[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[అద్వైత్ వస్తున్న స్టీమర్ అరేబియన్ సముద్రంలో పెనుతుఫానులో చిక్కుకుంటుంది. ప్రయాణీకులందరినీ రక్షించమని అద్వైత్ భగవంతుడిని ప్రార్థిస్తాడు. మద్రాసు చేరవలసిన ఆ స్టీమర్ తుఫాను కారణంగా బొంబాయి తీరానికి చేరి ఇసుకలో కూరుకుపోతుంది. స్టీమర్‌లోని వారంతా ఆంగ్లేయులే. మాటల సందర్భంలో అద్వైత్ తన ఊరి పేరు చెప్పి, రాబర్ట్‌తో తనకి మంచి పరిచయం ఉందని, అతనికి తాను తెలుగు నేర్పానని చెప్తాడు. బొంబాయి కర్నల్ అందరితో పాటు అద్వైత్కు కూడా ఆశ్రయం కల్పించి, ఆంధ్ర ప్రాంతపు వారితో పటు రైల్లో రాజమండ్రి చేరేలా ఏర్పాట్లు చేస్తాడు. రెడ్డిరామిరెడ్డిగారు సకుటుంబంతో సాగించిన యాత్రలో చివరి క్షేత్రం కాంచీపురం. వారితో పాటు వెళ్ళిన వసుంధర అనారోగ్యంతో బాధపడి, కంచిలో మరణిస్తుంది. అదే సమయంలో రెడ్డిగారిని వెతుక్కుంటూ వెళ్ళిన మనిషి కంచి చేరి, రెడ్డి గారిని కలిసి లక్ష్మీదేవి స్వర్ణ విగ్రహం చోరీకి గురైందన్న విషయం చెప్తాడు. ఈ రెండు సంఘటనల వల్ల క్రుంగిపోయిన రెడ్డిగారు యాత్ర ముగించి, వేరే వ్యానులో వసుంధర పార్థివ దేహాన్ని ఉంచి, ఊరు చేరుతారు. శాస్త్రి గారి ఇంటికి వెళ్ళి ఆ విషాద వార్తను వినిపిస్తారు. కుటుంబమంతా దుఃఖసాగరంలో మునిగిపోతారు. దౌహిత్రుడు రాఘవ ఎక్కడ వున్నదీ తెలియని కారణంగా వసుంధరమ్మ సోదరి కుమారుడు పాండురంగ అంత్యక్రియలు చేస్తాడు. వైకుంఠ సమారాధన ముగిసాకా, ఓ రోజు రెడ్డి గారు, శాస్త్రిగారు, సుల్తాన్ గోదావరి తీరానికి వెళ్తారు. అమ్మవారి విగ్రహం దోపిడీకి గురవడంలో రాబర్ట్ ప్రమేయం ఉందని రెడ్డిగారు, సుల్తాన్ అంటారు. అతను నీచుడే అయినా అమ్మవారి విగ్రహాన్ని దోపిడీ చేయించేందుకు పూనుకోడని శాస్త్రి గారు అంటారు. కాసేపు మాట్లాడుకున్నాకా, ఇంటివైపు నడుస్తుంటే, వాళ్ళకి జాలయ్య ఎదురుపడతాడు. రెడ్దిగారి కాళ్ళ మీద పడి తనని క్షమించమంటాడు. జరిగినదంతా వివరంగా చెప్తాడు. కరీమ్ అనుచరులు తనని చంపడానికి ప్రయత్నిస్తున్నారనీ, తనని కాపాడాలని అంటాడు జాలయ్య. నలుగురు ఊరి వైపు బయల్దేరుతారు. – ఇక చదవండి.]
ఆ రోజు అమావాస్య.. రాత్రి ఒంటిగంట ప్రాంతం. రాఘవ నరసింహశాస్త్రి గారి యింటికి వచ్చి తలుపు తట్టాడు. జరిగిన జరుగుతున్న చిత్ర విచిత్రమైన సంఘటనలు శాస్త్రిగారి మనస్సుకు ఎంతో కలవరాన్ని కలిగించాయి. రాత్రులు.. ప్రశాంతంగా నిద్రపోలేక పోతున్నారు శాస్త్రిగారు. వారి మనస్సు కీడును శంకిస్తూ వుంది. దైవధ్యానంతో కళ్ళు మూసుకొని వున్న వారు.. తలుపు కొట్టిన సవ్వడిని విని త్రోటుపాటుతో లేచి వెళ్ళి తలుపును తెరిచారు.
ఎదిగిన గడ్డం.. తైల సంస్కారం లేని జుట్టు బికారిలా వాకిట్లో నిలబడి వున్న రాఘవను చూచారు శాస్త్రిగారు. “మామయ్యా!.. బావ వచ్చాడా!..” దీనంగా అడిగాడు రాఘవ. అతని చేతిని తన చేతిలోనికి తీసికొని ముందుకు లాగారు. రాఘవ ఇంట్లోకి ప్రవేశించాడు. శాస్త్రిగారు తలుపు మూశారు. రాఘవ వైపు చూచారు. దోషిలా రాఘవ తల దించుకొన్నాడు.
