[సంచిక మాసపత్రికలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు అందిస్తున్న కాలమ్ ‘రంగుల హేల’.]
ఆర్ట్ ఆఫ్ లీవింగ్ (ART OF LEAVING):
మనకు ఊహ తెలిసిన దగ్గర నుండీ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. అమ్మమ్మ తాతయ్యల నుంచి, తల్లిదండ్రుల నుంచి, పెద్ద తోబుట్టువుల నుంచి, తోటి పిల్లల నుంచి నేర్చుకుంటూనే ఎదుగుతాం. ఆ ఎదిగే క్రమంలో ఒక్కోసారి మనం తెలివితక్కువగా మాట్లాడినా, చెప్పకూడని విషయాలు ఇంకొకరికి చెప్పినా పెద్దల నుంచి మనకి తిట్లు పడుతుండేవి. “బతికే ఎత్తుండాలి. ఏదో ఒకటి వాగకూడదు. తెలివిగా మసలుకోవాలి” అంటూ వాళ్ళనుంచి మనకి మొట్టికాయలు కూడా పడుతుండేవి. అలా మనం బోలెడన్ని నేర్చుకుని, చదివేసుకుని, సంసారం, ఉద్యోగం చేసేసి పెన్షన్ తీసుకునే వరకు వచ్చేసాం.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్చుకునే వేగంలో పొదుపు, అదుపు, జాగ్రత్త నేర్చుకున్నాం. భవబంధాలను గట్టిగా పట్టుకుని, మనం కనీసం ఈ భూమి మీద రెండు, మూడు వందల ఏళ్ల వరకు బ్రతకడానికి కావలసిన వనరులను సమకూర్చుకుంటున్నాం. పనిలో పనిగా చిన్నప్పుడు తాతగారు సైకిల్ కొనిచ్చేప్పుడు “డబ్బున్న ప్రతివాడు వస్తువులు కొనుక్కోగలడు. అది గొప్ప కాదు, వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవడం గొప్ప” అన్న సూక్తిని గుర్తుపెట్టుకుని ఇప్పటికీ మన కార్లు మనమే శుభ్రంగా తుడుచుకుంటున్నాం. బీరువాల్నిండా చీరల్ని నింపుకుంటూ ఓపిక ఉన్నంతవరకు వాటికి మ్యాచింగ్ నగలు సేకరించి సమకూర్చుకుంటూ ఇంకా నలుగురితో కలిసి బతకాలి అని విని ఉన్నాం కనక, స్నేహితులు బంధువులు అంటూ ఎలిమెంటరీ స్కూల్ మిత్రుల నుంచి, చుట్టపక్కాల నుంచి ఆఫీసులోని కొలీగ్స్, ఇరుగుపొరుగు నుంచి మిత్రులని పోగేసుకుంటూ వాళ్ళందరికీ, పొద్దున్నే లేచి మొబైల్లో గుడ్ మార్నింగ్ చెప్పి పలకరిస్తూ ఉన్నాం.
మనకున్న వస్తు గౌరవం (వ్యామోహం అనొచ్చు) వల్ల వస్తువులకు రిపేర్ వస్తే బెంగ, మిత్ర ప్రేమ వల్ల మన మిత్రులు మనల్ని పిలవకుండా ఫంక్షన్స్ చేసుకుంటే బాధ, మనవాళ్ళు ఎవరైనా అనారోగ్యం పాలైతే బెంగ, మన బంధువులు ఊర్లోకొచ్చి మనింటికి రాకపోతే దిగులు పెట్టుకుంటూ మనల్ని మనం కష్టపెట్టుకుంటున్నాం. కదిలే ప్రవాహం లాంటి ఈ జీవితంలో మనుషులందరూ నీళ్లలో కొట్టుకుపోయే గడ్డి పరకల్లా ఒక్కోసారి పక్కకు వస్తాం, మరోసారి దూరంగా పోతూ ఉంటాం అంతే కదా! అని సరి పెట్టుకోవడం మానేసి చింతిస్తూ కొత్త కొత్త బాధల్ని కొని తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఇవి అవసరమా! అన్న వివేకం తెచ్చుకోలేకపోతున్నాం. ఇంట్లోకి ఇంకా కొత్త కొత్త వస్తువుల సేకరణ, అలంకారాల కలెక్షన్ తగ్గించుకోవడం ఆరోగ్యం అన్న ఇంగితం ఇప్పుడిప్పుడే కలుగుతూ ఉందేమో! అన్న విషయాన్ని గమనించుకుంటే మనకే మంచిది, మనసుకి తద్వారా శరీరానికి కూడా. పెద్దగా చీకూ చింతల్లేకుండా ఏ రోజుకారోజు, ఈ రోజు బాగున్నాం, బాగుంది, ‘ఐ యామ్ హెల్దీ, ఐ యాం హ్యాపీ’ అని యోగ మాస్టర్ చెప్పినట్టుగా ప్రతీ రోజూ అనుకుంటే హాయి కదా !
