Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అద్వైత్ ఇండియా-42

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[కాశీ చేరిన రాఘవ తన తల్లిదండ్రులకు పిండప్రదానం చేస్తాడు. హరిశ్చంద్ర ఘాట్‍లో కూర్చుని ఉండగా, రాజమండ్రి నుంచి వచ్చిన వారు అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్న మాటల ద్వారా – సావిత్రమ్మ చనిపోయిందనీ, తన దొరకని కారణంగా, రాబర్ట్ తన బదులుగా అద్వైత్‌ని అండమాన్ జైల్లో పెట్టించాడని తెలుస్తుంది. వెంటనే అక్కడ్నించి బయలుదేరిపోతాడు. అద్వైత్, ఇండియాల పడవ ఆంధ్రావని తీరం చేరుతుంది. ఇద్దరూ పడవ దిగి కొంత దూరంలో ఉన్న్ బెస్త పల్లెలోకి ప్రవేశిస్తారు. అక్కడ కాశీ అనే యువకుడి పరిచయమై వారిని తమ ఇంటికి తీసుకువెళ్ళి ఆతిథ్యం ఇస్తాడు. వారు రాజమండ్రి వెళ్ళాలని తెలుసుకుని, ఆ ప్రాంతం నుండి గంట సేపు నడిస్తే కాకినాడ వస్తుందని, అక్కడ్నించి ఏ బండైనా పట్టుకుని రాజమండ్రి వెళ్ళచ్చని చెప్తాడు. వారి ఆతిథ్యం స్వీకరించి అక్కడ్నించి బయల్దేరుతారు. నడుస్తూ, సీత గురించి, తమ బిడ్డ గురించి, శాస్త్రి గారి గురించి మాట్లాడుకుంటారు. తమ కొడుకుకి అయినా శాస్త్రి అని పేరు పెడుతుంది ఇండియా. కొంత దూరం నడిచాకా, వాళ్ళకి రాజమండ్రి వెళ్తున్న ఎడ్లబండ్లు కనబడుతాయి. ఓ బండిలో ఎక్కి హాయిగా నిద్రపోతారు. – ఇక చదవండి.]

అధ్యాయం 83:

దయం.. ఐదు గంటల ప్రాంతంలో ఆ బండ్లు ఆండ్రియా స్థాపించిన ఆశ్రమం ప్రాంతానికి చేరాయి. అద్వైత్‌కు మెలకువ వచ్చింది. కళ్ళు తెరచి నలువైపులా చూచాడు. రోడ్డుకు ఐదు వందల అడుగుల దూరంలో వున్న ఆశ్రమాన్ని చూచాడు.

అతని మనస్సులో ఒక భావన..

‘ఇండియాను ఆశ్రమంలో వదిలి నేను ఇంటికి వెళ్ళి పరిస్థితులను చూచి.. నాన్నగారితో.. సీతతో మాట్లాడి.. వారి సమ్మతంతో ఇండియాను ఇంటికి తీసికొని పోవడం మంచిది’ అనుకొని.. నిద్రపోతున్న ఇండియాను లేపాడు. ఉలిక్కిపడి నిద్ర లేచిన ఇండియా!..

“ఆదీ!.. వూరికి వచ్చేశామా!..” ఆత్రంగా అడిగింది.

“ఇందూ!.. ఇప్పుడు మనం.. ఆశ్రమానికి దగ్గరగా వున్నాము.. బండి దిగి మనం ఆశ్రమానికి వెళదాము. నీవు ఆశ్రమంలో వుండు. నేను ఇంటికి వెళ్ళి అక్కడి పరిస్థితులను చూచి.. నాన్నగారికి సీతకు మన విషయాన్ని గురించి చెప్పి.. వారిని ఒప్పించి నీ వద్దకు వస్తాను. అప్పుడు ఇద్దరం కలసి ఇంటికి వెళదాం. సరేనా!..” చెప్పాడు అద్వైత్.

అద్వైత్ చెప్పిన మాటలకు ఇండియా సమ్మతించింది. ఇరువురూ బండి దిగారు. ఆ అన్నకు అద్వైత్ ధన్యవాదాలు తెలియజేశాడు. ఇరువురూ ఆశ్రమం వైపుకు నడిచారు. కాలు గంటలో ఆశ్రమాన్ని సమీపించారు.

వాచ్‌మన్.. అద్వైత్‌ను ఇండియాను గుర్తించాడు. నమస్కరించాడు. ప్రీతిగా పలకరించాడు.

