Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రంగుల హేల 55: ఇల్లు మారే వైభోగం

[సంచిక మాసపత్రికలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు అందిస్తున్న కాలమ్ ‘రంగుల హేల’.]

డి వయసులో ఇల్లు మారడం అంటే సరదా సంగతి కాదు. ఒక వరదొచ్చి మన ఇంటి సామాను మొత్తం కొట్టుకుపోతుంటే, మనం కష్టపడి ఒక ఒడ్డుకు చేరి, ఒక్కొక్క వస్తువును ఏరుకుని మళ్లీ ఇంకో ఇంట్లో సర్దుకున్నట్టుంటుంది. దెబ్బకి భగవద్గీత గుర్తొస్తుంది. ఆత్మ చిరిగిన వస్త్రాన్ని వదిలి నూతన వస్త్రాన్ని ధరించినంత పనవుతుంది.

చిన్నపిల్లలతో ఇల్లు మారుతున్నప్పుడు వాళ్ళ బొమ్మలు, గవ్వలు దాచడం ఒక పని. అందులో ఏదో పోయిందనో, మిస్సయిందనో కొత్త ఇంట్లో చేరాక పిల్లల గోల. కాలేజీకి వెళ్లే పెద్ద పిల్లలయితే వాళ్ల బండెడు రిఫరెన్స్ పుస్తకాలన్నీ దాచిపెట్టకపోతే వాళ్ల నిష్ఠూరాలు పడాలి. భర్తకో భార్యకో సాహిత్యం పిచ్చి ఉంటే ఆ పుస్తకాలు అల్మైరాల నిండా ఉంటాయి. డబ్బు పెట్టి కొన్న పుస్తకాలు పారేయలేక మళ్ళీ చదివే ఓపిక లేకపోయినా దాచుకోవాలి. ఇక ఇద్దరిలో ఎవరో ఒకరికి భక్తి ఉంటే ఆ భక్తి పుస్తకాలు జాగ్రత్త చెయ్యాలి. ఇంకా రకరకాల ఇంట్రెస్ట్ లున్నవాళ్ళకయితే వాళ్ళకి నచ్చిన వస్తువుల సేకరణ సరదా ఉంటుంది. మనం కూడా పెద్దగా హస్తకళాభిరుచి లేకపోయినా రంగు రంగుల కొండపల్లి బొమ్మలు, లేపాక్షి బొమ్మలు లాంటివి బోలెడు రేటు పోసి కొంటాం (చిన్నప్పుడు తీర్థాల్లో కొనుక్కునే అలవాటు కొద్దీ). అవి దుమ్ము పట్టిపోతాయి, వాటిని పారేయడానికి మనసొప్పక మళ్ళీ వాటిని కొత్త ఇంట్లో దాచిపెట్టడం తప్పదు.

చీరల పిచ్చి ఉన్న ఆడవాళ్లు అయితే ఎన్నెన్నో రకాల చీరలు కొంటారు. అవి ఎన్ని ఉన్నాయో కూడా వాళ్ళకి లెక్క తెలియక బిక్కమొహాలేసుకుంటారు. అది చూసిన మగవాళ్ళు, పిల్లలు “ఇన్నిన్ని చీరలు ఎందుకమ్మా? పనమ్మాయికి ఇచ్చేయమ్మా!” అంటూ వెంట పడతారు. “ఇలాంటి డ్రై వాష్ చీరలు వాళ్ళు మెయింటైన్ చేయలేరు” అంటే, “ఎక్కడైనా ఆశ్రమంలోకి వెళ్లివ్వాలి” అంటారు. ఎక్కడున్నాయి ఆశ్రమాలు? అనడిగితే “ఏమో! నువ్వే వెళ్లి వెతుక్కో” అంటారు. “ఇన్నిగిన్నెలు ఎందుకమ్మా?” అని వెక్కిరింపులు. “నలుగురు వచ్చినప్పుడు నాలుగు గిన్నెలు ఉండాలి కదా” అంటే “ఫంక్షన్లకి ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేసేస్తాం కదా!” అని లా పాయింట్లు. నాలుగు కొత్త చీరలు కొంటే నాలుగు చీరలు బైట పారెయ్యాలట. ఇల్లాంటి గీతా బోధలు ఎక్కువయ్యాయీ మధ్య. అందరిళ్ళలోనూ తల్లులకు ఇలాంటి టార్చర్ తప్పడం లేదు.

“ఈ వెలిసిపోయిన పట్టు చీర అవసరమా?” అని ఒకరంటారు. “అది మా పెళ్లి చీర జ్ఞాపకార్థం” అంటే “ఎందుకమ్మా ఈ జ్ఞాపకాలు? మనసులో పెట్టుకోవాలి గాని బీరువాలో పెట్టుకోకూడదమ్మా! ఈ సినిమా సెంటిమెంట్లు ఇంటి నిండా నిండిపోతాయమ్మా!” అంటూ వాళ్ళ చేత సుభాషితాలు వింటూ, వెక్కిరించే పిల్లల మధ్య పోలీస్ స్టేషన్‌లో దొంగల్లా ఉండాలి.

