[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘అహం ఫట్’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
“ఏంటి సార్, సున్నం తిన్నట్టు మొహం పెట్టి, చాలా ఇబ్బందిగా శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నారు, ఏదైనా మిమ్మల్ని ముంచేసే సమస్య మందుగానే ముంచుకొస్తోందా?” అడిగాడు అసిస్టెంట్ మేనేజర్ శేఖరం.
“ఏవీ లేదు, నేను ఎప్పటినుండో కారు కొనాలని ప్లాన్ చేస్తున్నాను. నిన్న మా మావగారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందాయట. దాంతో నిన్న పొద్దున్న మా ఇంటికి వచ్చారు. మా ఆవిడకి ఏదో బంగారు నగ కొని తెచ్చారు. ‘మీకు కూడా ఏదైనా బహుమతి ఇస్తానూ, తటపటాయించకుండా ఏం కావాలో చెప్పండి’ అని నన్ను ఒకటికి రెండు సార్లు అడిగి ప్రాణం తీశారు. నాకు ఏం చెప్పాలో తెలియక, ఒకటే సతమతమైపోయి చాలా సేపటివరకూ మౌనంగా ఉండిపోయాను. మరో మారు కూడా తప్పదన్నట్టు ‘ఏదో ఒకటి అడగండి అల్లుడుగారూ’ అన్నాడాయన. నేను కొంచెం మొహమాట పడిపోయి, ‘అబ్బే ఏం వద్దు మావయ్యా, అన్నిటి కంటే విలువైన మీ దీవెనలు ఉంటే చాలు’ అంటూ వినయం నటించేశాను. కానీ మా ఆవిడ నా మనసెరిగిన మనిషి. దాంతో ఆవిడ కలగజేసుకుని, ‘ఆయన ఎప్పటినుండో కారు కొనుక్కోవాలని ఆశ పడుతున్నారు నాన్నా’ అంది. అంతే మా మావగారు ఓ గంట లోపే ఓ ఆరు లక్షలు నా అక్కౌంట్లో వేసేశారు. ‘కారు కొన్నాక ఇంటికి ఆ కారులోనే రావాలి’ అంటూ ఆయన వెళ్ళిపోయారు. దాంతో ఈరోజు కారు కొనేయాలని నిర్ణయించుకున్నాను.” చెప్పాడు మేనేజర్ రాజారావ్.
అతని మాటలు విన్న శేఖరం నెమ్మదిగా బుర్ర గోక్కుంటూ, “నేను అడిగిన దానికీ మీరు చెప్పిన దానికీ పొంతన కుదరలేదండీ. నేను ఎందుకు అలా డల్‌గా ఉన్నారు అని అడిగాను. మీరు కారు కొంటున్నాను అంటున్నారు. ఇది ఎగిరి గంతేసి సంతోషించదగ్గ విషయం కదా, మరి ఏదో విషమ పరీక్ష ఎదురు కాబోతున్నట్టు మీరు ఎందుకు అలా ఉన్నట్టు?” అడిగాడు.
“ఫోన్లో అందరికీ చెప్పి, చెప్పి నీకు కూడా ఫ్లో లో అదే విషయం చెప్పేశాను. అసలు నా మూడ్ ఔట్‌కి కారణం ఏంటంటే, మన అటెండర్ అప్పారావ్ ఏదో చిన్న స్థలం అమ్మాడట, దాంతో ఏదో కారు కొంటాడట. నేను ఈ సాయంత్రం కారు కొనడానికి వెళ్తున్నానన్న విషయం, ఇందాక నేను ఫోన్ మాట్లాడుతుండగా, చెవులు రిక్కించి మరీ వినేసి, తను కూడా నాతో వస్తానని కుస్తీపట్టు పట్టాడు” అసహనంగా చెప్పాడు రాజారావ్.
