Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రంగుల హేల 60: హైటెక్ పరిణతి

[సంచిక మాసపత్రికలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు అందిస్తున్న కాలమ్ ‘రంగుల హేల’.]

హైటెక్ పరిణతి

ది ఒక పట్నంలో, చతురస్రంగా నాలుగు బిల్డింగులున్న ఓ బుజ్జి కమ్యూనిటీ. అందులో నివాసాలున్న బిల్డింగులు మూడు. ఒక్కోదానిలో రెండంతస్తులు, గ్రౌండ్‌తో కలిపి మూడు. ఒకో ఫ్లోర్‌కి మూడు ఫ్లాట్ల చొప్పున మొత్తం మూడు బిల్డింగులకీ కలిపి 27 ఫ్లాట్లు. నాలుగో బిల్డింగ్ ఒకే అంతస్తుతో ఉంటుంది. పైన కమ్యూనిటీ హాల్. కింద ఫంక్షన్ హాల్. విశ్రాంత ఉద్యోగస్థులైన మిత్రులు కొందరు కలిసి కట్టుకున్న కాంప్లెక్స్ అది. వాళ్ళు ఆ కమ్యూనిటీ హాల్‌కి నెలకొకసారి పండితులను పిలిపించుకొని రామాయణ భారతాలు, దైవసంబంధిత ప్రవచనాలు చెప్పించుకుంటూ ఉంటారు .మరోసారి వాళ్లలో వాళ్లే ఎవరో ఒకరు చక్కని ఉపన్యాసాలు ఇవ్వడం గానీ లేదంటే అందరూ కలిసి గీతాపఠనం చేయడం గానీ చేస్తూ ఉంటారు.

ఒకరోజు బయట నుంచి జనార్దనంగారనే ఒక పండితుడు వచ్చి రామాయణంలో కొంతభాగం, శ్రీరామునికి పట్టాభిషేకం ముహూర్తం పెట్టిన దగ్గర నుండి జరిగిన పరిణామాలు, ఆపై, శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి బయలుదేరే వరకూ వివరంగా చెప్పి ముగిస్తూ, “ఆ యుగంలో తండ్రి మాటను,  గౌరవాన్ని నిలపాలని ఎంత కష్టాన్నైనా ఓర్చుకునేవారు కొడుకులు. ఈ కలియుగంలో అటువంటివారు మచ్చుకైనా లేరు. నేటి యువత ఎవరి బిజీలో వాళ్ళుంటున్నారు. తల్లిదండ్రులకు ఫోన్ చేయడం కూడా కష్టంగానే ఉంటోంది. వారంతా నిత్యం ఉద్యోగం లేదా వ్యాపారం చేయడంలోనూ, వారాంతంలో విశ్రాంతి తీసుకోవడంలోనూ ఖాళీ లేకుండా ఉంటున్నారు. తోడబుట్టినవాళ్లతో అనుబంధాలు లేవు. రాఖీలు, రక్షాబంధన్‌లు కూడా లేవు. ఎవరికి వారే యమునా తీరే! ఏమైనా అంటే పని ఒత్తిడి అంటారు. మనమంతా ప్రత్యక్షంగా చూస్తున్న సంగతే ఇది. కొత్తది కాదు. స్వస్తి!” అన్నాడాయన. ఆ మాటలు విని  ఆడవాళ్లు, మగవాళ్ళు చప్పట్లు కొట్టారు. అలా కొట్టకుండా సాలోచనగా తలపంకించినవారు వెంకటేశ్వర్లు మాస్టారు మాత్రమే!

ఆయన ఒక వారం రోజుల కోసం తన తోడల్లుడు ఇంటికి వచ్చి ఉన్నారు. ఆయన సామర్లకోటలో ఒక హైస్కూల్‌లో లెక్కల మాస్టారుగా పదవీవిరమణ చేశారు. అక్కడే కట్టుకున్న సొంత ఇంట్లో ఉంటారు. ఆయనకు పిల్లల్లేరు. తన విద్యార్థుల్ని సొంత పిల్లలుగా భావించి ఆదరించేవారు. వారు చదువులు పూర్తి చేసుకుని వివిధ ప్రదేశాలకు వెళ్లినా సొంత ఊరికి వచ్చినప్పుడు మాస్టారిని కలిసి తమ సమస్యల్ని చెప్పుకుంటూ, సలహాలు తీసుకుంటూ ఉంటారు. అలా ఆయన తన స్టూడెంట్స్ అందరికీ ఆత్మీయుడు. అలాగే ఊరి వారందరితోనూ సంత్సంబంధాలు కలిగిన గౌరవనీయుడు.

