Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మదిని తట్టి లేపే మన సైనికుల కథలు – అజ్ఞాత కాశ్మీర్ ఫైల్స్

[శ్రీ కస్తూరి రాకా సుధాకర్ రావు రచించిన ‘అజ్ఞాత కాశ్మీర్ ఫైల్స్’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీ కస్తూరి రాజశేఖర్.]

~

రాకా సుధాకర్ అక్షర తూటాలు రగిలించి, దేశభక్తి రంగరించి అగాథంలోంచీ తీసి, అందలాన తగిలించిన అజ్ఞాత కాశ్మీర్ ఫైల్స్

~

మా తుఝే సలాం సినిమాలో కథానాయకుడు అంటాడు – “నువ్వు పాలు అడిగితే పరమాన్నం పెడతాం. అదే కాశ్మీర్ ని అడిగితే మాత్రం ముక్కలు చేస్తాం.”

అలా భావించే ప్రతి భారతీయుడికి ఈ పుస్తకం అంకితం చేశారు రచయిత! ఇది సమంజసం!

కాశ్మీరం – భరతమాత నుదిటి సిందూరం. ప్రతి భారతీయుడి ఊహల కుంకుమ రాగం. యువహృదయాల కలల తీరం. మంచు కొండలు, అందమైన లోయలు, పరవళ్ళు తొక్కే నదులు.. కాశ్మీర్ పేరు వినగానే ఇవన్నీ మన కళ్ళల్లో బొమ్మ కడతాయి.

అందమైనది అంటేనే ఎవరికన్నైనా కన్ను పడుతుంది. మరి పగవాడికైతే, కన్ను కుడుతుంది.

అలాంటి విష నాగులనుంచీ కాపాడుకోవాలంటే, వృత్తిగా కాక మనస్పూర్తిగా, యుద్ధానికి సిద్ధంగా ఉండి, వీర మరణం ఒక గౌరవంగా భావించే సైనికులే మనకి శ్రీరామ రక్ష! అలాంటి యోధుల వీర గాథల సంకలనమే – అజ్ఞాత కాశ్మీర్ ఫైల్స్!

ఎప్పుడో నా చిన్నప్పుడు, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వీరుల కథలతో ఏ. పండరీనాథ్ ‘చరిత్రకందని మృత వీరులు’ చదివాను. మురుగు రాజకీయ తంత్రాల వల్ల మరుగున పడిన ఎంతోమంది స్వాతంత్ర్య పోరాట వీరుల్లో కొంతమంది మహా యోధుల చరిత్రను 1969-70 మధ్య కాలంలో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ధారావాహికంగా ప్రచురించారు. అప్పట్లో, అంటే 20వ శతాబ్దపు ద్వితీయార్ధంలో మన మనసుల్లో దేశభక్తిని నిరంతరం వెలిగించి ఉంచే ప్రేరణాత్మక రచనలు రాలేదనే చెప్పాలి. ఈ పుస్తకంలోని యువ వీరుడు తుషార్ మహాజన్ వ్రాసుకున్నట్లు తెల్లారితే త్రివర్ణ పతాకాన్ని కప్పుకుని దేశభక్తి గురక పెడుతుంది. ఆగస్టు 15, జనవరి 26 వంటి కొన్ని తేదీల్లో మాత్రమే నిద్ర లేస్తుంది. అది నిజంగా నిజం!

మళ్ళీ ఇన్నేళ్ళకి, రాకా సుధాకర్ గారు వెలార్చిన ‘అజ్ఞాత కాశ్మీర్ ఫైల్స్’ సైనిక వృత్తిపైన గౌరవాన్ని హిమాలయమంత ఎత్తుకు తీసుకువెళుతుంది. రాకాలోకం యూట్యూబ్ ఛానెల్ ద్వారా వేడి వేడి రాజకీయ వార్తల్ని చారిత్రక పరిణామ రీతులతో అనుసంధానించి సాధికార విశ్లేషణతో తెలుగువాడి ‘వాడి’ని రుచి చూపిస్తూ 3.50 లక్షలకు పైగా subscribersని సంపాదించుకుని అప్రతిహతంగా జైత్రయాత్ర సాగిస్తున్న కస్తూరి రాకా సుధాకర్ గారు, కాలాన్ని అదలించి, కలాన్ని విదిలించి, మనసుని కదిలించి సాగించిన ధీరోదాత్త రచన – అజ్ఞాత కాశ్మీర్ ఫైల్స్!

