[సముద్రాల హరికృష్ణ గారు రచించిన ‘అహం!’ అనే జానపద కథను అందిస్తున్నాము.]
ఎనిమిదేళ్ళ పిల్లవాడిగా ఉన్నప్పుడు చూశాడు శూరసేనుడు మొట్టమొదట, విజయేంద్రను.
పొరుగు దేశపు రాజధాని నగరం శివార్లలో ఉన్న ఒక సాముగరిడీలూ నేర్పే చిన్నపాటి తాలింఖానాలో, సేవకుడిగా.
అక్కడ పనిచేస్తున్న విజయేంద్ర కళ్ళలో చురుకుదనం శూరసేనుడిని ఆకట్టుకుంది.
వెళ్తూ వెళ్తూ పది వెండి నాణాలు కానుకగా ఇచ్చాడు.
విజయేంద్ర మొదట తటాపటాయించాడు అవి తీసుకోవటానికి!
“తీసుకోరా”, అని పేరూ, ఇంట్లో వారి గురించీ అడిగాడు.
విజయేంద్ర, “ఎవ్వరూ లేరయ్యా, నేను ఇక్కడే పడుకుంటాను, రాత్రి పూట! మీరిచ్చింది కూడా మా వస్తాదుకే ఇచ్చేయాలి, ఇచ్చేస్తాను” అన్నాడు.
శూరసేనుడు, కుర్రవాళ్ళకు దర్పంగా పట్లు నేర్పుతున్న ఆ వస్తాదును ఒకసారి నిర్లక్ష్యంగా చూసి,”సరేలే ఈ సారి వచ్చినపుడు చూస్తా, వస్తావా నాతో,” అన్నాడు బయటకు వెళ్తూ!
విజయేంద్ర ఏం చెప్పాలో ఆలోచించే లోపలే, శూరసేనుడి దగ్గరకు ఇద్దరు మనుషులు వచ్చి, “గుర్రం సిధ్ధంగా ఉంది అయ్యా”, అనటం, ముగ్గురూ గుర్రాల మీద వేగంగా వెళ్ళిపోవటం జరిగిపోయింది.
ఓ నిముషం పాటు అటే చూస్తూ నుంచున్న విజయేంద్ర, వస్తాదు అరుపుతో ఈ లోకంలోకి వచ్చి, ఆ పది నాణేలు అతని చేతిలో పెట్టేసి, తన పనిలోకి వెళ్ళిపోయాడు.
అంతా ఓరకంట గమనిస్తూనే ఉన్న వస్తాదు, ‘ఎవరబ్బా ఇంత రొక్కం ఇచ్చి వెళ్ళాడు’, అనుకుని, ‘ఎవడైతే మనకేంటి లక్ష్మి తేరగా దొరికింది, భద్రపరచుకోవడమే’, అనుకుంటూ ఓ ఈల వేసుకుంటూ దాన్ని తన పెట్టెలో దాచేసుకున్నాడు.
***
సరిగ్గా మూడు నెలల తరువాత ఏదో పని చూసుకుని శూరసేనుడు తన ఇద్దరు అనుచరులతో ఆ రహదారి వెంట పోతూ, తాలింఖానా ఎదురుగా ఉన్న పూటకూళ్ళమ్మ ఇంట భోజనానికి ఆగాడు.
కిటికీలో నుంచి తాలింఖానాలో తల వంచుకుని పనిచేస్తున్న విజయేంద్ర కనిపిస్తూనే ఉన్నాడు అతనికి. తదేకంగా అయిదు నిముషాలు చూసి, తన మనిషిని పంపించి విజయేంద్రను పిలిపించాడు.
వచ్చిన విజయేంద్రతో, ఉన్నట్టుండి,”ఏయ్ వస్తావురా నాతో, ఇంతకంటే ఎక్కువ జీతం ఇచ్చే పని ఇప్పిస్తాను”, అన్నాడు శూరసేనుడు.
