Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అగమ్యం

[‘అగమ్యం’ అనే అనువాద కథని అందిస్తున్నారు రంగనాథ రామచంద్రరావు. కన్నడ మూలం – డా. సిద్ధలింగ పట్టణశెట్టి.]

‘దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా మా ఊరికి మాత్రం దాని ఫలితం దొరకలేదు. ఏమి ఊరు? ఏమి జనం? మిగిలిపోతుంది కదా’ అని మల్లేశి తనలో తాను అనుకున్నాడు. అతని స్వరములో విషాదం ఉంది, వ్యంగ్యం ఉంది.

అనేక చోట్ల తిరిగి, దేశాన్ని చూసిన మల్లేశికి తన ఊరు పరాయి దేశంగా అనిపించింది. ‘15 ఏళ్ల క్రితం నేను ఊరు వదిలేసి వెళ్ళినప్పుడు ఈ రోడ్డు ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉంది.. ఛ’ మల్లేశి కుడికాలు బెణికినట్లయింది,

భుజం మీద పెద్ద కాన్వాస్‌ బ్యాగు మోసుకొని, ఊరి అడ్డదారి గురించే ఆలోచిస్తూ, కింది గుంతలు, చిన్న తగ్గులు, వాహనాల చక్రాల వల్ల కోతలకు లోనై ఏర్పడిన జాడలను చూడనే లేదు. బ్యాగు దింపి పక్కనున్న ఈత చెట్టు కింద కూర్చున్నాడు. పైన దృష్టి సారించాడు. గుత్తుల కొద్ది పళ్ళు.

‘ఈ ఈత పళ్ళు తింటే కలిగేటటువంటి సంతృప్తి వేరే ఏ పండు తిన్నా కలగదు.’ మల్లేశికి పాత రోజులు గుర్తుకొచ్చాయి. పొలం గట్టుమీద, వాగు ఒడ్డున పెరిగిన ఈత చెట్లు అతని ఆకలిని ఎన్నో సంవత్సరాలు చల్లబరిచాయి. ఖర్జూరాలు, ద్రాక్షల రుచి అతనికి తెలిసింది ఈ మధ్యనే, అది కూడా మిలిటరీలో చేరిన తర్వాత. లేచి నిలుచుని గురిపెట్టి ఒక పళ్ళ గుత్తికి రాళ్ళు విసిరాడు. టపటపమని పళ్ళు రాలాయి. వాటిని తింటూ ఉండగా చప్పున ఎవరో నవ్వినట్టు అనిపించింది. తిరిగి చూశాడు. లేదు, ఎవరూ లేరు. అది తన భ్రమ అనిపించింది.

మరో పండు నోట పెట్టుకుంటుండగా మట్టి గాజుల గలగల సద్దు. మళ్ళీ తిరిగి చూశాడు. అక్కడ చుట్టుపక్కల వేరే చెట్లు కూడా లేవు. ఈ మైదానంలో ఎవరుండొచ్చు అని ఆలోచిస్తూనే అతని అర్థం అయింది. ఇది కేవలం జ్ఞాపకం. అతన్ని అప్పుడప్పుడు ఉద్రేకపరిచి, గిలిగింతలు పెట్టినట్టు వేధించే జ్ఞాపకాలలో ఇది కూడా ఒకటి.

సుమారు 16-17 సంవత్సరాల క్రితం వాగు ఒడ్డున ఈత చెట్టు కింద కూర్చొని, తాను పళ్ళ గుత్తిని ఎదుట పెట్టుకుని తింటూ మైమరిచినప్పుడు యజమాని కూతురు కిలకిల నవ్వింది. అప్పటినుంచి ఆమె నవ్వు అతని మనసులో ఇప్పటికీ మాయకుండా తాజాగా ఉంది. ఈరోజు ఊరు వైపు బయలుదేరినప్పుడు కమలమ్మ జ్ఞాపకం మొత్తం ఊరుగా మారి అతనిని ఆవరించింది. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎక్కడ ఉండొచ్చు? ధని ఇంట్లో గత రెండు సంవత్సరాలు తన జీవితంలో అమూల్యమైనవని అనిపించింది.

రాలిన ఈతపళ్ళు ఏరుకొని, షర్టు జేబులో వేసుకొని లేచి నిలుచున్నాడు. బ్యాగ్‌ భుజానికి తగిలించుకున్నాడు. మీసాలు పురి తిప్పుకున్నాడు. ఇది మీసాలు వదిలిన తర్వాత ఈ మధ్య వచ్చిన అలవాటు. మీసాల వల్ల తన మారిన వ్యక్తిత్వం గుర్తొచ్చి చిన్నగా నవ్వుకున్నాడు.