పెద్దవాళ్ళు చెప్పిన సూక్తుల్ని మర్చిపోకుండా మనం ఆచరిస్తున్న కొన్ని మంచి అలవాట్లు క్రమంగా మన తోటి మమేకమై, మనల్ని చాదస్తులుగా మార్చాయి. మనకి వస్తువుల తోటి అనుబంధాలు, శుచీ,శుభ్రం మీద అతి శ్రద్ధ, సమయపాలన మీద పట్టుదల లాంటి జాడ్యాలు పట్టుకున్నాయి. టైమ్ దాటితే కొంపలంటుకు పోతాయి అన్నట్టు గింజుకోవడం, శుభ్రత కోసం ఓసిడి తెచ్చుకోవడం, ఇల్లు అందంగా ఉండాలని మళ్ళీ మళ్ళీ సర్దుకోవడం లాంటి లక్షణాలు శృతి మించుతుంటాయి. మా అన్నయ్య పది గంటలకు బయలుదేరాలి అనుకున్నప్పుడు పది దాటితే ఒక ప్రళయం వచ్చేసినట్టు అందరి మీదా అరిచి కరుస్తాడు. ఏదైనా వస్తువు విరిగి కింద పడి పగిలితే ‘అది చుట్టూ ఉన్నవారి అజాగ్రత్త’ అంటూ లెక్చర్ మొదలు పెడతాడు. సమయం దాటవచ్చు, వస్తువులు పగలవచ్చు, అన్న ఇంగితం కొరవడుతుంది. కొన్ని సార్లు రూల్స్‌ను సవరించుకోవాలి. తమకున్న అబ్సెషన్ నుంచి బయటికి రావాలి. దాన్ని ‘ఆర్ట్ ఆఫ్ లీవింగ్’ అనొచ్చు.
మా కజిన్ ఒకామె పనమ్మాయి గదులు తుడిచి వెళ్లిపోయిన తర్వాత మళ్లీ ఇంకోసారి తుడుచుకుంటుంది. “ఏమిటో! నా చేత్తో తుడుచుకుంటే తప్ప నాకు తృప్తి ఉండదు” అంటుంది. ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళు అడుగులు ఎక్కడేస్తున్నారో చూసుకుంటూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళగానే తడిబట్ట వేసుకుంటూ ఉంటుంది. ఇవన్నీ ఎవరికి వాళ్లు వేసుకునే అమాయకపు శిక్షలు. వయసు మీద పడ్డాక కూడా, తమ శరీరాన్ని బాధ పెట్టుకుంటూ దాన్ని ఒక గొప్పతనంగా భావించుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళు.
కొందరు బంధువులతో స్నేహితులతో సత్సబంధాలతో ఉండాలని గట్టిగా అనుకుంటారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సంబంధాల్లో ఒకోసారి తేడా రావచ్చు. అకారణంగా మన మీద మన బంధువర్గం వారెవరికో కోపం రావచ్చు. అంతమాత్రాన మనం మరీ మరీ ఆ విషయాన్ని తలుచుకుని దుఃఖించి వాళ్లకీ, వీళ్ళకీ చెప్పి “నేను ఏమి అన్యాయం చేశాను! నేను ఎంతో చేశాను! నన్ను ఎందుకు చెడ్డగా చూస్తున్నారు?” అని మధ్యవర్తుల వద్ద మళ్లీ మళ్లీ వాపోడం మరింత అపార్థాలకు దారితీస్తుంది. ఎప్పుడైనా మిత్రుల మధ్య కూడా చిన్న ఇబ్బందులు వస్తాయి. దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఆ విషయాన్ని అంతటితో వదిలేయాలి. నిజానికి మన స్నేహం గొప్పదైతే అది తప్పక కొనసాగుతుంది, లేదనుకుంటే ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు దాన్ని వదిలేసి ముందుకెళ్లడం మంచిది. తుమ్మితే ఊడే ముక్కు ఏదో రోజు ఊడిపోక తప్పదు. మళ్లీ వెనక్కి తవ్వుకొని తొంగి చూసుకొని చింతించడం అనవసరం. జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులను మనం మరీ మనసు మీదకి తీసుకోకుండా వదిలేయడం కూడా ఒక ఆర్ట్. ఒక కళ.
