[సంచిక మాసపత్రికలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు అందిస్తున్న కాలమ్ ‘రంగుల హేల’.]
తెలియని నెంబర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది సీనియర్ రచయిత్రి సుజాతకి. “మేడమ్! నా పేరు మిత్ర. నాలుగు రోజుల క్రితం మీకు ఒక నవల పంపించాను. అది నా మొదటి నవల. అందిందా? నవల పేరు, ప్రేమపక్షి.”
“వచ్చినట్టుందమ్మా! పోస్ట్ నుంచి కొన్ని బుక్స్ వచ్చాయి. అందులో ఉండి ఉండొచ్చు”
“మేడమ్! మీరు ఆ నవల చదివి వెంటనే సమీక్ష రాయాలి మేడమ్!”
“సారీ అమ్మా! ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. మరో మూడు నెలల వరకు ఇలాగే ఉంటుంది. లేకపోతే ఒక నవల చదివి సమీక్ష రాయడం నాకు ఆనందమే! వీలు కాదమ్మా! ఇంకెవరినైనా అడుగు”
“సరే! ఉంటాను మేడమ్!”
వారం తర్వాత మిత్ర నుంచి ఫోన్ వచ్చింది సుజాతకి. “మేడం! నా నవలపై సమీక్ష రాశారా?”
“చెప్పాను కదమ్మా రాయలేనని!”
“సమీక్ష రాయడం నాకు ఆనందమే అని అన్నారు కదా!”
“నాకు తీరిక లేదు, ఉంటే రాసేదాన్ని అన్నాను.”
“మీరు సమీక్ష రాస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను. కావాలంటే ఇంకో వారం తీసుకోండి, ఉంటాను మేడమ్!”
సుజాతకి మతిపోయింది. మొహమాటానికైనా ఇప్పుడు రాసే తీరికలేదు. అసలు ఆ పిల్ల ఏం అడిగింది? నేను అప్పుడు ఏమన్నాను? తర్వాత నా మాటల్లో ఎక్కడైనా రాస్తానులేమ్మా! అన్న ధ్వని ఉందా? అనుకుంటూ ఆ రోజు జరిగిన సంభాషణాక్రమాన్ని, ఆ స్క్రిప్ట్‌ని మళ్లీ మళ్లీ చెక్ చేసుకుంది సుజాత. ఇద్దరం తెలుగులోనే కదా మాట్లాడుకున్నాం! భాష సమస్య లేదు. తను కచ్చితంగానే చెప్పింది కదా! మరి ఈ అపార్థం ఎలా వచ్చింది. ఆలోచిస్తూనే ఉంది సుజాత. మరో రెండు రోజుల తర్వాత మరో ఫోన్ వచ్చింది.
“మేడమ్ నేను ‘ముమ్మాటికీ నిజం’ ఎడిటర్‌ని. మిత్ర గారి నవల మీద సమీక్ష రెడీ అయిందా? నా మెయిల్ ఐడి పెడుతున్నాను దానికి పంపిస్తారా? మీ ఫోటో కూడా పంపించండి” అంటూ ఫోన్ పెట్టేసాడు. సుజాతకి ఏం చేయాలో పాలు పోక ఆ పిల్ల నంబరు, ఎడిటర్ నెంబరు గుర్తు పెట్టుకుని ఆ ఇద్దరి నుండీ వచ్చే ఫోన్లు ఎత్తకుండా ఊరుకుంది.
***
మరొకరోజు సుజాతకి మోహనరావు మాష్టారి నుంచి ఫోన్ వచ్చింది, ఎత్తి “మాష్టారూ! బాగున్నారా!” అంటూ పలకరించింది.
“ఇంకా ఈ మాష్టారు గుర్తున్నారా తల్లీ!”
“మిమ్మల్ని ఎలా మర్చిపోతాం మాస్టారు? పాతికేళ్ల క్రితం మీరే కదా రచనలు చేయడం ఎలా? అని మాకు కొన్ని కోచింగ్ క్లాస్లు తీసుకున్నారు. మేము ఈ నాడు రచయితలమయ్యాము అంటే దానికి పునాది మీరు వేసిందే కదా!”
“అంత మాట ఎందుకులే తల్లీ! కానీ, బాగున్నారు కదా, అని పలకరిద్దామని చేశాను.”
“మీరు ఏమన్నా రాస్తున్నారా? మాష్టారూ!”
“ఎక్కడ? మీ అందరికీ కోచింగ్ చెప్పినప్పటినుంచి నేను రాసిందే తక్కువ. అంతకుముందు కూడా పెద్దగా రాయలేదనుకో! నా ఇంట్రెస్ట్ కొద్దీ చెప్పానంతే! ఇంకేమిటి విశేషాలు?”
“చెప్పండి మాస్టారు.”
“అప్పుడు నా దగ్గరికి కోచింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా మీతో టచ్‌లో ఉన్నారా!”
“చాలామంది ఉన్నారు సార్! నా క్లోజ్ ఫ్రెండ్ సౌమ్యకి ఉగాది కథల పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది సార్! మీరు చూసే ఉంటారు.”