ఈ రచన ఒక సిద్ధాంతాన్ని ప్రచారం చేయటం కోసం వ్రాసింది కాదు. దేశంలో ఉన్న ప్రతి పౌరుడి కోసం వ్రాసింది. పల్లెల్లో, పట్నాలలో, నగరాలలో, మనం స్వేచ్చా సౌఖ్యాలని అనుభవించేందుకు భరోసానిస్తూ, సైద్ధాంతిక వర్గ సరిహద్దుల్ని చెరిపేస్తూ, దేశ సరిహద్దుల్లో ప్రతిక్షణం పహరా కాస్తున్న అజ్ఞాత రక్షకుల్ని కృతజ్ఞతా పూర్వకంగా గుర్తుకు తెచ్చేందుకు వ్రాసింది.

అన్నింటికంటే ముఖ్యంగా, స్వార్థమో, ద్వేషమో, కుత్సితమో, మరే కారణం చేతనో ప్రజలకు అందుబాటులోకి రానీయకుండా కప్పెట్టిన ఎన్నో రణధీరుల జీవితాలకు అక్షర రూపం! బహుశా అజ్ఞాత రక్షకులు కనుక అజ్ఞాతంలో ఉంచటమే సబబు అనుకున్నారేమో?! అలాంటి మణిమయ జీవితాల్ని ఏర్చి, కూర్చి రత్నఖచిత భావాలతో తెలుగు చారిత్రక anthology ప్రక్రియకు ఒక స్వర్ణాభరణం తొడిగారు రాకా సుధాకర్! జమ్మూ కాశ్మీర్ అధ్యయనంలో భాగంగా వ్రాసిన ఈ వ్యాస శృంఖల సంకుచిత భావదారిద్ర్య శృంఖలాలను ఛేదిస్తుంది .

అఖండ భారతాన్ని ఒక్క గొడుగు క్రిందకి తెచ్చే దిశగా సామాన్య శకం 724 -760 దాకా కృషి చేసి, కాశ్మీర చరిత్రలో స్వర్ణయుగంగా పరిపాలించిన కర్కోట వంశ లలితాదిత్య ముక్తపీడ మహారాజు నుండీ మొదలుకుని ఈ మధ్య కాలం దాకా కాశ్మీరాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఎంతోమంది రాజులు, సేనాపతులు, సైనికాధికారులూ, సైనికులూ, పోలీసులు వంటి అగణిత వీరవరుల్లో ఓ గుప్పెడుమంది కథలు మన గుప్పెడంత గుండెలో గంపెడంత ఆర్ద్రతని నింపుతాయి. ప్రతి కథ ఒక అనుభూతే – ప్రతి వీరుడు ఒక అవధూతే!

సైనిక వృత్తిలో వివిధ హోదాలలో పనిచేస్తూ, వీర పౌరుషం చూపిన ఎంతోమంది ధీర యోధుల కథలని అటుంచితే, కాశ్మీరం అంటేనే భారతీయం అని చాటిన ఆధ్యాత్మిక వేత్త స్వామి లక్ష్మణ్ జూ, లడాఖ్ స్ఫూర్తి ప్రదాతగా పేరొందిన ప్రసిద్ధ హీనయాన బౌద్ధ సన్యాసి కుశక్ బకుల్ వంటి వారు అఖండ భారత్ కోసం అహర్నిశలూ శ్రమించారు.

లేహ్‌ను కాపాడిన మెహర్ సింగ్, మంచు కొండలలో పని చేస్తూ అదృశ్యం అయిపోయి కూడా ఇప్పటికీ అనుక్షణం పహరా కాస్తూ మన సైనికులకి ప్రమాద సంకేతాలిస్తూ కాపాడుతున్న ఓ పి బాబా, చిదిమితే పాలుగారే యువ కిశోరం నవదీప్ సింగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే, ప్రతి అధ్యాయమూ రోమాంచితమే.. నిత్య స్మరణీయమే!