ఎండ తగ్గుముఖం పట్టింది. నెమ్మదిగా బయలుదేరాడు. సాయంత్రం సమయం. తన ఊరువైపు, ఇలా ఈత పళ్ళు తింటూ నడవడం అంటే కమలమ్మ మొదటిసారి, చొప్పదంటు వాము వెనుక, కందిపొట్టు చిన్న వాము సందులో, తన బుగ్గలను గబగబా నాకి, కొరికి, పారిపోయినట్టు. ఛ, ఇవన్నీ ఎలాంటి జ్ఞాపకాలు.. ఈరోజు నాకేమైంది? నేనెక్కడ? ధనిగారి కూతురు ఎక్కడ? నాలాంటి వాడు ఇలాంటి జ్ఞాపకాలను తలుచుకోవటం కూడా సరికాదు. అయితే జ్ఞాపకం మధురంగా, రుచికరంగా మాగిన పళ్ళ మాదిరిలా ఉంటుంది.

ఆ రోజు సజ్జె, జొన్న కంకులు నరికిన తర్వాత మిగిలిన చొప్పదంట్లను పశువులకు వేశాడు. దున్నే పశువులకు కందిపొట్టు తీసుకొని రావాలని బుట్ట పట్టుకొని అటువైపు వెళ్ళాడు. గోచిపోసుకుని, వెడల్పు చేతుల అంగీ తోడుకున్న తనను వెనకనుంచి ఎవరో గట్టిగా అదుముకున్నట్టు అనిపించింది. బుట్టను విసిరి వెనుతిరగాలని అనుకున్నప్పుడు తూలిపోయి, కింద పరిచిన పొట్టు మీద జారిపడ్డాను. కమలమ్మ వెంటనే కౌగిలించుకొని, నుదురు, బుగ్గలు, పెదవులు, తిన్న తర్వాత కంచాన్ని నాకుతున్నట్టు నాకి పారిపోయింది. తన నోటి నుంచి మాటలే వెలువడలేదు. ఆరోజు రాత్రి తనకు రొట్టె, కూరతో పాటు అన్నం, మీగడ పెరుగు వడ్డించింది. భయపడుతూ, వణుకుతూ తింటున్న తనను కమలమ్మ స్తంభం చాటున నిలబడి చూస్తోంది. ఒకసారి మాత్రం తాను తలెత్తి అటువైపు చూశాడు. ఆమె లోపలికి పారిపోయి లోటాలో నీళ్ళు తెచ్చిచ్చింది. ఇద్దరి నోళ్ళూ కుట్టిపడేసినట్లున్నాయి.

ఆలోచిస్తున్న మల్లేశికి తల వేడెక్కినట్టు అనిపించింది. ఒకసారి వేగంగా తల విదిలించాడు. మెడ, చెంపలు, తలకు ఇప్పటికీ పొట్టు అంటుకున్నట్టుగా అనిపించింది. తుడుచుకున్నాడు. మెల్లగా పెదవులపై పెదవితో రాసుకుంది.

భుజం మీద బ్యాగు మోసుకొని, మిల్ట్రీ యూనిఫాం తొడుక్కొని, పెద్ద పెద్ద బూటు కాళ్లు ఎత్తి ఎత్తి వేస్తూ నెమ్మదిగా నడిచి వస్తున్న మల్లేశిని ఊరి ముందరి వాగు జలజలమని ప్రవహిస్తూ స్వాగతం పలికింది. ఈ వాగు పట్ల అతనికి చాలా అభిమానం. అందులో అతను స్నానం చేశాడు, ఈత నేర్చుకున్నాడు, దాహం తీర్చుకున్నాడు, కావలసినంత సంతృప్తి పొందాడు.

సంతోషంతో భావ పరవశుడిలా, భుజం నుంచి బ్యాగ్‌ దించి, ఎడమ చేతిలో పట్టుకుని, ప్రవహించే వాగుకు సెల్యూట్‌ చేశాడు. బ్యాగ్‌ అక్కడే పెట్టి, ‘లెఫ్ట్‌ రైట్‌ లెఫ్ట్‌ రైట్‌’ అంటూ ఎనిమిది, పది అడుగులు వాగు ఒడ్డు వరకు వెళ్ళాడు. వంగి నిలుచొని రెండు చేతులు జోడిరచి నమస్కరించాడు. దోసిట్లో నీళ్లు తీసుకుని ముఖానికి చిలుకరించుకున్నాడు. పదేపదే అలా చేసి వేళ్ళ సందుల్లోంచి కొన్ని నీటి బిందువులను తర్పణం వదిలే వాడిలా నోట వేసుకున్నాడు.

