[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[నరసింహశాస్త్రిగారు, పాండు గోదావరీ స్నానం చేసి ఇంటికి వచ్చేసరికి గుమ్మం ముందు ఓ వెదురుబుట్టలో పొత్తిగుడ్డల మధ్యన ఓ మూడు నెలల బాబు కనిపిస్తాడు. బాబుని పాండు పైకి తీసి ఎత్తుకుంటాడు. శాస్త్రి గారికి ఆ బుట్టలో ఓ కవరు కనిపిస్తుంది. పాండు గమనించకుండా, ఆ కవరుని తీసుకుని, బాబుతో సహా లోపలికి వెళ్తారు. సీతని, సుమతిని పిలుస్తారు. ఇంతలో బాబు ఏడవడంతో, లోపలికి తీసుకెళ్ళి సీత పాలిస్తుంది. కాసేపటికి సీతని పిలుస్తారు శాస్త్రిగారు. ఆ బాబు ఎవరో, మనింటి ముందు ఎందుకు వదిలివెళ్ళారో అడుగుతుంది సీత. తనకీ అర్థం కావడం లేదని అంటారాయన. బాబుని అనాథాశ్రమంలో చేర్చవద్దనీ, తమ వద్దే పెరుగుతాడని అంటుంది. సరేనంటారు శాస్త్రిగారు. తర్వాత మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళి, అక్కడ వేపచెట్టు క్రింద కూర్చుని ఆ కవరు విప్పుతారు. అది ఇండియా వ్రాసిన ఉత్తరం. లండన్‍లో తనకీ, అద్వైత్‍కి మధ్య జరిగినదంతా వ్రాసి, ఆ బాబు తనకీ, అద్వైత్‍కీ పుట్టిన బిడ్డ అని తెలియజేస్తుంది. తాను అండమాన్ వెళ్తున్నాననీ, అద్వైత్‌తో తిరిగి వస్తాననీ, బాబుని జాగ్రత్తగా చూసుకోండని రాస్తుంది. ఆ ఉత్తరం చదివాకా, ఆయనలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. తనకు సమయస్ఫూర్తిని, సహనాన్ని, శక్తిని ప్రసాదించమని భగవంతుని వేడుకొంటారు. ఇండియా అండమాన్ చేరుతుంది. అక్కడి జైలు అధికారి జాన్ మిల్టన్‍ను కలుస్తుంది. పదేళ్ళ క్రితం ఆయన కలకత్తాలో పనిచేసినప్పుడు, రాబర్ట్ ఇంటి పక్కనే ఉండేవారు. ఆ విషయాన్ని ఆయనకు గుర్తు చేస్తుంది ఇండియా. జరిగినదంతా ఆయనకు తెలిపి, అద్వైత్‌ను జైలు నుంచి విడిపించమని ప్రార్థిస్తుంది. తొలుత జాన్ మిల్టన్ అంగీకరించడు. కానీ, ఇండియా, ఆయన భార్య రోజ్‌మన్‌ని కలిసి జరిగినదంతా చెప్పి, ఆమెను ఒప్పిస్తుంది. రోజ్‌మన్ తన భర్తతో, ఇండియా తనకు చెప్పిన వివరాలనన్నింటినీ ఇండియా సమక్షంలో చెప్పి, నిరపరాధి అయిన అద్వైత్‌ను విడిచి పెట్టమని కోరుతుంది. అందుకు అంగీకరిస్తాడు జాన్ మిల్టన్. అద్వైత్‍ని విడుదల చేసి, ఓ పడవ ఏర్పాటు చేసి, బయల్దేరమంటాడు. లండన్‍లో ఉన్నప్పుడు బోట్ నడపడం నేర్చుకోవడంతో, స్వయంగా నడుపుతాడు అద్వైత్. గాలి వాలు అనుకూలంతో బోట్ ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. అద్వైత్ లండన్ వదిలిన నాటి నుంచి జరిగిన విషయాలను అతనికి చెప్తుంది ఇండియా. తన కోసం ఆమె పడిన కష్టాలని అర్థం చేసుకుని ఇండియాను దగ్గరకి తీసుకుంటాడు అద్వైత్. – ఇక చదవండి.]