అప్పటికి మూడు నెలలుగా సుల్తాన్ భాయ్ ఆశ్రమంలోనే వుంటూ పాండురంగకు సాయంగా ఆశ్రమ విధుల నిర్వహణలో పాలుపంచుకొన్నాడు. వాచ్‍మన్.. పరుగున వెళ్ళి అద్వైత్ ఇండియాలు వచ్చారని సుల్తాన్‌కు చెప్పాడు. సుల్తాన్ ఆనందంగా వారిరువురికీ ఎదురైనాడు. అద్వైత్ చేతిని తన చేతిలోకి తీసుకొన్నాడు. ముగ్గురూ ఆశ్రమంలో ప్రవేశించారు.

“సుల్తాన్ భాయ్!.. మీరు ఇక్కడ..”

“మూడు నెలలుగా వుంటున్నాను బాబు.. కొడుకు కొరివిగా తయారైనాడు. ఆమె ఎప్పుడో వెళ్ళిపోయే!.. నా శేషజీవితాన్ని యిక్కడి చిన్నారుల సమక్షంలో.. వారిని సక్రమంగా పెంచే విషయంలో గడపాలని నిర్ణయించుకొని ఆండ్రియా అమ్మగారికి వుత్తరం వ్రాశాను. ఆమె ఆశ్రమంలో చేరిపో అని జవాబిచ్చారు. పాండురంగ అమ్మగారి దృష్టిలో మంచి పేరు సంపాదించుకొన్నాడు. ఆశ్రమ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు. నేను మన పాండూకు సాయంగా వుంటున్నాను” చెప్పాడు సుల్తాన్.

“చాలా సంతోషం సుల్తాన్ భాయ్!.. మీరు మంచి నిర్ణయాన్ని తీసుకొన్నారు”

“సుల్తాన్ భాయ్!..” పిలిచింది ఇండియా.

“చెప్పండమ్మా!..”

“నా బాబు.., గురువుగారూ!..”

“అందరూ బాగున్నారమ్మా!.. మీరు వ్రాసిన వుత్తరంలోని విషయాలన్నింటిని శాస్త్రిగారు నాకు చెప్పారు. ‘సుల్తాన్ చూచావా, దైవ నిర్ణయం. నాకు ఎంతో ప్రియమైన ఇండియా.. బిడ్డను.. నా యింటి వారసుణ్ణి ఆ దైవం నా వద్దకు ఎలా చేర్చాడో’ అని సంతోషించారు. తల్లీ.. మీరంటే వారికి ఎంతో అభిమానం..” నవ్వుతూ చెప్పాడు సుల్తాన్.

“మరి సీత!..”

“బాబుకు తన పాలను ఇచ్చి సాకుతూ వుంది. ‘సుల్తాన్ భాయ్ నాకు ఒక్క కూతురే కాదు.. కొడుకూ వున్నాడు..’ అని చెబుతూ బాబును ఎంతగానో ముద్దులాడుతుంటుందమ్మా ఆ అమ్మ సీతమ్మ..”

“సుల్తాన్ భాయ్!.. నాన్నగారికి నా విషయంలో కోపం లేదా!..”

“కర్మ సిద్ధాంతాన్ని నమ్మినవారు.. దైవాన్ని ప్రతి దినం ఆరాధించేవారు మీ నాన్నగారు.. వారికి మీ మీద కోపం లేదయ్యా!.. ‘అంతా ఆ దైవ నిర్ణయం కదా సుల్తాన్!..’ అన్నారు నాతో”, అని చెప్పి, క్షణం ఆగి

“మీరు కాలకృత్యాదులు తీర్చుకోండి. నేను వెళ్ళి నాన్నగారికి మీరు వచ్చిన విషయం చెప్పి వారి మనస్సుకు ఆనందం కలిగిస్తాను. ఆపైవారు ఎలా శలవిస్తే మీరు అలా నడుచుకొందురుగాని.. ఇది నాకు తోచిన ఆలోచన.. మీ నిర్ణయం ఏమిటో చెప్పండి బాబు” అడిగాడు సుల్తాన్.

అద్వైత్ ఇండియా ముఖంలోకి చూచాడు.

“సుల్తాన్ భాయ్ చెప్పిన ప్రకారం చేయడం మంచిది ఆదీ!..” అంది ఇండియా.

“సరే సుల్తాన్ భాయ్.. మీరు మన ఇంటికి వెళ్ళి రండి..” అన్నాడు అద్వైత్.