“రాఘవా!.. ఏందిరా ఇదంతా!..” విచారంగా అడిగారు.
“అంతా దైవ నిర్ణయం మామయ్యా!.. సీత కన్నదని విన్నాను. బావ వచ్చి వుంటాడని.. వారిని బిడ్డను చూడాలని వచ్చాను. నా కోసం రాబర్ట్ పోలీసు బలగాలు గాలిస్తున్నారు. నేను ఇక్కడ ఎక్కువసేపు వుండలేను. మామయ్యా!.. బావ వచ్చాడా మామయ్యా!..” ప్రాధేయపూర్వకంగా అడిగాడు రాఘవ.
“అంతా నీ చేతులారా నీవు చేసికొన్నది!.. భద్రాచలం వచ్చి నాతో రారా అని చెబితే.. నీవు నా మాటను వినలేదు.. నేను తిరిగి బయలుదేరినప్పుడు నది ఒడ్డున వున్న పడవరేవు దాకా కూడా నీవు నాతో రాలేకపోయావు. నీ మూఢత్వం నిన్ను ఏ స్థితికి తీసికొని వెళ్ళిందో ఇప్పటికైనా గ్రహించావా!..” ఆవేదనతో చెప్పారు శాస్త్రిగారు.
రాఘవ మౌనంగా తల దించుకొని నిలబడ్డాడు. కొన్నిక్షణాల తర్వాత..
“మామయ్యా!.. సీతను, పాపను చూడాలి!.. చూడనిస్తారా!..” దీనంగా అడిగాడు రాఘవ.
సావిత్రికి మెలకువ వచ్చింది. శాస్త్రిగారి గొంతు విని హాల్లోకి వచ్చింది. పోల్చుకోలేని స్థితిలో వున్న రాఘవను చూచింది.
“రాఘవా!..”
ఆ ఇరువురి చూపులు.. ఆమె వైపు మళ్ళాయి. రాఘవ సావిత్రిని సమీపించాడు కన్నీటితో..
అతని చేతులను పట్టుకొని పై నుంచి క్రిందవరకూ చూచిన సావిత్రి.. “ఏమిటిరా యీ అవతారం!..” బొంగురు పోయిన కంఠంతో అడిగింది.
“అత్తయ్యా!.. నీవు బాగున్నావా!..”
“నీ ముందే వున్నానుగా!.. నీకు కనబడడం లేదా!.. నా బాగోగులు. ఆది దేశాంతరం పోయాడు. ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలీదు. నీవు అడవుల పాలై హంతకుడిలా మారిపోయావు. నాకు కొండంత అండగా వున్న మా వదినగారు వెళ్ళిపోయారు. ఇంట్లో ఒకటి ఇద్దరు చిన్నారులు వున్నా.. మనోవేదనతో వారి ఆలనాపాలనా కూడా సరిగా చేయలేకపోతున్నాను. మనస్సు నిండా దిగులు.. బాధరా!.. ఎవరితోనూ చెప్పుకోలేని పరిస్థితిరా నాది!..” ఎంతో ఆవేదనతో చెప్పింది సావిత్రి.
నరసింహశాస్త్రి సావిత్రి ముఖంలోకి చూచారు.. వారి కళ్ళల్లో సావిత్రి మీద జాలి.. అభిమానం..
‘అవును సావిత్రి!.. నీ హృదయవేదనను నేను ఎరుగును. కానీ నేనూ ఏమి చేయలేని స్థితి.. ఎంతో గుప్తంగా హృదయంలో దాచుకొన్న నీ ఆవేదనను ఆత్మీయుడు కనబడగానే బయటికి చెప్పేశావు. దీన్నే అంటారు కష్టసుఖాల్లో అయిన వారి అండ అవసరం అని. ఇప్పుడు నీ హృదయ భారం కొంతవరకూ తగ్గి వుంటుంది..’ అనుకొన్నారు శాస్త్రిగారు.
“సావిత్రి!.. సీతకు రాఘవ వచ్చాడని చెబుతావా!..” మెల్లగా చెప్పారు శాస్త్రిగారు.
కన్నీటిని పవిటతో తుడుచుకొని.. “చెబుతానండీ!..” అంది సావిత్రి. సీత గదివైపుకు నడిచింది. లోనికి వెళ్ళి సీతను లేపింది. శాస్త్రిగారు పాండురంగ గది వైపుకు వెళ్ళి తలుపు తట్టాడు. పాండు తలుపు తెరిచాడు. “పాండూ!.. మన రాఘవ వచ్చాడురా..” చెప్పారు శాస్త్రిగారు.
పాండురంగ.. హాల్లో ప్రవేశించి రాఘవను చూచాడు. అతని స్థితిని చూచిన పాండుకు ఎంతో ఆశ్చర్యం. ఆత్రుతతో రాఘవను సమీపించాడు.