ఒక ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తూ కేవలం 12,000 రూపాయల జీతం సంపాదించే జితేంద్ర దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల వివరాలను ప్రోది చేస్తూ వారి కుటుంబ సభ్యులతో ఫోన్ లోనో, పోస్ట్ కార్డు ద్వారానో మాట్లాడుతూ ఉంటాడు. దగ్గర ఊరు అయితే స్వయంగా కలిసి, ఓదార్చి వస్తాడు. పోస్టల్ స్టాంపులు సేకరించేవాళ్ళు, కరెన్సీ నోట్లు, నాణేలు సేకరించే వాళ్ళ కంటే ఎంతో ఉదాత్తమైన హాబీ కదూ ఇది! అంతే కాదు. మనందరికీ ఒక స్ఫూర్తి, గుణ పాఠం కూడా! సినిమా తారలకీ, క్రికెటర్లకీ శుభాకాంక్షలతో సోషల్ మీడియాని హోరెత్తించే యువతకు చెంపపెట్టు!

రాకా సుధాకర్ తన పద లాలిత్యం, భావపుష్టి, స్వభావ పరిశీలనాసక్తి, విశ్లేషణాభివ్యక్తి పటిమలతో తెలుగు పాఠకులకి ఇప్పుడు ఎంతో అవసరం అయిన జాతీయతా స్పూర్తిని కలిగిస్తూ, ముఖ్యంగా యువతను ప్రభావితం చేస్తూ, ప్రతిభావంతంగా రచనని సాగించారు. ఆయన దీక్ష, నిబద్ధత, కేంద్రీకృత విషయావగాహన ఈ గ్రంథాన్ని, సైనిక భాషలో చెప్పాలంటే, Mention in Dispatches కి అర్హమైనదిగా చేసినాయి.

చైనా వాల్‌ని అంత ఎత్తులో ఆ కాలంలో ఎలా కట్టగలిగారని ఆశ్చర్యంతో చూస్తాం. గ్రేట్ అని పొగుడుతాం. Wonders of the world లో నమోదు చేసేస్తాం. కానీ 1948 పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో మంచు పర్వతాలలో 11,578 కి.మీ.ల ఎత్తున భయంకరమైన కొండ దగ్గర ఉన్న జోజిలా కనుమ దగ్గరికి వందలాది సైనికులు యుద్ధ టాంకులని తమ చేతులతో ఏకంగా పైకి తోసి తెచ్చారు. ఇంతటి ప్రపంచ వింత ఎంతమందికి తెలుసు? కాశ్మీర్ లోని టర్టుక్ ప్రాంతంలో 800 చ కిమీ లు, 1948 తర్వాత పాకిస్థాన్ నుంచీ మనం సాధికున్న ఏకైక భూభాగం!(pg 37)

ఇలాంటి గొప్ప విషయాలు మనకనదించిన రచయిత అభినందనీయులు!

రచయిత నవ్య పోకడలతో పద ప్రయోగాలతో కథ నడిపించారు. కొన్ని మెచ్చు తునకలు –

మంచు ఎడారి (pg 20), మంచు నరకం, (pg 79), నాభి నాళ సంబంధం (pg 111)

గుండెల్ని కదిలించే భావోద్వేగాన్ని కవితాత్మకంగా అక్షరీకరించారు రచయిత. ఆ వాక్యాలు రచయిత ఆలోచనా గాంభీరయాన్ని, అనుభవాన్ని, విజ్ఞతని , మనకు పరిచయం చేస్తాయి. ఉదాహరణలు:

విచ్చిన్న వాదులు విచ్చుకత్తుల నృత్యం చేస్తున్నారు (pg 20),

కొందరు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కొత్త కొత్త తీరాలు చేరుకుంటారు. కనీ, వినీ ఎరుగని విజయాలు సాధిస్తారు. కానీ తరువాత వారి పాద ముద్రలు సైతం మిగలవు.. (pg 23)

