Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రంగుల హేల 59: మల్టీటాస్కింగ్ మెనెస్

[సంచిక మాసపత్రికలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు అందిస్తున్న కాలమ్ ‘రంగుల హేల’.]

మల్టీటాస్కింగ్ మెనెస్ (Multitasking Menace)

ల్టీ టాస్కింగ్ (ఏకకాలంలో బహుకార్యాచరణ) చేయడం వలన నష్టాలు ఎక్కువ, ఏకాగ్రత ఉండదు. పనిలో నాణ్యత కూడా తగ్గుతుంది అంటారు, కానీ బొత్తిగా సింగిల్ టాస్క్ చేసే రోజులు కావివి. మన చిన్నప్పుడు అమ్మకి ఇంటిల్లిపాదికీ ఫుడ్ సప్లై పని, నాన్నకి పొలం, పశువుల పని ఉండేవి. అప్పుడప్పుడు అమ్మకి పండుగలు, పబ్బాల పనులు, నాన్నకి పంటలు, ధాన్యం, డబ్బు లావాదేవీలు లాంటి ఎగస్ట్రా పనులు ఉండేవి.

మన ఇంట్లో సహాయకులు కూడా ఉదయమే లేచి వచ్చి, మనతోనే కాఫీ తాగి, లంచ్ చేసి రోజంతా పనిచేసి రాత్రికి ఇంటికి వెళ్లేవారు. వాళ్ళు మన ఇంట్లో మనుషుల్లాగే మనతో కలిసి మెలిసి ఉండేవారు. ఒక పని తర్వాత ఒక పని చేస్తూ ఆవుల, గేదెల పాలు పిండుతూ, పశువుల పాకలు శుభ్రం చేసుకుంటూ ఇంట్లో కూడా సహాయం చేస్తూ ఉండేవారు. అందరూ తీరికగా కులాసాగా ఊళ్ళో విశేషాల కబుర్లు చెప్పుకుంటూ మధ్యాహ్నాలు రకరకాల స్నాక్స్ చేసుకుంటూ తింటూ ఉండేవారు. ఒకరోజు తాటి రొట్టె, ఇంకో రోజు కొబ్బరి వేసిన బియ్యం రవ్వ రొట్టె లాంటివి చేసుకునేవారు. ఇంకా తాటి ముంజలు, తేగలు, బుర్రలు, బొప్పాయిలు, అనాస పళ్ళు ఇలా ఏదో ఒకటి కోసుకుంటూ తింటూ, కులాసాగా, నిదానంగా ఉండేవారు. టెన్షన్ అంటే అర్థం కూడా తెలీకుండా గడిపారు వాళ్లు. మనం మాత్రం ఊపిరి సలపని రద్దీ యుగంలో పడ్డాం.

ఇప్పుడు మన సహాయకురాలు రావడం రావడమే, గడియారం చూసుకుంటూ వచ్చి, తల తిప్పకుండా పనిచేస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం ఎక్కువ సేపు ఉండే పరిస్థితే లేదు. పని చేస్తుండగానే తర్వాత వెళ్ళబోయే వాళ్ళ ఇంటి నుండి ఫోన్లు వస్తూ ఉంటాయి రా రమ్మని. ఆవిడ రన్నింగ్, రన్నింగ్ పని చేస్తూ తల ఎత్తితే ఏం పని చెప్తారో అన్నట్టు మొహం మాడ్చుకుని ఉంటుంది.

బట్టల షాప్‌కి వెళ్తే అక్కడ కస్టమర్లు ఎంతమంది ఉంటారో బట్టలు చూపించే వాళ్ళు అంతమంది ఉంటారు. అయితే వాళ్ళు అష్టావధానం చేస్తూ అటు ఇటు పరుగులు తీస్తూ, స్టాక్స్ సర్దుకుంటూ, రేట్స్ టాగ్స్ అంటించుకుంటూ మన మొహం చూడడానికి కూడా ఇష్టపడరు. ఎవరినైనా అడగ్గానే కొన్ని బట్టలు తెచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోతారు. మాకు ఫలానాది కావాలి అని అడగాలంటే ఒక మనిషిని వెతుక్కోడానికి ఓ పది నిమిషాలు పడుతుంది. దొరికాక “చూపించండి. లేటెస్ట్ డిజైన్ చీరలు” అని అడగబోతే “ఆ హాంగర్లకి ఉంటాయండి. నచ్చినవి చూసుకోవాలండి. వాటికి ధరల ట్యాగ్లు కూడా ఉంటాయండి” అంటారు, కొంటే కొనండి అన్నట్టు మొహం పెట్టి. ఎందుకంటే వాళ్ళు చాలా పనులు చేస్తూ ఉంటారు. బట్టలు చూపించే పని ఒక్కటే కాకుండా!