తర్వాత హఠాత్తుగా బిగుసుకుని పోయి లేచి నిలుచున్నాడు. ‘అబౌట్‌ టర్న్‌’ అంటూ వెనుతిరిగాడు. బ్యాగ్‌ ఉన్న స్థలం వరకు లెఫ్ట్‌ రైట్‌ అంటూ వచ్చాడు. మళ్ళీ ఒడ్డు వరకు వెళ్ళాడు. ఇలా ఐదు ఆరుసార్లు చేస్తూ చివరికి బ్యాగ్‌ తీసుకోబోతున్నాడు. అయితే వాగు వైపు నుంచి కిలకిలమని నవ్వు వినిపించింది.

మల్లేశి బ్యాగ్‌ వదిలి, ఉలిక్కిపడి, గబుక్కున తిరిగి నిలుచున్నాడు. ఈ ఎదురుచూడని చప్పుడుకు ఎలాంటి ప్రతిస్పందన చూపించాలో అతనికి స్ఫురించలేదు. గతంలో, దారిలో ఈత చెట్టు కింద కూర్చున్నప్పుడు ప్రతిధ్వనించిన జ్ఞాపకంలా ఇది కూడా భ్రమ అయివుండొచ్చా అనుకుంటూ, ఒడ్డు మీదున్నఈత చెట్లను ఒకే క్షణంలో తనిఖీ చేస్తున్నవాడిలా చూశాడు. లేదు. అక్కడ ఎవరూ లేరు. అవును. ఇది భ్రమనే. కమలమ్మ జ్ఞాపకం ఇలా చేసిందని అనుకుంటూ సంతృప్తి చెందిన వాడిలా, బ్యాగును భుజానికి తగిలించుకొని వాగు వైపు నడిచాడు.

అబ్బా, బూట్లు వేసుకుని వాగును దాటడం ఎలా? ఈ మాత్రం నాకు స్ఫురించలేదు కదా? ఈరోజు ఒక విధంగా అవుతుంది. ఒక్కక్షణం ఒడ్డు వరకు వచ్చినవాడు, నుదుటికి చెయ్యి పెట్టుకుని కూర్చున్నాడు. బూట్లు వదిలి, కుడి చేత్తో పట్టుకుని, ఇక, అడుగు పెట్టబోతున్నాడు. హఠాత్తుగా అదే నవ్వు. మల్లేశి బెదిరాడు. ముఖం పైకి ఎత్తాడు. ఊరి వైపు, నది ఒడ్డు వైపు, ఎడమవైపు కొంచెం నీళ్ళు

ఉన్నచోట అడుగు వేశాడు. బట్టలుతికే రాతిబండ దగ్గర, చేతులు బట్టలు పట్టుకొని నిలుచున్న ఒక అమ్మాయి కంటపడిరది.

మల్లేశి దిగ్భ్రాంతి చెందాడు. గుండె దడ దడ కొట్టుకోసాగింది. అస్సాం- త్రిపుర సరిహద్దుల్లో శత్రువుల ఎదురు తుపాకులు యుద్ధంలో ముఖాముఖి నిలుచున్నప్పుడు ఇలా అనిపించలేదు. దాదాపు 13- 14 సంవత్సరాల ఈ అమ్మాయి ఎవరై ఉండొచ్చు? ఈమెను చూస్తే ఎందుకు భయం కలగాలి? అప్పుడు నవ్వింది ఈమేనా? మొదట ఈత చెట్టు కింద నవ్వింది ఈమేనా? మల్లేశి ఆలోచనలో మునిగిపోయాడు. విప్పారిన కళ్ళతో ఆమెనే తదేకంగా చూస్తూ నిలుచున్నాడు.

అతని యూనిఫాం, మీసాలు, చేతిలో వేలాడుతున్న బూట్ల కన్నా అతని మౌనం, అలాగే ఆశ్చర్యపోతున్న కళ్ళకు బెదిరిన అమ్మాయి గబగబా తన బట్టలను బుట్టలో వేసుకోవడం మొదలుపెట్టింది. ఒడ్డుకు వచ్చిన ఆమె నడుముకు కట్టుకున్న పరికిణిని విప్పి వేలాడదీసింది. ఆమె బుట్ట ఎత్తుకోవాలనుకున్నంతలో మల్లేశి మెలకువ వచ్చినవాడిలా వాగులోకి దిగి, ఊరి వైపు ఉన్న ఒడ్డును దాటి వచ్చాడు. అమ్మాయిని సమీపించాడు.

