[సంచిక మాసపత్రికలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు అందిస్తున్న కాలమ్ ‘రంగుల హేల’.]
ఆ రోజు గుడిలో దేవుని దర్శనం చేసుకుని సీత ఇంటికి బయలుదేరింది సునంద. వాళ్ళిద్దరూ శివాలయంలో తరచూ కలుస్తూ ఉండడం వల్ల మిత్రులయ్యారు. ఒకరింటికి ఒకరు ఎప్పుడు వెళ్లలేదు కానీ బాగా స్నేహం కలిసింది. వారం క్రితం సీత గారు రావడం లేదేమని పూజారిగారిని అడిగినప్పుడు తెలిసిందామెకు సీతగారి అత్తగారు పోయారని. అప్పుడే, కార్యక్రమం అంతా అయ్యాక, బంధువులందరూ వెళ్లాక సీత ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది సునంద.
ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్లాట్స్ లోనే ఉంటారు కాబట్టి ఆ ఇళ్లు బాగానే తెలుసు ఒకరివి ఒకరికి. సునంద వెళ్లేసరికి సీత గారి ఫ్లాట్ తలుపు తీసి ఉంది. బెల్ కొట్టి నిలబడింది సునంద. సీత బయటికి వచ్చి “అరే.. మీరా! రండి” అని లోపలికి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది. సీత ఆడపడుచులు, ఇద్దరూ అప్పుడే సూట్‌కేసులు పట్టుకుని బయలుదేరుతున్నారు. వెళ్లే ముందు సీత కాళ్ళకి నమస్కరించి “ఇకనుంచి నువ్వే మాకు అమ్మవి వదినా!” ఏక కంఠంతో అన్నారు. సీత ఇద్దరినీ చెరో చేత్తో దగ్గరకి తీసుకొని “అలాగే! ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు మీరు!” అంది ప్రేమగా.
వాళ్ళిద్దరూ, సీత భర్తా కలిసి బయటికి నడిచారు. సునందని కూర్చోమని చెప్పి సీత లిఫ్ట్ వరకూ వెళ్ళి వాళ్ళను పంపి వచ్చి సునంద చెయ్యి పట్టుకుంటూ “భలే వచ్చారు. థాంక్స్! ఈ కార్యక్రమంతో ఒళ్ళు హూనం ఐపోయింది” అంటూ ఆమె పక్కన కూర్చుంది.
“మీ ఫ్యామిలీని చూస్తుంటే నాకు భలే ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో మీ అంత మంచి అన్నావదినలు ఉండడం వాళ్ళ అదృష్టం. మాకైతే, మేము చేయాల్సిందే తప్ప మా అన్నయ్య ఎప్పుడూ ఫోనే చెయ్యడు. ఇక అన్న ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు.” అంది సునంద.
“నా పరిస్థితీ అదేలేండి. మా అన్నయ్య బాంబేలో బిజినెస్ చేస్తాడు. అసలిక్కడికి రానే రాడు. ఫోన్లు కూడా ఉండవు. ఏమైనా కోపాలా! అలాంటివి ఏవీ లేవు. బంధువులెవరైనా కనబడితే ‘మేం బిజీగా ఉంటాం, ఫోన్లు చేసే తీరిక ఉండదు’ అంటాడట. మనకి ఆ బాధ తెలుసు కాబట్టే మనం అలా ఉండొద్దు అనుకుంటాం” అంటూ లోపలి కి వెళ్లి ఒక ప్లేట్ లో నాలుగు కాజు బిస్కట్స్ వేసి తెచ్చింది.
“మీరూ తీసుకోండి” అంది సునంద.
ఇద్దరూ తిన్నాక “కాస్త టీ తాగుదాం” అంటూ లోపలికి వెళ్ళింది సీత.
టీ తాగుతుండగా అడిగింది సునంద “పదిహేను రోజులైందేమో కదా! అత్తయ్యగారు పోయి. ఇంకా ఉన్నారా మీ ఆడపడుచులు!”
