Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అద్వైత్ ఇండియా-43

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[అద్వైత్, ఇండియాలు రాజమండ్రి చేరుతారు. ముందుగా ఆండ్రియా స్థాపించిన ఆశ్రమం వద్ద దిగుతారు. ఇండియాను ఆశ్రమంలో వదిలి తాను ఇంటికి వెళ్ళి పరిస్థితులను చూచి, తండ్రితోను, సీతతోనూ మాట్లాడి వారి సమ్మతితో ఇండియాను ఇంటికి తీసుకెళ్ళడం మంచిదనుకుంటాడు అద్వైత్. ఇండియాని ఆశ్రమంలో దింపి, అక్కడే ఉంటున్న సుల్తాన్ భాయ్‌ని పలకరిస్తాడు. స్నానం చేసి, పలహారం తినమనీ, ఈ లోపు తాను వెళ్ళి శాస్త్రిగారికి విషయం చెప్పి, ఆయన ఎలా చెప్తే అలా నడుచుకోవచ్చనీ అంటాడు సుల్తాన్. సరేనంటాడు అద్వైత్. వారు స్నానం చేసి, టిపిన్ తింటూండగా, సన్నగా వర్షం మొదలవుతుంది. కాసేపటికి పెద్దదై, గాలివానగా మారుతుంది. సుల్తాన్ భాయ్ ఆ గాలివానలో తడుస్తూనే శాస్త్రి గారింటికి చేరి విషయం చెప్తాడు. వారు ఇక్కడికి రావటానికి భయపడ్తున్నారా అని అడుగుతుంది సీత. కాదని చెప్పి, తానే వారిని కాస్త విశ్రాంతి తీసుకోమన్నాననీ చెబుతాడు. అక్కడ ఆశ్రమంలో ఇండియా సీతకు ఉత్తరం రాస్తుంది. తనని క్షమించమని అడుగుతుంది. అశ్రమంతా తిరిగి, పిల్లలని పలకరించి లోపలికి వచ్చిన అద్వైత్‌కు ఆ ఉత్తరం ఇచ్చి, సీతకు అందజేయమని చెప్తుంది. ఎలాగూ కలవబోతున్నాం కదా, ఈ ఉత్తరమెందుకని అడిగితే, తాను అక్కడికి రాలేననీ, సీతకు తన ముఖం చూపించలేనని అంటుంది. సుల్తాన్ భాయ్ తిరిగి వస్తే, అన్ని సందేహాలు తీరుతాయనీ, భయపడవద్దని అంటాడు అద్వైత్. – ఇక చదవండి.]

అధ్యాయం 84:

తుఫాను సమయంలో చామంతికి నొప్పులు ప్రారంభం అయినాయి. ఆ నాటికి వారం రోజుల క్రిందట రెడ్డి రామిరెడ్డిగారు తనకు తిరిగి లభించిన శ్రీ మహాలక్ష్మిదేవి విగ్రహాన్ని తన ఇంట పూజా మందిరాన్ని నిర్మించి అందులో నరసింహశాస్త్రి ద్వారా ప్రతిష్ఠింప చేశారు. చామంతిని ఆ రోజున తన ఇంటి ఆడబిడ్డను సత్కరించినట్లుగా పట్టుచీర.. రవిక బంగారు గొలుసును ఇచ్చి.. సుఖప్రసవంతో పండంటి మగ బిడ్డకు తల్లివి అవుతావని ఆశీర్వదించారు రెడ్డిగారు, వారి సతీమణి.

వారి దీవెనలు.. చామంతి విషయంలో ఫలించాయి. సుఖ ప్రసవాన చామంతి మగ బిడ్డను కన్నది. మంత్రసాని బయటికి వచ్చి చెప్పిన ఆ వార్త విని.. చామంతి తల్లిదండ్రులు.. మేనమామ రంగయ్య దంపతులు.. ఇతర బంధువులు సంతసించారు.