“అన్నయ్యా!.. ఏమిటది.. యిలా ఐపోయావ్..” ఆవేదన.. కన్నీరు.. అడిగాడు పాండు ఆందోళనతో.
“రేయ్!.. పాండు!.. నాకేంరా, నేను బాగానే వున్నాను. పాప.. సుమతి ఎలా వున్నారు. పాప ఆ.. వూ.. అంటూంది కదూ ఇప్పుడు..”
“అవును..” బొంగురు పోయిన కంఠంతో చెప్పాడు పాండు.
“పాపను.. సుమతిని ఒకసారి చూడాలని వుందిరా!..” దీనంగా అడిగాడు రాఘవ.
“రా అన్నయ్యా!.. రా!..” రాఘవ చేతిని తన చేతిలోనికి తీసుకొని తన గది వైపుకు నడిచాడు పాండు.
సుమతి పాపను ఎత్తుకొని వాకిట నిలబడి వుంది. రాఘవ సుమతి చూచాడు.
“అమ్మా!.. బాగున్నావా!.. పాప ఆరోగ్యంగా వుంది కదూ!..”
ఆమె చేతుల్లో నిద్రపోతూ వున్న పాపను ప్రేమతో చూచాడు రాఘవ.
తన కుడి చేతిని పాప తలపై వుంచి.. “బంగారు తల్లీ.. నీవు మా పిన్నివి కదమ్మా!.. తల్లీ, నీవు సర్వసౌభాగ్యాలతో నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో బిడ్డలు మనవలు మనుమరాండ్రతో చల్లగా వర్ధిల్లాలమ్మా.. అమ్మా!.. నీవు పెద్దయ్యాక అమ్మా నాన్నలను బాగా చూచుకోవాలి. మీ అమ్మానాన్నలు చాలా అమాయకులమ్మా. ఎంతో ఎంతో మంచివారమ్మా!.. నీవు ఎదిగాక నీతో ముచ్చటించేదానికి నాకు పొద్దు లేదు తల్లి!.. అందుకే.. నీ పెదతండ్రిగా నీకు చెప్పవలసినవన్నీ ఇప్పుడే చెప్పేశాను..” దీనంగా చెప్పాడు రాఘవ.
“రాఘవా!.. ఏమిట్రా ఆ మాటలు!..” నిలబడి జరుగుతున్న సన్నివేశాన్ని తిలకిస్తున్న శాస్త్రిగారి నోటి నుంచి ఆ మాటలు ఎంతో ఆవేదనతో వెలువడ్డాయి.
రాఘవ శాస్త్రిగారి ముఖంలోకి చూచాడు. వారి వదనంలో ఆవేదన.. పాండు.. సుమతి కళ్ళల్లో కన్నీరు. రోదిస్తూ ఇరువురూ తలలు దించుకొన్నారు.
సావిత్రి నిద్ర లేపగా.. సీత మేల్కొంది.
“ఏమిటత్తయ్యా!.. యీ వేళప్పుడొచ్చారు?..” మెల్లగా అంది సీత.. అద్వైత్ రానందుకు ఎంతో విచారంతో సీత కృంగి కృశించి పోతూ వుంది. ఆమెలోని పూర్వపు చలాకీతనము మాయమయింది.
“అమ్మా సీతా!..”
“చెప్పండత్తయ్యా!..”
“మన రాఘవ వచ్చాడమ్మా!..”
“ఆఁ..”
“అవునమ్మా!.. నిన్ను పాపను చూడాలంటున్నాడు..”
“ఎక్కడ వున్నాడు?..”
“హాల్లో..”
“ఇక్కడికి రాలేదేం?..”
“పాండు సుమతీలతో మాట్లాడుతున్నాడమ్మా!..”
సీత మంచం దిగింది.
వారిరువురూ.. హాల్లోకి వచ్చారు.
పోల్చుకోలేని స్థితిలో వున్న రాఘవను చూచి సీత ఆశ్చర్యపోయింది. నిశ్చేష్టురాలై అతన్ని చూస్తూ నిలబడిపోయింది. ఆమె నోటి నుండి ఎలాంటి పలుకూ రాలేదు.
రాఘవ.. సీతను చూచాడు. మెల్లగా ఆమెను సమీపించాడు.
“అమ్మా!.. సీతా!..”
సీత అతన్ని చూచి బోరున ఏడుస్తూ అతని గుండెల తన తలను ఆనించింది. ఎక్కి ఎక్కి ఏడ్వసాగింది. రాఘవ.. అక్కడికి వచ్చినప్పటి నుంచీ.. అతని ప్రయత్నం లేకుండానే కన్నీరు జలపాతంలా కారుతూ వుంది. అది రక్త సంబంధానికి బాంధవ్యాలకు వున్న మహిమను తెలియజేస్తూ వుంది.
“వూరుకో అమ్మా వూరుకో!.. బావ రాలేదనే కదా నీ ఏడుపు. అమ్మా!.. బావ తప్పకుండా త్వరలో వస్తాడు” అనునయంగా చెప్పాడు రాఘవ.
