Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఈస్తటిక్స్ – ఎనస్తిటిక్స్

[శ్రీ అవధానుల మణిబాబు రచించిన ‘ఈస్తటిక్స్ – ఎనస్తిటిక్స్’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

రాత్రి రెండో ఝాములో
సగం జగతి జోగుతూ ఉన్నపుడు..
“ఇక ఆశ లేదని” చెప్పాల్సిన సన్నివేశానికి
సంభాషణలు సమకూర్చుకుంటూనో;
రేపటి శుభోదయాన శస్త్రచికిత్సకు
సమన్వయం చేసుకుంటూనో..
నగరంలో కొన్ని గదులింకా మెలకువగానే ఉంటాయ్.

లేవాలంటే పడుకోక తప్పదని గుర్తొచ్చి
ఆలోచనలను బయటకు నెట్టి
నిద్రని లోనికి ఆహ్వానిస్తారు.

సైలెంట్లో ఉంచినా ఫోన్ వెలగడం మరచిపోదు.
అల్ప్రేజొలాం ఓడిపోవడానికి ఆమాత్రం అలజడి చాలు.
మళ్ళీ మొదలు..
సలహాలో, సూచనలో, మందులో, మందలింపులో పూర్తై
మరోసారి ప్రయత్నం.
ఎపుడుకావస్తే అపుడు రిజూమ్ చెయ్యడానికి
నిద్ర ఓ.టి.టి లో సినిమాకాదు.

ఒక్క నిద్రన్నమాటేమిటి
వీళ్ళకు ఏదీ గ్రాంటెడ్ కాదు.
వీలైనవేవో, వీలున్నప్పుడు, వీలున్నంత సేపు.

ఐనా, మనుషుల నుంచి మినహాయించేశాక,
వీళ్ళు సహజాతాలు కోల్పోతున్నామనో
ఉద్వేగాలను పంచుకుంటామనో
అనడం మానేశారు.

***

మరి,
ఇంతగా తీరికలేనప్పుడు
ఇంతలేసి ఎలా రాస్తారు?

రచనకు మూల ధాతువులన్నీ
మస్తిష్కంలో కదలాడుతుంటే
‘స్కాల్ పెల్’ ఖాళీ చేసిన తక్షణం
వేళ్ళఖాళీలో కలం చేరిపోతుంది.
ఆ కాస్త విరామంలో
ప్రిస్క్రిప్షన్ పాడ్ లో ఓ కాగితం
పేషెంట్లకు బదులు పాఠకులకు ఖర్చవుతుంది.

ఐనా,
కనిపించే గాయం వెనుక కనబడని దాష్టీకాన్ని
లొంగని వ్యాధి వెనుక కుంగిన హృదయాన్ని
చదవడం నేర్చిన వీళ్ళకి రాయడమేమెంత కష్టం?

కళ్ళలో చెమరింత తీవ్రతను బట్టి
బాధను తర్జుమా చేసుకోగలిగిన వారికి
ఈ అనువాదాలు ఏమంత అసాధ్యం?

మనుషి బతుకులో వేదనంతా కేస్ షీట్లలో నింపిన వాళ్లకు
వ్యవధి కుదరాలేగానీ కథావస్తువు కానిదేముంది?

రోగాలకు, మందులకు నిరంతరం అప్డేట్ అవుతున్న వారికి
కొత్త ప్రక్రియలు, వాదాలు ఆకళింపుకావంటారా?

వాళ్ళు రాస్తున్న ప్రతి మాటా చూస్తున్నదో, చేస్తున్నదో.

***

కానీ ఎందుకో
ఆ చేతలకు కృతజ్ఞతలో
ఆ రాతలకు అభినందనలో
తెలపాలని
ఎదురుపడ్డప్పుడు
మనలో ఎవ్వరికీ తోచదు.

వందల జనాల మధ్య
వారిని ఉత్సాహపరిచే ఓ పలకరింత దొరకదు.
వేల సంభాషణల్లో తమ ‘సలుపు’ గురించి తప్ప
‘గెలుపు’ పంచుకునేవారుండరు.

ఐనా,
ఎనస్తిటిక్స్ తో దశాబ్దాల సహవాసంకదా!
మనం స్పందించలేదని నిందిస్తూ కూర్చోరు.

ఔషధాలను మౌనంగా సెలైన్ లో అడ్మిక్స్ చేసినట్లు
అనుభవసారాన్ని
సుషిప్త సమాజ దేహంలోకి
బొట్టు బొట్టుగా చేర్చుతుంటారు.

***

మనం హాయిగా ఉన్న ఏనాడూ వీళ్ళని తలచుకుంటే ఒట్టు.
వీళ్ళూ దేవుళ్ళే అనడంలో అదీ అసలు గుట్టు.

(డా. ఆలూరి విజయలక్ష్మిగారు వైద్య, సాహిత్య రంగాలలో చేసిన సేవకు తేది: 27 జూలై, 2025న ‘ప్రభా గౌరవ పురస్కారం’ అందుకున్న సందర్భంగా ఈ రెండు రంగాలలో కృషి చేస్తున్న వారందరికీ అభినందన పూర్వకంగా..)

Exit mobile version