గత నాలుగేళ్ళుగా అక్కడ పడ్డ అవస్థలు తలచుకొని, ఏదో ఒకటి బయటపడవచ్చని విజయేంద్ర వెంటనే తలూపాడు.
ఆ సమయంలో, తాలింఖానాలో వస్తాదు కూడా లేడు. తనతో కాస్త స్నేహంగా ఉండే శరభయ్యకు చెప్పి వాళ్ళతో వెళ్ళిపోయాడు విజయేంద్ర.
వారు తమ రాజధాని చేరటానికి సుమారు 25 యోజనాల దూరం ఉంది. ఆ మధ్యలో కొంత ప్రాంతం ఒక దట్టమైన చిట్టడవి ఉంది. అందులో రెండు మూడు పులులు తిరుగుతాయనీ, ఇద్దరు ముగ్గురు ఒక ఏడాది కింద వాటి బారిన పడ్డారని జనం చెప్పుకునే మాట, ఆ ప్రాంతాల్లో!
అయితే, “ఆ ప్రమాదాలు జరిగినది సాయంకాలం దాటిన తరువాత, మనం ఆ లోపునే అడవి దాటేస్తాములే”, అని ఆ దారి ఎంచుకున్నాడు ఆ రోజు శూరసేనుడు, ఇద్దరు భటులకూ పెద్దగా ఇష్టం లేకపోయినా. ఆ ప్రమాదకరమైన మార్గం.
తన గుర్రం మీద తనతో పాటు, విజయేంద్ర. తోడుగా రెండు గుర్రాల మీద ఆ ఇద్దరు సైనికులు.
కొంత దూరం వెళ్ళారు అడవిలో.
సగం దాకా దాటారు కూడా. ఎక్కడి నుంచి వచ్చిందో చెట్ల మాటునుండి అమాంతం శూరసేనుడి గుర్రం మీదే పడబోయింది, ఉగ్రంగా ఉన్న పులి.
ఎట్లాగో ఒడుపుగా తప్పుకున్నాడు శూరసేనుడు, బల్లెంతో దాన్ని అడ్డుకుంటూ.
ఇంతలో అది ఆ మిగతా ఇద్దరు సైనికుల మీదకి మళ్ళింది, గాండ్రిస్తూ!
వారు తమ శక్తి కొద్దీ పోరుతుండగానే, శూరసేనుడు తన గుర్రాన్ని మరింత వేగంగా దౌడు తీయించి ఆ ప్రాంతం దాటేశాడు.
అంతా చూస్తున్న విజయేంద్ర భయంతో అవాక్కైపోయాడు.
“మరి వాళ్ళిద్దరూ”, అన్నాడు జంకుతూ శూరసేనుడితో, ఒక రెండు గంటల తరువాత ఊళ్ళోకి అడుగుపెడుతూండగా.
“వాళ్ళా?! పులి వదిలేస్తే వస్తారు, లేకపోతే ఈ పాటికే ఫలహారమైపోయుంటారు దానికి” అన్నాడు చాలా మామూలుగా!
విజయేంద్రకు అప్పటివరకు శూరసేనుడి మీద తాను పెట్టుకున్న నమ్మకం, ఎందుకో తగ్గినట్లు అనిపించింది, ఆ నగరం ప్రవేశిస్తున్న వేళ, తన కొత్త జీవితపు ఆరంభంలోనే!
అది ఒక నేరలోకపు రహస్య జీవితం కాబోతోందని అతనికి తెలియదు, ఆ క్షణాన పాపం!!
***
మహీధర రాజ్యంలో శూరసేనుడు ఒక సైనికాధికారి. అమిత కిరాతకుడు, దురాశాపరుడు అయిన సర్వ సేనాధిపతి ప్రచండుడికి కుడిభుజం!
వృధ్ధరాజును అదను చూసి పడగొట్టి, రాజ్యం తాను కైవశం చేసుకోవాలి అని ఆలోచిస్తున్న ప్రచండుడికి, కుడిభుజం.
