[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘అగ్ని కణం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
నింగి నుంచి వాన చినుకు
తొంగి చూసింది
నేల మీద పడకుండా
నెరజాణ మీద కురిసి
హరివిల్లై మురిసింది
మేని అందాలకు అద్దం పట్టి
సొగసుల గుట్టు గడుసుగా విప్పింది
రెక్క విప్పుకున్న కోరికలను
కళ్ళెం లేని గుర్రం తానై
దౌడు తీయించింది
దూకుడు పెంచింది
సుందరాంగి మీద
పడ్డ చినుకేమో చల్లనట
వంటి మీద పడ్డాకే అగ్ని కణమట
అది సెగలు పొగలు రేపేనట
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.