సమయం రాత్రి ఏడు గంటల ప్రాంతం.. పంజాబ్ నుంచి వచ్చే లారీ రాజమండ్రి బస్ స్టాండ్‌లో ఆగింది. కాషాయ వస్త్రాలు, ఏపుగా పెరిగిన గడ్డం మీసాలతో ఒక వ్యక్తి లారీ నుంచి దిగాడు. వర్షం పడుతూ వుంది.. గాలి వీస్తూనే వుంది. కరెంట్ తీగలు తెగిన కారణంగా విద్యత్ సరఫరా ఆగిపోయింది. కారు చీకటి, ఉరుములు.. మెరుపులు ఆ వ్యక్తి రాబర్ట్ నిలయం చేరాడు.. అతను ఎవరో కాదు రాఘవ.. లోనికి నడిచి పరిసరాలను పరికించాడు. అతని కళ్ళకు ఎవరూ కనుపించలేదు.

తలుపును తట్టాడు. నాల్గవ పర్యాయానికి తలుపు తెరవబడింది. ఎదురుగా రాబర్ట్.. అతని వ్యతిరేక దిశలో రాఘవ.. బొడ్లో నుంచి తుపాకిని తీశాడు.

“ఇది నీ తమ్ముడి తుపాకి. ఇందులో నాలుగు గుళ్ళు నీ కోసం సంవత్సరం నుంచీ మిగిలి వున్నాయి. నన్ను పట్టుకోలేక నా బావను అండమాన్ జైలు పాలు చేసినందుకు.. మా కుటుంబీకులపై పగను పెంచుకొన్నందుకు నీకు యీ శిక్ష..” ఆవేశంగా చెప్పి తుపాకిని రెండుసార్లు అతని గుండెలకు గురి పెట్టి పేల్చాడు. రాబర్ట్ ముందుకు ఒరిగాడు. కాలితో అతన్ని బలంగా తన్ని లోనికి త్రోసి.. తలుపు మూసి బయట గడి బిగించి వేగంగా నడిచి ఆ చీకటిలో కలసిపోయాడు. లిల్లీ పరుగున హాల్లోకి వచ్చింది. రక్తపు మడుగులో చచ్చి పడి వున్న రాబర్ట్‌ను చూచి భోరున ఏడ్వసాగింది.

‘రాఘవా!.. నీ ఆశయం నెరవేరింది.. నీ శత్రువును నీవు చంపేశావు’ అనుకొని రాఘవ నవ్వుకొన్నాడు. అనాథాశ్రమం వైపుకు నడిచాడు..

అక్కడి వారంతా అతనికి పరిచయస్థులే.. వారి నుండి నరసింహశాస్త్రిగారి కుటుంబ విషయాలు.. తెలుసుకోవాలని అతని ఆశ.

ఆ సాయంత్రం నాలుగు గంటలకు సుల్తాన్.. పాండురంగలు గొడుగులు వేసికొని ఆశ్రమానికి వచ్చారు. తన తండ్రిని, సీతను, బిడ్డలను చూడాలనే ఆరాటంతో అద్వైత్.. పాండుతో కలసి తన ఇంటిని వెళ్ళాడు. ఆశ్రమంలో ఇండియా వుంది. తను సీతకు వ్రాసిన లేఖను అద్వైత్‌కు ఇచ్చి సీతకు యివ్వమంది.

ఎదురైన తండ్రి కాళ్ళ మీద వాలాడు అద్వైత్.. “నన్ను క్షమించండి నాన్నా!..” అన్నాడు.

నరసింహశాస్త్రిగారి కళ్ళల్లో కన్నీరు. అద్వైత్ భుజాలను పట్టుకొని పైకి లేపి కౌగలించుకొన్నారు.