అధికారికంగా, దేశ రక్షకులైనా, ప్రచండుడు శూరసేనుడు లాంటి వారు, రహస్యంగా వారు నడుపుతోంది మాత్రం, ఒక దోపిడి ముఠాను, అనే చెప్పాలి.
తనతో తీసుకెళ్ళినప్పటి నుంచి చాలా బాగా చూసుకున్నాడు శూరసేనుడు, విజయేంద్రను, దాదాపు సొంత తమ్ముడి లాగా!
అట్లాంటిదే ఏదో ఒక భావన కలిగింది శూరసేనుడికి, విజయేంద్ర పట్ల, తాను తల్లిదండ్రులను వదిలేసి పారిపోయి వచ్చినప్పటి తన తమ్ముడిని గుర్తు చేస్తూ!
తమ నాయకుడే విజయేంద్రను ప్రేమగా చూడటంతో, మిగతా వారు కూడా జాగ్రత్తగా చూడసాగారు.
కొత్త జీవితం బాగానే సాగిపోతోంది విజయేంద్రకి, ఇదివరకటి తాలింఖానా జీవితం కంటే ఎన్నో రెట్లు హాయిగా!
‘అన్నా’, అనే విజయేంద్ర, శూరసేనుణ్ణి పిలవటం కూడా, మొదటినుంచీ!
ఆ కరకు సైనికాధికారి కూడా ఆ పిలుపుకి పలకడమే అక్కడి విచిత్రం!
***
చూస్తుండగానే పది పన్నేండేళ్ళు గడిచిపోయినై!
విజయేంద్ర దాదాపు 20 ఏళ్ళ దృఢమైన యువకుడయ్యాడు.
అక్కడి పనిపాటల్లో రహస్య వ్యాపార మతలబుల్లో, చట్టవిరుధ్ధ కార్యకలాపాల్లో తన స్థాయి వారిలో అందరికంటే తెలివైన, చురుకైన వాడిగా పేరు సంపాదించాడు.
శూరసేనుడికి పై అధికారి యైన ప్రచండుడు కూడా విజయేంద్రను ఒకటి రెండుసార్లు చూశాడు, శూరసేనుడితో ఉన్నపుడు!
ఈ కుర్రవాడిలో ఏదో చురుకుతనం ఉన్నది, వీడు ముందు ముందు బాగా ఉపయోగపడ్తాడు మనకు అనే నమ్మకం కూడా ఏర్పడ్డది, ఆ సేనాధిపతికి..
ఒక పని చెపితే, అంతా తనే చూసుకొని, ముగించే సత్తా ఉన్నవాడు, పైగా యువకుడు, దూసుకుని పోగలడు అని మనసులో అనుకునేవాడు, ప్రచండుడు.
***
అన్నీ బాగున్నప్పుడు నమ్మకాలు ఎంత గట్టిగా ఉంటాయో, తేడా వస్తే నమ్మక ద్రోహాలూ అంతకు మించిన స్థాయిలో ఉంటాయి, ఈ చీకటి నేర ప్రపంచంలో!
అదే తటస్థించింది, శూరసేనుడికి.
హఠాత్తుగా ఏమైందో విజయేంద్ర అతని మాట వినక, పెడ చెవిన పెట్టడం మొదలుపెట్టసాగాడు. తరువాత క్రమంగా ఎదురు చెప్పసాగాడు కూడా!
శూరసేనుడికి ఈ మార్పు దేని వలనో అంతు పట్టలేదు, ఎంత ఆలోచించినా!
ఇదే ధోరణి ఎక్కువ కావటంతో, విజయేంద్రను కొన్ని రోజులు నువ్వు రానక్కర్లేదు అని హుకుం జారీ చేశాడు, శూరసేనుడు!
అంతే, అదే ఆఖరి సారి, విజయేంద్ర ‘అన్నా’ అని తను పిలిచిన శూరసేనుడితో పనిచేయటం!