బహు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్‌కి (వినగానే కళ్ళు తిరిగేంత కన్సల్టేషన్ ఫీజు కట్టి) వెళ్తే ముందుగా అక్కడ ఓ చిన్న డాక్టర్ (వాళ్ళు చెప్పిన చోట చేయించుకుని) మనం తెచ్చిన రిపోర్టులు చూసి నోట్ రాస్తాడు. నర్స్ వచ్చి బిపి, బరువు రాస్తుంది. నాలుగు గంటల నిరీక్షణ తర్వాత పెద్ద డాక్టర్ గారి గది లోపలికి వెళ్ళాలి. అక్కడ మూడు సోఫాల్లో పేషెంట్‌కి ఇద్దరు బంధువులు చొప్పున కూర్చుని ఉంటారు. ఆ చిన్న డాక్టర్ పెద్ద డాక్టర్ చెవిలో ఏదో మన రిపోర్ట్స్ గురించి చిన్నగా చెబుతాడు. ఆయన మన వైపు నిర్లిప్తంగా చూసి ‘చెప్పండి’ అన్నట్టు తలాడిస్తాడు. మనకు ముప్పై సెకన్ల టైమ్ ఉంటుంది. మనం రిహార్సల్ వేసుకున్న మాటలు అప్పచెబుతూ ఉంటాం. డాక్టర్ మన వెనుక సోఫాలో ఉన్న పేషెంట్‌కి చెయ్యి ఊపుతూ, వచ్చిన ఫోన్లో మాట్లాడుతుంటాడు. అప్పటికి మనకిచ్చిన టైమ్ అయిపోతుంది. పెద్ద డాక్టర్ తలతిప్పి గొణిగిన మందులేవో చిన్నవాడు రాస్తాడు. మనం ఇంకా ఏదో చెప్తుంటే చిన్న డాక్టర్ మన భుజం మీద చెయ్యి వేసి బయటికి తీసుకొస్తాడు. అతను కూడా వాడాల్సిన మందుల గురించి సగం సగం చెబుతాడు. ఏదో అడిగేలోగా తర్వాత పేషెంట్ చెప్పేది విని రాసుకుంటూ ఉంటాడు.

ఆ బహు పెద్ద డాక్టర్ మన అనారోగ్యం విషయం సరిగా విన్నాడో లేదో దేవుడికెరుక. అంచేత మనం దేవుడికి అక్కడే తూర్పు తిరిగి దండం పెట్టుకుంటూ ఇంటికి వెళ్ళడమే! మరి ఆ పెద్ద డాక్టర్ అంత ఫీజు పెట్టినా పేషెంట్లు తిరునాళ్ల కొచ్చినట్టు రావడం వల్ల, అష్టావధానం చేస్తూ మనకి కొన్ని సెకండ్లు మాత్రమే టైమ్ ఇవ్వగలిగాడు. ఏం చేస్తాడు పాపం ఆయన మాత్రం! అందుకే పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడేమో అభావంగా! మన చిన్నప్పుడు ఊరిలో డాక్టర్ గారు నవ్వుతూ జోక్స్ వేస్తూ, మనం చెప్పే సోదంతా ఎంత దయగా వినేవాడో!

టైలరమ్మ ఇంటికి వెళ్లేసరికి ఆవిడ సీరియస్‌గా డైలీ సీరియల్ చూస్తూ బట్టలు కుడుతూ ఉంటుంది. మనం బ్లౌజ్ ఇచ్చి కొన్ని మార్పులు చెప్పి అనుమానంగా చూస్తుంటే “ ఓకే అండీ నాకు గుర్తుంటాయి! డోంట్ వర్రీ!” అని మనల్ని పంపించేస్తుంది కుట్టడం ఆపకుండా, టీవీ సీరియల్ చూస్తూనే. వారం తర్వాత ఫోన్ చేసి “కుట్టావా తల్లీ !” అంటే “మీరు మార్పులేవో చెప్పారు, మరొకసారి చెప్పండి” అంటుంది. అదీ సంగతి!