ఆయా శంకరమ్మను పిలిచి వారికి స్నానాల గదిని.. విశ్రాంతి గదిని చూపించి టిఫిన్ చేసి పెట్టమన్నాడు సుల్తాన్. ఆమె ఆనందంగా తల ఆడించింది.

సుల్తాన్ తన సైకిల్ పై నరసింహశాస్త్రిగారి ఇంటి వైపుకు బయలుదేరాడు.

అరగంటలో అద్వైత్ ఇండియాలు శుచులైనారు. శంకరమ్మ వారికి రవ్వ వుప్మా. అల్లం పచ్చడి అందించింది.

ఇరువురూ తిన్నారు. విశ్రాంతి గదికి వెళ్ళారు. విశ్రమించారు.

సన్నగా తూరలో ప్రారంభమైన వర్షం.. గాలి తోడు కాగా తీవ్ర రూపం దాల్చి గాలీ వానగా మారింది.

సుల్తాన్ తడిసి ముద్దయి.. ఆ పెనుగాలి వానలో అతి కష్టంమ్మీద నరశింహశాస్త్రిగారి ఇంటికి చేరారు. శాస్త్రిగారు సుల్తాన్‌ను చూచి తన పంచ, టవల్ జుబ్బాను అందించారు. తల తుడుచుకొని శాస్త్రిగారు ఇచ్చిన దుస్తులను ధరించాడు సుల్తాన్ భాయ్. ఇరువురూ సింహద్వారాన్ని మూసి హాల్లో కూర్చున్నారు. సీతమ్మ దోశలు.. కాఫీ సుల్తాన్కు అందించింది.

“సుల్తాన్!.. నా సీత మన సావిత్రిని మరపిస్తూ వుంది..” సీత ముఖంలోకి ప్రీతిగా చూస్తూ చెప్పారు శాస్త్రిగారు.

సంతోషంతో తలవంచి నవ్వింది సీత. ఆ భంగిమ వినయానికి మారు పేరు. ఫలభరితమైన వృక్షం నేలకు వంగే వుంటుందనే దానికి సాక్ష్యం. సుల్తాన్ దోశలు తిని కాఫీ తాగాడు.

“సుల్తాన్!.. ఇంత వర్షం గాలిలో ఎలా రాగలిగావు. విషయం ఏమిటి?..”

“వుంది స్వామీ!.. అందుకే వచ్చాను..” చిరునవ్వుతో చెప్పాడు సుల్తాన్ భాయ్.

“ఏమిటది?..”

సుల్తాన్ ఏమి చెప్పబోతున్నాడో అని సీత.. సుమతి.. పాండు వారి ముఖంలోకి పరీక్షగా చూస్తున్నారు.

“రెండు గంటల క్రిందట మన అద్వైత్ బాబు.. ఇండియా అమ్మ.. ఆశ్రమానికి వచ్చారయ్యా!..”

“ఆఁ..” ఆశ్చర్యపోయారు శాస్త్రిగారు.

“బావా!.. ఇండియా!.. బాగున్నారా సుల్తాన్ భాయ్!..” అడిగింది సీత.

నరసింహశాస్త్రి.. సుమతి.. పాండురంగ.. సుల్తానులు సీత ముఖంలోకి చూచారు.

“బాగున్నారమ్మా!..”

“సుల్తాన్!.. నీవు చెప్పింది!..”

“నిజం స్వామీ!.. ఇండియా అమ్మ అండమాన్ నుంచి మన అద్వైత్ బాబుతో తిరిగి క్షేమంగా వచ్చారు” ఆనందంగా చెప్పాడు సుల్తాన్.

“సుల్తాన్ భాయ్!.. వారు ఇక్కడికి వచ్చేదానికి భయపడుతున్నారా!.. సుల్తాన్ ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగింది సీత.

“లేదమ్మా!.. నేనే వారిని అక్కడ వుండి కాలకృత్యాదులు తీర్చుకొని విశ్రాంతి తీసుకోమన్నారు. మీతో విషయాన్ని చెప్పి వస్తానని నేను బయలుదేరి వచ్చాను. మార్గమధ్యంలో గాలి వాన..” చిరునవ్వుతో చెప్పాడు సుల్తాన్. బాబు ఏడుపు వినిపించింది. సీత వేగంగా తన గదికి వెళ్ళిపోయింది.

“మామయ్యా!.. నేను ఆశ్రమానికి బయలుదేరుతాను.. బావని చూడాలి మామయ్యా!..” ఆత్రంగా అడిగాడు పాండు.