అధ్యాయం 81:
అది కాశీ మహాక్షేత్రం.. వరుణ, అసి, గోమతి నదుల సంగమం. భారతావని నలుమూలల నుండీ అసంఖ్యాక హైందవ సమూహాలు ఆ పవిత్ర క్షేత్రంలో వెలసి యున్న కాశీ విశ్వనాధుని మాత అన్నపూర్ణమ్మను దర్శించి.. ఆ పవిత్ర త్రివేణీ సంగమంలో స్నానం చేసి.. తమ పితృదేవతలకు పిండ ప్రధానం చేసి.. పరమానంద భరితులయ్యే అద్వితీయ పుణ్యక్షేత్రం.
ఆ కార్యక్రమాలనంతా.. ఓ యువకుడు.. వుత్తమాంగాన బాగా ఎదిగిన కేశములతో యథావిధిగా నిర్వర్తించాడు. అతనికి తన భవిష్యత్తు తెలుసు. చివరి అధ్యాయంలో తాను చేయదలచుకొన్న ఒక కార్యం.. మిగిలి వున్న కారణంగా అది నెరవేరాలని ఆ జగన్మాతా పితలను ఎంతో భక్తి శ్రద్ధలతో వేడుకొన్నాడు.
హరిశ్చంద్ర ఘాట్లో కూర్చొని వున్నాడు. అతను ఎవరో కాదు.. రాఘవ.
రాజమండ్రి నుంచి కాశీ యాత్రకు వెళ్ళిన వారు అతని ప్రక్కన కూర్చున్నారు. వారి మాటల సందర్భంలో నరశింహశాస్త్రిగారి కుటుంబ విషయాలు చర్చ జరిగింది. రాఘవకు రెండు విషయాలు అర్ధం అయినాయి. మొదటిది సావిత్రమ్మ మరణం.. రెండవది తాను రాబర్ట్ మూకలకు చిక్కని కారణంగా.. అతను అద్వైత్‌ను అండమాన్ జైలు పాలు చేయడం..
ఆ రెండు విషయాలను వినన రాఘవ చలించిపోయాడు. పొంగి వచ్చిన ఆవేదనతో కన్నీరు కార్చాడు..
‘నా మూలంగా నా బావ దోషిగా అండమాన్ జైలు పాలైనాడు. నా వారంతా ఆనందంగా వున్నారని నేను ఇంతకాలంగా అనుకొన్నది.. అక్కడి యథార్థ పరిస్థితులకు పూర్తి వ్యతిరేకం.. నేను నేరం చేశాను.. నేరస్థుడే శిక్షను అనుభవించాలి. ఏ నేరమూ చేయని నా బావ శిక్షను అనుభవించడం అన్యాయం.. ముందు ఏమి జరిగినా నేను ఆనందంగా స్వీకరించాలి. రాజమండ్రికి వెంటనే వెళ్ళాలి. రాబర్ట్‌ను కలవాలి. బావను విడిపించమని కోరాలి. అతను నన్ను చంపినా.. ఆ మరణాన్ని నేను ఆనందం స్వీకరించాలి. నా బావను జైలు నుంచి విడిపించాలి..’
ఆ నిర్ణయానికి వచ్చిన రాఘవ.. వేగంగా లేచి ముందుకు నడిచాడు.
అధ్యాయం 82:
సమయం.. సాయంత్రం ఆరు గంటలు.. అద్వైత్ ఇండియాల బోట్ ఆంధ్రావని తీరం చేరింది. ఇరువురూ బోటు దిగి కొంత దూరంలో వున్న బెస్త పల్లెలో ప్రవేశించారు. అక్కడికి రాజమండ్రి ఎంత దూరం అని ఓ వ్యక్తిని అడిగాడు అద్వైత్. ఆ ప్రాంతంలోనే గోదావరీ నది సాగర సంగమం.