యుద్ధం ఆయుధాలు చేయవు.. వాటి వెనక ఉండే హృదయం చేస్తుంది.. (pg 31)

అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ కథానాయకులే కావాలి.. అలాంటి వాళ్ళే ఆంజనేయుళ్ళు. వారు లంకను కాల్చగలరు. సంజీవని పర్వతాన్నీ మోయగలరు.(pg 38)

కార్య సాధకులకు సాధనాలు ముఖ్యం కాదు (pg 39)

చనిపోయి జీవించేందుకే జదునాథ్ బతుకంతా గడిపాడు (pg 50)

యుద్ధ నౌక సముద్రంలోకి మునిగిపోతున్నప్పుడు వర్ణన: నిప్పు పగబట్టింది. నీరు నోరు తెరిచింది. (pg 68)

నౌకాదళ సంప్రదాయం ప్రకారం కెప్టెన్, నౌక వేర్వేరు కాదు. చెక్క, స్టీల్‌తో చేసిన ఓడ, రక్త మాంసాల మనిషీ మధ్య అద్వైత స్థితి ఉంటుంది. (pg 69)

ప్రతి మనిషి జీవితంలోనూ ఒక క్షణం వస్తుంది.. హిమాలయ శిఖరమంత సమున్నతమైంది.. సముద్రమంత లోతైనది. ముందుకు ఉరికితే అతను హీరో. ఆగిపోతే జీరో! (pg 70)

మైనస్ 48 డిగ్రీల శవపేటిక లాంటి డీప్ ఫ్రీజర్ – సియాచిన్! (pg 77)

భుజం ఆది భుజంగం శేషువు – బాహువు శత్రువుల పాలిటి రాహువు! (pg 79)

తమ ఆఖరి ఊపిరితో చినార్ చెట్లకు చిరుగాలులని అందించారు! (pg 82)

ముగ్గురు ముష్కరుల్ని చంపి తుపాకీ ఆకలి తీర్చాడు ! (pg 82)

తూటాలు తోడేళ్లలా వేటాడతాయి.. త్రివర్ణ పతాకం అతని శవపేటికను వాటేసుకుంది.. (pg 83)

సైనికుడు అనేవాడు కేవలం నాలుగు జీతం రాళ్ళ కోసమే పంచ ప్రాణాలూ వదిలేసుకుంటాడా? ఇంట్లో ఉన్న తల్లి, తండ్రి, భార్యా పిల్లలను సైతం మరచి తూటాతో తుది భేటీకి, అశోక చక్ర అనే ఒక చిన్న గుడ్డ ముక్క , ఒక లోహం బిళ్ళ కోసమే పరుగులు తీస్తాడా? (pg 83)

చావు నీది, పుటక నీది, బతుకంతా దేశానికి (pg 87)

కానీ, దేశం కూడా తుషార్ మహాజన్‌ను గుర్తుంచుకోదు. అదే అన్నిటికన్నా విడ్డూరం – అంతకన్నా విషాదం కూడా !(pg 88)

గెలుపు లో ఉన్న మజా ముందు చావు కూడా దిగదుడుపే (pg 89)

శరీరంతో సంబంధం లేకుండా మనసు ఒకటుంటుంది. మనసుకు పైన బుద్ధి ఉంటుంది. బుద్ధి పైన ఆత్మ ఉంటుంది. దానికి చావు వుండదు.. మనసు ముందుకు ఉరుకు అంది. బుద్ధి పరాకీయుడిని పట్టి పల్లార్చమంది. ఆత్మ ఎక్కడ లేని బాలాన్నిచ్చింది. (pg 97)

కాయాన్ని కర్పూరంలా ఆయుషును హారతిగా చేసి భారతమాతను అర్చించటమే నిజమైన అర్చన. ఆఖరి ఊపిరిలోనూ కర్తవ్యాన్నే నిశ్వసించగలగడమే నిజమైన ప్రార్థన! (pg 100)

ఆఖరి రక్తం బొట్టుతో ఏ రావణుడు దాటలేని లక్ష్మణ రేఖను గీశాడు! (pg 102)