“నీకు ఉత్తరం వ్రాశాడా! అన్నయ్యా!..” దీనంగా బొంగురుపోయిన కంఠంతో అడిగింది సీత.
“లేదమ్మా!.. నేను బావకు నీవు గర్భవతివని.. వెంటనే తిరిగి రావలసిందనీ వ్రాశాను..”
“నేనూ వ్రాశాను.. కానీ ఇంతవరకూ జవాబు లేదు. మనిషి రాలేదు. ఒకవైపు నిన్ను గురించి.. మరోవైపు బావను గురించి ఆలోచించి.. ఆలోచించి నాకు పిచ్చి పట్టేలా వుందన్నయ్యా!..” గద్గదస్వరంతో చెప్పింది సీత.
“ఏమండీ!.. మీరూ ఆదికి సీత గర్భవతి అని వ్రాశారు కదా!..” అడిగింది సావిత్రి.
మౌనంగా వుండిపోయారు నరసింహశాస్త్రిగారు.. తాను ఏమని సావిత్రి ప్రశ్నకు జవాబు చెప్పగలడు!.. వారు వ్రాసిన ఉత్తరాలలో ఆదిని రమ్మనికాని.. క్రిందటి సారి వ్రాసిన దానిలో సీత ప్రసవించిందని కానీ వ్రాయలేదు.. వారు వ్రాయకపోవడానికి కారణం.. వారికి మాత్రమే తెలుసు.
శాస్త్రిగారి మౌనం.. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అందరూ వారి వంక చూచారు ఆశ్చర్యంతో.
“మామయ్య ఏ పని చేసినా.. సకారణంగానే చేస్తారు కదా అత్తయ్యా!.. ఆ విషయం మీకు బాగా తెలుసుగా!..” అంత దుఃఖంలోనూ నవ్వుతూ చెప్పాడు రాఘవ. కొన్నిక్షణాల తర్వాత..
“అమ్మా సీతా!.. నా కోడలిని చూపించవా!..”
“చూద్దువుగాని రా అన్నయ్యా!..”
“అత్తయ్యా!.. పాపకు బాలసారే జరిగిందా!..”
“లేదు..” సావిత్రి కంటే ముందు సీత సమాధానం చెప్పింది.
“కారణం!..”
“మామయ్య గారితో మన బావ వచ్చాకనే పాప బాలసారె జరగాలని నేను చెప్పాను..”
“పాపకు ఇప్పుడు ఎన్నో నెల?..”
“రెండో నెల..”
సీత తన గదిలోకి వెళ్ళుతూ.. “రా అన్నయ్యా!..” రాఘవను పిలిచింది. రాఘవ ఆమె వెనకాలే గదిలోనికి నడిచాడు. సావిత్రి వారిని అనుసరించింది.
పాప.. హాయిగా నిద్రపోతూ వుంది.
రాఘవ.. వంగి పాప ముఖంలోకి కొన్నిక్షణాలు చూచాడు. సీత సావిత్రి.. రాఘవ ముఖ కవళికలను చూస్తున్నారు.
“పాప పోలిక అంతా మన బావదే సీతా!..” నవ్వుతూ చెప్పాడు రాఘవ.
“అవునురా..” అంది సావిత్రి.
సీత.. ‘అవును’.. అన్నట్లు తల పంకించింది.
రాఘవ జేబు నుంచి కొంత డబ్బును తీసి సావిత్రి చేతిలో వుంచి.. “అత్తయ్యా!.. ఆ కూతురికి.. ఈ కోడలికి నా గుర్తుగా ఏదైనా చేయించు..” మెల్లగా చెప్పాడు రాఘవ.
“సీతా!.. పాపను జాగ్రర్తగా చూచుకో.. ఇక నేను బయలుదేరాలి..”
“అన్నయ్యా!..” ఆశ్చర్యంతో అంది సీత.
“ఇప్పుడు ఎక్కడికి వెళతావురా..” అమాయకంగా అడిగింది సావిత్రి.
“అత్తయ్యా.. ఆంగ్లేయుల దృష్టిలో, ముఖ్యంగా రాబర్ట్ దృష్టిలో నేను నేరస్థుణ్ణి. వారు నన్ను పట్టుకోవాలనే ప్రయత్నంలో వున్నారు. నేను ఇక్కడ వున్న విషయం వారికి తెలిస్తే.. నాకు, మీ అందరికీ హానికరం. అందుచేత.. నేను వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి..” ఆ గది ద్వారాన్ని సమీపించిన నరసింహశాస్త్రి గారు.. పాండురంగ, సుమతి రాఘవ చెప్పిన మాటలు విన్నారు. అందరి ముఖాల్లో ఆవేదన. రాఘవ అందరినీ పరీక్షగా చూచాడు.. విరక్తితో కూడిన చిరునవ్వుతో..