మసక చీకటి కమ్ముకుంటున్న సమయంలో జరిగిన ఈ ఊహించని పరిణామం వల్ల ఇద్దరూ బెదిరిపోయారు. యూనిఫామ్‌ వేసుకున్న మల్లేశి ఏకాంతంలో చేస్తున్న పెరేడ్‌ చూసి, తననే మరిచి, ఆపుకోలేక అమ్మాయి నవ్వేసింది. అయినా అమ్మాయి నవ్విండొచ్చు అని నమ్మలేని, మల్లేశి ధైర్యంతో, “ఏయ్‌ అమ్మాయి, ఎవరు నీవు?” అన్నాడు. ఇప్పుడైతే ఆ అమ్మాయికి పైప్రాణాలు పైనే పోయినట్టు అనిపించింది.

“నన్ను వదిలేయండి, ఇంకోసారి ఇలా చేయనండి?” అని అమ్మాయి నోరు విప్పి చెప్పినప్పుడు, ఆమె ఏమి చెబుతోందో అర్థం కాక, “ఏమి చేస్తున్నావ్‌?” అని కసిరేవాడిలా అడిగాడు. నవ్వింది ఆమేనని ఇప్పటికీ అతను నమ్మినట్టు లేడు.

“నేను మిమ్మల్ని చూసి నవ్వలేదండి..” అని తలమీద బుట్ట పెట్టుకుంటూ, అవకాశం దొరికితే అక్కడి నుంచి పారిపోవాలన్నట్టు ఆమె కలవరంతో మల్లేశిని చూసింది. వద్దనుకున్న భారం ఏదో తల మీద నుంచి దబ్బున్న కిందకు పడ్డట్టు అనిపించింది.

“అలాగైతే అప్పుడు నువ్వే నవ్వావు..?” అని మళ్ళీ అడిగాడు.

అమ్మాయి మౌనంగా తలూపి ఊ అంది. మళ్లీ కమలమ్మ నవ్వు మల్లేశి ఒళ్ళంతా ప్రాకింది. ఈమె కమలమ్మ, ఆమె ముందే తాను నిలబడ్డాడు అని నమ్మినట్టు, మరీ వినయంతో, “చూడండి కమలమ్మ గారు..” అన్నాడు. ఇది మంచి అవకాశం ఉన్నట్టు ఆ అమ్మాయి “నా పేరు బసవ్వ” అని బిరబిరా వెళ్ళిపోయింది.

మెడలో పాము కదిలినట్టయింది మల్లేశికి. తన ధ్వని, అర్థం, భావోద్వేగాలకు చిక్కుకొని, తన దొంగతనంలో తానే బందీ అయినట్టు, “ఏయ్‌ చెల్లమ్మ, ఎవరు నువ్వు?” అని గట్టిగా అడిగాడు. “నేను ఈ ఊరి పిల్లను కాదండి. కురువ సాతీరప్ప కూతుర్ను”. ఈ మిలిటరీ మనిషి నుంచి తప్పించుకోవాలి, జీవించాలి అనే ఆలోచనతో అమ్మాయి పారిపోయింది.

సాధారణమైన నల్లరంగులో ఉన్న బసమ్మ నవ్వు, నడక మల్లేశిని చుట్టు ముట్టాయి. కమలమ్మ ఇలాగే నవ్వేది. కమలమ్మకు ఉన్నట్టే దోసిళ్ళంత వెడల్పయిన కళ్ళు.. కంఠస్వరం కూడా అలాగే అనిపించింది.

ఇది నాకు ఎలాంటి భ్రమ! ఇంకా ఊర్లో కాలు పెట్టలేదు. ఎవరినీ చూడలేదు. ఎవరికీ నేను వస్తున్నట్టు కూడా తెలియదు – అప్పటికే నేను..

***

మల్లేశి అక్కడే, వాగు ఉన్న ఊరు వైపున్న, ఆ వాగు ఒడ్డు మీద కూర్చున్నాడు. బూట్లు వేసుకుని, బ్యాగు చేతిలో పట్టుకొని, ఊరి వైపు నడిచాడు. ఊరు వాకిలి దగ్గరే శెట్టిగారి చాయ్‌ అంగడి. శెట్టి కొడుకు మారుద్రతోపాటు ఒకటి రెండుసార్లు అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు అంగడిని ధైర్యంగానే ప్రవేశించాడు. సాయంత్రం చీకటి పడుతుంది. అంగడిలో లాంతరు వెలిగించి పైన కర్రదూలానికి తగిలించిన తీగకు కడుతున్న కట్టిన వ్యక్తి పెద్దశెట్టి కాదని నిర్ధారణ అయ్యింది. అలాంటప్పుడు ఈయన మారుద్ర శెట్టి కావచ్చు అని అనుకుంటూ ఉండగా, మారుద్ర నమస్కరించి, గల్లా పెట్టకు చేయి పెట్టి తిరిగి చూశాడు. పెద్ద మీసాల ఖాకీ దుస్తుల ఆకృతికి బెదిరి, ‘నమస్కారమండి.. అయ్యగారికి ఎవరు కావాలి” అని అన్నాడు.