మృత్యువు నోట కరచుకుని కబళించాలనుకుంటున్న వేళ, ఆయువును రాహువు ఆబగా తినేయాలనుకున్న వేళ, దేశం గురించి మాట్లాడేవాడు హీరో. (pg 107)

ఆ చిరునవ్వు కొండలోయల్లోని గడ్డి పూవు చిరునవ్వు.. తూనీగ చిరునవ్వు.. అది ఒక నాగా యోధుడు నవ్వే అమాయకపు నవ్వు. అది అడవికోణాల గాలి రివ్వుమంటూ చేసే సవ్వడి తాలూకు నవ్వు. (pg 112)

హితేష్ జెండాను తాకాడు. తల్లి చీరను తాకినట్టనిపించింది. (pg 117)

‘అసహనం’ బ్రిగేడ్ మౌఖిక డయేరియా కట్టలు తెంచుకుంది. దేశమంతా కుహనా సెక్యులర్ మీడియా కుప్పిగంతులేసింది. (pg 119)

అయితే, జీవిత సంఘటనల్ని వివరిస్తున్నప్పుడు ముఖ్య భూమిక కాశ్మీర్ కొండలలో సైనిక సాహసం అయినా కూడా, వాటిని కేవలం వార్తా కథనం లాగా కాకుండా biography లాగా ఉంటే మేలురకం ఉద్వేగంతో పాఠకుణ్ణి కట్టిపడేసేవి. మొత్తంగా చూసినప్పుడు, ఎక్కువ శాతం కథానాయకులు ఉత్తర భారతం నుంచీ వచ్చిన వారుగానే కనిపిస్తుంది. దక్షిణ భారతం నుంచీ ఎవ్వరూ లేరేమో అన్న భావన కొద్దిగా బాధిస్తుంది.

ముఖ్యంగా ఇంతటి ధీరోదాత్తుల్ని తెలుగువారికి పరిచయం చేస్తున్నప్పుడు, హైదరాబాద్ నివాసి, 1999 జూన్‌లో జరిగిన కార్గిల్ యుద్ధంలో 30 ఏళ్ల వయసులో 2-రాజ్ పుతానా రైఫిల్స్ యూనిట్ తరపున వీరోచితంగా పోరాడి అసువులు బాసిన మహావీర్ చక్ర మేజర్ పద్మపాణి ఆచార్య గురించి ప్రస్తుతించకపోయినా, కనీసం ప్రస్తావించి వుంటే నగర బిడ్డడి దొడ్డ తెగువ తెలుగువాడిని తన్మయం చేసేది. ఈ తెలుగు రచనకు మరింత వన్నె తెచ్చేది. యుద్ధ సమయంలో తండ్రికి ఉత్తరం వ్రాస్తూ “యుద్ధం జీవిత కాల గౌరవం” అని వ్రాసిన యోధుడు పద్మపాణి ఆచార్య! అతణ్ణి విస్మరించటం ఓపలేని లోపంగా అనిపిస్తుంది.

అలాగే, వీలయినంతమేర రాష్ట్రాల వారీగా కాశ్మీర్‌లో సాహసం చూపిన సైనిక యోధుల గురించి వ్రాసి ఉంటే, కాశ్మీర్ కోసం భారత దేశం మొత్తం నిలబడినట్లు సంపూర్ణత్వం కనపడేది.

వ్యక్తుల జీవితాల్ని స్పృశిస్తున్నప్పుడు ఒకే format లో ఉంటే చదువరికి కూలంకషంగా అర్థం అవుతుంది. ప్రతివారి కథలో వారి స్వస్థలం, కుటుంబ పరిచయం ఉంటే బాగుండేది. కొన్నిచోట్ల అసలు చెప్పలేదు. కొంత మందికి కుటుంబం గురించీ రెండు పేరాలు చెప్పారు (pg 54). కానీ జన్మస్థలం ఎక్కడో చెప్పలేదు.

చేతన కుమార్ చీతాకి కీర్తి చక్ర అవార్డు వచ్చిందన్న విషయం విస్మరించారు (pg 107).