“అంతా దైవ నిర్ణయం.. మనలనందరినీ ఆడించే విధాత శాసనం. ఆదానికి అతీతంగా ఏదీ ఎవరి విషయంలోనూ జరగదు. ఆదీ!.. నీవు క్షేమంగా తిరిగి వచ్చావు. నాకు చాలా సంతోషం నాయనా!..” పరవశంతో చెప్పారు శాస్త్రిగారు.. కొన్ని క్షణాల తర్వాత.. “ఆఁ.. ఇండియా ఎక్కడ?..” అడిగారు శాస్త్రిగారు,

“ఆశ్రమంలో వుంది నాన్నగారూ!..”.

సీత వారి ముందుకు బాబుతో వచ్చింది. అద్వైత్ ముఖంలోకి దీనంగా కన్నీటితో చూచింది.

అద్వైత్.. సీతను సమీపించాడు. తన జేబులోని ఇండియా వ్రాసిన ఉత్తరాన్ని ఆమెకు అందించాడు. సీత బాబును అతని చేతికి అందించి.. కవర్ చించి ఉత్తరాన్ని బయటికి తీసి.. చదివింది.. కన్నీటితో ఆ ఉత్తరాన్ని శాస్త్రిగారికి అందించింది.

శాస్త్రిగారు ఉత్తరాన్ని చదవడం ప్రారంభించారు.

అద్వైత్ చేతిలోని బాబును అందుకొని.. “బావా!.. మన బాబు బంగారం.. అంతా నా సోదరి ఇండియా పోలిక.. ఎంతో సహనం.. ఎంతో శాంతం..” అంది సీత,

“సీతా!..”

“చెప్పండి బావా!..”

“బాబంటే నీకు యిష్టమా!..”

“మాటలతో చెప్పలేను. నా తండ్రి బంగారు” బాబు నుదుటన ముద్దు పెట్టింది.

“మరి ఇండియా అంటే!..”

సీత నిట్టూర్చి.. “మీ విషయంలో నా మనస్సు ఎలా వుంటుందో మీకు తెలియదా బావా!..”

“నేను అడిగింది నా విషయం కాదు. ఇండియాను గురించి!..”

“ఇప్పుడు ఇండియా ఎవరు?.. యీ యింటి యజమానురాలు. నా అక్క.. మన వంశాంకురమైన యీ బాబుకు తల్లి.. ఇన్ని హోదాలు వున్న ఆమె మీద నాకు కోపం ఎలా వుంటుంది బావా!..” జాలిగా అద్వైత్ కళ్ళల్లోకి చూస్తూ అడిగింది సీత.

శాస్త్రిగారు ఉత్తరాన్ని చదవడం ముగించి సీత ముఖంలోకి చూచారు.

“అమ్మా సీతా!..”

“మామయ్యా.. మీ అబ్బాయిగారికి చెప్పండి, వెంటనే వెళ్ళి అక్కను ఇంటికి తీసుకొని రమ్మని” ఆ మాటలతో సీత అంతర్యం.. అందరికీ అర్థం అయింది.

“గాలీ వాన.. తగ్గలేదు కదమ్మా.. ఉదయాన్నే వెళతాడులే!..” అన్నారు శాస్త్రిగారు.

“బావ ఒక్కడే కాదు, మనమందరం కలసి వెళదాం. మనలనందరినీ చూచి అక్క సంతోషిస్తుంది మామయ్యా..”

“నీ యిష్ట ప్రకారమే చేస్తాము తల్లీ..” చిరునవ్వుతో చెప్పారు శాస్త్రిగారు.

అందరి ముఖాల్లో ఎంతో సంతోషం.

అక్కడ ఆశ్రమంలో..

సుల్తాన్ రాఘవకు ఎదురైనాడు.

“సుల్తాన్ భాయ్!..” నవ్వుతూ పలకరించాడు రాఘవ.

“రాఘవ బాబూ!.. ఏమిటీ విశేషం.. ఇన్నాళ్ళు ఎక్కవున్నావు?..” ఆత్రంగా అడిగాడు సుల్తాన్.

“వుండింది కాశీలో.. సాయంత్రం వచ్చాను. వాతావరణం అనుకూలించింది. అంటే నా కోర్కె సరైనదన మాట..” నవ్వి..

