళ్ళను మెల్లగా లాగమని చెప్పి, తను బస్య బర్రె రెండు డొక్కలను నొక్కసాగారు. మెల్లగ కాళ్ళు బయటికి వచ్చాక దూడ మొత్తం బయటికి వచ్చేదాకా అలాగే చేస్తూ ఉండి, దూడ బయట ప్రపంచానికి కాలుపెట్టగానే అంతా సజావుగా జరిగినందుకు భగవంతుడిని తలచుకుంటూ వంద సార్లు ఆకాశం వైపు తిరిగి దణ్ణం పెట్టుకున్నాడు. తన బరువును దించిన ‘పుణ్యాత్ముడు’ అనేలా నాన్న వైపు చూసింది. తనకైతే నాన్న సినిమా హీరో అనిపించాడు. బయటికి మొరటుగా కనిపించే నాన్నలోనూ అంత మెతకదనం ఉందని అర్థమయింది.

“ఎనీ కూల్ డ్రింక్ సర్?” ఏర్ హోస్టెస్ గొంతుకు ఉలిక్కిపడి లేచిన సతీశ్ వాస్తవానికి వచ్చాడు. అప్పుడే మోహన్ దాస్ ఒక టెట్రాప్యాక్ డ్రింక్ లో మునిగి పోయాడు. “ఆప్ క్యా లేంగే సాబ్? సమోసా అచ్ఛా నహి హై. ఈ సమోసా బెంగళూర్లో పది రుపాయలకు దొరుకుతుంది. ఇక్కడ డెబ్బై రుపాయలు.” చేతిలో ఉన్న డ్రింక్ చూపుతూ “ఏ భీ కాస్ట్లీ హై సాబ్. కానీ ఏదో ఒకటి తాగాలి కదా!” అంటూ దాన్ని తాగేసి మూత్ర విసర్జనకని నిలబడ్డాడు. ఇంకెంత సేపురా నాయనా బెంగళూరు చేరేది అని గడియారం వంక చూసుకున్నాడు సతీశ్. ఇంకా ఒక గంట వీడ్ని భరించాలి అనుకుంటూ సర్దుకున్నాడు. అక్కడనుండి వచ్చిన మోహన్ దాస్ “విమానాల్లో కొంచెం పెద్ద టాయ్లెట్, పెద్ద తలుపు కావాలి సాబ్! నాలాంటి వాళ్ళు లోపల ఇరుక్కుపోవడం గ్యారంటీ. విమానం తయారుచేసేవారికి తెలపాలి.” అన్నాడు. అతడి మాటలకు నవ్వుతూ సతీశ్ కూడా తను ఆ పనిని ముగించి వస్తానని బయటికి వచ్చాడు.

“మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు మా హార్డ్ వేర్ షాపుకే రండి. మంచి డిస్కౌంట్ ఇస్తాను.” అని చెపుతూ తన విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు. ఇక్కడ కూడా తన బిజినెస్ బుద్ధి చూపాడు అనుకున్నాడు సతీశ్. “మీ విజిటింగ్ కార్డుంటే ఇవ్వండి సాబ్! మాకేమైనా ఇబ్బంది కలిగితే మాకు ప్రెస్ వాళ్ళు తెలుసు అని చెప్పవచ్చు.” అన్నాడు. “మీ బిజినెస్‌లో అలాంటి ఇబ్బంది ఏం వస్తుంది?” సతీశ్ పశ్నించాడు. “ఈ కాలంలో ఎవరినీ నమ్మలేము సాబ్! పని కావాలని వస్తారు, పాపం అని పనిలోకి పెట్టుకుంటే మమ్మల్నే మోసం చేసి పోతారు సాబ్! మూడు నెలల క్రితం ఒక కుర్రాణ్ణి పన్లో పెట్టుకున్నాను. నేనే వాడితో మాట్లాడి, చూసి, జీతం ఇంత అని చెప్పి పన్లోకి పెట్టుకున్నాను. ఒక నెల తరువాత ఒక కస్టమర్ వద్ద నుండి అరవై వేలు తీసుకురమ్మని పంపాను. వీడు యాభై వేలే తెచ్చిచ్చాడు. ఆయనేమో అరవై వేలు ఇచ్చానంటాడు. వీడేమో ఇవ్వలేదంటాడు. చివరికి నేను, మా అబ్బాయి షాపు షట్టర్లు వేసేసి కుర్రాడికి నాలుగు తగిలించాము. అప్పుడు ఒప్పుకున్నాడు. ఇంకా మా షాపులో పని చేస్తున్నాడు. నెలకింత అని జీతంలో తీసుకుంటున్నాము.” అన్నాడు. సతీశ్ “మీ కస్టమరే తక్కువ ఇచ్చుండవచ్చు కదా?” అన్నాడు. “లేదు సాబ్! ఆయన అలా చేయడు. ఈ డబ్బు లేనివాళ్ళ రాతే అంత. డబ్బులు కనపడగానే వాళ్ళ నిజాయితీ మునిగి పోతుంది. అదీ కాక వాడే ఒప్పుకున్నాడు కదా సాబ్! ఇంతకంటే వేరే ఏం ప్రూఫ్ కావాలి?” తను అబద్ధం చెప్తున్నాను అని తెలిసికూడా దాన్ని కప్పిపుచ్చాడు. అతడి కస్టమర్ లెక్క తప్పుగా చేసింది, ఒప్పుకుని తరువాత పదివేలు ఇచ్చిన సంగతి సతీశ్ కు చెప్పాలని అతడికి అనిపించలేదు. దాన్ని పని కుర్రాడికి కూడ చెప్పలేదు. “కాదు. మీ దెబ్బలకు తట్టుకోలేక వాడు తనది కాని తప్పును ఎందుకు ఒప్పుకుని ఉండకూడదు? పేదరికానికి, నిజాయితీకి ముడి పెట్టకండి. మీరే ప్రభుత్వానికి ఒక లెక్క, మీ లాభాలకు మరొక లెక్క చూపేది. మీరు నిజాయితీ గురించి మాట్లాడతారా?” ఎందుకో సతీశ్ గొంతు గట్టిగా పలికింది. మోహన్ దాస్ ఒక్కసారిగా ఉలిక్కి పడి మళ్ళీ సర్దుకుని “హే! అలా చేయకపోతే ఎలా సాబ్ బ్రతికేది? మేము వంద రుపాయల లాభంలో ఒక రుపాయి దానానికని తీసి పెడతాము తెలుసా?” అన్నాడు. చేసిన అన్యాయాన్ని ధర్మం పేరిట కప్పిపెట్టే ఇలాంటివాళ్ళకు ఏమనాలో అర్థం కాకుండా మౌనంగా కూర్చున్న సతీశ్‌కు ఇస్లాంపురంలో రెడ్డి కొట్టు కనిపించింది.