“మీరంతా నా గురించి ఎంతగా బాధ పడుతున్నారో నాకు తెలుసు. నా కోసం రాబర్ట్ వర్గం గాలిస్తూ వున్నదన్న విషయమూ మీకు తెలుసు. ప్రతి మనిషీ తన జీవిత కాలంలో ఏదో ఒక లక్ష్యంతో జీవితాన్ని సాగిస్తాడు. ఆ లక్ష్యం పదిమంది తన తోటివారికి ఆనందం కలిగించేది కావచ్చు.. అది వారికి నచ్చనందున వారికి బాధను కలిగించవచ్చు. నా లక్ష్యం మీకు పంచింది బాధనే.. కానీ నాకు ఎంతో ఆనందంగా వుంది. కారణం నేను చంపింది.. అమాయకులైన నా తల్లిదండ్రులను కాల్చి చంపిన కిరాతకుణ్ణి. అలాంటివారు బ్రతికుంటే యింకా ఎందరి ప్రాణాలు తమ రాక్షస ప్రవృత్తితో నిర్దయగా తీస్తారు. అమ్మా సీతా!.. మన అమ్మా నాన్నలకు జరిగిన అన్యాయం ఆ రిచర్డ్ వలన మరెవ్వరికీ జరగకూడదని వాడిని అతని ఇద్దరు తొత్తులను తన్ని జీపులో పడేసి దాని లోయలో త్రోసేసాను. నా పగ చల్లారింది. నా లక్ష్యం నెరవేరింది. తన వారికి మేలు చేయాలనే మహాలక్ష్యంతో నా ఆరాధనా గురువుగారు శ్రీ అల్లూరి సీతారామరాజు ఆ తెల్లరాక్షస మూక చేతుల్లో చిక్కుకొని.. వారి చేత నిర్దయగా కాల్చి చంపబడ్డారు. వారి ఆత్మ తాను సంకల్పించిన లక్ష్యాన్ని సాధించలేక పోయానని ఎంతగా విలపించిందో.. కానీ.. నేను నా లక్ష్యాన్ని సాధించాను. నా నిర్ణయం ప్రకారం ఒక కిరాతకుణ్ణి చంపగలిగాను. నా మనస్సుకు ఎంతో ఆనందం. మామయ్యా.. నన్ను వారు చంపుతారే అనే భయం బాధ నాకు లేదు. మీరు చెప్పే రీతిగా నేరస్థుడు శిక్షను అనుభవించవలసిందే.. అది నా విషయంలో ఎలా పరిణమించినా నాకు విచారం కలుగదు. కానీ.. నేను వారికి అంత సులభంగా దొరకను. నా చివరి శ్వాసవరకూ నేను రాబర్ట్ గుండెల్లో దడ పుట్టిస్తాను. అత్తయ్యా! నీవు మామయ్య ప్రక్కకురా..” చిరునవ్వుతో చెప్పాడు రాఘవ.
సావిత్రి యాంత్రికంగా కదలి నరసింహశాస్త్రిగారి ప్రక్కకు వచ్చింది. రాఘవ వారిరువురి పాదాలను తాకాడు.
“ఏమని దీవించమంటావురా!..” గద్గదస్వరంతో అడిగింది సావిత్రి.
“రాబోయే మరణాన్ని ఆనందంగా స్వీకరించే శక్తి నాకు కలగాలని ఆశీర్వదించండి..” విరక్తిగా నవ్వుతూ అన్నాడు రాఘవ.
నరసింహశాస్త్రిగారు రాఘవ భుజాలు పట్టుకొని పైకి లేపి అతన్ని తన హృదయానికి హత్తుకున్నారు.
“నేను నాటిన మొక్కలు నా ముందే యిలా వసివాడి పోవడాన్ని చూడాలని నా నుదుట వ్రాశాడు ఆ బ్రహ్మదేవుడు..” విచారంగా కన్నీటితో పలికారు శాస్త్రిగారు.
రాఘవ బొడ్లో వున్న రివాల్వర్ క్రింద పడింది. దాన్ని అందరూ ఆశ్చర్యంతో చూచారు.
“రాఘవా!.. తు..” ఆశ్చర్యంతో అన్న సావిత్రి ముగించక ముందే..
“అవునత్తయ్యా!.. అది తుపాకి.. రిచ్చర్డ్ గాడిది.. దీట్లో ఆరు గుండ్లు వున్నాయి. నేను చచ్చే లోపల కనీసం మరో ఆరుగురు తెల్ల రాక్షసులను చంపుతాను..”
రాఘవ వంగి తుపాకిని చేతికి తీసుకొన్నాడు. బొడ్లో వుంచుకొన్నాడు. కన్నీటితో తన్నే చూస్తున్న సీత ముఖంలోకి చూచాడు. సమీపించాడు.