“భాయ్!.. రాబర్ట్‌ను పైకి పంపేశాను. మా కుటుంబ శత్రువును చంపేశాను..” కసిగా చెప్పాడు రాఘవ.

“బాబూ!..” ఆశ్చర్యపోయాడు సుల్తాన్.

“అవును సుల్తాన్ భాయ్!.. నేను చెప్పింది నిజం.. నా మీద పగతో అన్నెపున్నెం ఎరుగని నా బావను నీచాతి నీచంగా మాట్లాడి.. వారిని దోషిగా అండమాన్ జైలు పాలు చేసినందుకు వాడికా శిక్ష!..” ఆవేశంగా చెప్పాడు రాఘవ.

“ఇండియా అమ్మ ఇక్కడికి తిరిగి వచ్చింది. నేను ఆమెకు విషయాన్ని ఉత్తరంలో వ్రాశాను. అండమాన్‌కు వెళ్ళి.. ఆది బాబును తీసికొని ఆ తల్లి యిక్కడికి తిరిగి వచ్చింది. వారిద్దరికీ ఒక బాబు పుట్టాడు బాబూ!..”

“సుల్తాన్ భాయ్!.. మీరు చెప్పింది!..”

“నిజం.. రండి ఇండియా అమ్మను చూస్తురుగాని..”

ఇరువురూ ఇండియా వున్న గదిని సమీపించారు. కిటికీ గుండా వారిని చూచిన ఇండియా వారికి ఎదురయింది. రాఘవ తీరును చూచి ఆశ్చర్యంతో అతని ముఖంలోకి చూచింది.

“అమ్మా ఇండియా!.. నేను రాఘవనూ!..”

“అన్నయ్యా!..” సమీపించి అతని చేతులను పట్టుకొంది ప్రీతిగా.

“నేను మరో నేరాన్ని చేశాను..”

“ఏమిటది?..”

“మీ నాన్న.. కాదు..” తల ఆడించి.. “రాబర్ట్‌ను చంపేశాను” అన్నాడు రాఘవ నిశ్చలంగా.

ఇండియా ఆశ్చర్యపోయింది. కొన్ని క్షణాల తర్వాత.. “చాలా మంచి పనిని చేశావన్నయ్యా!.. నీవు చంపింది. మనిషిని కాదు రాక్షసుణ్ణి..” అంది ఇండియా.

వర్షం.. హోరుగాలి ఆగలేదు.. ఆ రాత్రి భోజనానంతరం.. ఇండియా మౌనంగా తన గదికి వెళ్ళిపోయింది. అక్కడ.. నరసింహశాస్త్రిగారి ఇంట్లో..

భోజనానంతరం.. సీత తన నిర్ణయాన్ని మార్చుకొని వెంటనే ఇండియాను చూడాలని పట్టు పట్టింది.

ప్రక్క వీధిలో వున్న టాక్సీ సుందరం ఇంటికి వెళ్ళి అద్వైత్ టాక్సీతో వచ్చాడు. నరసింహశాస్త్రి.. సీత.. పాప.. బాబు.. అద్వైత్‌లు టాక్సీలో ఆశ్రమానికి బయలుదేరారు.

సుల్తాన్ కొడుకు ఆ టాక్సీని చూచాడు. వాడు తన బృందం నలుగురితో కలిసి ఆ టాక్సీని ఫాలో చేశాడు. అద్వైత్ టాక్సీ ఆశ్రమంలో ప్రవేశించింది. సుల్తాన్ కొడుకు అంజాద్.. టాక్సీని వంద అడుగుల దూరంలో

ఆపాడు. దిగాడు.

ఆశ్రమంలో ప్రవేశించగానే.. అద్వైత్ ఇండియా గదిని సమీపించి..

“ఇండియా!.. నీకోసం.. నాన్నా.. సీత.. పాప.. బాబు వచ్చారు. తలుపు తెరూ!..” బిగ్గరగా ఆనందంగా అరిచాడు అద్వైత్.

