Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అద్వైత్ ఇండియా-19

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[రాత్రి ఆశ్రమంలో గడిపిన ఆండ్రియా, ఇండియా, మేరీలను తీసికొని రావడానికి సుల్తాన్ తెల్లవారు ఝామునే వెళ్తాడు. వారు సిద్ధంగా ఉంటారు, కారులో అందరూ బయల్దేరుతారు. పార్టీ ఎలా జరిగిందని ఆండ్రియా సుల్తాన్‍ను అడుగుతుంది. అతను వెంటనే జవాబు చెప్పడు. ఆండ్రియాకు నిజం చెప్పాలా వద్దా అని సంశయిస్తాడు. ఆండ్రియా మళ్ళీ అడిగేసరికి జరిగినదంతా చెప్తాడు. పార్టీకి అద్వైత్ రావటం, అతని చేత రాబర్ట్ మద్యం తాగించటం, తాను అద్వైత్‍ను ఇంటికి చేర్చడం – అన్నీ చెప్తాడు. వాళ్ళు ముగ్గురూ రాబర్ట్ ప్రవర్తనను అసహ్యించుకుంటారు. రాబర్ట్‌కీ, ఆండ్రియాకీ సఖ్యత లోపించడంతో, అతను తన ఆఫీసులోని లిల్లీ అనే ఆంగ్లో ఇండియన్‍తో సంబంధం పెట్టుకుంటాడు. సుల్తాన్‍ ఆ విషయం గ్రహించినా, ఏమీ తెలియనట్టే ఉంటాడు. రాత్రి పార్టీ అయ్యాకా, లిల్లీ అక్కడే ఉండిపోతుంది. కారు రాబర్ట్‌ ఇంటికి చేరుతుంది. ఆండ్రియా ఇండియా మేరీలు కారు దిగారు. ఆండ్రియా వేగంగా వెళ్ళి తలుపు తడుతుంది. లిల్లీని రెస్ట్ రూమ్‍లో దాక్కోమని చెప్పి, లేచి వెళ్ళి తలుపు తీస్తాడు రాబర్ట్. వాళ్ళ మధ్య వాదోపవాదాలు జరుగుతాయి. ఘర్షణ తీవ్రతరమవుతుంది. చివరికి ఆండ్రియా ఇండియా మేరీలు తమ బట్టలు సర్దుకుని కల్నల్ మూన్ ఇంటికి వెళ్ళిపోతారు. ఉదయం ఐదు గంటలకు సీతకు మెలకువ వస్తుంది. అద్వైత్ గాఢ నిద్రలో ఉంటాడు. మెల్లగా లేచి వెళ్ళి కాలకృత్యాలు ముగించి, తల స్నానం చేసి పాయసం తయారు చేస్తుంది. పూజ చేసుకుని పాయసం నైవేద్యంగా అర్పించి దేవుడిని ప్రార్థిస్తుంది. బావ దూరమైపోతాడేమోనన్న భయంతో తాను చేసిన తప్పును క్షమించమని వేడుకుంటుంది. తరువాత కాఫీ కలుపుతుంది. అప్పటికే నిద్ర లేచిన అద్వైత్.. మంచం మీద వాడిన సన్నజాజులు చూస్తాడు. ఏదో అనుమానం వస్తుంది. రాత్రి జరిగినదంతా లీలగా, అస్పష్టంగా గుర్తొస్తుంది. తన వల్ల తప్పు జరిగిందని గ్రహిస్తాడు. స్నానం చేసి సీత గదిలోకి వెళ్తాడు. తన వల్ల తప్పు జరిగిందని, ప్రాయశ్చిత్తం చేసుకుంటాననీ అంటాడు. మాంగల్యం కొని తెచ్చి, ఆమె మెడలో కడతానంటాడు. తన దగ్గర ఉన్న తాళిబొట్టును బయటకు తీస్తుంది సీత. దేవుడి దగ్గరకు వెళ్తారిద్దరూ. విగ్రహాలకు నమస్కరించి సీత మెడలో తాళి కడతాడు అద్వైత్. తాను లండన్ నుంచి తిరిగి వచ్చే వరకూ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని అంటాడు. కాసేపటికి పాండురంగ, సుమతి వస్తారు. సుమతి సీతని అనుకున్న పని ఏమైందని అడిగితే, విజయం అంటుంది. ఆండ్రియా లండన్ వెళ్తున్నందున ఆమె తిరిగొచ్చేవరకూ ఆశ్రమాన్ని చూసుకోడానికి తెలిసిన వాళ్ళు కావాలనీ, ఆ బాధ్యతని పాండురంగని తీసుకోమని చెప్తాడు. సరేనంటాడు పాండురంగ. వెళ్ళి ఆ మాటని ఆవిడకి చెప్పి రమ్మంటాడు. ఇంతలో అక్కడికి సుల్తాన్ భాయ్ వస్తాడు. సీతా, తాను భద్రాచలం వెళ్ళాలనీ, ఓ టాక్సీ ఏర్పాటు చేయమని అడుగుతాడు అద్వైత్. ఓ అరగంటలో ఏర్పాటు చేస్తానని అక్కడ్నించి వెళ్తాడు సుల్తాన్ భాయ్. సీత ఎంతో సంతోషిస్తుంది. – ఇక చదవండి.]