“అమ్మా!.. బాధపడకు. బావను ఎంతగానో ప్రేమించావు. ఆయన్ను నీ వాడిగా చేసుకొన్నావు. మన పురిగండ్ల వారికి యీ చతుర్వేదుల వారికి ఆరు తరాల సంబంధ బాంధవ్యాలు వున్నాయి. తాతముత్తాతల నాటి రోజులు వేరు. యీ రోజులు వేరు. మనుషుల తత్వాల్లో మార్పు.. కానీ కాలమానంలో మార్పు లేదు. మన జీవితాలు కాలమానంతో ముడిపడివున్నాయి. కష్టసుఖాలను ఒకే రీతిగా స్వీకరించాలి. ధర్మాన్ని న్యాయాన్ని నీతిని నిజాయితీని కాపాడాలి. జీవితంలో ముందు ఎటువంటి సమస్య ఎదురైనా ధైర్యంతో ఎదుర్కోవాలి. నీవు పుట్టిన ఇంటికి మెట్టిన ఇంటికి.. నీ చర్యల వలన కీర్తి ప్రతిష్ఠలను సంపాదించాలి. అత్తయ్యను మామయ్యను జాగ్రర్తగా చూచుకోవాలి. పాపను సక్రమంగా పెంచి ఆమె పుట్టిన వంశానికి కీర్తి ప్రతిష్ఠలను తెచ్చేలా చూడాలి. పిరికితనాన్ని పారదోలి జీవితంలో ధైర్యంగా చక్కటి ఆశయాలతో ముందుకు నడవాలి చెల్లీ!..” తన చేతిని సీత తలపై వుంచాడు రాఘవ. సీత బోరున ఏడ్చింది.. తన చేతులతో ఆమె కన్నీటిని తుడిచాడు. ముందుకు నడిచి అందరికీ నమస్కరించాడు. వేగంగా యింట్లో నుంచి బయటికి నడిచి ఆ అమావాస్య చీకటిలో కలసిపోయాడు రాఘవ.
రాఘవ ఆ కారుచీకటిలో రాబర్ట్ గృహం వెనుక భాగం నుంచి లోనకి ప్రవేశించాడు. అతని చివరి లక్ష్యం రాబర్ట్‌ని చంపడం.. ఆనాటి ఉదయం రాబర్ట్.. విశాఖపట్నానికి వెళ్ళాడు. అతని ఇంటి కాపలాదారులు ఆంగ్ల సిపాయిలు రాఘవను చూచారు. అతని వైపుకు తుపాకులతో నడిచారు. చాటుగా వుండి ఆ ఇద్దరినీ కాల్చి చంపాడు రాఘవ.
‘నేను మిమ్మల్ని చంపాలని రాలేదు రా!.. మీకు నాకు పగ లేదుగా.. కానీ మీరు నా పగవాని ఇంట్లో కాపలా వుండి నన్ను కాల్చాలని ప్రయత్నించినందుకు మీకు యీ శిక్ష.. సర్వేశ్వరుడు మీ ఆత్మలకు శాంతి కలిగించుగాక!..’ వారిని ఆశీర్వదించి రాఘవ వెళ్ళిపోయాడు.
అదే సమయంలో శ్రీమహాలక్ష్మి బంగారు విగ్రహాన్ని కరీమ్ చలమయ్యలు కలకత్తాలో రాబర్ట్ మొదటి భార్య కొడుకు విన్సెంట్.. రంగయ్య మేనకోడలు చామంతి ఇంటికి చేర్చి.. మాత బంగారు విగ్రహాన్ని విన్సెంట్‌కు, రాబర్ట్ అతనికి వ్రాసిన వుత్తరాన్ని అందించారు. వారు రాజమండ్రికి బయలుదేరారు.
భార్య చామంతికి తెలియకుండా విన్సెంట్ ఇంట్లో బంగారు విగ్రహాన్ని దాచాడు.
ఆనాటికి పది రోజుల ముందు రంగయ్య తన బావమరది బాలయ్యతో కలకత్తాకు వెళ్లి చామంతిని చూచి.. మాట్లాడి ఊరికి తిరిగి వచ్చారు. చామంతి ఆరు మాసాల గర్భవతి. భర్త తన్ను బాగా చూచుకుంటున్నాడని వారికి చెప్పింది చామంతి.
కలకత్తాకు బయలుదేరబోయే ముందు రాబర్ట్.. తనకు నరసింహశాస్త్రి రాఘవ వివరాలు తనకు తెలిసీ చెప్పనందుకుగాను.. రాఘవ.. తన ఇద్దరు సిపాయిలను చంపినందుకు గాను.. మరుదినం ఉదయం శాస్త్రిగారిని అరెస్టు చేసి జైల్లో తోయమని పోలీసులకు ఆదేశాన్ని యిచ్చాడు.
మరుదినం ఉదయం.. ఆరున్నర గంటలకు పోలీస్‌లు ఇన్స్పెక్టర్ శాస్త్రిగారి ఇంటికి వచ్చారు. నిన్న రాత్రి రాఘవ ఇక్కడికి వచ్చి.. మిమ్మల్ని కలిసి.. ఇద్దరు సిపాయిలను కాల్చి చంపాడు. అతను రాగానే మీరు మాకు తెలియజేయనందున మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని శాస్త్రిగారికి వారు చెప్పి వారి చేతులకు సంకెళ్ళు తగిలించి.. పోలీసులు వారిని జైల్లోకి త్రోశారు.