“ఈ గాలి వానలో ముఫై మైళ్ళు ఎలా వెళ్ళగలవు పాండూ!.. వర్షం గాలీ తగ్గని..” అనునయంగా చెప్పారు శాస్త్రిగారు.

“మనస్సులో బావ ఎలా వున్నాడో చూడాలనే ఆతృత మామయ్యా!..” దీనంగా చెప్పాడు పాండు.

“వాతావరణం సరిగా లేనప్పుడు ఎవ్వరమూ ఏమీ చేయలేము కాదా పాండూ!..” అన్నారు శాస్త్రిగారు.

సీత బాబు నెత్తుకొని నవ్వుతూ హాల్లోకి వచ్చింది. పాలు తాగిన బాబు నవ్వుతూ కేరింతలు కొడుతున్నాడు.

“బాబూ!.. మీ అమ్మ నాన్నలు వచ్చారట. వర్షం తగ్గగానే వారు నీ దగ్గరకు వస్తారట!..” నవ్వుతూ బాబు ముఖంలోకి చూస్తూ చెప్పింది సీత.

పాండు.. సుమతి ఆశ్చర్యంతో సీత ముఖంలోకి చూచారు.

సుల్తాన్.. నరసింహశాస్త్రిగారి ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూచాడు.

కొన్నిక్షణాల తర్వాత శాస్త్రిగారు ..

“అమ్మా సీతా!..”

“ఏం మామయ్యా.. నా మాటలు మీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి కదూ!.. వరండాలో చూర్లో దోపిన ఇండియా వ్రాసిన ఉత్తరం.. నేను వరండాను చిమ్ముతుండగా క్రింద పడింది. చేతికి తీసుకొన్నాను. చదివాను. నాకు విషయం అర్థం అయింది. ఈ బాబు ఈ ఇంటి వారసుడని తెలిసిపోయింది మామయ్యా.. వీడు నా బావ ప్రతిరూపం..” అంది నవ్వుతూ సీత.

“అమ్మా!.. నీకు..”

“బాధగా అనిపించలేదా అనే కదూ మీరు అడగతలచుకొన్నది!.. నా బావ నా యిష్టానుసారంగా నా కోర్కెను తీర్చారు. వారు వారి ఇష్టానుసారంగా చేసిన పనికి నేను సంతోషించాలి కాని బాధపడితే ప్రేమ అనే పదానికి అర్థం మారిపోతుంది కదా మామయ్యా!.. మీ నుండి నేర్చుకొన్నదే!.. పవిత్రప్రేమ త్యాగాన్నే కదా కోరేది మామయ్యా!..” ఎంతో గంభీరంగా చెప్పింది సీత.

అందరూ ఆమె మాటలకు ఆశ్చర్యపోయారు. ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు.

అక్కడ ఆశ్రమంలో..

ఇండియా.. లేచి పెన్ కాగితాన్ని తీసుకొంది.

“ప్రియాతి ప్రియమైన నా సోదరి సీతకు..

ఆది నుంచీ.. నీకు అద్వైత్ పైన ఎంత ప్రేమో, నాకు.. వారిపై అదే రీతిగా అంతే ప్రేమ. నీకు ఆయనకు రక్త సంబంధం వుంది.. నిన్ను ఆయన అంగీకరించి పెండ్లి చేసికొన్న కారణంగా వారిపై నీకు సర్వహక్కులూ వున్నాయి.

నాకు వారికి మధ్య ముందు వున్నది స్నేహబంధం.. లండన్‌కు వెళ్ళిన తర్వాత నా మనస్సులో వారిని నా వారిగా చేసికోవాలనే కోరిక.. నా నిర్ణయాన్ని వారికి తెలియజేశాను. అబద్దం చెప్పడం.. ఆడిన మాటను తిరస్కరించడం తెలియని అద్వైత్ నా నిర్ణయాన్ని హర్షించారు. నా వారైనారు.

ఆ తర్వాత.. నీవు వ్రాసిన వుత్తరం వారికి చేరింది. అప్పుడు వారు చెప్పారు.. లండన్‌కు రాకముందే నీ వాడైనట్లుగా.. నిన్ను వివాహం చేసికొన్నట్లుగా.