అధ్యాయం 37:

ద్వైత్.. సీతలు భద్రాచల ప్రయాణానికి సిద్ధం అయినారు. సుల్తాన్ అంబాసిడర్ కారుతో వచ్చాడు. పాండురంగ ఆండ్రియాతో మాట్లాడి ఇంటికి తిరిగి వచ్చాడు. తన నిర్ణయానికి ఆండ్రియా సంతోషించిందని అద్వైత్‌కు చెప్పాడు.

సీత.. ఆద్వైత్‍లు సుమతీ.. పాండురంగలకు జాగ్రత్తలు చెప్పి కార్లో కూర్చున్నారు.

“సుల్తాన్ భాయ్!.. మాతో మీరూ వస్తున్నారా?..” అడిగాడు అద్వైత్

“అవును బాబు..”

“మరి రాబర్ట్ కొలువు?..”

“పని వుందని చెప్పి మూడు రోజులు శలవు అడిగాను..”

“ఏమీ అనకుండా శలవు మంజూర్ చేశారా!..”

“చేశారు బాబు.. నాకూ చాలా కాలంగా ఆ భద్రాద్రి సీతారాముల్ని దర్శించాలనే కోరిక. మీతో వస్తే నా కోర్కె తీరుతుంది కదా బాబూ!”

“మీకు సీతారాముల మీద నమ్మకం వుందా సుల్తాన్ భాయ్!..”

“బాబూ!.. మనకంటే గొప్పవారు.. సత్యం, ధర్మం, నీతి న్యాయాలకు కట్టుబడి.. జీవితాన్ని సాగించే వారెవరైనా సరే.. నాకు భక్తి.. గౌరవం. యిక త్రేతాయుగ నాయకుడు.. యావత్ ప్రపంచం ఎరిగినన రామరాజ్యం పాలకుడు.. యుగపురుషుడు.. అయిన శ్రీ సీతారామచంద్రమూర్తిని.. అహంకారులు, స్వార్థపరులు, భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడలేని మూర్ఖులు తప్ప.. మిగతా అందరూ ఆ పరంధాముని అభిమానులే..” నవ్వుతూ చెప్పాడు సుల్తాన్.

“మీ తెలుగు భాషలో ఎంతో స్వచ్ఛత వుంది సుల్తాన్ భాయ్!..”

“నా గురువులు.. మీ తాతగారైన రఘురామచంద్ర శాస్త్రిగారు బాబు. వారు ఆ రోజుల్లో ఎందరికో ఉచితంగా విద్యాదానాన్ని చేశారు. పెద్ద బాలశిక్షను పూర్తిగా మా చేత వల్లె వేయించారు. వారికి మీ నాన్నగారిలా.. కులమతాల పట్టింపు లేదు.. తన చుట్టూ వున్న వారంతా.. వివేకవంతులై సోదరభావంతో కలసి మెలసి వుండాలని ఎప్పుడు ప్రస్తావించేవారు. వారు నా సద్గురువులు.” కొన్ని క్షణాల తర్వాత..

“మీకు మరో విషయం తెలుసునా బాబూ!..” అడిగాడు సుల్తాన్

“ఏమిటది సుల్తాన్ భాయ్!..”

“మన దేశంలో వున్న కొందరి నేటి ముసల్మాన్లు.. ఒకప్పుడు హైందవులే.. కనికరం లేకుండా జహంగీర్ బాదుషాను వారి తనయుడు ఔరంగజేబు.. జైల్లోకి త్రోసి.. తాను బాదుషా అయ్యాడు. వారి కాలంలో మతద్వేషంతో, కొందరు హైందవులను తన పదవీ బలంతో ఇస్లాములుగా మార్చారు. కొన్ని తరాలు అలాగే పెరిగిపోయాయి. వారి శకం 1707లో ముగిసింది. బాబూ!.. నాకు తెలిసినంత వరకూ.. ఆ దేవుడు.. ఆ అల్లా.. ప్రతి ఒక్కరినీ వారికి నచ్చిన రీతిలో తనను ప్రార్థించమని.. అలాంటి వారి రక్షణ.. తన బాధ్యతని చెప్పేవాడే కానీ.. సాటి మనిషిని ద్వేషించి.. చంపి.. నీవు హాయిగా బ్రతకమని చెప్పబోడు. అలా చెబితే.. ఆ దేవుడు, ఆ అల్లా, మనలాంటి మామూలు మనిషే అవుతాడు గాని.. కోట్లాది జనం ఆరాధించే దేవుడెలా అవుతాడు?.. ప్రతి మనిషి యీ సృష్టిలో దైవారాధన విషయంలో సర్వస్వతంత్రుడు. సర్వాంతర్యామి అయిన ఆ సర్వేశ్వరుణ్ణి ఎవరు ఏ పేరుతో పిలిచినా వారికి ఆనందమే.. పరస్పర ద్వేషాలు విరోధాలు.. యుద్ధాలు.. చంపడాలు.. ఆ దైవత్వానికి సమ్మతం కాదు. తన సృష్టి అంతా అందంగా ఆనందంగా వుండాలనేదే ఆ దైవకాంక్ష. సాటి మనిషిని మనిషిగా గౌరవించి అభిమానించి.. ప్రేమించి.. సౌభాత్రాన్ని పంచలేని మనిషి.. అహంకారంతో తనకు తానే సాటి అని విర్రవీగుతూ.. చేసే పూజలు ప్రార్థనలు.. తన వరకూ సంతోషాన్ని కలిగించవచ్చునేమో కానీ.. ఆ దైవత్వాని ఆనందదాయకం కాలేవు. వున్న వునికి పరిసరాల కారణంగా నలుపు తెలుపు రంగులు.. మనుషులకు ఏర్పడతాయి. మనిషి నలుపైనా తెలుపైనా.. మనిషి మనిషే.. అలాంటి ఆ మనుషులంతా ఒక్కటే.. అందరికీ దైవం.. అల్లా.. ‘మాలిక్’ ఒక్కడే.. ఇది నాకు తెలిసిన జీవిత సత్యం బాబు” సుల్తాన్ చెప్పడం ఆపేశాడు.

