[శ్రీ నల్లబాటి రాఘవేంద్రరావు రచించిన ‘అహంభావం హరించిపోయిన వేళ’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
ఈ ప్రపంచంలో గొప్ప వాడిని నేను
అనుకోండి రాసుకోండి ఊహించుకోండి
ఏమాత్రం తప్పులేదు అసలు తప్పే కాదు
అది మానవులకు దేవుడిచ్చిన కోరని వరం
కానీ అంతా నాలాగే ఉండాలి
అనుకోవడం ఆలోచించటం
కించిత్ అనాలోచితత్వం
ఓ మనిషిలా మరో మనిషి
నటించలేడు నాట్యం చేయలేడు
నవ్వలేడు ఆడలేడు రాయలేడు
అంతేకాదు ఓ మనిషిలా మరో మనిషి
తుమ్మలేడు దగ్గలేడు ఏడవలేడు
చదవలేడు కబుర్లు చెప్పలేడు
ఎవరి నటన వారిది ఎవరి పాట వారిది
ఎవరి దారులు వారివి ఎవరి ఆలోచన వారిది
ఎవరి నడవడిక వారిది ఎవరి ఆనందం వారిది
గేలి చేయకండి గోల చేయకండి
తెలియని వాళ్ళు ఉంటే నేర్పండి
అవమానించి అసహ్యంగా చూడకండి
ఎందుకంటే ఒకప్పుడు మనందరికీ ఏమీ రాదుగా
అందరినీ గౌరవించుకుపోవడం మనధర్మం
అది మన అందరికీ ఆరోగ్యదాయకం
ఉత్తమమైన మంచి మార్గం
చెప్పుకోవలసిన మహా గొప్ప
విషయం ఏమిటంటే
ఉన్నతులు
గుర్తింపబడకపోవచ్చు
సమర్థులు చీకటి బందిఖానాలో
క్రుంగిపోతూ ఉండబడి ఉండవచ్చు
పండితులనోటికి బీగం
ఉండవచ్చు!
అనామకులు
సింహాసనం అధిరోహించవచ్చు
చచ్చు బండలు సైతం ప్రాణం వచ్చి
పరుగెత్తుతూ ఉండవచ్చు.. అంతెందుకు
కొరగానివాడు కూడా వేదాలు
వల్లించి అబ్బురపరుస్తూ
ఉండవచ్చు!
ఇది
ఎవరూ ఆపలేని
కాలచక్ర మహిమ
మహా గొప్పమహిమ!
దీన్నిజీర్ణించుకొని
ముందుకు నడవడం
మానవ ధర్మం
నల్లబాటి రాఘవేంద్రరావు కవి, కథకులు. నాటక రచయిత. తల్లిదండ్రులు సుబ్బారావు, వీరభద్రమ్మ గార్లు తనకు సాహితీ గురుదేవులని అంటారు రచయిత. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 15 రేడియో నాటికలు ప్రసారం చేసి, రచయితగా నమ్మకాన్ని కలిగించిందంటారు. 1975లో తొలికథ ‘బుద్ధిలేని మనిషి’ ఆంధ్రసచిత్రపత్రికలో ప్రచురితం. తొలి బహుమతి అప్పటి సినిమా పత్రిక విజయచిత్ర వారిచ్చారు. తాను రచయితనవడానికి ప్రేరణ తన మిత్రుడు, ఇప్పటి కథారచయిత, సినీ దర్శకుడు పసలపూడి బామిరెడ్డి అంటారు రచయిత.
ఇప్పటివరకు 900 కథలు రచించగా, వాటిలో 200 కథలకు వివిధ బహుమతులు లభించాయి. 300 కవితలు వ్రాయగా, అందులో 60 కవితలకు పలు బహుమతులు అందుకున్నారు. 20 రేడియో నాటికలు ప్రసారం కాగా, 10 స్టేజి నాటికల రచన, నటన, దర్శకత్వం, ప్రదర్శన.
200 షార్ట్ స్కిట్స్ వివిధ గ్రూపులలో ప్రదర్శించారు. 200 సూక్తులు, 100 గేయాలు రాశారు. 20 యూట్యూబ్ గ్రూపులలో యాక్టివ్ మెంబర్. 50 కథ, కవిత సంకలనాలలో భాగస్వామి. 6 టెలి ఫిల్ములు, 6 బహుమతి కథల సంపుటులు, 2 కవితల సంపుటులు, 4 నవలలు వెలువరించారు. 5 సంవత్సరాల నుండి యూట్యూబర్. యూట్యూబ్లో 100 కథలు,100 కవితలు,300 షార్ట్స్ అందించారు. 2 సంవత్సరాల నుండిSpotify vloger గా 30 కథలు. యూట్యూబ్ వివిధ ఛానళ్లల్లో పాడ్ కాస్ట్ స్టోరీలు 250 పైగా.
మొత్తంగా బహుమతులు 250, వందలాది ప్రశంసాపత్రాలు, 30 బిరుదులు పొందారు.
వివిధ ప్రదేశాలలో అనేక సన్మానాలు జరిగాయి. అందుకున్న పురస్కారాలలో మైలురాళ్ళవంటివి – అప్పాజ్యోసుల విష్ణుభట్ల ఫౌండేషన్ పురస్కారం, ఆటా పురస్కారం, తానా కవితాలహరి ప్రశంస, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పత్రికా ప్రశంస, కదలిక టెలిఫిలిం నిర్మాణం ప్రశంసలు, నిమ్స్, సి.పి. బ్రౌన్, ఆప్కో లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల పురస్కారాలు.
వీరి బహుమతి కథల కథా సంపుటి ‘స్వర్ణశిఖరాల’కు 2024వ సంవత్సరం జాతీయ స్థాయి అత్యుత్తమ గ్రంథంగా పెందోట సాహితీ సంస్థ శ్రీవాణి పరిషత్తు వారి అవార్డు రివార్డు సన్మానం. అదే గ్రంథానికి చదువుల సాహిత్య వేదిక వారు విశిష్ట గౌరవ పురస్కారం అందించారు. అదే గ్రంథం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గ్రంథాలయ గౌరవానికి ఎన్నిక కాబడటం, అదే గ్రంథ గౌరవంగా పుట్టిన ఊరులో స్వసంఘీయుల తరపున ఘన సన్మాన సత్కారం, అవార్డు రివార్డు అందుకోవడం గొప్ప చారిత్రాత్మక విషయంగా భావిస్తారు.