ఆఖర్న, మనం బాగా బతికిన రోజుల్లో కొని, చదివి అపురూపంగా దాచుకున్న పుస్తకాలపై వాళ్ళ కళ్ళు పడతాయి. “ఈ యద్దనపూడి, యండమూరి పుస్తకాలు ఎవరు చదువుతారు? మేమైతే చదవం కదా! నువ్వు మళ్ళీ ఇంకోసారి చదవవు కదా! ఇవన్నీ పారేయమ్మా! ఆ రామాయణం, భారతం పుస్తకాలు ఏవో పోస్టులో తెప్పించుకున్నావు కదా, మీ గురువుగారు చెప్పారని, అవి మాత్రం దాచుకుని ఇవన్నీ పడెయ్యి” అంటూ ఇంకొకరి పోరు. అసలే మెడనొప్పి, వీపునొప్పి, జబ్బల నొప్పులతో కొత్త ఇంట్లోకి మారాక సామాను పడేయలేక దాచుకోలేక సతమతమవుతుంటే ఇంటిల్లిపాదీ అనే సూటిపోటి మాటలతో ఆ ఇల్లాళ్లకు ప్రత్యక్ష నరకంగా ఉంటుంది. భర్త గారేమైనా కాస్త సపోర్ట్ చేస్తారేమో అని ఆశ పడితే ఆ మహానుభావుడు ఆ చుట్టుపక్కల ఎక్కడా లేకుండా మాయం.

అదేం చిత్రమో! ఏ వస్తువు మీద విసుగు వచ్చి పడేస్తామో మర్నాడు పొద్దున్నే దాని అవసరం వచ్చేస్తుంది. అవి కూడా పగబట్టేస్తాయి. వాటితో అవసరం వచ్చేట్టుగా శాపం పెడతాయి. పిల్లలు మాత్రం వాళ్ళు కొనుక్కున్న డ్రెస్సులు, వాళ్ళ ఫ్యాన్సీ సరదాలతో ఇల్లంతా నింపుతుంటారు. ఆడపిల్లలు “మా అమ్మకి వాళ్ళమ్మ, వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిన గిన్నెలు కూడా ఉన్నాయి మా ఇంట్లో” అంటూ స్నేహితులతో చెబుతూ గేలి చేస్తూ ఉంటారు. మనం మౌనం వహించాల్సిందే! డిఫెండ్ చేసుకునే ఓపిక కూడా నశించి.

ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటిలో ఎన్నో లోపాలున్నాయనీ, అవి లేకుండా ఉండే కొత్త ఇంటిని ఆశగా వెతుక్కుంటాం! తీరా ఇల్లు ఖాళీ చేసి వెళ్లేటప్పుడు ఎంత దుఃఖం వస్తుందో! ఆ ఇంటిలోని గోడలన్నీ మనం వెళ్ళిపోతుంటే బావురుమన్నట్టనిపిస్తాయి. ఎన్నడూ పలకరించని ఇరుగూ పొరుగు వాళ్ళు కూడా “అయ్యో వెళ్లిపోతున్నారా!” అనగానే మనకి దుఃఖం ముంచుకొస్తుంది. అంతేనా! ఆ ఇంటి చుట్టూ ఉన్న రోడ్లు, గల్లీలు, కిరాణా షాపులు, బ్యూటీ పార్లర్, టైలర్ షాపు, ఫాన్సీషాపు, అమ్మాయి అత్తగారింటికి వెళ్లేప్పుడు బాధపడినట్టుగా (అవి కాదు) మనకనిపిస్తాయి. ఏడుపు మొహంతో పాల ప్యాకెట్లు ఇచ్చే వాడినీ, తన ఆస్తంతా మనకి రాసేస్తున్నట్టుగా మొహం ముటముట లాడించుకునే ఇస్త్రీ చేసే వాడినీ మనం మిస్ అయిపోతున్నాం కదా అనిపిస్తుంది. మనం కారెక్కాక, వెనక లారీ సామానుతో బయలుదేరుతుంది. మనకి మనసు భారం, లారీకి సామాను భారం.