సుల్తాన్ భాయ్ సుదీర్ఘ ఉపన్యాసాన్ని విని సీత.. ఆద్వైత్ ముఖంలోకి ఆశ్చర్యంగా చూచింది.. “గ్రేట్ బావా!..” అంటూ తల ఆడించింది. అద్వైత్ ఆలోచించసాగాడు.

వారు మారు మాట్లాడకుండా వుండడాన్ని చూచి సుల్తాన్.. “బాబూ!.. నా మాటలు మీకు బోరుగా, తప్పుగా.. తోచాయా!..” చిరునవ్వుతో రోడ్డు చూస్తూ కారును నడుపుతూ అడిగాడు.

“లేదు సుల్తాన్ భాయ్. మీరు నాకు తెలియని ఎన్నో గొప్ప విషయాలను చెప్పారు. బావ మీ మాటలను గురించే ఆలోచిస్తున్నారు” అంది సీత చిరునప్పుతో.

“సుల్తాన్ భాయ్. మా సీత చెప్పింది నిజం. మీరు గొప్ప వేదాంతి..” అన్నాడు అద్వైత్.

తర్వాత వారి సంభాషణ మన దేశంలోకి ఫ్రెంచ్.. ఆంగ్లేయుల రాక.. వారి మధ్యన ఏర్పడిన వైరం; దేశ ప్రజల మధ్యన ఒకరిపై మరొకరికి ఉన్న కక్షతో ఆంగ్లేయులను.. వారు ఆశ్రయించడం. వారు ఒంటె పిల్ల తలను చలికి గుడారంలో దూర్చి.. చివరికి యజమానిని బయటికి గెంచిన రీతిగా.. దేశంలో రాజ్యాలను వారి సాస్తగతం చేసికోవడం మీద సాగింది.

సీత.. అద్వైత్ భుజంపై తల నుంచి హాయిగా నిద్ర పోయింది.

సుల్తాన్ కారు రాత్రి పన్నెండు ప్రాంతంలో భద్రాచలంలో వున్న రాఘవ నిలయం ముందు ఆగింది.

అద్వైత్ కారు దిగి వెళ్ళి తలుపు తట్టాడు. నిద్రపోతున్న రాఘవ ఉలిక్కిపడి లేచి.. వచ్చి తలుపును తెరిచాడు. ఎదురుగా నవ్వుతూ నిలబడి వున్న అద్వైత్‌ను.. ప్రక్కన నిలబడి వున్న సీతను చూచి ఆశ్చర్యపోయాడు. కళ్ళు పెద్దవి చేసి..

“బావా.. ఇది కలా.. నిజమా!..” అన్నాడు.

అద్వైత్ తన వేళ్ళతో అతని చేతిని గిల్లి..

“యిప్పుడు చెప్పు..” నవ్వుతూ అన్నాడు.

“ఒరేయ్!.. అన్నాయ్.. నాకు నిద్ర వస్తూ వుందిరా.. లోనికి రానీరా!..” అంది సీత.

“ఆ.. రండి రండి..” ఆనందంగా స్వాగతం పలికాడు. కారు ప్రక్కన నిలబడివున్న సుల్తాన్‌ను చూచి..

“భాయ్!.. మీరు వచ్చారా!.. రండి.. రండి..” సాదరంగా ఆహ్వానించాడు.

అద్వైత్.. సీత.. సుల్తా‍న్ లోన ప్రవేశించారు. వారికి పడకలను అమర్చాడు రాఘవ.

“పడుకోండి. తెల్లవారి లేచి అన్ని విషయాలూ వివరంగా మాట్లాడుకొందాం” అన్నాడు రాఘవ.

అందరూ పడకలపై వాలిపోయారు.

రాఘవ ఐదు గంటలకు లేచాడు. అక్కడి పదిహేను కిలోమీటర్ల దూరంలో వున్న గంటన్న గూడానికి తన స్కూటర్‍పై వెళ్ళి బావా చెల్లి వచ్చారని చెప్పాడు.

గంటన్న వారిని గూడానికి సాయంత్రం తీసికొని రమ్మని సంబరం చేసికొందామని రాఘవకు చెప్పాడు. రాఘవ ఆనందంగా తిరిగి వచ్చాడు.

అద్వైత్.. సుల్తాన్ భాయ్‌లు లేచి వాకిట్లో నిలబడి వున్నారు. తమను సమీపించిన రాఘవను చూచి.. “ఏరా!.. వేకువనే ఎక్కడికి వెళ్ళావ్?..” అడిగాడు అద్వైత్.

“నా స్నేహితుడి దగ్గరకు.. మీరు వచ్చారని చెప్పే దానికి వెళ్ళాను. యీ సాయంత్రం మనం అక్కడికి వెళ్ళాలి..” నవ్వుతూ చెప్పాడు రాఘవ.