మల్లేశికి స్ఫురించింది, “మీరు మారుద్ర శెట్టిగారు కదా?”

“అవును, నిజమే సార్‌.. నీకు ఎవరు కావాలి?” అని తడబడ్డాడు.

అదే సమయంలో, బయటినుంచి యలిగార అంబన్న కుతూహలంతో లోపలికి వచ్చాడు. అతను బయట దూరం నుంచే ఆగంతకుడిని గమనించాడు. మారుద్రకు అంబన్న రాకతో కొంచెం ధైర్యం వచ్చినట్టయింది. ఎవరో అధికారి తన అంగడి తనిఖీకి వచ్చాడని భావించిన మారుద్ర, “ఇక్కడ పొద్దువాలటానికి ముందే అంగడి మూసివేసే పద్ధతి ఉందండి. అందుకే దీపాలు వెలిగించి దేవుడికి నమస్కారం చేసి..” అంటూ సగానికి ఆపాడు.

మల్లేశికి తమాషాగా అనిపించింది. యలిగార అంబన్న వైపు చూస్తూ, “రా చిన్నాన్నా, రా… బాగున్నావా” అని, “మారుద్ర శెట్టిగారు నన్ను గుర్తుపట్టలేదు చూడు..” అన్నాడు.

మారుద్రకు ఊపిరి తీసుకోవడం కాస్త సులభమైంది.

“మీరు.. మ్యాగేర మల్లేశప్ప.. అవునా?” అని చాలా ఆసక్తితోనే అడిగాడు.

“అవును శెట్టిగారు, మీరే గుర్తుపట్టలేకపోతే ఎలా?”

ఇప్పుడు అంబన్న కూడా నిశ్చింతగా అడిగాడు, “మ్యాగేరి మల్లేశి..!? అరెరే.. ఎలా గుర్తుపట్టాలి తమ్ముడా? ఊరు వదిలి పోయినప్పుడు నువ్వు చిన్న పిల్లవాడివి. 10-15 సంవత్సరాల తర్వాత వచ్చావు, ఎక్కడో మిలటరీలో చేరుకున్నావు అని గాలివార్త వచ్చింది. అది ఈ రోజు నిజమైంది. నిన్ను చూసి చాలా సంతృప్తి కలిగిందప్పా.. మల్లేశి”

మారుద్రకు ఒంట్లో వణుకు తగ్గింది. చాలా ఆత్మీయంగా, దగ్గరికి వచ్చి మల్లేశి చేయి పట్టుకుని, “మల్లేశి, నువ్వు ఇలా భయపెట్టే వాడిలా డ్రెస్‌ తొడుక్కుని వస్తే దేవుడు కూడా బెదురుతాడప్పా. ఇంత పెద్ద మీసాలు పెంచావుకదా.. ఇబ్బంది కలగదా?” అన్నాడు.

మారుద్ర అమాయకంగా అడిగిన ప్రశ్న ముగ్గురిని తేలికపరిచింది. మారుద్ర స్టౌకు పుస్‌ పుస్‌మని గాలి కొట్టి చాయ్‌ వేడి చేయడానికి పెట్టాడు. ఉగ్గాని చేయడం కోసం కోసిన ఉల్లిపాయల మీద కారంపొడి వేసి, వాటి పైన ఉదయమే చేసి పెట్టిన ఇంకా మిగిలిన బజ్జీలు తెచ్చి పెట్టాడు. మల్లేశి, అంబన్నలను తినమనిచెప్పి చిన్నపిల్లవాడిలా అటు ఇటు తిరగసాగాడు.

“అది కాదు మల్లన్న, నీవు ఇలా వస్తావని ఒక మాట చెప్పి పంపకూడదా? భీమవ్వకు కూడా తెలియదప్పా..” అనే మారుద్ర 15 ఏళ్ళ అంతరాన్ని ఒక ప్రశ్నతో దాటడానికి ప్రయత్నించాడు.

“ఎలా చెప్పి పంపను? ఎవరు ముందు చెప్పాలి శెట్టిగారు? కొన్ని సంవత్సరాల నుంచి మా అమ్మకు, నేను ఎక్కడెక్కడ ఉంటున్నానో, అక్కడి నుంచి మనియార్డర్‌ చేశాను. ఆమె సంతకం పెట్టిన బొటనవేలు గుర్తు మాత్రం నాకు తిరిగి వచ్చేది. ఇది తప్ప వేరే ఎలాంటి సంపర్కమూ మిగల్లేదు” అతని మాటల్లో బాధ తొణికింది.