ఈ కళని అభ్యాసం చేస్తే మన మనసుకు మనం బరువు తగ్గించే వాళ్ళం అవుతాం. ఏదీ శాశ్వతం కాదు కదా! అనుకోవాలి. దీన్నే త్యజన కళ అనొచ్చు. ఒకోసారి తప్పనప్పుడు త్యజించాలి వస్తువుల్నిగానీ, మనుషుల్నిగానీ! అప్పుడు మనసుకు తేలిగ్గా ఉంటుంది అయితే ఇది అంత సులువు కాదు. కొంత ప్రాక్టీస్ చెయ్యాలి. అలా వదిలేయవలసినప్పుడు వచ్చే బాధను పూర్తిగా అనుభవించి అప్పుడు వదిలేయాలి. మళ్లీ ఆ విషయం గుర్తు చేసుకోకూడదు. మనుషులు, వారి మధ్య బంధాలు, వస్తువులు, పరిసరాలు ఏవీ స్థిరం కావు. ఉండవు. ఆ మాటకొస్తే మనం మాత్రం ఉంటామా? ఇక్కడ! ఉండం కదా! అనుకుంటూ మనం నడవబోయే కొత్త దారులు మనకి ఇంకొన్ని ఆనందాలు తెచ్చి పెడతాయేమో అన్న ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగడం ఉపయుక్తం. “ఎవరెవరో ఎదురౌతారు. గుండె గుండెతో ముడిపెడతారు. ఘటనంటే కలిసుంటారు. గడువైతే విడిపోతారు. ఆగిపోతూ, సాగిపోయే రాదారి పయనం బ్రతుకు!” అనే పాటను గుర్తు చేసుకోవాలి. అలా ఈ కొత్త కళను మనమంతా సాధన చేసి మన మానసికమైన భారాన్ని దించుకొని తేలిగ్గా ముందుకు దారితీద్దాం.
అనవసరమైన ఆలోచనలు, గజిబిజి ఊహలు వదిలేస్తే మనం ప్రశాంతంగా ఉంటాం. కాస్త నేల మీదకు దిగి ఆశలు, ఆశయాలు, ఊహలు, అసాధ్యమైన కలలు మొదలైన వాటిని మళ్ళీ మళ్ళీ తలుచుకోకుండా ‘అది మనకి ప్రాప్తం లేదు’ అని మనకి మనం నచ్చచెప్పుకుని ఒక క్లోజర్ రేఖ గీసుకుంటే సుఖం. అందుకు మన మనసు మీద మనకు అదుపు ఉండాలి. మనకి మనమే పాఠాలు చెప్పుకోవాలి. “అది కాదురా భాయ్! ఇలా చెయ్! సుఖంగా ఉండు! ఊరికే బుర్ర ఉంది కదా అని దానిలో అడ్డమైన చెత్త నింపి గింజుకోకు!” అని మనకి మనం కూడా అప్పుడప్పుడు క్లాసులు తీసుకుంటే మన మనసు కూడా నిమ్మళిస్తుంది. అటువంటి ఉపయోగపడే సూచనలు మనల్ని అనవసరపు భారాన్నించి బైట పడేస్తాయి. అప్పుడు మనం చదివిన చదువుకీ, సాహిత్య పఠనానికీ ఒక సార్థకత ఉంటుంది. చదువుదారి చదువుదీ, మన సంఘర్షణ దారి సంఘర్షణదీ అయితే ఎంతకీ ఏడో క్లాస్, పాస్ కాని కుర్రాడిలా అక్కడే గింగిరాలు తిరగవలసి వస్తుంది.
దశాబ్దాలుగా మనతో ప్రయాణిస్తూ ఉన్న వాళ్ళు కూడా కొందరు ఈర్ష్యపు మాటలతో మన మనసుకు ఏదో ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని ఇప్పుడు వదిలేసుకుంటే మనసుకు తెరిపిగా ఉంటుంది. ‘సెలెక్ట్ అండ్ డిలీట్’ అన్నమాట. అనవసరపు మానసిక వేదన తగ్గుతుంది.
ఒక్కోసారి మన తప్పు లేకపోయినా కొన్ని నీలాపనిందలు వచ్చి నెత్తిన పడతాయి. అప్పుడు, అలనాటి శ్రీకృష్ణుడిలా మన నిజాయితీని నిరూపించుకునే అవకాశం మనకి దొరకదు, మింగి ఉండాల్సిందే! నిజ నిరూపణ కోసం ప్రయత్నం చేసే కొద్దీ మరింత అభాసు పాలవుతాం. అలాంటి జంఝాటాలన్నీ వదిలేసుకుంటూ ముందుకు సాగడమే ఆర్ట్ ఆఫ్ లీవింగ్ అంటే!
అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.