***
కొద్ది రోజుల్లోనే కారణం తెలిసింది, శూరసేనుడికి!
తన స్థానంలో ప్రచండుడు, విజయేంద్రను ఆ సైనికదళానికి నాయకుడిగా నియమించాడు అనీ, తను వేరే పనులు చూడాలని ఉత్తర్వులు విడుదల చేశాడనీ!.
***
మొదట విజయేంద్ర తనకిచ్చిన సైనికాధికారి పదవి వద్దన్నాడు, శూరసేనుడిని తీసేసి తనకు ఇస్తున్నాడని తెలిసి.
కానీ ప్రచండుడి మాటలు అతని మీద ప్రభావం చూపాయి.
“నువ్వనుకున్నంత మంచివాడు కాదు శూరసేనుడు, అవసరమైతే ఎవరినన్నా ఎరగా వాడేస్తాడు తన స్వార్థానికి, జాగ్రత్త! నీ మంచికే చెపుతున్నాను, అతని కింద ఉండటం నీ కెప్పటికైనా ప్రమాదమే” అని హెచ్చరించాడు.
వెంటనే తాను సుమారు 13 ఏళ్ళ కిందట వస్తున్నపుడు అడవిలో పులి బారిన ఆ ఇద్దరు సైనికులనూ శూరసేనుడు ఎంత నిర్దయగా వదిలేసి తప్పించుకుని వచ్చేశాడో గుర్తొచ్చింది.
అంతే, మర్నాడే అతను ప్రచండుడితో చెప్పేశాడు తన అంగీకారాన్ని, ఆ కొత్త పదవికి!
ప్రచండుడి ముఖాన ఒక చిరునవ్వు తారాడింది, ఆ మాట వినగానే, నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావని, అన్న భావం ఒలికిస్తూ!
***
పదవి తగ్గించడంతో, శూరసేనుడి అహం దెబ్బ తిన్నది ఘోరంగా. గాయపడ్డ పెద్దపులి అయిపోయాడతను!
***
ఇది రెండు రకాలుగానూ ద్రోహమే – తాను నమ్మినవాడూ, తనను నమ్ముకున్న వాడూ కలిసి చేసిన ద్రోహం అని భావించా డతను.
పదవి పోయినందుకంటే, తనను తక్కువ అంచనా వేశారు అనీ, అది తన సామర్థ్యం మీద కొట్టిన దెబ్బగా, పడిన మచ్చగా అతను భావించాడు.
ఆ మచ్చ తుడిపేయనిదే అతనికి ఇక మనశ్శాంతి లేదు!
అది తన ఉనికినే ప్రశ్నిస్తున్నట్టు, గేలి చేస్తునట్టూ తీసుకున్నాడు శూరసేనుడు!
ప్రచండుడితో ఒకసారి మాట్లాడితే, “అవును నీకే మంచిది, వయస్సు ప్రభావం చూపుతోంది నీ మీద”, అని అవమానకరంగా మాట్లాడి పంపించాడు.
“విజయేంద్ర అయితే మన పనులను త్వరగా అమలు చేయగలడు, ఇంకా ఎంతో సమయం లేదు మనం అధికారం మొత్తం చేజిక్కించుకోవడానికి, అందుకే ఈ మార్పు”, అని కూడా అని శూరసేనుడి అహాన్ని ఇంకా దెబ్బతీశాడు ప్రచండుడు తనకు తెలియకుండానే!
అంతే, ముభావంగా ఉంటూ, తన కోసం, వేరే అనుయాయ గణం కూడగట్టి సాగాడు శూరసేనుడు, అతి రహస్యంగా!
అత్యంత స్వల్ప కాలంలో ప్రచండుడికే పోటీ అని, విషయం తెలిసిన వారు గుసగుసలాడే స్థితికీ, చేరుకున్నాడు శూరసేనుడు.