జనార్దనంగారి ప్రసంగం విన్నాక, ఆ రాత్రి వెంకటేశ్వర్లు మాస్టారి ఆలోచనల్లో, ఆయన విద్యార్థులు మెదిలారు. మర్నాడు మాస్టారు, తన తోడల్లుడితో ‘ఒకరోజు తానూ ప్రసంగిస్తానని’ కమ్యూనిటీ లోని వారిని  అనుమతి అడగమని చెప్పారు. ఆయన అడిగాడు. వాళ్లంతా ఒప్పుకున్నారు. నాలుగు రోజుల తర్వాత అంతా ఒక సాయంకాలం సమావేశమయ్యారు.

“నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేనూ మీలాగే ఒక రిటైర్ అయిన ఉద్యోగినే! టీచర్‌ని. భయపడకండి, నేను మీకు ఏమీ బోధించబోవడం లేదు.” అని నవ్వి, “కేవలం నా అనుభవాలు, వాటినుండి నేను గ్రహించిన సారాంశం మీతో పంచుకుంటాను” అంటూ వెంకటేశ్వర్లు మాస్టారు మొదలు పెట్టి కొనసాగించారు.

“నా దగ్గర చదువుకున్న మా ఊరి కుర్రాళ్లంతా పెద్ద పెద్ద చదువులు చదివి దేశవిదేశాల్లో మంచి మంచి జాబులు చేస్తున్నారు. ఒకసారి నా  స్టూడెంట్ రమేష్, కెనడా నుంచి ఓ రోజు ఫోన్ చేశాడు. ‘మాస్టారూ! మా నాన్నగారు రాత్రి కాలం చేసారని తెలిసింది. నేను రావడానికి వీలు కావడం లేదు. మీకు మా నాన్నగారు తెలుసు కనుక మీ మీద బాధ్యత పెడుతున్నాను. అమ్మ ఏనాడో వెళ్ళిపోయింది. నేనే ఏకైక సంతానాన్ని. మీరు చెప్తే అంతా పూనుకుంటారు. మీరు దగ్గరుండి నాన్నగారి కార్యక్రమం జరిపించండి. అందుకయ్యే ఖర్చంతా మీకు  పంపిస్తాను’ అంటూ ప్రాధేయపడ్డాడు. చెట్టంత ఎదిగిన శిష్యుడికి నేను ఏం సుద్దులు చెప్పగలను వీలయితే సాయం చెయ్యడం తప్ప. అందుకే అతను చెప్పినట్టే చేశాను. అతను కృతజ్ఞతలు తెలియచేసాడు.

అలాగే మరొక విద్యార్థి ప్రసాద్ ఒకసారి వచ్చినప్పుడు, ‘మీ అక్క ఎలా ఉంది?’ అనడిగాను. తనకి సిస్టర్ ఇంటికి వెళ్లడం కుదరడం లేదని చెప్పాడు. ‘అదేమిటి ఇద్దరూ ఉండేది హైదరాబాదేగా?’ అని నేను ఆశ్చర్యపోయినప్పుడు, అతను ‘మాకిద్దరు పిల్లలు, వాళ్ళను చదివించుకుంటూ, మా దంపతులం ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉంటాము. అక్కతో కలిసిమెలిసి ఉండడం నా భార్యకిష్టం ఉండదు. అక్కా, నేనూ కొన్నాళ్ళు ప్రయత్నించాము కానీ కుదరలేదు. నా భార్యని కాదని నేనేం చెయ్యగలను? ఇంట్లో అశాంతి పెంచుకోవడం నాకిష్టం ఉండదు. అందుకే ఒకరింటికి మరొకరి రాకపోకలు కూడా లేవు. అక్కా, నేనూ కూడా పెద్దవాళ్ళం అవుతున్నాం. ఎవరి బంధువులు వాళ్లకున్నారు ఎవరి ఫ్రెండ్స్ వాళ్లకున్నారు. అమ్మానాన్నా వెళ్లిపోయారు. ఇంకా అక్కాతమ్ముడు లాంటి బంధాల అవసరం ఉందంటారా! అదో పిచ్చిగానీ!’ అంటూ నవ్వాడు. నేను ఆశ్చర్యపోయాను. తిరిగి మాట్లాడలేకపోయాను.