ప్రక్క గదిలో వున్న సుల్తాన్.. రాఘవ ఉలిక్కిపడి లేచి బయటికి చ్చారు. ఆనందంతో వారిని సమీపించారు. ఇండియా తన గది నుంచి వచ్చి వారిని చూచింది. రాఘవ ఆనందంగా అద్వైత్‌ను కౌగలించుకొని.. “బావా!.. నా అమాయకులైన నా తల్లిదండ్రులను కాల్చి చంపిన.. పాపం చిన్న పిల్ల, గంటన్న కూతురు జాబిలిని చెరచి.. చంపిన, రిచ్చర్డ్‌ను చంపేశాను. మన కుటుంబ శత్రువు.. రాబర్ట్‌ను పైకి పంపేశాను. నీకు.. మన వారికి ఇక శత్రువులంటూ ఎవరూ లేరు!..” ఆనందంగా చెప్పాడు.

అద్వైత్ ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు.

సీత ఇండియాను చూచి.. వేగంగా వెళ్ళి ఇండియాను కౌగలించుకొంది.. “ఇండియా!.. నీ మూలంగానే బావ మనకు దక్కాడు. నీ మీద నాకు కోపం లేదు. మాటలతో చెప్పలేనంత ప్రేమ వుంది..” చెప్పింది సీత. జరుగుతున్న సన్నివేశాలను సుల్తాన్.. నరసింహశాస్త్రిగారు ఆశ్చర్యంతో చూస్తున్నారు.

అంజాద్.. వాచ్‌మన్‌ను సమీపించి అతనికి అనుమానం కలగని రీతిలో తాను సుల్తాన్ కొడుకునని చెప్పి లోన ఎవరెవరున్నదీ తెలుసుకొన్నాడు.

సీటీ కొట్టి తన అనుచరులను తన వద్దకు వచ్చేలా చేశాడు. ఆ ఐదుగురినీ చూచి.. అనుమానంతో వారిని లోనికి పోనివ్వక అడ్డగించిన వాచ్‌మన్‌ను ఎడాపెడా కొట్టి నేల కూలదోశాడు అంజాద్.

తనతో వచ్చిన నలుగురితో ఆశ్రమంలోకి ప్రవేశించాడు అంజాద్.

అక్కడ.. అందరూ ఆనందంగా కలిసిపోయి చిన్న బిడ్డలను చూచి నవ్వుకొంటున్నారు. కానీ.. రాఘవ కళ్ళు పరిసరాలను పరిశీలిస్తున్నాయి. అద్వైత్ ముఖంలో ఆనందం లేదు.. రాఘవ చేసిన పనికి విచారం.

నరసింహశాస్త్రి తన మనవడు.. మనుమరాలు కోడళ్ళు మధ్యన ఎంతో ఆనందంగా వున్నారు.

అంజాద్ తన ముగ్గురు అనుచరులతో వారున్న హాల్లోకి ప్రవేశించాడు. ముందుగా అతన్ని చూచిన రాఘవ అద్వైత్‌ను సుల్తాన్‌ను ప్రక్కకు నెట్టి తన తుపాకితో అంజా‍ద్‌ని కాల్చాడు. అతను ప్రక్కకు తప్పుకోగా.. గురి తప్పింది. వెంటనే అంజాద్ తుపాకితో రాఘవను కాల్చాడు. గుండు అతని గుండెకు తగిలింది. రాఘవ నేలకు ఒరిగే సమయంలో అద్వైత్.. “రాఘవా!..” అంటూ అతన్ని పట్టుకొన్నాడు.

గుండు శబ్దం విన్న ఇండియా వేగంగా గది నుండి పరుగున బయటికి వచ్చింది.

రాఘవను సుల్తాన్‌కు అందించి అద్వైత్ లేచి నిలబడ్డాడు..

“అంజాద్!.. నీవు చేస్తున్న పని మంచిది కాదు.. నీవు నేరస్థుడవౌతావ్!..” అరిచాడు అద్వైత్ .