“చూశాను. మంచి కథ అనుకోవచ్చు, కానీ నేను మీకు కొన్ని విమర్శ క్లాసులు కూడా చెప్పాను కదా! దాన్ని బట్టి నువ్వు ఆ కథని పరిశీలించి ఏమేమి లోపాలున్నాయో చెప్పగలవా? మిత్రురాలు కాబట్టి గుర్తించలేదా?”
“ఒక్కటే అనిపించింది మాష్టారూ!”
“ఏమిటదీ?”
“ఒక పాత్ర, మా అమ్మమ్మ వంచిన నడుం ఎత్తకుండా బంధువులకి వండి పెట్టేది అని రాస్తూ, మా అమ్మమ్మ నెయ్యమ్మేది అని రాసింది. నిజానికి నెయ్యి అమ్మే రోజులు వచ్చేసరికి బంధువులకి వండి వార్చడం ఆగిపోయింది. ఎప్పుడైతే ఆడవాళ్లకు కూడా ఇంట్లో వస్తువుల్ని డబ్బుగా మార్చొచ్చు అని డబ్బు విలువ తెలిసిందో అప్పుడు ఆటోమేటిగ్గా, ఇలా ఎడాపెడా ఇంటిలోని వనరులను ఖర్చు పెట్టడం మానేశారు” అన్న సుజాత మాటకి అడ్డం వస్తూ,
“చాలా బాగా చెప్పావమ్మా! ఇంకా ఆవిడ పల్లెటూర్ల గురించి చాలా సౌందర్యాత్మకంగా, ఆకర్షణీయంగా రాస్తుంది. నిజానికి మనం పల్లెటూర్లో పుట్టి పెరిగాం కాబట్టి మనకవి అంత గొప్పగా అనిపించవు. ఊరిలో కురిసిన వాన గురించి రెండు పేరాలు రాసింది. ఆ పరిసరాల్లో వర్షం పడిందంటే, మన పశువుల శాలలన్నీ పేడవాసనలతో ఉండేవి. అడుగు తీసి అడిగేస్తే కాలికి రోడ్లపై ఉండే మట్టి బూట్లు వేసుకున్నట్టు అంటుకునేది. ముళ్ళు కూడా గుచ్చుకునేవి. ఇంత మంచి రోడ్లు అప్పుడు లేవు కాబట్టి వానని ఆనందించేంతటి జ్ఞాపకాలు మనకు ఉండవు” నవ్వుతూ అంటున్న మాష్టారితో,
“కథ థీమ్ బాగుంది. ఇది విమర్శ అని కాదు. ఔచిత్యం గురించిన చర్చ. దీనివల్ల మరొకరిని వెక్కిరించడం అని కాదు. అలాంటి తప్పులు మన చెయ్యకుండా మనమీద మనకి ఒక చెక్ కోసం అంతే!”
“ఇప్పుడు నాకు కూడా పాఠాలు చెప్పేటట్టున్నావు సుజాతా!”
“అయ్యో! లేదు మాష్టారూ ! మీరు అడిగారు కాబట్టి చెప్పాను తప్ప మరో ఉద్దేశం లేదని నా ఉద్దేశం!”
“అర్ధమయ్యిందిలే! సరదాకన్నాను. ఉంటానమ్మా!”
మర్నాడు మధ్యాహ్నం సుజాత ఫోన్ మోగింది. ఎత్తుతూనే “హాయ్ సౌమ్యా! ఇంకా అభినందనల వర్షంలో ఉన్నారా!” నవ్వుతూ అడిగింది సుజాత.
“ఏం! మీకు బాధగా ఉందా?” అంది సౌమ్య ఆవేశంగా.
“అయ్యో! అదేమిటండీ! నేనేగా ఫస్ట్ మీకు కంగ్రాట్స్ చెప్పానన్నారు!”
“అవును. ఇక్కడ కంగ్రాట్స్ చెప్పారు, అక్కడ మాష్టారికి ఫోన్ చేసి నా కథను విమర్శించారు. రెండు నాల్కల ధోరణి మీది అని ఇన్నాళ్ళూ తెలుసుకోలేకపోయాను.”
“అయ్యో! అలా కాదు సౌమ్యా! మాస్టారు దాన్ని విమర్శనాత్మకంగా ఏమైనా చెప్పండి? అంటే ఒక పాయింటు చెప్పాను, కానీ కథ బాగుంది బహుమతికి అర్హమైనది అన్నాను.”
“అలా ఎందుకంటారు లెండి? ఈ కథలో బోలెడు లోపాలు ఉన్నాయి. అయినా దీనికి బహుమతి వచ్చింది అని ఉంటారు.” అంటూ ఫోన్ పెట్టేసింది సౌమ్య. ఆ రోజు మాష్టారితో సాగిన సంభాషణ గుర్తు తెచ్చుకుంటూ ఉండిపోయింది సుజాత ఎక్కడ పొరపాటు జరిగింది! అని తర్కించుకుంటూ.
***
ఇంకొక రోజు సుజాతకి ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ నుంచి ఫోన్ వచ్చింది.