“దొరా!.. తమరు యాడనించి వస్తుండరు!..” అడిగాడు ఆ బెస్త యువకుడు కాశీ.
“అండమాన్ నుండి..”
“యీయమ్మ..”
“నా భార్య..”.
“తమరు ఏడకెళ్ళాలి దొరా!..”.
“రాజమండ్రికి..”
“సముద్రపు ఒడ్డున్నే ఎల్లితే.. ఓ గంటలో కాకినాడ వస్తది దొరా.. ఆడ నుంచి ఏ బందో బడకో పట్టుకొంటే రాజమండ్రికి ఎల్లొచ్చు..”
“ఆదీ!.. ఆకలిగా వుంది..” అద్వైత్‌ను సమీపించి మెల్లగా చెప్పింది ఇండియా.
“శాకాహారం.. మాకు యిక్కడ తినేదానికి దొరుకుతుందా బాబూ!..” అడిగాడు అద్వైత్.
“దొరా!.. రండి ప్రక్కనే మా యిల్లు.. మా అమ్మ ఏం చేసినాదో అడిగి చెబుతా!..” కాశీ ముందు నడువగా వారిరువురు అతన్ని అనుసరించారు.
యిరవై అడుగులు నడవగానే కాశీ..
“దొరా యిదే మా యిల్లు” అంటూ, ఎత్తి వున్న నులక మంచాన్ని వాల్చి “కూకోండి దొరా..” ఎంతో మర్యాదగా చెప్పాడు కాశీ బిగ్గరగా.
“అమ్మా..” పిలిచి గుడిసెలో దూరాడు.
అద్వైత్ ఇండియాలు మంచంపై కూర్చున్నారు. వారు బయలుదేరేటప్పుడు జాన్ మిల్టన్ భార్య రోజ్‌మన్ ముపై చపాతీలు.. వూరగాయ.. వుర్లగడ్డల వేపుడూ వారికి కట్టి యిచ్చింది. నాలుగు రోజుల సుదీర్ఘ సాగర పయనంలో వాటిని తిని.. రోజ్‌మన్ డ్రమ్ముతో ఇచ్చిన మంచినీటిని తాగి.. తీరం చేరారు వారిరువురు.
కాశీ రెండు తట్టల్లో బియ్యపు పిండి రొట్టెలను నిమ్మకాయ వూరగాయ ముక్కలను వాని తల్లి పెట్టి యివ్వగా తీసికొని బయటికి వచ్చి.. ఇండియాకు అద్వైత్‌కు అందించాడు.
“దొరా!.. బియ్యపు రొట్టెలు.. నిమ్మకాయ వూరగాయ బాగుంటాయి. తినండి..” నవ్వుతూ చెప్పాడు కాశీ.
అతని తల్లి ముంతతో మంచినీళ్ళు తెచ్చి కొడుకు చేతికి యిచ్చింది. కాశీ ముంతను అద్వైత్ ముందు వుంచాడు. ఆకలితో వున్న వారిరువురూ.. ఆ రొట్టెలను నిమ్మకాయ ముక్కల ఆసరాతో గబగబా తిన్నారు, ‘ఆకలి.. రుచి ఎరుగదు’ అన్న సామెతను తలచుకొంటూ.
వారి క్షుద్బాధ తీరింది. కాశీ ముంతనందించాడు. మొదట అద్వైత్ తర్వాత ఇండియా మంచినీళ్ళు త్రాగారు. “దొరా!.. యీ రాత్రికి మా గుడిసెలో పడుకొంటరా!..” ఆప్యాయంగా అడిగాడు కాశీ.
“లేదు కాశీ. మేము కాకినాడ వెళతాం. ఓ గంటలో చేరగలమని చెప్పావుగా!..”.
“అవును.. అలసటగా వుంటే గుడిసెలో పడుకోండి. మంచాలేస్తాను” నవ్వుతూ చెప్పాడు కాశీ.
“వద్దు కాశీ మేము బయలుదేరుతాం!.. నీవు మీ అమ్మ మా ఆకలిని తీర్చారు. మీరు హాయిగా వుండాలి” చేతులు జోడించి చెప్పాడు అద్వైత్.