కొంత సమయం.. తప్పు చేశానని బాధపడ్డాను.. కానీ జరగవలసింది జరిగిపోయిన తర్వాత బాధ పడడం వల్ల ప్రయోజనం లేదనుకొన్నాను. వారి కోర్కె ప్రకారం వారిని ఇండియాకు పంపాను. జీవితాంతం వారి జ్ఞాపకాలతో గడపాలని నిర్ణయించుకొన్నాను.

కానీ!.. విధాత నిర్ణయం.. వేరుగా వున్నందున నేను నీలా గర్భం ధరించాను. విషయాన్ని మా తల్లికి అమ్మమ్మకు మూన్ అంకుల్‌కు చెప్పాను. వారు నన్ను ఏమీ అనలేదు. నీకు తగిన వాణ్ణి ఎన్నుకొన్నావని.. సంతోషించారు. నన్ను ఎంతో ప్రేమగా చూచుకొన్నారు. బాబు పుట్టాడు. మూడు మాసాలు గడిచాయి. ఆరో నెలలో ఇండియాకు అమ్మతో కలసి రావాలనుకొన్నాను.

కానీ.. సుల్తాన్ భాయ్ వ్రాసిన ఉత్తరం ద్వారా.. నిరపరాధి అయిన వారిని.. రాబర్ట్ అండమాన్ జైలుకు పంపాడని తెలిసింది. వుండలేకపోయాను. ఇండియాకు బయలుదేరి వచ్చాను. అండమాన్‍కు వెళ్ళి వారిని విడిపించుకొని రావాలని నిర్ణయించుకొన్నాను. బాబుతో ఆ ప్రయాణం కష్టతరం.. ఆ పసికందు తట్టుకోలేడు. అందువలన.. మా గురుదేవులకు యథార్థాన్ని వివరించి ఉత్తరం వ్రాశాను. ఉత్తరాన్ని బాబును నీ యింటి ముంగిట వుంచి నేను అండమాను బయలుదేరాను.

ఆ దైవ కృపాకటాక్షంతో.. అండమాన్ జైలు సూపరిండెంటన్ మిల్టన్ వారి సతీమణి రోజ్‌మన్.. నా మాటలను విశ్వసించారు. నా కోర్కెను మన్నించారు. అద్వైత్‌ను విడుదల చేశారు. మాకు వారు.. ఆహార పదార్థాలను, నీటిని యిచ్చి బోట్‍ను ఏర్పాటు చేసి మమ్మల్ని ఇండియాకు పంపారు.

తీరం చేరిన తర్వాత కాశీ.. బెస్త యువకుడు మా ఆకలిని తీర్చాడు. మాకు కాకినాడకు దారి చూపాడు. రెండెడ్ల బండిలో ఈ ఉదయం ఐదు గంటలకు రాజమండ్రికి వచ్చి ఆశ్రమాన్ని చేరాము. సుల్తాన్ భాయ్ మీ అందరి

క్షేమసమాచారాలను చెప్పాడు. ఇరువురం ఆనందించాము. మీ రాకను మీకు తెలియజేయాలని సుల్తాన్ భాయ్ బయలుదేరాడు. గాలీ వాన ప్రారంభం అయింది. అది ఇప్పట్లో తగ్గే రీతిగా లేదు.

సీతా!.. నేను వ్రాసిన వుత్తరాన్ని మామగారు నీకు చూపించారో లేదో నాకు తెలియదు. కానీ.. నా బాబును నీవు ఎంతో ప్రేమగా చూచుకొంటున్నావని.. వాడు బాగున్నాడని సుల్తాన్ భాయ్ చెప్పాడు. నాకు చాలా ఆనందం కలిగింది. నా వేదన తీరింది. నేను నీ సుఖసంసార జీవితానికి అడ్డుగోడగా నిలవదలచుకోలేదు. అద్వైత్ నీ వాడే.. కానీ నా బాబు వాళ్ళ నాన్న.. తాతయ్యల వద్ద.. నీ చేతుల్లో పెరిగి.. తాత.. తండ్రులకు వారసుడు కావాలని.. నా కోరిక..

సుల్తాన్ రాగానే వారు ఇంటికి వస్తారు. వారు నా విషయంలో చేసిన తప్పును మన్నించు. తప్పు వారిది కాదు నాది. వారిని పూర్వంవలె అభిమానించు. ప్రేమించు.. ఆరాధించు. అద్వైత్ లాంటి భర్త అందరికీ లభ్యపడడు. వారి మంచికి మానవత్వానికి ప్రతిరూపం..