“మేడమ్! స్నేహ సాహితీ సంస్థ సెక్రటరీ రమణిని మాట్లాడుతున్నాను. మా మేడమ్ మీకు చెప్పమన్నారు, ఒక హిందీ బుక్‌కి తెలుగు అనువాద పుస్తకం రిలీజ్ చేస్తున్నాము. ముఖ్య అతిథి మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు. ఆ పుస్తకం మీకు పంపమన్నారు. మీ అడ్రస్‌కి పోస్ట్ చేసాము. మీరు హిందీ టీచర్ కాబట్టి ప్రధాన వక్తగా ఆ పుస్తకాన్ని మీరు పరిచయం చేయాలి.”
సుజాత చాలా ఆనందపడింది. ఈ సంస్థ నుంచి సుజాత ఎన్నో పుస్తకాల గురించి మాట్లాడింది. ఆ సంస్థ అధ్యక్షురాలు సంధ్యారాణిగారు విదుషీమణి. లాభాల ప్రసక్తి లేకుండా కేవలం సాహితీ సేవ చెయ్యాలని మాత్రమే ఆవిడ ఈ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు. సుజాతకి ఆమెతో స్నేహం ఈనాటిది కాదు.
“సరే. తప్పకుండా చేస్తాను! అని చెప్పండి మీ మేడమ్‌కి” అంది సుజాత సంతోషంగా.
రెండు రోజుల తర్వాత సుజాతకి సరిత నుంచి ఫోన్ వచ్చింది “ఒక హిందీ నుండి తెలుగు అనువాదానికి పుస్తక పరిచయం చేస్తున్నాను. మీరు కూడా రావాలి”, అందామె. పుస్తకం వివరం చెప్పగానే అది తనని పరిచయం చేయమని చెప్పిన పుస్తకమే! ఆశ్చర్యపోవడం సుజాత వంతయ్యింది.
“మీకెవరు ఫోన్ చేసారు?”
“సెక్రటరీ రమణి చేసింది”
“ఎన్ని గంటలకి?”
“నిన్న ఉదయం పదకొండుకి.”
“ఓకే. నేను మీటింగ్‌కి వస్తాను” అని ఫోన్ పెట్టేసి, ఫోన్ తీసి చూస్తే నిన్న సెక్రటరీ సుజాతతో మాట్లాడిన టైం ఉదయం పది.
మర్నాడు సెక్రటరీ రమణికి ఫోన్ చేసి డైరెక్ట్‌గా అడగలేక “ఆ హిందీ అనువాద పుస్తకావిష్కరణలో నా పాత్ర ఏమిటి?” అనడిగింది సుజాత.
“మీరు ఆత్మీయ అతిథి”
“నన్ను పుస్తక పరిచయం చేయమన్నారు కదా!”
“కానీ, మీరు అతిథిగా ఉంటాను అని అన్నట్టున్నారు కదా!”
“అలా ఎందుకంటాను? పుస్తక పరిచయం చెయ్యమని కదా మీరు అడిగింది, నేను ఓకే చేసింది!”
“అవును కదా! నేను కనుక్కుంటాను. ఎక్కడ తేడా వచ్చిందో తెలుసుకుంటాను” అన్నావిడ మళ్ళీ ఫోన్ చేయలేదు.
ఎందుకైనా మంచిది పుస్తకపరిచయం నన్నే చెయ్యమంటే అప్పుడు హడావిడి పడడం ఎందుకులే! అనుకుని పోస్ట్‌లో వచ్చిన ఆ అనువాద పుస్తకం చదివి, ప్రసంగం కోసం నోట్స్ రాసుకుంది సుజాత. నాలుగు రోజుల తర్వాత ఇన్విటేషన్ వచ్చింది. అందులో పుస్తక పరిచయం సరిత, ఆత్మీయ అతిథి సుజాత అని ఉంది. ఈ తిరకాసుతో చిరాకెత్తిన సుజాత ఆ మీటింగ్‌కి వెళ్ళలేదు. మర్నాడు ఫోటోలు పంపిస్తూ, స్నేహ సాహితీ సంస్థ అధ్యక్షురాలు సంధ్యారాణి ‘పుస్తక పరిచయం చేయమంటే వీలు కాదన్నారట. ఆత్మీయ అతిథిగా కూడా రాలేదు. కారణం ఏమిటి?’ అంటూ పంపిన మెసేజ్ చూసుకుని తల గిర్రున తిరిగింది సుజాతకి. తనని ఆ రోజు పుస్తక పరిచయవక్తగా తప్పించడానికి ఎటువంటి కూర్పు జరిగిందో మననం చేసుకుంటూ.
రచయితలు, ‘మేము వందల పుస్తకాలు చదివాం! ఎన్నో పుస్తకాలు రాసేసామ్. మనకి తెలుగు భాష మీద బాహా పట్టుంది’ అని రవ్వంత మురుస్తుంటారు. ఇప్పుడు నేను చెప్పిన అనుభవాలు ఎదురైతే ఆ కాన్ఫిడెన్స్ తగ్గించుకోవలసి వస్తుందేమో అని నా సందేహం!
అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.