తనతో తెచ్చిన పాలను కాచి కాఫీ పెట్టాడు రాఘవ.

సీత లేచింది. పళ్ళు తోమింది. నలుగురికీ కాఫీ గ్లాసులు అందించాడు రాఘవ.

“కాఫీ!.. చాలా బాగుందిరా..” అన్నాడు.

“కాఫీ కాదు బావా అది నా మనస్సు..” నవ్వాడు రాఘవ.

“నీవెందుకురా.. పెట్టావ్. నేను పెట్టుండేదాన్నిగా!..”

“అమ్మా!.. సీతా, నీవు పెడితేనేం నేను పెడితేనేం.. బావ సర్టిఫికేట్ ఇచ్చాడుగా!..” “ఇచ్చింది నీకుగా!..” అద్వైత్ ముఖంలోకి వాల్గంట చూస్తూ అంది సీత.

అద్వైత్ సీతను చూస్తూ కళ్ళు ఎగరవేసి నవ్వాడు.

“బావా!.. ఏమిటి ప్రోగ్రాం..” అడిగాడు రాఘవ.

“ముందు గోదావరీ నదికి వెళ్ళి స్నానం చేయాలి. ఆలయానికి వెళ్ళి సీతారామలక్ష్మణులను.. పవనసుత వీరాంజనేయ స్వామిని దర్శించాలి. తర్వాత టిఫిన్.. హోటల్లో తిందాం. యింటికి వస్తాం.. తర్వాత మాటా మంచి.. సరేనా సీత!..” సీత ముఖంలోకి చూస్తూ అడిగాడు అద్వైత్

“అలాగే బావా!..” ఆనందంగా చెప్పింది సీత.

కార్లో.. నలుగురూ గోదావరి స్నానాల ఘాట్ చేరారు. నదిలో స్నానం చేశారు. బట్టలు మార్చుకొన్నారు. కాలి నడకన అద్వైత్ సీత.. రాఘవ.. సుల్తాన్‍లు ఆలయంలో ప్రవేశించారు. ఆ దేవతా మూర్తులను దర్శించారు. తమ విన్నపాలను విన్నవించుకొన్నారు. ఐదు ప్రదక్షణాలను ఆలయం చుట్టూ చేశారు. తీర్థ ప్రసాదాలను తీసికొన్నారు. ముందున్న శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించారు.

అద్వైత్.. తన తాతగారి పేర.. నానమ్మ పేర.. తన మామ (సీత రాఘవ తండ్రి తల్లి) తన అక్కగారి పేర్ల వెయ్యిన్నీ నూటపదహార్లు ఆఫీసులో జమ చేసి ప్రతి సంవత్సరం.. మహాశివరాత్రి నాడు తాతనానమ్మ పేరున.. పెద్ద పండుగ రోజున మామ అక్కల పేరున అన్నదానం జరిగే రీతిగా చెప్పి.. వారు వ్రాసి ఇచ్చిన పత్రాలను చేతికి తీసుకొన్నాడు.

“బావా!.. యిక్కడ వుండీ.. నాకు యీ పని చేయాలని తోచనే లేదు బావా!..” విచారంగా చెప్పాడు రాఘవ.

“మన ఇద్దరం వాళ్ళకు వారసులం.. నీకు చేసినా నేను చేసినా.. ఒక్కటే బాధపడకు..” అనునయంగా చెప్పాడు అద్వైత్.

సీత ఇరువురి ముఖాల్లోకి చూచి..

“అవునన్నయ్యా!.. బావ చెప్పింది నిజం..” అంది ఆనందంగా

రాఘవ.. సీతను గమనించాడు. ఇంతకుముందు ఎన్నడూ లేని సంతోషం.. ఉత్సాహం.. ఆమె మాటల్లో అతనికి గోచరించాయి.

నలుగురూ.. హోటల్‍కు వెళ్ళి టిఫిన్ తిన్నారు. ఇంటికి వచ్చారు. సుల్తాన్ తన మిత్రుని కలసి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.

“ఆఁ.. బావా!.. ఇప్పుడు చెప్పు. విషయాలేమిటి?..”

అద్వైత్ సీత ముఖంలోకి చూచాడు. ఆమె ‘సరే’ అన్నట్లు తల ఆడించింది.

“రాఘవా!..”

“చెప్పు బావా!..”

“నీకో సంతోషకరమైన వార్త చెప్పనా!..” చిరునవ్వుతో రాఘవ ముఖంలోకి చూస్తూ అన్నాడు.

“చెప్పు బావా!..”

“నేనూ.. సీత.. పెండ్లి చేసికొన్నాము” చెప్పి. సీత ముఖంలోకి చూచాడు.

“అన్నయ్యా!.. బావ చెప్పింది నిజం.. నీ మనస్సులో మా విషయంలో వున్న కోరిక అదేగా!..” అందంగా నవ్వింది సీత.

రాఘవ ఆశ్చర్యపోయాడు. అతని చెవుల మీద అతనికి విశ్వాసం లేనట్లనిపించింది.

“బావా!.. సీతా!.. మీరు చెప్పింది!!!..” ఆశ్చర్యానందాలతో అడిగాడు.

“నిజం..” ఇరువురూ ఒకేసారి అన్నారు నవ్వుతూ.

రాఘవ.. అద్వైత్‍ను సమీపించాడు. అతని చేతులను తన చేతుల్లోకి తీసికొన్నాడు వాటిని తన కళ్ళకు అద్దుకొన్నాడు.