“దొరా!.. నాకు దండవెట్టకూడదు. నేను మీకంటే చిన్నోణ్ణి. నన్ను మీరు దీవించాలి దొరా!..” అమాయకంగా నవ్వాడు కాశీ,
“నీవు.. మీ వారంతా చల్లగా వుంటారు కాశీ.. నీ మనస్సు చాలా గొప్పది” హృదయపూర్వకంగా చెప్పాడు అద్వైత్ కృతజ్ఞతా భావనతో..
“ఇప్పుడే వస్తాను దొరా!..” లోనికి పరుగెత్తాడు కాశీ.
రెండు నిముషాల్లో తిరిగి వచ్చి టార్చిలైట్‌ను అద్వైత్‌కు అందిస్తూ..
“దీన్ని చేత పట్టుకోండి దొరా!.. పైన చందమామ వుండడు. అయినా ముందు కొన్ని చోట్ల దట్టమైన చెట్లుండయి. వాటి నీడల్లో ఇది మీకు ఎలుతురిచ్చి దారి చూపిస్తది” నవ్వుతూ చెప్పాడు కాశీ.
అద్వైత్ టార్చిని అందుకొన్నాడు. ఇండియా ముఖంలోకి చూచాడు.
ఇండియా తన చంకకు వున్న బ్యాగ్ నుంచి కొంత పైకాన్ని తీసి అద్వైత్‌కు ఇచ్చింది.
“కాశీ.. దీన్ని తీసుకో..”
“ఏంది దొరా!..”
“ఏం లేదులే తీసికో!..”
“డబ్బా!.. ఒడ్డు దొరా!.. ఒద్దు..” అనునయంగా చెప్పాడు కాశీ,
ఇండియా.. “కాశీ.. నీవు చాలా.. చాలా మంచివాడివి..” నవ్వుతూ చెప్పి.. అద్వైత్ చేతిలోని డబ్బును తన చేతిలోనికి తీసుకొని వేగంగా కాశీ తల్లిని సమీపించి.. ఆమె చీర కొంగును తన చేతిలోకి తీసి కొని ఆ డబ్బును అందులో వుంచి ముడివేసి..
“అమ్మా!.. నేను నీ కూతురులాంటి దాన్ని. నా మాటను నీవు కాదంటావా..” నవ్వుతూ చెప్పింది ఇండియా. కాశీ తల్లి తన రెండు చేతలను పైకెత్తి ఇండియా తల చుట్టూ చుట్టి.. తన కణతలకు చేర్చి మెటికలు విరిచింది.
“నా బంగారు తల్లీ!.. నీవు మీ ఆయనా నూరేళ్ళు చల్లగుండాలమ్మా!..” మనసారా దీవించింది. అద్వైత్ ఇండియాలు వారికి చెప్పి ముందుకు సాగరతీరాన నడవసాగారు.
కాశీ వాళ్ళ వెనకాలే ఓ రెండు వందల అడుగులు నడిచాడు. అద్వైత్ వెనుతిరిగి కాశీని చూచాడు. “కాశీ!..” ఆశ్చర్యంతో పలకరించాడు.
“దొరా!..”
“మాకేం భయం లేదు. నీవు ఇంటికి వెళ్ళు..” అన్నాడు అద్వైత్. క్షణం తర్వాత.. “నీవు మాకు ఇచ్చిన రొట్టె పూరగాయ ఎంతో బాగున్నాయని నా భార్య ఇందూ చెప్పింది.. విన్నావుగా!..” నవ్వాడు అద్వైత్..
“దొరా!..”
“కాలే కడుపుకు మండే గంజి.. పేదోళ్ళం.. ఏదో మాకాడ వున్నది.. మీరు ఆకలి అనగానే ఇచ్చాను.”
“కాశీ!.. నాకు బాగా నచ్చింది. నీవు ఇచ్చింది పూర్తిగా తినేశాను. అమ్మ నీ కోసం.. ఎదురు చూస్తూ వుంటుంది. ఇక నీవు వెనక్కి వెళ్ళు బాబూ!..” ప్రీతిగా చెప్పింది ఇండియా.