తన శక్తి ఏమిటో ప్రచండుడికి తెలియవచ్చేలా చేయాలన్నదే ఇప్పుడు శూరసేనుడి లక్ష్యంగా తయారైంది.
అది నెరవేరటానికి ఎంతకైనా సిద్ధమే అతను.
ఆరునెలల్లో ఆ పోటీ శత్రుత్వం కిందకే మారిపోయింది ఇద్దరి మధ్యా!
అంతా గమనిస్తూ వస్తున్న ప్రచండుడు కూడ, ఎట్లాగైనా ప్రతీకారం తీర్చుకునే అదను కోసం ఎదురు చూడసాగాడు!
మరో మూడు నెలల్లో ఓ నిర్ణయానికీ వచ్చేశాడు కూడా!
తన హుకుమ్ ఇదివరలో లాగా నడవాలంటే,శూరసేనుడు అనే అడ్డంకి తొలగించాల్సిందే!
అసలే పోటు వీరుడు, పైగా తన రహస్యాలన్నీ బాగా తెలిసినవాడు, ఏ రోజుకైనా తన ఉనికికే ఎసరు పెట్టవచ్చు!
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ శూరసేనుడిని తొలగించే పని విజయేంద్రకే అప్పగించటం, అందుకు అతను ఒప్పుకోవటం!
***
తనకు ఈ పని ఇచ్చిన పదిహేను రోజుల్లోనే, విజయేంద్ర ఒకసారి అతి రహస్యంగా శూరసేనుడిని ఒక నిర్జన ప్రదేశంలో చంపే యత్నం చేసి, విఫలమయ్యాడు.
తృటిలో ప్రాణ గండం తప్పించుకున్నాడు, శూరసేనుడు.
కూపీ లాగిన శూరసేనుడు అసలు ఆ యత్నం చేసిన మనిషి ఎవరో తెలిసి ముందు చకితుడయ్యాడు.
తరువాత ఇంత ద్రోహమా అని పళ్ళు పటాపటా కొరికాడు, మహోగ్రుడయ్యాడు! తనను చంపే యత్నం చేసింది, మరెవరో కాదు, విజయేంద్ర అని అతనికి తెలిసింది!
ఇప్పు డతనికి ప్రథమ శత్రువు విజయేంద్ర,, తరువాతే ప్రచండుడు! పరిస్థితులు అనూహ్యంగా మారిపోయినై!
***
శూరసేనుడు వేసిన ఉపాయం మొత్తానికీ, అతని దెబ్బతిన్న అహమే కారణంగా నడిచింది. అది చల్లారాలి, అప్పుడు కానీ అతనికి శాంతి లేదనిపించసాగింది.
తమ్ముడి లాగా పెంచిన వాడి నుంచి ఇంత ద్రోహమా?! విజయేంద్రను క్షమించే ప్రసక్తే లేదని తీర్మానించుకున్నాడు.
***
సముద్ర తీరాన ఉన్న రాజ్యాలు కావటంతో, పొరుగున ఉన్న రాజ్యంలోని కొండ గుహల్లో, అటువైపు అడవుల్లో ఉంటూ, సముద్రపు దొంగలుగా పేరున్న వారిని సంప్రదించాడు గుట్టుగా!
వారు డబ్బుకోసం ఏదైనా చేస్తారనీ ప్రతీతి గల బందిపోటు దొంగలజాతి వారు. వారిలో ఇద్దరిని పిలిపించాడు, ఒక మధ్యవర్తి ద్వారా!
విజయేంద్ర రోజూ గుర్రపు స్వారీ కోసం వచ్చే ఒక ప్రాంతం చూపించాడు. “మీరు అతన్ని హతమార్చి, పక్కనే ఉన్న పొదల మాటున ఉంటే, అక్కడ నేను రక్షణాధికారితో మాట్లాడి ఉంచాను, అతనే స్వయానా వచ్చి తన తెరల వాహనంలో మిమ్మల్ని సముద్రమార్గంలో చాటుగా తీరానికి చేర్చేస్తాడు”, అని తన ఉపాయం చెప్పి, పెద్ద మొత్తం ఆశ చూపించాడు.