“లేదు పదకొండు రోజుల కార్యక్రమం అయ్యాక వెళ్ళిపోయి, తల్లి బట్టలు, బంగారం, ఆవిడ పూజ చేసుకునే దేవుడి వెండి విగ్రహాలు, పళ్లెం, గ్లాసులు, కుందులూ పంచుకుందాం అని వచ్చారు.”
“మరి మీరు ఇరవై ఏళ్ల నుంచి ఆవిడకి సేవ చేశారుగా మరి మీకు?”
“ఏమీ లేదు! ఇద్దరూ వాటాలేసి పంచుకున్నారు. అరడజను కొత్త చీరలు, పాత చీరలతో సహా! ఆ కొత్త చీరలేమైనా ఓ రెండు ఉంచుతారేమో ఏ ముత్తైదువు కన్నా, మా అత్తగారి పేరు చెప్పి పండగరోజు పెడదాం అనుకున్నా. ఎందుకంటే ఆ చీరలు నేను కొన్నవే!”
“ఆ మాట అని ఉండాల్సింది”
“ఆ మాత్రం ఇంగితం వాళ్ళకుండాలి. ఇన్నాళ్లూ చూసి నేనేదో ఆశపడినట్టు ఉండదూ! అందుకే మొత్తం పట్టుకు పొమ్మన్నాను. ఆడపడుచుల్ని, వదినగార్లు ఆదరించడం లేదు అంటారు లోకులు. మనం ఏటా వాళ్ళని పిలిచి అన్ని గౌరవాలు చేసినా వాళ్లకు మన మీద ఉండే ఆప్యాయత ఇంతే! బూడిదలో పోసిన పన్నీరే!”
ఆశ్చర్యంగా చూస్తున్నమిత్రురాలితో “అపరిచితుడిలా మాట్లాడానా!” అంది నవ్వుతూ సీత.
“లేదు. లేదు. నిజం మాట్లాడారు” అంది సునంద ఆమె చెయ్యి ఆప్యాయంగా నొక్కుతూ!
***
అది ఒక ఎరువుల సరఫరాకు సంబంధించిన ఫెడరేషన్ అనబడే రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ. అది ఆ సంస్థ ఎం.డీ. అయిన, ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ గారి పేషీ. లోపల ఆయన పి.ఏ. రామ్ ప్రసాద్, టైపిస్టు, ఇద్దరు అటెండర్లు అప్పుడే ఆఫీసుకు వచ్చి కాఫీ తాగుతూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో పి.ఏ. ల్యాండ్‌లైన్ ఫోన్ మోగింది, అవతల ఎం.డీ. గారు.
“ఏం ప్రసాద్ గారు! శ్రీకాకుళం పోతారా! ఎం.డీ. అంటే భయమే లేదు.”
ఖంగుమన్న ఆయన గొంతు విని అంతా భయపడిపోయారు.
“సర్! సర్!” అన్నాడు పి.ఏ. రాంప్రసాద్.
“మా వంటమనిషి రావడం లేదని నిన్ననే చెప్పారుగా మేడం! ఇప్పటివరకు మరో మనిషిని పంపించలేదు. ఏం చేస్తున్నారు మీరంతా?”
“సర్! వేరే అమ్మాయిని మాట్లాడాను సర్! ఈరోజు ఉదయం వస్తానన్నది.”
“వచ్చిందా లేదా చూడరా? ఇంకెందుకు మీరు పి.ఏ.గా నాకు! మీరు వెళ్లిపోండి! నేను వేరే వాళ్ళని వేసుకుంటాను” అని ఫోన్ పెట్టేసాడు.