రాఘవ రాక.. అతని మాటలు.. విన్న ఆ యింటి వారంతా ఎంతో వేదనగా వున్న ఆ సమయంలో.. పోలీసులు వచ్చి శాస్త్రిగారికి బేడీలు తగిలించి లాక్కొని పోవడంతో వారందరి ఆవేదన తారాస్థాయికి చేరింది. సావిత్రి స్పృహ కోల్పోయి పడిపోయింది. సీత.. పాండు సుమతులు ఆమె ప్రక్క ఏడుస్తూ చేరారు.
సీత.. రెడ్డి రామిరెడ్డిగారి ఇంటికి పరుగెత్తి వుదయాన్నే జరిగిన విషయాన్ని చెప్పి బోరున ఏడ్చింది.
పోలీసుల చర్యకు రామిరెడ్డిగారు ఆశ్చర్యపోయాడు. తన బావమరది శేషారెడ్డితో కలిసి పోలీస్ స్టేషన్ వైపుకు బయలుదేరారు..
సీత.. ఏడుస్తూ తన ఇంటివైపుకు నడిచింది.
సావిత్రికి ఎంతకూ స్పృహ రానందున పాండురంగ తన స్నేహితుల సాయంతో సావిత్రిని హాస్పటల్‌కు చేర్చాడు. సుమతి సావిత్రి ప్రక్కన హాస్పటల్లో వుంది.
సావిత్రి పరీక్షించిన డాక్టర్లు.. ‘హార్ట్ అటాక్’.. అని తేల్చారు.. సమయానికి తీసుకొని వచ్చినందున ప్రమాదం తప్పిందని.. కోలుకొనేదానికి వారం.. పది రోజులు పడతుందని చెప్పారు. ఇద్దరు పసికందుల మధ్యన సీత.. అంతులేని ఆవేదనతో క్షణం ఒక యుగంగా గడపసాగింది.
రెడ్డిరామిరెడ్డి, శేషారెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ను కలిశారు. నరసింహశాస్త్రిగారు.. చాలా గొప్ప వ్యక్తి.. రాఘవ విషయం వారికి తెలియనందున చెప్పలేక పోయారని.. వారిని విడిపించవలసిందిగా ప్రాధేయపూర్వకంగా కోరారు.
పోలీసులు.. వారి మాటలను గౌరవించలేదు. తనకు రాఘవ విషయం ఉనికి.. తెలిసీ మాకు తెలియజేయనందున ప్రభుత్వ ఆదేశానుసారం.. వారిని అరెస్టు చేశామని.. రెడ్డిగారి విన్నపాన్ని లెక్క చేయలేదు. వారిని స్టేషన్ నుండి వెళ్ళిపొమ్మని ఆదేశించారు.
రామిరెడ్డిగారు శేషారెడ్డి.. లాయర్ గోపాలశర్మ యింటి వైపుకు నడిచారు. అరగంట ముందు యనబై రెండేళ్ళ గోపాలశర్మగారు హాస్పటల్లో చేర్చబడ్డారు. వారి ప్రయత్నం విఫలమయింది. మరో లాయర్ ముకుందాన్ని వారు కలిశారు. విషయం క్రిమినల్ కేసుకు సంబంధించింది.. అలాంటి వాటిని నేను టేకప్ చేయనని ఆ న్యాయవాది పెదవి విరిచారు. ఆ ఇరువురూ.. నరసింహశాస్త్రిగారి ఇంటికి బయలుదేరారు. వారికి మార్గంలో సుల్తాన్ కలిశాడు. “సుల్తాన్ శాస్త్రిగారిని పోలీసులు అరెస్టు చేశారు..” విచారంగా చెప్పాడు రామిరెడ్డి.
“అయ్యా! విషయాన్ని విన్నాను. మిమ్మల్ని కలవాలనే వస్తున్నాను..” ఆవేదనతో చెప్పాడు సుల్తాన్. క్షణం తర్వాత.. “అయ్యా!.. కరీంగాడు.. అతని అనుచరుడు చలమయ్యా కలసి అమ్మవారి బంగారు విగ్రహాన్ని రాబర్ట్ చెప్పగా దొంగలించారు. యీ ఉదయం అనుమానంతో నేను కరీమ్ భార్యను కలిశాను. వాడు పని మీద కలకత్తాకు వెళ్ళాడని చెప్పింది. దాన్ని బట్టి విగ్రహాన్ని కాజేసింది రాబర్ట్ అనే నా అభిప్రాయం!..” ఆవేశంగా చెప్పాడు సుల్తాన్.
“నాకు వాడి మీదే అనుమానం సుల్తాన్.. కానీ మనం వాణ్ణి ఏమీ చేయలేము కదా!..” జిజ్ఞాసగా చెప్పాడు రెడ్డిగారు.