“బావా!.. నీవు నా పాలిటి దేవుడవు. నా కోర్కెను తీర్చావు.. నాకున్న దిగులు తీరిపోయింది..” పరవశంతో, కన్నీటితో చెప్పాడు రాఘవ.

అద్వైత్.. సీతలు ఒకరినొకరు చూచుకొన్నారు. వారి పెదవులపై నవ్వులు.. రాఘవ సీతను సమీపించాడు. ఆమె చేతులను తన చేతుల్లోకి తీసికొని.. రాఘవ.

“అమ్మా!.. సీతా నీకు.. నీకు.. ఆనందమేగా!..” ఆత్రంగా ఆమె ముఖంలోకి చూచాడు పిచ్చివానిలా.

సీత.. తన అన్నయ్య ముఖాన్ని తన చేతిలోనికి తీసుకొని పవిటతో.. కన్నీటిని తుడుస్తూ..

“అన్నయ్యా!.. నా చిరకాల వాంఛను మన బావ తీర్చాడు. యీ ప్రపంచంలో నా అంతటి అదృష్టవంతురాలు వుండదు. నాకు.. నాకు ఎంతో ఆనందంగా వుందిరా అన్నయ్యా!..” అంది.

రాఘవ ఆమె తలను తన హృదయానికి హత్తుకున్నాడు. కుడి చేతిని ఆమె తలపై వుంచి.. “అమ్మా! నీవు నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో పండంటి సంతతికి తల్లివై సర్వసౌభాగ్యాలతో వర్ధిల్లాలమ్మా!..” ఆనంద పారవశ్యంతో మనసారా దీవించాడు.

“రాఘవా!.. ఒక్కమాట!..”

“ఏమిటి బావా!..”

“యీ విషయాన్ని.. నేను లండన్ నుండి తిరిగి వచ్చేవరకూ నీవు ఎవ్వరికీ చెప్పకూడదు” మెల్లగా చెప్పాడు

“కారణం బావా!..”

“మా వివాహం.. ఓ ఆవేశంలో జరిగిపోయింది. నాన్న అమ్మలు నా వివాహ విషయంలో ఎలాంటి అభిప్రాయాలతో వున్నారో నీకు తెలుసు. అందుకని..”

రాఘవ.. కొన్ని క్షణాలు ఆలోచనలో మునిగిపోయాడు.

“బావ తిరిగి రాగానే మా వివాహం.. అత్త మామయ్య యిష్టానుసారంగా మరోసారి జరుగుతుంది రా అన్నయ్యా!..” అంది సీత నవ్వుతూ.

రాఘవ సీత ముఖంలోకి చూచాడు. అతనూ కొంతవరకూ విషయాన్ని వూహించుకొన్నాడు. పెదవుల పైన.. ఆశ్చర్యం స్థానంలో చిరునవ్వు వెలసింది.

“ఓకే.. ఓకే.. నాకు విషయం అర్థం అయింది. నేను ఎవ్వరికీ చెప్పను” ఆనందంగా మనసారా నవ్వాడు రాఘవ.

సీతా అద్వైత్‍లు ఒకరినొకరు చూచుకొని రాఘవతో వంత కలిపారు.

తర్వాత.. ముగ్గురూ హోటల‌కు వెళ్ళి భోంచేశారు. రాఘవతో బట్టల కొట్టుకి వెళ్ళారు. వారిరువురికీ మంచి ఖరీదైన.. వారికి నచ్చిన దుస్తులను కొన్నాడు రాఘవ. బంగారు అంగడికి వెళ్ళి మూడు సవర్ల దండను కొన్నాడు. పూలూ పండ్లతో ఇంటికి తిరిగి వచ్చారు. తట్టలో వాటినన్నింటినీ వుంచి.. వారిని ప్రక్క ప్రక్కన నిలబడమని.. తట్టను వారిరువురి చేతులకు అందించాడు.

అద్వైత్ కాళ్ళకు వంగి నమస్కరించాడు. అతని భుజాలను పట్టుకొని లేపి.. అద్వైత్ అతన్ని తన గుండెలకు హత్తుకున్నాడు. అతని కౌగిలిలో రాఘవ చిన్ని పిల్లవానిలా ఒరిగిపోయాడు. సీత ప్రీతిగా తన అన్నయ్య తలపై తన చేతిని వుంచింది. అద్వైత్ మనస్సున రాఘవ ఎప్పుడూ ఆనందంగా వుండాలని, అతను కోరిన పిల్లతో త్వరలో వివాహం జరగాలని.. కోరుకొన్నాడు.

అధ్యాయం 38:

సాయంత్రం ఆరున్నర సమయానికి రాఘవ.. అద్వైత్.. సీత సుల్తాన్లు గంటన్న గూడెంకు చేరారు.

బావా చెల్లి వచ్చారని రాఘవ చెప్పిన మాటలకు గంటన్న వారికి వివాహం అయిందని తలచి.. కొత్త బట్టలు.. విందు భోజనాలు.. సీత అద్వైత్‍లు రాత్రి శయనించే దానికి ఓ గుడిశను అందంగా అలంకరించాడు.

వారిని చూచి.. తన ఇల్లాలు, కూతురు.. ఇతర బృందంతో ఆనందంగా ఆ నలుగురినీ ఆహ్వానించాడు. ఎత్తైన వేదిక మీద ఆ నలుగురినీ కూర్చోబెట్టాడు.