కాశీ ఆగిపోయాడు.
“వెళ్ళొస్తాం.. కాశీ, ఇంటికి వెళ్ళు..” అన్నాడు అద్వైత్.
“జాగ్రత్తగా వెళ్ళండి దొరా..!..”
“అలాగే!..”
కాశీ వెనక్కు తిరిగాడు. అద్వైత్ ఇండియాలు ముందుకు సాగారు.
“ఆదీ! పేదవాళ్ళయినా.. వారి మనస్సులు ఎంత మంచివో చూచావా!..”
“ఆ మంచి మనస్సు అనేది.. యీ దేశపు ప్రజల సొత్తు. దాన్ని ఆసరాగా చేసుకొనే.. యీ దేశంలోకి మహమ్మదీయులు.. ఆంగ్లేయులు రాగలిగారు.”
“మీరన్నమాట నిజం..” ఇండియా ఆకాశం వైపు చూచింది. లయబద్ధంగా అలలు దరికి చేరి వెనక్కు వెళ్లడాన్ని చూచింది.
“ఆదీ!..”
“చెప్పు ఇందూ..”
“ఈ వాతావరణం ఎంతో ప్రశాంతంగా వుంది కదూ!..”
“అవును..”.
“వేరే.. నీకేమనిపిస్తూ వుంది..”
“మూడు వేళలా ఏ మహారాజైనా మనకు దోసిలి అన్నం పెడితే జీవితాంతం ఇక్కడే వుండిపోవాలనిపిస్తూ వుంది”
“ఒంటరిగానా!..”
“నీవు నాకు తోడుగా వున్నావుగా!..”
“ఎంత వరకూ..”
“నా జీవితాంతం వరకు..”.
“మరి సీత!..”
అద్వైత్ వెంటనే జవాబు చెప్పలేక పోయాడు.
“ఆదీ!..”
“ఆ..”
“సీత.. మనం కలసి వుండే దానికి అంగీకరిస్తుందా!..”
అద్వైత్ సీతను గురించి ఆలోచించసాగాడు.
“అదీ!.. సీతను గురించి ఆలోచిస్తున్నావు కదూ!..”
“అవును..”
“నేను ఒక మాట అడుగుతాను నిజం చెబుతావా!..”
“నేను అబద్ధం చెప్పనని నీకు తెలుసుగా!..”
“అవుననుకో.. కానీ.. నేను అడగబోయే విషయం!..” ఇండియా ఆగిపోయింది.
“అది.. ఏదైనా నా నుండి నీవు వినబోయేది నిజాన్నే!..”
“సరే!.. అడగనా!..”.
“అడుగు ఇందూ!..”.
“మీకు నేనంటే యిష్టమా.. లేక సీత అంటేనా..”
అద్వైత్ నవ్వాడు.
“ఆ నవ్వులోని అర్థం?..”
“నీ రెండు కళ్ళలో నీకు ఏ కన్ను ఇష్టం అంటే నీవు ఏమి చెప్పగలవు ఇందూ!.. నేను చెప్పేది నిజం.. నాకు మీరిద్దరూ సమానమే!..”
“మీకు.. నాలో.. సీతలో నచ్చిన లక్షణాలు ఏమిటి?..” అడిగింది ఇండియా.
“సీతలోని అమాయకత్వం.. ఆవేశం, నీలోని సహనం.. శాంతం..”
“అంటే!..”
“ద్వాపరయుగ నాయకుడు.. శ్రీ కృష్ణ పరమాత్మ.. శ్రీ మహాభారత చరిత్ర నాయకుడు.. వారికి అష్ట అంటే ఎనిమిది మంది భార్యలు.”
“మీకు ఇద్దరం..” నవ్వింది ఇండియా.
“అవును..”.
“అయితే!..”
“వారిలో.. వారిని అతిగా అభిమానించేవారు ఇద్దరు. ఒకరు రుక్మిణీదేవి.. మరొకరు సత్యభామాదేవి..”