“అది ఎట్లా మిగులుతుందిలే మల్లేశి? ఆ నింగప్ప షావుకారు నిన్ను ఎకాయెకి సరిహద్దులు దాటించకపోతే ఇలా ఎందుకు జరిగేదో చెప్పు? చూడు తమ్ముడా, మన అదృష్టాన్ని ఎవరు లాక్కోలేరు. ‘సెటిగమ్మ’ వారి వారి నుదుట రాసిన దాన్ని తుడపడానికి సాధ్యమా?”

అంబన్న మాటలు భావోద్వేగంతో వెలువడ్డాయి. వేడి చాయ్‌ తెచ్చి ఇద్దరికీ ఇచ్చాడు. తాను ఒక కప్పు పట్టుకొని ఎదురుగా కూర్చున్నాడు. పెద్ద తత్వజ్ఞానిలా, “కాకా, దేవుడన్నవాడు ఒకడు పైన కూర్చుని అంతా చూస్తుంటాడు అన్నది నిజం చూడు. ఆ షావుకారు జీవితం ఏమైంది? ఎంత పొగరుగా తిరిగేవాడు, ఏమి కత..” అంటూ ఏదో నోటి వరకు వచ్చిన విషయాన్ని పెదవులతోనే ఆపాడు.

మల్లేశి ఆత్రుతతో “ఏమైంది యజమానికి..” అని అడిగాడు

“మా నాయన చనిపోయిన రెండు నెలలకు షావుకారు ఖూనీ జరిగింది”

“అరే పెద్ద శెట్టిగారు.. అప్పుడే పోయారా?”

“అవును. నువ్వు వెళ్లిపోయిన తర్వాత కొద్ది రోజుల వరకు పడరాని పడబాట్లు మా వెంట పడ్డాయి. అదృష్టం గట్టిగా ఉండటంతో ఏదో కడుపుకింత తిని బతికాం”

“యజమానిని ఖూనీ చేసింది ఎవరో తెలిసిందా?” మల్లేశి ప్రశ్నలో కుతూహలం, తెలివి, ఆత్రుత కలగలిశాయి.

“తెలియకుండా ఏమిటి తమ్ముడా? అతని బంధువులే ఖూనీ చేశారు. చూడు మల్లేశి, వారి పాపం పుణ్యాలు వారి చుట్టే ఉంటాయి.. అదంతా ఉండనీలే.. ఇంకా ఉంటావు కదా, రేపు అన్ని విషయాలు మాట్లాడదాం. ముందు వెళ్ళి భీమవ్వను పలకరించు. పాపం కళ్ళల్లో ప్రాణం పెట్టుకుని ఉంది ముసలిది..” అంటూ అంబన్న చాయ్‌ తాగడం పూర్తిచేసి బయటికి నడిచాడు.

మారుద్ర లేచి అంగడి తలుపు పలకలను వేయసాగాడు. మల్లేశి ఏదో అడగాలనుకున్నప్పటికీ ధైర్యం చాల్లేదేమో. నివ్వెరపోయినట్టు కళ్ళు పెద్దవి చేసి, బుడ్డి లాంతర్ను చూడసాగాడు. తలుపులు వేసి, ఒక పలకను వాలుగా చేసి లోపలికి వచ్చిన మారుద్ర, మల్లేశి దగ్గర కూర్చున్నాడు. ఇద్దరి మనుసులకు సంతోషం కలిగింది. మారుద్ర ఆత్మీయత మల్లేశికి తన తల్లిని చూసినంత సంతృప్తి కలిగింది.

“పదా మల్లేశి, మీ ఇంటికి పోదాం..”

“శెట్టిగారు, నాది ఒక విధంగా ఇది కొత్త జన్మ..” మల్లేశి కళ్ళు నీళ్లతో నిండాయి.

“ఏమైంది? ఎక్కడి నుంచి ఎక్కడికి పోయావు? తర్వాత ఏమైంది?”

“దేవుడు గొప్పవాడు శెట్టిగారు. ఎక్కడెక్కడో వెళ్ళి బతికి బయటపడ్డాను.. ఆ రోజు రాత్రి యజమాని ఎకాయెకి నన్ను ఊరు వదిలి పోయేలా చేశారు. ఆయనకు కమలమ్మ మీద అనుమానం వచ్చి ఉండాలి..”

“ఏమన్నావు..”