42 వ అధ్యాయంలో ఒక వాక్యం ఉంటుంది – ఇప్పుడు కశ్మీర్ లోయకు కావలసింది అలీ షా జిలానీలు కాదు (pg 114). ఏ వ్యాసంలో నైనా మొదటి సారి ఒక పేరు ప్రస్తావించినప్పుడు కనీసం ఏకవాక్య పరిచయం చాలా ముఖ్యం. సగటు తెలుగు పాఠకుడికి ‘ఆయన ఎవరో తెలిసే ఉంటుందిలే’ అని సరిపుచ్చేసుకోవటం సబబు కాదేమో!

ఏ పత్రికలోనైనా అచ్చుకు నోచుకున్న రచనని రచయిత శైలిని కాపాడుతూ, మరింత పుష్టి చేకూర్చి, రచనకి మెరుగుపెట్టడమే సంపాదకవర్గ సమర్థత! ఈ వ్యాసాలలో అది లోపించినట్లు కనిపిస్తుంది. అచ్చుతప్పులు కనిపిస్తాయి. ఎడిటింగ్ మరింత నిర్దుష్టంగా, నిర్మాణాత్మకంగా ఉంటే బాగుండేది. సంపాదక వర్గం మరింత జాగ్రత్త పడాల్సిన  అవసరం ఉంది.

కొన్ని గమనికలు –

Cover page మీద title కాశ్మీర్ అని వ్రాసి, లోపల చాలా చోట్ల కశ్మీర్ అని ప్రచురించారు. Proof reading లో అలసత్వంగా కనిపిస్తుంది.

ఒక చోట జయించాడు (ఏకవచనం). మరోకచోట సాధించారు(గౌరవ వాచకం) (pg no 11). నిర్దుష్టత లేదు.

Period of Time వాడినప్పుడు దాదాపు వాడతారు. 36 సంవత్సరాల 7 నెలల 11 రోజుల పాటు అని Point of Time సూచించినప్పుడు దాదాపు అని చెప్పక్కర్లేదుగదా!? (pg 12)

Chronology of happenings వరుసలో పేర్చి ఉంటే మరింత స్పష్టత, నిండుదనం ఉండేది.

జాగృతి పత్రికలో ఆయా వ్యాసాలు ప్రచురణ అయిన తేదీలు ఇచ్చి వుంటే reference archive గా ఉపయోగపడేది.

1841 లో మరణించిన జోరావర్ సింగ్ 1842 లో చూశూల్ ఒప్పందంలో ఎలా భాగమయ్యాడో అర్థం కాదు. (pg 15)

మార్చి 1948 నాటికి ……………. .. .. ఎలాగోలా బ్రతికినవారు 5,000 మంది. అందులో దాదాపు 16,000 మంది …(pg 28) (?)

జమ్మూ కాశ్మీర్ భారత్ సాయం కోసం, రాజేంద్ర సింగ్ బలిదానం కోసం ఎదురు చూస్తోంది. (pg 57). బలిదానం పదం సరైనది కాదేమో!? వీరత్వం కోసం లాంటి పదం అర్థవంతంగా ఉండేదేమో!

ఇక తర్వాతి మజిలీ ఉడిలో (?).అక్కడి నుండీ .. .. .. 62 కి. మీ.(?) శ్రీనగర్! (pg 62). ఈ ప్రదేశం పేరు యూరి. అక్కడనుండీ 62 మైళ్ళు శ్రీనగర్!

భవిష్యత్తులో ప్రూఫ్ రీడింగ్ విషయంలో మరింత జాగ్రత్త తప్పనిసరిగా చేయటం ఇలాంటి మంచి రచనలకి చాలా అవసరం.

అయితేనేం, మదిని తట్టి లేపే మన సైనికుల కథల్ని కీర్తిమంతంగా తీర్చి దిద్ది, అమేయమైన 49 జీవితాల్ని తన జాతీయవాద భావానికి సైనిక రూపమిచ్చి జాగృతీయంగా అందించారు రచయిత!