ఒక్క క్షణం కళ్ళు బైర్లుకమ్మాయి పి.ఏ.కి. ఎవరెవరికో మూడు, నాలుగు ఫోన్లు చేశాడు. పెద్ద అటెండర్ని పిలిచి, కొత్త పనమ్మాయి అడ్రస్ చెప్పి, “ఆవిడ దొరక్కపోతే మా పనమ్మాయిని నేను చెప్పానని చెప్పి తీసుకుపో” అంటూ తన స్కూటర్ ఇచ్చి పంపాడు. ఆ తర్వాత కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఆ పై కాసిని మంచినీళ్లు తాగాడు.
అప్పుడు టైపిస్ట్ వైపు తిరిగి “ఏమనుకుంటాడయ్యా ఆయన? నేను ఈయన పాలేరునా! నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు! గవర్నమెంట్ ఈయనకి పోస్ట్ ఇచ్చింది పేషీలో స్టాఫ్‌ని ఆఫీస్ పనికి వాడుకోమని. వీడింటికి పనిమనిషినీ, వంటమనిషినీ పంపించడానికి నేనున్నానా! ఈయన తల దువ్వెన నుంచి, రోజంతా స్నాక్స్, లంచుల వరకూ అన్నీ పేషీ డబ్బులతోనే బతుకుతాడు. జీతం అంతా ఏం చేసుకుంటాడో! ఇలాగే వీళ్లంతా గవర్నమెంట్‌ని దోచుకుని బతుకుతున్నారు. నన్ను పొమ్మనడానికి ఈయనెవడు! ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి నుంచి సీనియారిటీతో ఈ ఆఫీస్ కొచ్చాను. రిటెన్ టెస్ట్, ఇంటర్వ్యూలో పాసై ఈ పోస్ట్ కొచ్చాను. నేనెక్కడికి పోతాను? రిటైర్ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను. అయితే గియితే తెల్లారేప్పటికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చి ఈయనే పోతాడు. అప్పుడు నేను వచ్చి సి.టి.సి. కొడితే గాని ఈయనకి రిలీవ్ అయ్యే దిక్కులేదు.
ఊరికే బెదిరిస్తాడు గూండాలాగా! రోజంతా ఫ్రెండ్స్‌కి ఫోన్లు కలపమని బాతాఖానీ వేసుకొని ఇకిలిస్తూ కూర్చుంటాడు సొల్లుగాడు. చేసే పని తక్కువ! బిల్డప్ ఎక్కువ! బోడి పోజులగాడు. ఐఏఎస్ లాగా ఫీల్ అయిపోతా ఉంటాడు.” పి.ఏ.గారి ఏకపాత్రాభినయం సాగుతోంది. ఈ పరిచిత వ్యాఖ్యానం అలవాటయిన టైపిస్టు, చిన్న అటెండెరూ ఏదో పని కల్పించుకుని, పేషీ నుంచి బయటపడి హాల్లో సోఫాలో కూర్చున్నారు. ఇంతలో ఎం.డీ. గారు వస్తున్నారని కబురు రావడంతో తిరిగి పేషీలోకి వచ్చి కూర్చున్నారు.
ఓ నిమిషం తర్వాత ఎం.డీ. గారు, పెద్ద అటెండర్ బాగ్ తీసుకుని వెంటరాగా రూమ్ లోకి వేంచేశారు. పేషీలో అంతా లేచి నిలబడ్డారు. చిన్న అటెండర్ ఎం.డీ.గారికి ఫ్లాస్కోలో కాఫీ తీసుకుని వెళుతున్నాడు. టైపిస్ట్ వివిధ సెక్షన్స్ నుంచి వస్తున్న ఫైల్స్ తీసుకుంటూ సంతకాలు పెడుతున్నాడు. పి.ఏ. నోట్ బుక్ తీసుకుని, మొహం ప్రసన్నంగా, అపాలజిటిక్‌గా పెట్టుకుని నెమ్మదిగా ఎం.డీ. గారి రూంలోకి ప్రవేశిస్తున్నాడు.
అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.