ముగ్గురూ శాస్త్రిగారి ఇంటికి వెళ్ళారు. సీత ఏడుస్తూ సావిత్రి స్థితిని గురించి వారికి చెప్పింది. ముగ్గురూ పరుగున హాస్పటల్‌కు బయలుదేరారు.
పాండురంగను కలిశారు. అతను సావిత్రికి హార్ట్ అటాక్ అని ఏడుస్తూ చెప్పాడు.
రెడ్డిగారు పెద్ద డాక్టరను కలసికొన్నారు. “ఎంత ఖర్చయినా సరే సొమ్మును నేను చెల్లిస్తాను. మా చెల్లెమ్మను కాపాడండి డాక్టర్!..” దీనంగా వారి చేతులను పట్టుకొన్నాడు రెడ్డిగారు.
“నా ప్రయత్నాన్ని నేను చేస్తూ వున్నాను. ఆపైన అంతా దైవ నిర్ణయం..” డాక్టర్ ఐసియులోకి వెళ్ళిపోయారు.
“మా యింటికి, మా వారికి గ్రహణం పట్టింది బాబాయ్!..” రెడ్డిగారిని చుట్టుకొని బోరున ఏడ్చాడు పాండు.
“బాబూ!.. పాండూ!.. యిప్పుడు నీవు చాలా ధైర్యంగా వుండాలి నాయనా.. నీవు అధైర్యపడకూడదు. సుమతికి సీతకు నీవు ధైర్యం చెప్పి వారిని వూరడించాలి. బాధపడకు. సహనంతో సమస్యను ఎదుర్కో.. మేమంతా నీకు అండగా వున్నాముగా!..” పాండుని ప్రీతిగా అనునయించాడు రెడ్డిగారు. క్షణం తర్వాత.. “శేషు!.. నీవు పాండుకు తోడుగా వుండు. నేను సుల్తాన్ జైలుకు వెళ్ళి శాస్త్రిగారిని చూచి వస్తాము.”
“అలాగే బావా!..”
రెడ్డిగారు.. సుల్తాన్ జైలు వైపుకు వెళ్ళారు. కటకటాల వెనుక వున్న నరసింహశాస్త్రిని చూచారు. చమట కారే ముఖంలో అర్ధనయనాలతో దీనంగా వారిని చూచారు శాస్త్రిగారు.
వారి స్థితిని చూచిన ఆ యిరువురికీ దుఃఖం పొంగి వచ్చింది.
“చీమకు కూడా హాని చేయని మీకు యీ కటకటాల వెనుకనా స్వామీ!..” బోరున ఏడ్చాడు సుల్తాన్. ఆవేదనతో రెడ్డిగారు మాట్లాడలేక పోయాడు.
“రెడ్డిగారూ!.. నేను బయటికి వచ్చేవరకూ నా వారిని మీరు..”
“జాగ్రర్తగా చూచుకొంటానయ్యా!..” గద్గదస్వరంలో చెప్పాడు రెడ్డిగారు.
పోలీసులు పొమ్మనడంతో వారు బయటికి నడిచారు. ఆ రాత్రి పాండూకు సాయంగా రెడ్డిగారు హాస్పటల్లో.. సీతకు సాయంగా సుల్తాన్ శాస్త్రిగారి ఇంట వుండిపోయారు.
(ఇంకా ఉంది)
సిహెచ్. సి. ఎస్. శర్మ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి జననం నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా ఊచగుంటపాళెంలో జరిగింది. ప్రాథమిక విద్య పెయ్యలపాళెం, బుచ్చిరెడ్డిపాళెంలోనూ, ఉన్నతవిద్య నెల్లూరులోనూ.
సివిల్ ఇంజనీరుగా రాష్ట్రంలోని పలు సంస్థలలో వివిధ హోదాలలో పని చేసి చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరక్టర్ స్థాయికి ఎదిగారు.
చిన్ననాడు బామ్మగారు చెప్పిన కథలతో ప్రేరణ పొంది బాల్యం నుంచే రచనలు చేశారు. మిత్ర రచయితల ప్రోత్సాహంతో రచనా రంగంలో విశేషంగా కృషి చేశారు. 20 నవలలు, 100 కథలు, 12 నాటికలు/నాటకాలు, 30 కవితలు రాశారు.
వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ట్విన్ సిటీస్ సింగర్స్-1: చిత్రపు లక్ష్మీ పద్మజ
మహాభారత కథలు-6: ఉదంక మహర్షి
భూతద్దం
99 పదాల కథ – 2: భాష
బతికి సచ్చిన మనిసి
తెలుగుజాతికి ‘భూషణాలు’-21
ముద్రారాక్షసమ్ – పఞ్చమాఙ్కః – 5
అమ్మనుంచి అమ్మదాకా
హాలికుడి గర్భశోకం
బివిడి ప్రసాదరావు హైకూలు 11
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®