గూడెంలోని యువకులు.. యువతులు వారికి తెలిసిన నాట్యాన్ని ప్రదర్శించారు. ఎంతో ఆనందంగా వున్న రాఘవ గంటన్న అందిన కల్లు త్రాగి పరమానందంతో పాట పాడాడు. వారితో కలసి ఆటనూ ఆడాడు. ఆ కార్యక్రమం తర్వాత..

గంటన్న వారికి విందు ఏర్పాటు చేశాడు. రొట్టెలు.. తేనె.. చార పప్పు.. గుంజి పంట్లు కలేపండ్లు వారి ముందు వుంచాడు. ప్రీతిగా ప్రక్కన కూర్చొని..

“తినండి బాబు!..” ఎంతో ప్రేమతో చెప్పాడు.

అద్వైత్.. తను చుట్టూ వున్న వారినందరినీ కలయజూచాడు. అందరి కళ్ళల్లోనూ ఎంతో అభిమానం, ప్రేమ.

తాగిన కారణంగా దూరంగా వున్న రాఘవను దగ్గరికి పిలిచాడు అద్వైత్.

చేతులు జోడించి.. ఆనందంగా నవ్వుతూ అద్వైత్‌ను సమీపించాడు రాఘవ.

“బావా!.. ఆనందంతో గంటన్న అందించిన అమృతాన్ని తాగాను. యీ రోజు.. యీ క్షణాలు నా జీవితాంతం నా గుండెల్లో ఎంతో పదిలంగా వుంటాయి. తినండి..” అని రొట్టెను విరిచి తేనెలో ముంచి బావగారికి చెల్లికి నోటికి అందించాడు. తనూ తిన్నాడు. సుల్తాన్ భాయ్ ప్రక్కన కూర్చొని గంటన్న.. అతనూ తృప్తిగా భోంచేసేలా చేశాడు. సీత అద్వైత్ ప్రక్కన గంటన్న భార్య కూతురూ చేరి వారు ఆనందంగా తినేలా వారి గూడెం కబుర్లు చెప్పారు.

గంటన్న రాఘవను పిలిచాడు. రాఘవ అతన్ని సమీపించాడు. రాఘవ చేతిని తన చేతిలోనికి తీసుకొని సీత.. అద్వైత్‍లు శయనించే దానికి తాను ఏర్పాటు చేసిన గుడిశ వద్దకు తీసికొని పోయి..

“లోన చూడు దొరా!..” అన్నాడు.

రాఘవ లోన ప్రవేశించాడు.

మంచం.. పరుపు కొత్త బెడ్ షీట్.. కప్పుకొనే దానికి మరోకటి మంచం నిండా మల్లెపూలు.. కిరోసిన్ దీపాలు రొండు క్రమంగా అమర్చబడి వున్నాయి. రాఘవ నవ్వుకొన్నాడు. బయటికి వచ్చాడు.

“దొరా!.. నేను చేయగలిగినంత చేసినా.. బాగుందా!..” ఆత్రంగా అడిగాడు.

“గంటన్నా!.. అద్భుతంగా వుంది నీ ఏర్పాటు. మా బావ చాలా మంచివాడు. తప్పక సంతోష పడతాడు” నవ్వుతూ చెప్పాడు రాఘవ.

అందరి భోజనాలూ ముగిశాయి. రాఘవ అద్వైత్ సీతలను సమీపించాడు. వారికి ఏర్పరచిన పడక గదిని గురించి చెప్పాడు. అద్వైత్ ఆనందంగా తల ఆడించాడు.

రాఘవ సీత వంక చూచాడు. సిగ్గుతో నవ్వుతూ సీత తల దించుకొంది.

వారిని తనతో రమ్మని ఆ గుడిశ వరకూ వచ్చాడు.

“వెళ్ళి పడుకొండి బావా!.. ఇక్కడ మనకు ఎలాంటి భయమూ లేదు. ప్రశాంతంగా నిద్రపోండి..” అన్నాడు చిరునవ్వుతో.

అద్వైత్.. సీతలు గుడిశలో ప్రవేశించారు. తలుపు మూసుకొన్నారు.

రాఘవ.. సుల్తాన్ భాయిని సమీపించి వారికిగా గంటన్న ఏర్పాటు చేసిన గుడిశలో ఆ యిరువురూ ప్రవేశించారు. “బావా!..” మెల్లగా పిలిచింది సీత ఆద్వైత్ ప్రక్కన మంచం పైన కూర్చుంటూ.

“చెప్పు సీతా!..” ప్రీతిగా ఆమె కళ్ళల్లోకి చూచాడు అద్వైత్.

“యీ ఆటవీకులు ఎంతో మంచివారు కదూ!.. వారికి మన మీద ఎంత ప్రేమ.. ఎంత అభిమానం..” సాలోచనగా అంది సీత.

“వీరికి స్వార్థం.. అనేదేమిటో తెలీదు. అడవిలో కష్టపడి పని చేసికొని దక్కిన ఫలితంతో పొట్ట నింపుకొని.. ఎలాంటి వ్యామోహాలు లేకుండా.. దైవాన్ని నమ్ముకొని ప్రశాంతంగా మనుగడ సాగించే వారు.. వీరు..”

“యీరోజు రాఘవ అన్నయ్య చాలా సంతోషంగా వున్నాడు మీ కారణంగా!..”

“కాదు.. నీ కారణంగా!..”