***
వాళ్ళు కాస్త తటాపటాయిస్తే, అదే రోజు సాయంకాలం, వాళ్ళకి రక్షణాధికారి వేషంలో ఉన్న ఒకతనిని తెచ్చి, “ఈయన సమస్త రక్షణ బాధ్యతలూ చూసే ఉన్నతాధికారి, ఇతనే మిమ్మల్ని తీరం దాటిస్తాడు” అని అతనితో కూడా అదే చెప్పించి నమ్మబల్కాడు.
అతను వాళ్ళకు నమ్మకం కలిగించడం కోసం తన అధికారహోదా వివరాలు చూపించే పత్రం చూపించి చెప్పేసరికి, వాళ్ళకు నమ్మకం కలిగి, ఒప్పుకున్నారు.
***
మర్నాడే ఉపాయం అమలైంది.
రోజూ లాగే వచ్చిన విజయేంద్రను ముసుగులో ఉన్న ఆ సముద్రపు దొంగలు, స్వారీ పూర్తి చేసి మరలుతున్న వేళలో, అమాంతం మీదపడి పిడి కత్తులతో బలంగా పొడిచి చంపేశారు.
పరుగు పరుగున పక్కనే ఉన్న పొదల మొదటికి వచ్చి చూశారు.
ఖాళీ దారి కనబడ్డది, వీళ్ళను తీసుకు వెళ్ళటానికి వాహనం కాదు కదా, ఆ ప్రాంతంలో పిట్టపురుగు లేదు ఆ వేళప్పుడు!
క్షణాలలో రక్షకభటులు ఎట్లా పసికట్టారో వీరిని పట్టి బంధించేశారు. మర్నాడు న్యాయశాల వారికి అక్కడి నియమాలను బట్టి ఉరిశిక్ష వేసింది.
భారీగా డబ్బు ముట్టినా వారికి ఏ లాభం లేకపోయింది, ప్రాణాలే పోగొట్టుకున్నారు!
***
ఈ మొత్తంలో శూరసేనుడిని అమితంగా తృప్తి పరిచిన విషయం ఒకటే!
అది ఆ ఇద్దరూ – ఈ పని చేయించింది, శూరసేనుడే అని చెప్పటం రక్షక భటాధికారులకు!
అతనికి కావలసింది అదే!
ఈ విషయం తెలిసిన వారు భయంతో గుసగుసలు పోయారు.
శూరసేనుడు ఎంతటి వాడు! ఎంత సాహసి! ఏకంగా సేనాధిపతుల వారి ఆంతరంగికుణ్ణే చంపించేశాడు అని అందరూ చెప్పుకున్నారు.
అదీ అతని అహాన్ని త్రృప్తి పరిచిన విషయం!
అట్లా అట్లా, ఈ వార్త రాజ్యంలో, పొరుగు రాజ్యాలలోనూ పాకింది. లోకంతో పాటే,తన శత్రువు ప్రచండుడు కూడా వింటాడు, ఈ వార్త! తన అసలైన శక్తి ఏంటో అప్పుడు బోధపడుతుంది ఆ ముసలి సేనాధిపతికి!
శిక్షలు అతి తీవ్రంగా ఉండే రాజ్యంలో జరిగిన మొదటి హత్య చేయించిన సత్తా ఈ శూరసేనుడిదని తెలిసొస్తుంది. అంతటివి తన శక్తియుక్తులనీ తెలిసొస్తుంది.
అర్భకుఢైన విజయేంద్రను ఈ లోకం లోనే లేకుండా చేసేశాడు, ముందే!
పగ తీరర్చుకున్నానన్నట్టు కాక,తనను తాను నిరూపించుకున్నట్టు ఒక అనుభూతి,కలిగింది, తన బంధువుల ఇంట, పొరుగు రాజ్యంలో రహస్యంగా ఉన్న, 55 ఏళ్ళ శూరసేనుడికి.