“వారిరువురిలో వున్న వ్యత్యాసం?..”
“నీకు సీతకు వున్న వ్యత్యాసం..”
“అంటే నేను రుక్మిణీదేవిని.. సీత సత్యభామాదేవి.. అవునా..”
“అవును..” నవ్వాడు అద్వైత్.
“వారిరువురిలో శ్రీ కృష్ణ పరమాత్మ ఎవరిని అధికంగా అభిమానించే వారు..”
“ఇరువురినీ..”
“అంటే..”
“నాలాగా!..” అద్వైత్ ఇండియా భుజంపై చెయ్యి వేసి ఆమెను దగ్గరకు లాక్కున్నాడు.
ఇండియా ఆనందంగా అతన్ని కౌగలించుకొంది.
“కాసేపు హాయిగా యిక్కడ పడుకోవాలని వుంది ఆదీ!..” పరవశంతో అంది ఇండియా.
“అలాగా!..”
“అవును..
అద్వైత్ ఇసుకలో కూర్చున్నాడు. ఇండియా అతని ఒడిలో తలనుంచి పడుకొంది.. కళ్ళు మూసుకొంది..
అరగంట గడిచింది.
“ఇందూ!.. లేస్తావా!.. బయలుదేరుదాం!..” ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు అద్వైత్.
ఇండియా అతని కళ్ళల్లో నవ్వుతూ చూచి లేచి కూర్చుంది.
అద్వైత్ నిలబడి తన చేతిని ఆమెకు అందించాడు. ఇండియా పైకి లేచింది.
ఇద్దరూ ముందుకు నడవసాగారు..
“ఇప్పుడు అక్కడ మన వాళ్ళు ఏం చేస్తుంటారు అదీ!..”
“పెద్దలా, చిన్నలా..”.
“ఇరు వర్గాల వారిని గురించి చెప్పండి..”
“పెద్దలు భోజనాలు ముగించి పడుకోబోతుంటారు. పిన్నలు అంటే పాప, బాబు పాలు తాగి హాయిగా నిద్రపోతూ వుంటారు”
ఇండియాకు తన బాబు గుర్తుకు వచ్చాడు. కన్నతల్లి గదా!.. మనోవికలంతో మౌనంగా వుండిపోయింది. ఆమె హృదయ స్పందనను అర్థం చేసికొన్న అద్వైత్..
“ఇందూ!.. బాబును గురించి ఆలోచిస్తున్నావు కదూ!..”
“అవును.. వాడు తల్లి తండ్రికి దూరంగా ఎలా వున్నాడో!..” విచారంగా అంది ఇండియా.
“మా నాన్నగారు.. అదే మీ మామగారు వాణ్ణి ప్రాణప్రదంగా చూచుకొంటారు. నీవు వారికి వ్రాసిన లేఖను చదివి తన యింటి ముంగిట వెలసిన బాబు ఎవరనే విషయాన్ని వారు గ్రహించి వుంటారు”
“మరి.. సీత!..” అమాయకంగా అడిగింది ఇండియా.
“సీత.. చిన్నతనం నుంచీ నేను చూస్తున్నానుగా.. సీతకు మగపిల్లలంటే ఎంతో ఇష్టం.. నాన్నగారు విషయాన్ని చెప్పకపోయినా.. సీత బాబును ఎంతో ప్రీతిగా చూచుకొంటుంది”
“విషయం తెలిస్తే!..”
“కాసేపు బాధ పడవచ్చు.. నా మీద తనకు కోపం రావచ్చు.. కానీ బాబును ద్వేషించదు”
“నా మూలంగా మీ ఇరువురి మధ్యన..”.
“నీవు అనుకునే రీతిలో ఏదీ జరగదు. నాన్నగారు సీతకు నచ్చ చెబుతారు” ఇండియా పూర్తి చేయక మునుపే అద్వైత్ చెప్పేశాడు.
ఆమె హృదయంలో చెలరేగే సందేహాల దిశను మార్చాలని అద్వైత్..