“మన మధ్యన ఇప్పుడు.. నీ నా భేధాలు వున్నాయా బావా!..”

అద్వైత్ మౌనంగా సీత ముఖంలోకి చూచాడు.

“జవాబు చెప్పండి బావా!..” క్రీకంట అతన్ని చూస్తూ అడిగింది సీత.

“ఏం చెప్పాలి?..”

“నేను.. అన్నమాటకు అర్థాన్ని!..”

“నీకు కావలసింది అర్ధమా.. జవాబా!..”

“నాకు రెండూ కావాలి..”

“చిరునవ్వుతో సీత ముఖంలోకి చూచాడు అద్వైత్.

“ఎందుకు ఆలోచిస్తున్నారు!..”

“చూడాలనిపించింది..”

“ఇంకేం అనిపించడం లేదా!..”

అద్వైత్.. తలను ప్రక్కకు త్రిప్పుకొన్నాడు. కొన్నిక్షణాల తర్వాత..

“సీతా!.. వచ్చే సోమవారం.. నేను లండన్ వెళ్ళాలి. ఆ విషయం నీకు తెలుసు.. నేను తిరిగి వచ్చే వరకు నీవు స్వచ్ఛంగా.. ఎవరి వలనా ఎలాంటి ప్రశ్నలను ఎదుర్కోకుండా నీవు వుండాలనేది నా కోరిక.. ఆ కారణంగా నీవు హాయిగా మంచంపై పడుకొని నిద్రపో.. నేను క్రింద దుప్పటి పరుచుకొని పడుకొంటాను. నేనంటే ఎంతో ప్రేమ అభిమానం కలదానివి, నా దానివి.. నా మాటలను అర్థం చేసుకొని నన్ను ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా నిద్రపో.. నా సీత నా మాటను వింటుంది కదూ!..”

“అంతేనా!..” మెల్లగా అడిగింది సీత.

మంచం మీద బెడ్ షీట్‍ను నేలపై పరచుకొంటూ.. “అంతే.. సీతా, నీవు నా మాటను గౌరవిస్తావుగా!..” అని బెడ్ షీట్‍పై వాలిపోయాడు అద్వైత్.

మౌనంగా సీత మంచంపై పడుకొంది.

పడుకొన్న ఇరవై నిముషాలకే అద్వైత్ నిద్రపోయాడు.

సీతకు.. నిద్ర పట్టలేదు. రెండు మూడుసార్లు అద్వైత్ వైపు చూచింది. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు.

‘బావా!.. నా బావ.. ఇప్పుడు నా భర్త.. ఎంతో మంచివాడు. ఆ రాత్రి అతను మైకంలో వున్నాడని తెలిసి.. నేనే చొరవ తీసికొన్నాను. అది ఒక రీతిగా తప్పే.. కానీ బావ వుదయాన్నే లేచి తనే తప్పు చేసినట్లుగా బాధ పడ్డాడు. జరిగింది నా సమ్మతితోనే జరిగింది. బావ లండన్ ప్రయాణం లేకుంటే నేను అంత సాహసం చేసి వుండేదాన్ని కాను. బావ విషయంలో ఇండియా.. ఎలాంటి అభిప్రాయంతో వుందో.. నేను వారిరువురూ కలసి మాట్లాడుకొనే సమయంలో.. ఇండియా బావకు ఎంతో సన్నిహితంగా వున్నట్లు నాకు అనిపించేది. తన చర్యల పట్ల.. మాటల పట్ల.. నాకు అనుమానం.. బావను తన వల్లో వేసికొంటుందని.. అందుకే అలా సాహసించవలసి వచ్చింది. ఏమైతేనేం, నా కోర్కె నెరవేరింది. బావ నా మెడలో తాళి కట్టాడు. క్రిందటి గంటలో.. తాను క్రింద పడుకొంటానని.. నన్ను మంచంపై పడుకోమని బావ చెప్పడంలో అర్థం.. తాను లండన్ నుంచి తిరిగి వచ్చేవరకూ నాలో ఎలాంటి మార్పులు రాకూడదని.. నన్ను ఎవరూ వేలెత్తి చూపి విమర్శించకూడదని.. బావది ఎంత మంచి మనస్సు.. నా మీద అంత అభిమానం.. గౌరవం.. ఇలాంటి గొప్ప వ్యక్తికి నేను భార్యనైనానంటే.. అది నా జన్మ సుకృతం.. ఎప్పుడూ ఏ విషయంలోనూ బావను ఎదిరించకూడదు. నా చర్యల వలన నా బావ ఆనందించాలే కాని కష్టపడకూడదు. యికపై బావను ఇండియా కాదు గదా!.. ఏ ఆడదీ ఏమీ చేయలేదు. నాపై సర్వహక్కులు వున్నప్పటికి.. నా శ్రేయస్సు కోరి నేల.. ఎంతో నిగ్రహంతో పడుకొన్న బావా!.. అందరిలాంటి వాడు కాదు. నా పాలిట దైవం.. నేను ఎంతో అదృష్టవంతురాలిని..’ ఆనందంగా సీత.. అద్వైత్‍ను గురించి.. ఆ రాత్రి గురించి.. తలచుకొంటూ తనలో తాను నవ్వుకొంటూ ఎంత సేపు గడిపిందో!.. ఎప్పుడు నిద్రకుపక్రమించిందో ఆమెకు తెలియదు.