ప్రతి ఆదివారం గంగావతిలో సంత. చుట్టూరా ఉన్న పల్లె ప్రజలు అక్కడికి వచ్చేవారు. పిల్లలంతా సంతలో ఉన్న ‘రెడ్డి ఐస్ క్రీం అంగడి’ ముందుకు వెళ్ళి నిల్చునేవారు. అది గంగావతిలోని మొట్టమొదటి ఐస్ అంగడి. దారి పొడుగునా దొరికే డబ్బాలోని ఐస్ కడ్డి తింటున్న పిల్లలకు ఒక రుపాయి పెట్టి రెడ్డి ఐస్ క్రీమ్ తినాలని ఆశ. నాన్న దగ్గరే ఒక రూపాయి లేనప్పుడు ఇక తన దగ్గర ఎలా ఉంటుంది? శరణ్ ఒక ఉపాయం కనిపెట్టాడు. తమ అమ్మలందరూ చింతపండు దంచుతున్న వరాండాకు స్కూలు తరువాత  వెళితే అక్కడ వాళ్ళంతా వెళ్ళిపోయి ఉంటారు. తామంతా ఆ రాతికి అంటుకున్న చింతపండును గీకేవాళ్ళు. అన్ని రాళ్ళనూ గీకితే ఒక క్రికెట్ బాలంత చింతపండు దొరికేది. ఇలా ఒక వారం పాటు సేకరించిన చింతపండును కుప్పలుగా చేసి సంతలో అమ్మే చంద్రవ్వకు ఇచ్చి ఒక రూపాయి తీసుకుని ఒక ఐస్ కడ్డి కొనుక్కొని ఆరుగురు మిత్రులు తినాలని నిర్ణయించారు. అలాగే చేసి ఒక రూపాయి పెట్టి అక్కడే ఉన్న కుర్చీల పైన కూర్చుని రెడ్డి ఇచ్చే ఐస్ కడ్డీని ఎవరు ముందుగా నాకాలని అనుకునేంతలో రెడ్డి ఒక చాకలేట్ రంగు పేపరు కప్పిన ఐస్ కడ్డి తెచ్చిపెట్టాడు. ప్లాన్ చేసిన శరణ్ మొదట నాకాడు. వాడు నాకిన దూకుడుకి పావుభాగం ఐస్ అయిపోయింది. తరువాతి వంతు మహేశ్ ది. వాడు కూడా పావు భాగం నాకాడు. దీన్ని అసహనంగా చూస్తున్న మిగతావాళ్ళు “రేయ్! కొంచెం కొంచెం నాకండిరా. మేమేం కడ్డి నాకడానికి కూర్చున్నామా? “ అంటూ గొడవచేశారు. నాలుగో వంతుగా సతీశ్ చేతికి వచ్చింది. ఇంకేం తినాలి! పావు భాగం ఐస్ కరగిపోయి నేలకు చేరింది. తిన్నవారు గంతులు వేస్తుంటే “చేతిదాకా వచ్చింది నోటికి రాని” పరిస్థితి సతీశ్‌ది. ఇంకా తినని వారి పరిస్థితి? “అప్పట్నుంచి మొత్తుకుంటున్నాం కదరా కొంచెం తినండి కొంచెం తినండి అని. ఇప్పుడు మేమేం తినాలి? మేము కూడా చింతపండు గీకామురా బాడ్కవ్” అంటూ కళ్ళల్లో నీళ్ళు నింపుకున్నాడు కాశి. ఇదంతా గల్లా పెట్టెలో కూర్చుని చూస్తున్న రెడ్డి, ఇదేదో తోపులాటకు దారి తీస్తుండడం చూసి “ ఏ పిల్లలూ ఇలా రండి” అని పిలిచాడు. మళ్ళీ పిల్లలంతా ఆశతో గల్లా పెట్టె వెనుక అతికించిన పోస్టర్ వంక చూస్తూ అతడి ముందుకు వెళ్ళి నిల్చున్నారు. “ఎవరు ఐస్ తిన్నారో వాళ్ళు బయటికి వెళ్ళండ్రా” అంటూ ముగ్గురిని బయటకు పంపాడు. “ఏయ్ సత్యా! నువ్వు తినలేదా?” అంటూ మేస్టారులాగా అడిగాడు. వాడు “లేదు. ఇక్కడే పడిపోయింది.”  అని దీనంగా అన్నాడు. ముగ్గురినీ కూర్చోబెట్టి వాళ్ల ముందు ఒక్కో కప్ లో పాల ఉండల్లా ఉన్న పాల ఐస్ తెచ్చి పెట్టాడు. “మా వద్ద డబ్బుల్లేవు” నోట్లో నీళ్ళూరుతున్నా అన్నారు ముగ్గురూ. “తెలుసురా. డబ్బులు ఇవ్వద్దు. తినండి. అలాగే ఆశతో చచ్చిపోయేరు.” అంటూ లోపలికి వెళ్ళాడు. ముగ్గురు పిల్లలు స్వర్గం అంటే ఇదే అని, రెడ్డి భగవంతుడని నిర్ణయించడం ఎప్పుడో జరిగిపోయింది. బయట ఉన్న ముగ్గురూ వీళ్ళని ఆశ కళ్ళతో చూస్తున్నారు. ఆ రోజు తిన్న ఐస్‌ను ఆనందించింది, బయటున్న ముగ్గురికీ తినిపించిందీ చూసిన రెడ్డి, చివరిదాకా ఇలాగే ఉండండ్రా అనింది గుర్తుకు వచ్చి సతీశ్ గద్గదితుడయ్యాడు.

“ప్రయాణికులు గమనించండి. బెంగళూరు కెంపేగౌడ ఇంటర్నేషనల్ విమానాశ్రయం..” అంటూ వినిపించి గబగబా సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు. విమానం ఆకాశం నుండి భూమికి దిగింది. అందరికీ దిగాలనే ఆత్రం. విమానానికి మాత్రం రన్ వే పైన నిదానంగా వెళ్ళాల్సిన అనివార్యత. అందరి మొబైళ్ళ రింగులు కొట్టుకోసాగాయి. మోహన్ దాస్ ఏదో ఫోన్లో మాట్లాడుతున్నాడు. అతడి భాష అర్థం కాక, తన చేతిలోని చదవని పుస్తకాన్ని తన సంచిలో పెట్టుకుని విమానం నుండి దిగడానికి తయారయ్యాడు. మోహన్ దాస్ ఒకే ధాటిగా ఎవరెవరికో ఫోన్లు చేస్తున్నాడు. “మా అన్న కూతురు సోనీ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంట. నేను మళ్ళీ భుజ్ కు వెళ్ళాలి. పెళ్ళై వారం కూడా కాలేదు. ఎంత పని చేసింది చూడండి సాబ్” అన్నాడు. ఆమె కోరినదానికి వ్యతిరేకంగా ఆమె పెళ్ళి చేసి ఇప్పుడు ఆమెను చంపింది మీరే కాదా అని అనాలనుకున్న సతీశ్ ఊరకుండిపోయాడు. అతడిని హత్తుకుని “ధైర్యంగా ఉండండి” అంటూ వీడ్కోలు పలికాడు.

కన్నడ మూలం: డా. పద్మిని నాగరాజు

అనువాదం: చందకచర్ల రమేశబాబు

Exit mobile version