కాగల పని అయిన వెంటనే అతను పారిపోయాడు ఆ రాత్రే, మారువేషంలో, చిమ్మచీకటిలో!
***
ఇక తన వల్ల నష్టపోయిన ఆ బలి అయిన ఇద్దరి కుటుంబాలకూ న్యాయం చేయాలి అని ఆలోచించాడు. తనే వాళ్ళ ఆనుపానులు తెలుసుకుని జరిగినదంతా చెప్పించాడు మధ్యవర్తి ద్వారా. తన పేరు ఎక్కడా బయటపడకుండా!
ఏదో వ్యక్తిగత కక్షల కారణంగా వారిద్దరూ బలి అయ్యారని, ఎవరో కావాలని ఆ ఇద్దరినీ వాడుకున్నారని!
అయినా మీ కుటుంబాలకీ రెండు తరాల పాటు సుఖంగా ఉండటానికి తగినంత ఉబ్బు వారే పంపించారు, మీ పట్ల సానుభూతితో అని చెప్పించాడు. అన్నట్టే వారికి ఆ డబ్బంతా అతి రహస్యంగా ఇప్పించే ఏర్పాటు చేశాడు కూడా!
***
శూరసేనుడు ఇదంతా చేసింది, ఏదో తప్పు చేశానని అపరాధ భావనతో కాదు, ‘నా అహాన్ని నిలబెట్టుకోవడం నా హక్కు’ అనే ధోరణిలో!
ప్రచండుడు రహస్యంగా నడిపేది నేరలోకమే ఐనా, ఒక మాట కట్టుబాటు మీద నడుస్తుంది అక్కడ అంతా. ఎవరూ దాన్ని అతిక్రమించరు.
అట్లాంటిది ప్రచండుడు నేతగా ఉంటూ, తనే అతిక్రమించి అన్యాయం చేశాడు నాకు, అని శూరసేనుడి కోపం!
తన అహాన్ని నలుగురు ముందర తీవ్రంగా చిన్నపుచ్చాడని పగ!
వారు చేసేది బయట ప్రపంచానికి పరమ అన్యాయమైనా, ఆ చట్రంలో వారికి వారే ఏర్పరచుకున్న నిశ్శబ్ద నియమాలు కొన్ని ఉంటాయి.
వాటిల్లో ఒకటి, తమకు అడ్డురానివారినీ, సంబంధం లేని వారినీ ఏమీ చేయకూడదని!
ఆ ఆనవాయితీ ప్రకారం ‘న్యాయం’ చేశానని శూరసేనుడు తృప్తిగా పడుకున్నాడు ఆ డబ్బు ఆ రెండు కుటుంబాలకూ అందజేసిన రోజు!
అన్యాయపు ప్రపంచంలో, విచిత్రమైన న్యాయ సూత్రాలు!
పట్టుబడితే ఏమిటనే బెంగ అతనికి ఏమాత్రం లేదు, కారణం తన శక్తి ఏంటో, లోకానికి చూపించేశాడు! తన అహం ఇప్పుడు శాంతించింది.
దాని ఖరీదు తన ప్రాణమే అయినా అందుకు సిద్ధమే, ఇదీ అతని స్వభావ తీవ్రత!
***
అహం ఒక లెక్కలేనన్ని పడగలతో చెలరేగే విషసర్పం!
ఎప్పుడు ఏది ప్రేరణయై, ఏ తల లోంచి విషం చిమ్ముతుందో, పక్క తలకు కూడా తెలియదంటే ఆశ్చర్యం లేదు.
బంధాలను కూడా కాటువేసి అంతమొందించే విశేషమైన శక్తి గల మహా కాలనాగు!
అనుకున్నది సాధిస్తేనే శాంతించే శక్తిమంతం – మంచైనా, చెడైనా!