ఉదయాన్నే ఐదు గంటలకు అద్వైత్ లేచాడు. గూడెంకు ప్రక్కన పారుతున్న సెలయేటి స్నానం చేశాడు. సంధ్యావందనం.. సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించాడు. నదికి నీటికి కోసం వచ్చిన ఆటవీక వనితలు.. అతని చర్యను చూచి ఆశ్చర్యపోయారు. వినయంగా అద్వైత్‍కు నమస్కరించారు.

ఒడ్డుకు చేరి దుస్తులు మార్చుకున్నాడు అద్వైత్.. నవ్వుతూ ఎదురుగుండా నిలబడి వున్న రాఘవను చూచాడు.

“బావా!.. చలిగా లేదా!..”

“లేదు రాఘవా!.. ఎంతో హాయిగా వుంది..”

“నీతో ఒక విషయం చెప్పాలి బావా!..”

“ఏమిటది?..”

“నేను శ్రీ అల్లూరి సీతారామరాజుగారిని చూచాను..”

“ఏమిటీ!..” ఆశ్చర్యంతో అడిగాడు.

“అవును బావా!..”

“అలాగా!..” ఆశ్చర్యపోయాడు అద్వైత్.

నవ్వుతూ.. అవునన్నట్లు తల ఆడించాడు రాఘవ..

“మాట్లాడాను కూడా!..” మెల్లగా చెప్పాడు.

“ఏం మాట్లాడావు?..”

“వారి ఆశయాన్ని గురించి..”

“వారేమన్నారు..”

“మన సాటి వారికి.. కొందరికి నేను కానివాణ్ణి అన్నారు.. ఎవరు ఏమనుకొన్నా వారి నిర్ణయం మారదన్నారు”

“నీ గురించిన వివరాలు అడిగారా!..”

“అడిగారు..”

“నీ మాటలను విని వారేమన్నారు.”

“బాధ్యతలను గుర్తించి నడుచుకోమన్నారు..”

“దానికి నీవేమన్నావు..”

“సరే అన్నాను..”

“చూడు రాఘవా!.. ఆశయాలు అందరికీ వుంటాయ్. కొందరి విషయంలోనే అవి సఫలమౌతాయి. వారి ఆశయాలు ఎంతో గొప్పవి.. అవి.. వారన్నట్లు కొందరికి నచ్చలేదన్న మాట వాస్తవం.. భవిష్యత్తులో ఫలితం ఎలా వుంటుందో వారికి.. ఎవరికీ.. తెలియదు. వారిని చూడాలనుకొన్నావు.. చూచావు.. మాట్లాడావు.. వారు చెప్పినట్లుగా నీ బాధ్యతలను గుర్తించి నడుచుకో.. కొంతకాలం నేను మన దేశాన్ని విడిచి వెళుతున్నాను కదా!.. అమ్మా నాన్న సీత అత్తయ్య.. అందరి క్షేమానికి నీవు బాధ్యుడివిగా వుండాలి.. ఆ గురుతర బాధ్యతను మరువకు రాఘవా!..” ఎంతో సౌమ్యంగా చెప్పాడు అద్వైత్.

రాఘవ కొన్ని క్షణాలు మౌనంగా వుండిపోయాడు.

అద్వైత్ అతని ముఖంలోకి చూచాడు.

“అలాగే బావా!.. మీరు చెప్పినట్లుగానే నడుచుకొంటాను..”

“నా ముద్దుల మరిది.. నామాటను ఏనాడూ కాదనడు..” నవ్వుతూ అన్నాడు అద్వైత్.

రాఘవ అద్వైత్ ముఖంలోకి చూచి నవ్వాడు.

ఇరువురూ.. గూడెంలోని వారి బసకు వచ్చారు. సీత.. గంటన్న అతని పరివారం.. సుల్తాన్ వారిని చూచి సమీపించారు.

“వేకువనే ఎక్కడికి వెళ్ళారు బావా!..”

“నదీ స్నానానికి..”

“నన్ను లేపలేదేం!..”

“నీవు గాఢ నిద్రలో వున్నావు సీతా!..” చిరునవ్వుతో చెప్పాడు అద్వైత్ గంటన్న వైపుకు తిరిగి..

“గంటన్నా!.. మీ అతిథి సత్కారం.. మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. యిక మేము బయలుదేరుతాం” అని చెప్పి; రాఘవ భుజంపై చేతిని వేసి.. “వీడు నా మరిది.. మంచి మనస్సున్న వాడు.. కొంచెం.. ఆవేశం కలవాడు. వీణ్ణి జాగ్రత్తగా చూచుకోండి. వయస్సులో పెద్దవారు. మీకు తెలియనిదంటూ లేదు. సెలవు..” చేతులు జోడించాడు అద్వైత్. అందరూ అతన్నే చూస్తూ నమస్కరించారు.

గంటన్న భార్య తేనె సీసాలను చారపప్పు సంచినీ గంటన్న కందించింది. “బాబూ!.. ఈటిని మీతో తీసికెళ్ళండి” అద్వైత్‍కు అందించబోయాడు.

“నా చేతికీ గంటన్నా!..” అన్నాడు సుల్తాన్.

గంటన్న వాటిని సుల్తాన‌కు అందించాడు.

అందరూ కారును సమీపించారు. అద్వైత్, సీత, రాఘవ, సుల్తాన్ కార్లో కూర్చున్నారు. సుల్తాన్ కారును స్టార్ట్ చేశాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version