ఒక్కసారి నా బాబును ఎత్తుకొని.. నా తనివి తీరా ముద్దులాడాలని వుంది. బాబును ఆశ్రమానికి పంపగలవా!.. నేను అక్కడికి వచ్చి నీ ముఖాన్ని.. అందులో నాకు గోచరించబోయే ప్రశ్నలను.. చూడలేను. కారణం.. నీ ఏ ప్రశ్నకూ నేను జవాబు చెప్పలేను కదా!.. నీవు నాలాంటి స్త్రీవే.. నా మనస్తత్వాన్ని అర్థం చేసికొని నన్ను క్షమించమని కోరుతున్నాను. నేను.. లండన్‌కు తిరిగి వెళ్ళిపోతాను.

ఇట్లు

ఇండియా అద్వైత్.

ఆశ్రమ బిల్డింగ్ లోపల అంతా తిరిగి బాలబాలకలను పలకరించి నవ్వించి, అద్వైత్ ఇండియా వున్న గదిలోకి వచ్చాడు. వ్రాసిన ఉత్తరాన్ని మడచి కవర్ లో వుంచింది ఇండియా.

“ఏమిటది ఇందూ!..”

“ఉత్తరం..”

“ఎవరికి!..”

“సీతకు..”

“మనం అక్కడికి వర్షం తగ్గి సుల్తాన్ రాగానే వెళతాముగా!..”

ఇండియా వెంటనే జవాబు చెప్పలేదు.

అద్వైత్ ఇండియా ముఖంలోకి చూచి.. “ఏమిటి నీ ఆలోచన ఇందూ!…”

“నేను అక్కడికి రాలేను ఆదీ!..” విచారంగా చెప్పింది ఇండియా.

“కారణం ?..” అడిగాడు ఆది.

“సీతకు నా ముఖాన్ని చూపించలేను ఆదీ!..”

“అంటే, సీత నిన్ను ఏమన్నా అంటుందనే భయమా!..”

“అవును.. ఆమె దృష్టిలో నేను నేరస్థురాలినే కదా!..”

“అది నేరమే అయితే.. అందులో నాకూ సమభాగం వుందిగా!..”

“ఆదీ.. ఆమె దృష్టిలో శిక్షార్హురాలిని నేనే.. మీరు కాదు. ఆమె మిమ్మల్ని క్షమించగలదు. నన్ను క్షమించలేదు. యీ విషయంలో ఒక స్త్రీ మనస్తత్వం.. మరో స్త్రీకే అర్థం అవుతుంది.. మీ మగవారు అర్థం చేసికోలేరు..”

“నన్ను నీవు అర్థం చేసికొన్నది ఇంతేనా ఇందూ!..”

“మిమ్మల్ని నేను బాగా అర్థం చేసుకోన్నాను కాబట్టే.. నా వలన మీకు.. సీత ముందు ఎలాంటి తలవంపులు కలుగకూడదని నేను ఈ నిర్ణయాన్ని తీసుకొన్నాను ఆదీ!..” అనునయంగా చెప్పింది ఇండియా.

బయట వర్షం గాలీ.. ఎంతో తీవ్రంగా వుంది. కారు చీకట్లు.. కిటికీ గుండా బయటి ప్రకృతిని చూచాడు ఆది.

‘సీత.. తన్ను అవమానిస్తుందని.. తనతో పూర్వపు మాదిరి వెటకారంగా మాట్లాడుతుందని ఇండియా భయపడుతూ వుంది. ఇంతకూ.. బాబు ఇండియాకు నాకు పుట్టిన బిడ్డ అన్న విషయం సీతకు తెలుసునో.. లేదో.. నాన్నగారు చెప్పి వుంటారా చెప్పి వుండరా!..’ అనుకొన్నాడు అద్వైత్.

ఎంతగా ఆలోచించినా అద్వైతు సమాధానాలు గోచరించలేదు. సుల్తానాబాయి వస్తే.. తన ప్రశ్నలకు సమాధానం దొరకవచ్చు..

“ఇండియా!..”

“చెప్పు ఆదీ!..”

“సుల్తాన్ భాయ్ వస్తే.. నీ సందేహం తీరిపోతుంది.. నీవు భయపడకు..” ప్రీతిగా ఆమె భుజంపై చేయి వేసి నవ్వుతూ ఆమె ముఖంలోకి చూచాడు అద్వైత్.

“అలాగే!..” అంది ఇండియా ముక్తసరిగా.. ఆమె మనోవేదన ఆమెకే పరిమితం.

(ముగింపు వచ్చే వారం)

Exit mobile version