ఇండియా అద్వైత్ ప్రక్కకు చేరింది. అంజాద్ అద్వైత్‌ని కాల్చాలని పేల్చిన రెండవ కాల్పు తూటా ఇండియా గుండెల్లో గుచ్చుకొంది.

‘అమ్మా’ అంటూ ఇండియా నేలకు ఒరిగింది.

నరసింహశాస్త్రి సీత.. రెండవ కాల్పు శబ్దం, ఇండియా అరచిన అమ్మా అనే అరుపును విని గది నుంచి బయటికి పరుగెత్తారు. వయస్సు మీరిన సుల్తాన్ కళ్ళకు ఆ రక్తపాతాన్ని చూచి బయర్లు కమ్మాయి. సీతా.. నరసింహశాస్త్రి.. అద్వైత్‌లు.. రాఘవ.. ఇండియాల ప్రక్కన చేరారు కన్నీటితో. అంజాద్ అతని బృందం పారిపోయారు.

ఆ యిరువురికీ అంజాద్ కాల్చిన కాల్పులు గుండెలో దిగినందున

“బావా!.. మరణం ప్రతి ఒక్కరికీ ఒకనాడు ఖాయం.. నా మరణం.. నాకు ఎంతో ఆనందం బావా!.. ఏ.. డ..వ..కు” రాఘవ జ్యోతి తనువు నుండి లేచిపోయింది.

అంతిమ క్షణాల్లో ఇండియా.. “ఆదీ!.. మామయ్యగారూ!.. చెల్లి సీతా.!.. నా తప్పును మన్నించండి. బాబు.. బా..బు..ను.. జా..గ్ర..త్త..గా..” తెరిచిన కళ్ళు తెరిచినట్లుగానే వున్నాయి. చిరునవ్వుతో అందరినీ చూస్తూ వుండిపోయింది ఇండియా.

సీత.. అద్వైత్.. సుల్తాన్ భోరున ఏడవసాగారు. కన్నీటితో నరసింహశాస్త్రిగారు తన చేతితో ఇండియా కళ్ళు మూశారు.

ఆమె ఆత్మ జ్యోతిని తెల్లని పావురంలా గగన వీధికి ఎగరడాన్ని నరసింహశాస్త్రిగారు వీక్షించారు.

ఎవరి విషయంలోనైనా.. పగ పతనానికి దారి తీస్తుంది.. పవిత్ర ప్రేమ త్యాగంతో పరాకాష్ట.. అవుతుంది. పగకు పంతానికి ప్రేమకు అభిమానానికి.. ప్రతిరూపాలు.. రాఘవ.. ఇండియా.

ఇండియా మరణాన్ని విన్న ఆండ్రియా మూన్‌లు ఇండియాకు వచ్చి ఆశ్రమంలో వుండిపోయారు. ఆండ్రియా వాదన.. సుల్తాన్ సాక్ష్యంతో అంజాద్ ఉరి తియ్యబడ్డాడు. తిరిగి వస్తానని గంటన్నకు కాశీలో చెప్పి వచ్చిన రాఘవ.. తిరిగి వెళ్ళనందున గంటన్న జీవితం కాషాయ వస్త్రాలతో సన్యాసిగానే కాశీలో సాగిపోయింది. చామంతిని.. విన్సెంట్ వచ్చి కలవనందున ఆమెకు ఎంతో ప్రియమైన బావ గోవిందు.. చామంతిని పెండ్లి చేసికొన్నాడు.

రాఘవ.. ఇండియాలు సమాధుల రూపంలో ఆ ఆశ్రమంలో ఓ మూల వెలసి.. ఆ అనాథ బాలబాలికలకు ఆదర్శప్రాయులైనారు.

1925వ సంవత్సరం.. నరసింహశాస్త్రి.. అద్వైత్.. సీతలకు చేదు.. తీపి.. జ్ఞాపకాలను మిగిల్చి ముగిసిపోయింది.

(సమాప్తం)

Exit mobile version