“శెట్టిగారు, అందులో నా తప్పేమీ లేదు.. నేనేం చేయగలను చెప్పండి? ఆమె నా యజమాని కూతురు. రోజు నాకు భోజనం పెట్టేవారు. నీళ్ళు ఇచ్చేవారు. అన్నిటికీ ఆమే పిలిచేవారు”

“అది నిజమేలే, ఆమె తల్లి మొదటి నుంచి రోగిష్టి దానిలా ఉండేది. అంతా కూతురే చూసుకుంటూ ఉండేది.. అది కాదు మల్లేశి, వయస్సులో ఆమె నీకన్నా పెద్దది కదా..?”

ఏదో లోకంలోకి జారిపోయినట్టు మౌనం వహించిన మల్లేశిని మారుద్ర ఎక్కువగా గెలకలేదు.

మల్లేశి కలవరం అతని నుదుట చెమట బిందువులుగా కనిపించాయి…

యజమానిగారు పెద్దరికాన్ని చూపిస్తూ ఊర్లు తిరిగేవారు. అతని పెద్దకొడుకు కూడా ఏమీ చేసేవాడు కాదు – జీతగాడైన తాను అన్ని బాధ్యతలు మోసుకున్నట్టు అయ్యింది. పొలానికి వెళ్ళడం, పశువులను కాయటం, వాటిని మేతకు తీసుకెళ్ళడం, పేడ తీయడం.. అన్నీ తానే చేస్తుండేవాడు. కమలమ్మగారు తన మీద మనసు పడివుండాలి.. ఆమె ప్రేమను చూపించేవారు. పొలంలో పక్కనే కూర్చుని తినిపించేవారు. చేత్తో ముద్దలు చేసి, బెల్లం-నెయ్యి కలిపి పెడుతుండేవారు. తాను పెరట్లో గడ్డివాము దగ్గరికి వెళ్ళినప్పుడు గుండెలకు తనను గట్టిగా హత్తుకునేవారు.

మల్లేశి ఒకసారి జోరుగా తల విదిలించి కన్నీళ్లు తుడుచుకున్నాడు.

మారుద్ర నెమ్మదిగా లేచి బయటికి తొంగి చూశాడు. దట్టమైన చీకటి వ్యాపించింది.

“ఈరోజు అమావాస్య మల్లేశి.. పొద్దు మునిగిన తర్వాత జనం బయటికి రారు. మీ అమ్మను పలకరించి, నేను ఇంటికి వెళతాను..” అని మారుద్ర లాంతరు వైపు వెళ్ళాడు.

మల్లేశికి తల్లి దగ్గరికి వెళ్ళాలనే తపన ఉన్నప్పటికీ, ఆమెను చూడటానికి అదో విధమైన భయం. “ఆ షావుకారు కూతురు చాలా చెడ్డ పిల్ల. నువ్వు జాగ్రత్తగా ఉండాలి మల్లన్న” అని తల్లి అప్పుడప్పుడు చెబుతూనే ఉండటం అతనికి గుర్తొచ్చింది. తల్లికి ఈ విషయపు వాసన మొదటే తగిలిందేమో అనుకున్నాడు.

లాంతరును చేతిలో పట్టుకొని, తలుపులు వేసుకుని ఇద్దరూ బయలుదేరారు. “నీ ఉద్యోగం సద్యోగం కథంతా రేపు మాట్లాడదాం” అన్నాడు మారుద్ర. భీమవ్వ ఇంటి గుమ్మంలో నిలుచొని, ఎప్పటిలాగే ఆమెను పిలిచి, లోపలికి వెళ్ళి పలకరించాడు. ఉదయం అంగడికి వచ్చేటప్పుడు, రాత్రి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మారుద్ర తప్పకుండా ఆమెను పలకరించేవాడు. ఈరోజు తన సొంత కొడుకే ఇంటికి వచ్చినా అతన్ని వెంటనే గుర్తించడం భీమవ్వకు సాధ్యం కాలేదు. కంటికి పొరలు వచ్చి కళ్ళు మసకబారిన భీమవ్వకు పొడుగ్గా పెరిగి నిలుచున్న, మీసాలు కలిగిన ఒక మగవాడి ఆకారంలో కొడుకు ఇలా వస్తాడని అనిపించనే లేదు. మల్లేశి బ్యాగును ఒక పక్కన విసిరాడు. బూట్లు విడిచాడు. తల్లి కాళ్ళు ముట్టి నమస్కరించాడు. “అమ్మ నేనేనే, నీ మల్లన్నను” అని బిగ్గరగా ఏడవసాగాడు.

కొద్దిసేపు కూర్చొని, ఇద్దరినీ ఓదార్చిన మారుద్ర “రేపు వస్తాను, మాట్లాడదాం” అని చెప్పి వెళ్ళిపోయాడు.