బ్యాంకుకు వెళితే అదొక పద్మవ్యూహంలా ఉంటుంది. కౌంటర్లు కనబడనంత జనాలు. ఏదో ఒక కౌంటర్ క్యూలో నిలబడి మనం వంతు వచ్చాక, మన రికార్డు వేశాక ఈ కౌంటర్ కాదు అంటూ అక్కడున్న కౌంటర్లన్నిటికీ మనల్ని తిప్పుతారు. ఆఖరికి ఎప్పుడో మన బిక్కమొహం చూసి జాలిపడి రెండు మూడు కౌంటర్లు సాయం బట్టి మనం పని చేస్తారు. ఒకరోజు ఆ పనితో గడుస్తుంది. ఇంక పోస్ట్ ఆఫీస్‌లో అయితే పబ్లిక్ తాకిడి పిచ్చి పిచ్చిగా, గందరగోళంగా, బీభత్సంగా ఉంటుంది.

ఓ రోజు ఒకమ్మాయి రోడ్డు మధ్యలో యాక్టివా బండి వేగంగా నడిపిస్తూ, కుడి చేతితో హ్యాండిల్ పట్టుకొని ఎడమచేత్తో మొబైల్‌లో మెసేజ్ టైప్ చేస్తోంది. అది చూసి నేను ముచ్చటపడిపోయాను. నాకే గనక పవర్ ఉంటే ఆ అమ్మాయికి ‘శౌర్యరత్న’ పతకాన్ని ఇప్పించి ఉండేదాన్ని కదా అని చింతించాను కూడా!

ఇక కుర్రగాళ్ళయితే బైకులో మొబైల్‌ని భుజానికీ, చెవికీ మధ్య నొక్కిపెట్టి మాట్లాడుతూ రయ్యినపోతుంటారు. సడన్‌గా పక్క గల్లీలో నుంచి హార్న్ లేకుండా ఎవరైనా వస్తే వాడిని ఢీకొడతారు. ఇద్దరిలో ఎవరో ఒకరు కింద పడతారు. బైకుకో వాళ్ళకో దెబ్బలు తప్పవు. నిజానికి ఆ ఫోన్ కాల్స్ ఏమీ అర్జెంటు కాదు. ఫోన్ వచ్చింది అనగానే వెనకాముందూ చూసుకోకుండా ఆ కాల్ అందుకుంటారు. తర్వాత మాట్లాడొచ్చు. మిస్డ్ కాల్ ఆప్షన్ ఉందిగా! వీల్లేదు. అప్పుడే మాట్లాడేయ్యాలి! పక్కనేవున్న వాళ్లతో మాట్లాడాలంటే విసుగు! ఎక్కడి నుంచో వచ్చిన కాల్ పైన చచ్చేంత గౌరవం.

అప్పుడప్పుడు ఈ మల్టీ టాస్కింగ్ భూతం మనల్ని కూడా ఆవహిస్తుంది. ఓపెన్ కిచెన్‌లో నిలబడి, ఓ కన్ను హాల్లోని టీవీ పై వేసి, ఫోన్‌లో కజిన్‌తో జోకులు వేసుకుంటూ కూరలో ఉప్పు రెండుసార్లు వేస్తుంటాం. ఇవన్నీ అనవసర అష్టావధాన వేషాలే! ఇతరుల మల్టీ టాస్కింగ్ వల్ల మనం పడుతున్న ఇబ్బందుల్ని మనం పడాల్సిందే! కనీసం మనమైనా మనసుకు నిమ్మళంగా ఉండేలా ఒకో పనిని ఒకోసారి చేసుకోవడం మంచిది, మరీ తప్పనప్పుడు తప్ప.

కంప్యూటర్ మేధావులు చెబుతున్నారు, ఇప్పుడు నడుస్తున్నది డిజిటల్ విప్లవయుగమట. ప్రపంచమంతా ఒక క్లిక్ దూరంలో ఉందట. సో, అన్ని బిల్లులూ ఇంట్లో కూర్చుని చెల్లించమంటున్నారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ అంతా ఇంటి నుండే! ఫోన్‌పే లొచ్చాక చేతిలో డబ్బులవసరం లేదు. ఆన్‌లైన్‌లో బట్టలు, కిరాణా నుంచి సర్వం ఇంటికే. మరి నిజంగా, మన సమయం ఇలా భయంకరంగా ఆదా అయిపోతుంటే మనందరం గోళ్ళు గిల్లుకుంటూ, క్యారమ్స్, అష్టాచెమ్మా లాంటి దేశవాళీ ఆటలేవో ఆడుకుంటూ ఉండాలి కదా! ఎక్కడ చూసినా ఈ జనాల పరుగులేంటి! నాకు అర్థం కావట్లేదు. మీకు అవుతోందా!

Exit mobile version