“ఓస్, దీనికా మీరు ఇంత నలిగిపోయి మూడు పాడు చేసుకున్నది. వాడొట్టి అమాయకుడండి. ఒక్కడే వెళ్ళి కారు బేరం ఆడి జీపు కొన్నా కొంటాడు. అలాంటి ఇబ్బందులు లేకుండా మీతో వస్తే బావుంటుందని అలా అనుంటాడు. పోనీలెండి పాపం, ఊకకీ, నూకకీ తేడా తెలియనివాడు, రానివ్వండి సార్, మనతో పాటు తీసుకువెళదాం” అన్నాడు శేఖరం.
“వాడ్ని మనతోనా?, వాడి వాలకం చూశావా, వాడి బట్టలూ, మాటతీరు, వాడ్ని మనతో పాటు తీసుకువెళితే, వాళ్ళ ముందు మన పరువు పత్తి పరుపులా పర్రున చిరిగిపోతుంది. అంతగా కాదంటే వాడ్ని వాడి డొక్కు స్కూటర్ పై రమ్మను. మనం క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోదాం. అలానే, వాడ్ని అక్కడ నాకు కొంచెం దూరంగా మసలమను, లేదంటే సలసలా మండుకొస్తుంది నాకు. ఎందుకంటే, వాడు పీచు బేరాలాడి ఏ చీపు కారో కొంటాడు. పైగా, వాడి డౌన్ పేమెంట్ తగ్గినా లేదా ష్యూరిటీ వగైరా కావాల్సినా, ఫేవర్ చేయమని నన్ను అడిగినా అడుగుతాడు. వాడి తాహతుకి అది తీర్చగలడా లేదా అని ఆలోచించి నేను స్పందించాలి” అన్నాడు మొహం చిరాగ్గా పెట్టి.
ఎందుకో ఆ మాటలు కొంచెం ఇబ్బందిగా అనిపించినా, ఔను అన్నట్టు గొర్రెలా తలాడించాడు శేఖరం.
***
తన కార్ సెలక్ట్ చేసుకుని ఫార్మాలిటీస్ పూర్తి చేసేసాడు రాజారావ్. అప్పారావు కొంచెం దూరంలో ఓ సేల్స్‌మన్‌తో మాట్లాడ్డం గమనించాడు. ఇంతలో మరో సేల్స్‌పర్సన్ వచ్చి, “సార్ మీరు లక్కి, మీకు కార్ యాక్ససరీస్ మీద ఓ యాభై శాతం డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది” అన్నాడు.
“ఓ అలాగా, కానీ అదెలాగ” అడిగాడు రాజారావ్ ఉబ్బితబ్బిబ్బైపోతూ.
“సింపుల్ సార్, ఒక కష్టమర్ పది లక్షల సెడాన్ కార్ తీసుకున్నారు. మీరు హెచ్బ్యాక్ కార్ తీసుకున్నారు. ఆయన మీకు రిఫరెన్స్ ఇచ్చినట్టుగా ఈ ఫామ్‌పై మీరో సంతకం పెడితే, మీకు నలభైవేలు కలిసివస్తాయి. లేదంటే అవి మీరు నష్టపోయినట్టే. కనుక ఆలోచించకండి సార్, ఆయన కూడా మీ ఆఫీస్ పేరే చెప్పారు. ఆ సార్ అక్కడ ఉన్నారు” అంటూ అప్పారావ్‌ని చూపించి, ఆ ఫామ్‌ని రాజారావ్ చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు సేల్స్‌పర్సన్.
ఆ ఫామ్ మీద వి.ఐ.పీ. కష్టమర్ రిఫరెన్స్ అని ఉంది. ఇంతలో ఒక అమ్మాయి, ముందుగా అప్పారావ్ వైపు నడిచెళ్ళి, “సార్ జ్యూస్ తీసుకోండి” అంటూ అందించి, తర్వాత ఆమె వెనక్కి తిరిగి, తన వైపు రావడం గమనించాడు రాజారావ్.
రాజారావ్ వంక దీనంగా చూసాడు శేఖరం, అతని కళ్ళలోకి సూటిగా చూడలేక కాస్త తల వంచుకున్నాడు రాజారావ్.