మంచం పట్టిన ఒంటరి తల్లిని ఒక ఓల్డ్ ఏజ్ హోమ్‌లో జాయిన్ చేసి, మిత్రునికి ఆఖరి తతంగంతో సహా శాశ్వతంగా అప్పచెప్పి పోయిన ఓ అమెరికా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కూడా నా శిష్యుడే! అతని భార్య ఒక అమెరికన్, అందుకే అలా చెయ్యవలసి వచ్చింది అని ఒకసారి ఫోన్ చేసి నాతో చెప్పాడు. ‘కనీసం రోజూ మీ అమ్మతో కాసేపు మాట్లాడొచ్చు కదా! ఆవిడ సంతోషిస్తుంది’ అన్నాను ఉండబట్టలేక. ‘ప్రతిరోజూ రెండు నిమిషాలు మాట్లాడి ఆవిడని ఎక్కువగా ఎమోషన్‌కి గురి చేయడం తప్ప, ఆవిడకి కలిసొచ్చేదేమీ లేదు కదా మాస్టారూ! నేను మాట్లాడతాను అన్న ఆశ కూడా ఉండకపోతేనే, ఆవిడ గుండె దిటవు చేసుకుంటుంది. అదే మంచిది.’ అని అతనన్నప్పుడు అవాక్కవడం నా వంతయింది.

‘మీరు చెప్పినంత అన్యాయంగా పరిస్థితి లేదు, మా పిల్లలు మమ్మల్ని ఆదరిస్తున్నారు’ అని మీలో కొందరు అదృష్టవంతులు అనుకోవచ్చు. వారందరికీ అభినందనలు. ఐతే నేను చెప్పేది వినడం అందరికీ మంచిది అని నా ఉద్దేశం. అంతే!

మీరనొచ్చు! గురువుగా మీరు రెండు మాటలు చెప్పొచ్చుకదా అని. కొందరికి చెప్పాను. ‘కుటుంబ బంధాలు మనకి పునాదులు, వాటిని కాపాడుకోవాలి. మరో పాతికేళ్ళకి మీరూ మా పరిస్థితిలోనే ఉంటారు’ అని. అలా అన్నందుకు వాళ్ళు నాకు ఫోన్ చెయ్యడం మానేశారు. ఊర్లోకి వచ్చినా నన్ను కలవడంలేదు. అది నాకు వాళ్ళు నేర్పిన పాఠంగా భావించాను. ఆశావహ దృక్పథంతోనూ, అనుభవంతోనూ మీకు రెండు మాటలు చెప్పాలని  మీ ముందుకు వచ్చాను.

మనందరికీ పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసి వాళ్లకు పెళ్లిళ్లు చేసి, మనవల్ని కూడా పెంచి పెద్దవాళ్ళని చేసి  అరవైల్లో పడ్డాక, శక్తి తగ్గాక గానీ ఈ మమకారాల పట్ల వైరాగ్యం రాలేదు. వాళ్లకి మూడు పదులకే పరిణతి లభించింది. అది గొప్ప విషయమే కదా! ఆలోచించండి” అని ఆయన ఆగారు. అంతా మౌనంగా ఉండిపోయారు.

మళ్ళీ ఆయనే “నేటి యువతరంలో అధికశాతం కుటుంబ బంధాల పట్ల మమకారాలు వదులుకున్నారు. తరం మారుతోంది. ఆలోచనలూ మారుతున్నాయి. జీవితాలు పరుగులు పెడుతున్న మాట నిజం. ఒకనాటి జీవన నిదానం  ఇప్పుడు లేదు. వాళ్ళని చూసి మనం కూడా నేర్చుకోవాలి. మీకు పిల్లల్లేరు కాబట్టి బిడ్డలపై ప్రేమ మీరు అర్థం కాదు అని మీరనొచ్చు. నా విద్యార్థులంతా నా పిల్లలే! అని  నేనూ, నా భార్యా  అనుకున్నా వారికి అవసరమైనప్పుడు, లేదా ఊరిలోకి వచ్చినప్పుడు మాత్రమే నన్ను గుర్తుచేసుకుంటారు. ‘మాస్టారూ! మీరూ మేడం ఎలా ఉన్నారు?’ అని ఎవరూ ఎప్పుడూ  ఫోన్ చెయ్యరు. ఇది వారిపై నా ఫిర్యాదు కాదు. వాస్తవం చెప్పడం కోసం మాత్రమే ఈ సంగతి చెప్పాను.” అంటూ అందరి వైపూ చూస్తూ “ఈ విషయమై ఎవరైనా చర్చించదలచుకుంటే చర్చిద్దాం!” అన్నారు.

ప్రేక్షకులుగా ఉన్న ఆడవారుగానీ, మగవారు గానీ నోరు విప్పలేదు. “లోకం తీరు అలా ఉంది. నేను సమర్థిస్తున్నానని అనుకోకండి. దీనిని మనం జీర్ణం చేసుకోక  తప్పదు అని మాత్రమే నా సూచన. నా సలహా  తప్పు అనుకుంటే మన్నించమని అందరినీ వేడుకుంటున్నాను” అంటూ వెంకటేశ్వర్లు మాస్టారు చేతులు జోడించి  అందరికీ “నమస్తే” చెప్పి లేచారు కుర్చీలోంచి.

Exit mobile version