జాతీయవాదం అంటే తృటిల్భరిత సిద్ధాంతం కాదు. భిన్న సాంప్రదాయాలనీ సంస్కృతినీ ఒక్కటిగా నిలిపే ఉమ్మడికుటుంబం. దేశాన్ని ప్రేమించే ప్రతివాడూ జాతీయవాదే! జాతీయతని కాపాడేందుకు ప్రతిక్షణం ఆలోచించే ప్రతివాడూ సైనికుడే! దేశ సమైక్యతకి ప్రమాదం వాటిల్లినప్పుడు స్థానికుడే సైనికుడు అవుతాడు. దేశంలో అంతర్గతంగా వేళ్లూనుకున్న విద్వేష మూకల్ని దునుమాడుతాడు!

మహత్తర ప్రభావవంతమైన ప్రసార సాధనం అయిన సినిమా మాధ్యమం ఎన్నో సైనిక కథలతో ప్రేక్షకులకు ప్రేరణ కల్గించింది. ఈ పుస్తకం లోని కథాంశాలు – ‘కార్గిల్’ అదే పేరుతోనూ, దేశరక్షణ కోసం పాకిస్తానీ సైనికుణ్ణి పెండ్లి చేసుకున్న ధీర వనిత కథ ‘రాజ్’ సినిమా గానూ, ఇంకా ‘యూరీ’ వంటి సినిమాలు ప్రేక్షకాదరణ పొందటమే కాక, సందేశాత్మకంగా కూడా స్పందింపజేసినాయి. ఇప్పుడు అదే వరసలో 1962 చైనా తో యుద్ధ సమయంలో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన మేజర్ షైతాన్ సింగ్ కథను ‘120 బహదూర్’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. చెప్పాలంటే ఈ పుస్తకం లోని కథలన్నీ తెరకెక్కించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

భరత మాత హృదయం ఒక దేవాలయం అయితే, భారతీయులందరూ దేశభక్తి మంత్రాన్ని వల్లెవేసే పూజారులే! గరికపాటి వారు పద్యరూపంలో చెప్పినట్లు –

మన భారతీయత మానవత్వయుత – మనజాతి ధీయుత మహనీయ కవిత

మన మహర్షుల బుద్ధి మహితాత్మ సిద్ధి – మన చిత్త శుద్ధియే మన సంపద్వృద్ధి!

ఆ ధీరోదాత్తులకి ఈ పొత్తం ఒక ‘చిరు’ స్మరణీయం. కానీ అది రగిలించే ఉద్వేగం చిరస్మరణీయం. ప్రతి భారతీయుడూ కొని చదివి, పదిమంది చేత చదివించాల్సిన పుస్తకం అజ్ఞాత కాశ్మీర్ ఫైల్స్! పుస్తకం ఆసాంతం చదివిన తర్వాత ఒక్క నిమిషం మనసు మూగబోతుంది. అంతలోనే దీర్ఘమైన నిశ్వాస ఉప్పెనలా క్రమ్ముకుంటుంది. మనిషిలో ప్రాణవాయువు ఉన్నంత వరకు, దేశమాత పట్ల విజ్ఞతా చింతనని ఉత్తేజితం చేస్తూనే ఉంటుంది.

***

అజ్ఞాత కాశ్మీర్ ఫైల్స్
రచన: కస్తూరి రాకా సుధాకర్ రావు
ప్రచురణ: సంవిత్ ప్రకాశన్ అండ్ మీడియా ప్రై. లి.
పేజీలు: 131
వెల: ₹160/-
ప్రతులకు:
సంవిత్ ప్రకాశన్ అండ్ మీడియా ప్రై. లి..
నెం.43, ఫస్ట్ ఫ్లోర్,
సాయి మాన్షన్, ఆజ్‌బెస్టాస్ స్టాఫ్ కాలనీ,
కార్ఖానా, సికిందరాబాద్ – 500 009
మొబైల్: 8520999582 (ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 6 గం. వరకు)
వాట్సప్: 9121548857
ఈమెయిల్: samvitprakashan@gmail.com
ఆన్‌లైన్‌లో:
https://www.amazon.in/-/hi/Raka-Sudhakar-Rao/dp/B0DYV78FX4

Exit mobile version