రొట్టె తిన్న తర్వాత మల్లేశి తన బ్యాగ్‌ తెరిచాడు. తల్లి కోసం తెచ్చిన కారాల ప్యాకెట్‌, చీర, రవిక గుడ్డ, ఉన్ని స్వెటర్‌, రగ్గు మొదలైనవి చిమ్నీ దీపపు వెలుతురులో ఒక్కటొక్కటిగా చూపించాడు. తల్లి బోసి నోటితో కారాలు నములుతూ, “మీ నాయన బతికివుంటే నువ్వు షావుకారు ఇంట్లో జీతగాడిగా పనిచేసేవాడివి కాదు. ఆ వెధవ నిన్ను ఊరు వదిలించే సందర్భం వచ్చేది కాదు”

“అదంతా ఎందుకు ఎత్తుతావు.. వదిలేయ్‌” అని ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు మల్లేశి.

“అది కాదురా మల్లన్నా. ఆ కమలి నీవల్ల కడుపు తెచ్చుకుందేమిరా?” అన్న భీమవ్వ ప్రశ్న చాలా కాలంగా అదిమిపెట్టిన జ్వాలాముఖిలా పేలింది.

“ఇప్పుడు ఊరికే పడుకోవే. రేపు మాట్లాడదాం. నాలుగు రోజులు రైలు బండిలో కూర్చుని అలిసిపోయి వచ్చాను. రెండు రోజులుండి మళ్ళీ నేను వెళతాను. నేను చాలా బతిమిలాడిన తర్వాత పది రోజులు సెలవులు దొరికాయి”

భీమవ్వ తలలో ఈ మాటలేవీ దూరనే లేదు. అసంతృప్తి చెందినట్టు కొడుకు ఊరు వదిలిన తర్వాత జరిగిన అనేక విషయాలను చెప్పడం మొదలుపెట్టింది..

షావుకారు లింగప్పకు తన కూతురు గర్భవతి కావడం తెలియగానే ఆమెను బెదిరించి, వివరాలు తెలుసుకున్నాడు. జీతగాడు మల్లేశితో ఆమె సంబంధం పెట్టుకుందని తెలిసిన తర్వాత, అదే రాత్రి పైల్వాన్‌ గంగప్పతో కలిసి ఏదో చేసి మల్లేశిని ఎక్కడికో పంపేశాడు. ఆ తర్వాత హడావుడిగా కూతుర్ని కురువగట్టి సన్నీరప్ప కొడుకుకు దడెం బంగారం ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళయిన కొద్ది రోజులకే విషయం తెలిసిన సాతీరప్ప, భార్య నుంచి విడిపోతానని చెప్పి పుట్టింటికి పంపాడు. దీన్ని తన అవమానంగా భావించిన లింగప్ప సాతీరప్పను పిలిపించి స్తంభానికి కట్టించి కొట్టించాడు. బెదిరించాడు. బంగారం లాక్కున్నాడు..

తర్వాత పొలాల కట్ట తెంచిన రోజున లింగప్ప పొలంలోనే సాతీరప్ప అతన్ని ఖూనీ చేశాడు. ఇప్పుడు సాతీరప్ప జైల్లో ఉన్నాడు. కమలమ్మ పెళ్ళయిన నాలుగు నెలలకు పుట్టింట్లో ఆడపిల్లను ప్రసవించింది. ఆ వంశమే అభివృద్ధిలోకి రాలేదు. షావుకారు భార్య చనిపోయింది. తెలివి లేని కొడుకు ఉన్న ఆస్తిని అమ్ముకొని కిందిగేరిలో తన భార్య ఇంట్లో ఉంటున్నాడు. కమలమ్మ తన కూతురు బసమ్మతో ఇదే ఊర్లో కూలీనాలీ చేసుకుంటూ పొట్ట నింపుకుంటోంది..

“అలాగైతే ఈరోజు పొద్దువాలడానికి ముందు వాగు దగ్గర నేను చూసిన అమ్మాయి..?” మల్లేశి తనను తానే ప్రశ్నించుకున్నాడు.

“నువ్వు ఆ పిల్లను చూశావా?”

“ఊఁ..”

“ఆ పిల్ల కళ్ళు, ముక్కు, ముఖం నీలాగే ఉన్నాయి కదారా మల్యా.. దాన్ని ఒకసారి చూసినప్పుడు కళ్ళు చెదిరిపోయినట్టు అయ్యింది..”

మల్లేశి తల్లిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.

కన్నడ మూలం: డా. సిద్ధలింగ పట్టణశెట్టి

అనువాదం : రంగనాథ రామచంద్రరావు

Exit mobile version