మన భావజాలానికి తెలుగు భాష సరిపోక “ఛోడాయే.. హమ్ ఓ గలియా” అని హిందీలో కూడా భోరుమంటాం ఆ ప్రదేశాన్ని వదిలి వెళుతూ. అన్నీ భలే బాగా ఉన్నాయని మురిసిపోయి తీసుకున్న కొత్త ఇంట్లో వారం తిరగ్గానే అన్ని లోటుపాట్లే కనబడతాయి. ఖాళీ చేసి వచ్చిన ఇంట్లో ప్లస్ పాయింట్లన్నీ 10 రెట్లుగా గుర్తొచ్చి కడుపులో దుఃఖం పెల్లుబుకుతుంది. ఇవన్నీ ప్రసూతి వైరాగ్యంలా అప్పటికప్పుడు కలిగిన తాత్కాలిక పైత్యాలే కానీ శాశ్వతంగా నిలిచి ఉండేవి కావు. మన సాధారణ బ్రతుకులోని వేగం ఇలాంటి వాటినన్నిటినీ అధిగమించేట్టు చేస్తుంది. పాత ఇంటి పరిసరాలు మనకి 70 ఎం.ఎం.లో కనబడి మొదట్లో కొన్ని రాత్రులు నిద్రకి దూరం చేస్తాయి. క్రమంగా ఆ సీన్లు లాంగ్ షాట్ లోకి వెళ్లిపోతాయి. ఇటువంటి మరపుశక్తి మనకి దీవెనయే కదా! అదృష్టం బావుండి మనకి ఆ ఇల్లు వదిలి మరో కొత్త ఇంటికి వెళ్లే అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఇదే ఎమోషనల్ డ్రామా! హిస్టరీ రిపీట్స్! అంతే!

ఇల్లు మారినప్పుడు ఇరుగమ్మ, పొరుగమ్మ కొత్తవారు వస్తారు. వారితో స్నేహం మెల్లగా కొత్త మల్లె మొక్కను నాటి దాన్ని బతికించి ఆపై పందిరేసినట్టు దాన్ని జాగ్రత్తగా పెంచుకోవాలి. అలాగే ఇంట్లో సహాయకులుగా కొత్తవారిని వెతుక్కోవాలి. వారితో పని చేయించుకోవడం కోసం మనం మళ్లీ కొత్త కొత్త థియరీలు కనిపెట్టుకొని, ఫాలో అవుతూ వారి భాషకి, భావాలకి అనుగుణంగా మసులుకోవాలి. దానికోసం కొత్తగా పెళ్లి చేసుకుని జీవిత భాగస్వామితో కలిసి జీవించడానికి అలవాటు పడినంత కష్టపడాలి. కోపతాపాలు పైకి ప్రదర్శించకుండా ఉండాలి. మన సత్ప్రవర్తన వారి ముందు నిరూపించుకోకపోతే కొత్త సహాయకులు నిలబడరు. మనం మరీ స్ట్రిక్ట్‌గా రూల్స్ మాట్లాడితే, ఆ కాలనీ మొత్తం మన పేరు మార్మోగుతుంది. అప్పుడు మన ఇంటి పని, వంట పని మనమే చేసుకుంటూ సర్వనొప్పుల తైలం ఓ డ్రమ్ముడు కొనుక్కుని రాసుకుంటూ ఉండాలి. ఇన్ని ఇక్కట్లున్నాయి కాబట్టి ఇల్లు మారడం అనేది మరీ అంత అత్యుత్సాహ పడవలసిన విషయం ఎంత మాత్రమూ కాదు! అని నా అభిప్రాయం.

మనం, సంసార గందరగోళంలో పడి చేతులూ, కాళ్ళూ కొట్టుకుంటాం గానీ, బుర్రకి మాత్రం పని చెప్పం. గమనిస్తే, జీవితం ప్రతి మలుపులోనూ ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అయితే అది ఫిజిక్స్ మాస్టారిలాగా సూత్రాల రూపంలో చెప్పి వెళ్ళిపోతుంది గానీ తెలుగు మాస్టారిలాగా ప్రతి పదార్థాలు వివరిస్తూ విపులంగా చెప్పదు. ఎప్పుడో ఫ్యామిలీ అంతా హిల్ స్టేషన్‌కి వెళ్ళినప్పుడు, అందరూ ఒక పని మీద బయటికి వెళ్తూ, మనల్ని మాత్రం గెస్ట్ హౌస్‌లో ఉండమన్నప్పుడు ఆ ప్రకృతి అందాల్ని ఏకాంతంగా చూస్తూ పరవశించిపోతాం. అలా చాలా సేపు ఒంటరిగా తిరిగి,తిరిగి ఆనందించాక అక్కడున్న కుర్చీలో ఆసీనులమవుతాం.

అప్పుడు అరమోడ్పుకనులతో మన జీవన ప్రస్థానం గురించి ఒక రౌండప్ వేసుకున్నప్పుడు, ఇల్లు మారడం అనేది కూడా ఒక శిక్షణే సుమా! అనిపిస్తుంది. అది మనం నివసించే ఇంటిమీదా, చుట్టూ ఉండే పరిసరాల మీదా, చుట్టూ ఉన్న మనుషుల మీదా ఉండే వ్యామోహాన్ని వదులుకోమనీ, కాసింత వైరాగ్యం పెంచుకోమనీ, అసలీ మానవ జన్మే అద్దె ఇల్లులాంటిదనీ మనకి హితబోధ కావచ్చు కదా! కాదా!!

Exit mobile version