“ఇందూ!.. బాబుకు ఏం పేరు పెట్టాలనుకొంటున్నావు?..”
“ఆ విషయాన్ని గురించి నేను ఆలోచించలేదు ఆదీ!..”
“నేను ఆలోచించాను..”.
“ఏం పేరు పెట్టాలనుకొంటున్నావు?..”
“అఇనా శాస్త్రి..”
“అఇనా అంటే!..
“అఇనా అంటే అర్థం.. మిర్రర్.. అద్దంలో నిన్ను నీవు.. ప్రతి ఒక్కరూ వారి నిజరూపాలను చూచుకోగలరు కదా!..”
“అవును..”
“నా బిడ్డను చూచిన వారు.. వారి నిజరూపాలను తెలుసుకోగలరు.. అంతేకాదు ఆ.. అద్వైత్ ఇ.. ఇండియా.. నా.. నరశింహశాస్త్రి మన ముగ్గురి పేర్ల తొలి అక్షర కలయికే నా కొడుకు పేరు. అంతే కాదు.. స్వచ్ఛతకు మారు పేరు.. ఎలా వుంది?..” చిరునవ్వుతో అడిగాడు అద్వైత్..
“చాలా.. చాలా బాగుంది..” ఆనందంగా నవ్వింది ఇండియా.
ఇరువురూ.. కాకినాడలో ప్రవేశించారు. సమయం రాత్రి పదకొండు గంటలు. వీధులు నిర్మానుష్యంగా వున్నాయి. పశుగ్రాసంతో రెండు ఎడ్లబండ్లు రోడ్డున వెళుతున్నాయి.
అద్వైత్.. ఆ రథచోదకుడిని అడిగాడు.
“అన్నా!.. అన్నా యీ బండ్లు ఎక్కడిదాకా వెళతాయి?..”
“రాజమండ్రి!..” జవాబు చెప్పాడు ఆ వ్యక్తి.
“అన్నా!.. మాకో సాయం చేయగలరా!..”
“చెప్పు బాబూ!.. ఏం చెయ్యాలి?..” అడిగాడు ఆ పెద్ద మనిషి.
“మేమిద్దరం రాజమండ్రికి వెళ్ళాలి. బండిలో ఎక్కించుకోగలరా!..”
“జల్లలో పిల్లిబిసర.. వులవ చెత్త వుంది. కూర్చోగలరా..” అడిగాడు ఆ పెద్దమనిషి,
“కూర్చుంటాం అన్నా!..”
“సరే ఎక్కండి. తెల్లారేటప్పటికి చేరుతాం.. ఫరవాలేదా!..”
“ఫరవాలేదన్నా!..”
అద్వైత్.. ఇండియాలు బండి ఎక్కి జల్లలో కూర్చున్నారు. బండ్లు కదిలాయి. నడిచి అలసిన శరీరాలు జల్లలో కొంతసేపటికి ఒరిగి పోయాయి. రాత్రి సమయం.. చల్లగాలి. సర్వాన్ని మరచి ఇండియా అద్వైత్‌లు నిద్రపోయారు.
(ఇంకా ఉంది)
సిహెచ్. సి. ఎస్. శర్మ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి జననం నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా ఊచగుంటపాళెంలో జరిగింది. ప్రాథమిక విద్య పెయ్యలపాళెం, బుచ్చిరెడ్డిపాళెంలోనూ, ఉన్నతవిద్య నెల్లూరులోనూ.
సివిల్ ఇంజనీరుగా రాష్ట్రంలోని పలు సంస్థలలో వివిధ హోదాలలో పని చేసి చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరక్టర్ స్థాయికి ఎదిగారు.
చిన్ననాడు బామ్మగారు చెప్పిన కథలతో ప్రేరణ పొంది బాల్యం నుంచే రచనలు చేశారు. మిత్ర రచయితల ప్రోత్సాహంతో రచనా రంగంలో విశేషంగా కృషి చేశారు. 20 నవలలు, 100 కథలు, 12 నాటికలు/నాటకాలు, 30 కవితలు రాశారు.
వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందారు.