Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అద్వైత్ ఇండియా-10

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[తాను డబ్బు కట్టి పశువులను విడిపించిన సంగతి తల్లికి చెబుతుంది ఇండియా. ఆండ్రియా కూతురు చేసిన పనికి ఎంతో సంతోషిస్తుంది. మరో యాభై వేలు తెచ్చి, సుల్తాన్‍కిచ్చి, గౌరీ మేడమ్‍కి ఇచ్చి రమ్మంటుంది. అదే సమయంలో రెడ్డిరామిరెడ్డిగారు నరసింహశాస్త్రి గారింటికి వచ్చి, కరువును పారద్రోలేందుకు యజ్ఞం తలపట్టాననీ, ఖర్చులన్నీ తాను చూసుకుంటాననీ, నిర్వహణ బాధ్యతను శాస్త్రిగారిని తీసుకోమని చెప్తాడు. అంగీకరిస్తారు శాస్త్రి. యజ్ఞం ముగిసాక, కాశీకి ప్రయాణమవుదామని చెప్పి వెళ్ళిపోతారు రెడ్డిరామిరెడ్డి. ఇంతలో కొందరు జనం రాబర్టు దొర జిందాబాద్ అని అరుచుకుంటూ వెళ్ళడం చూస్తారు. ఆ నినాదాలు నరశింహశాస్త్రి సావిత్రిలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సాయంత్రం ఇండియా వస్తే వివరాలు తెలుస్తాయంటారు శాస్త్రి. వారంతా అంతగా ఆనందపడుతూ వారి పేరును స్మరిస్తున్నారంటే రాబర్ట్ దొర వారికి సంబంధించిన ఏదో మంచిని చేసి ఉంటాడని అంటుంది సావిత్రి. నిజం నిలకడ మీద తెలుస్తుందని అంటారు శాస్త్రి. రాఘవ అద్వైత్ పేరిట ఉత్తరం రాస్తాడు. తన ఉద్యోగంలో వివరాలు చెప్పి, తన వాళ్ళందరి యోగక్షేమాలు అడుగుతాడు. అందరికి కన్నా చివరగా సీత పేరు రాయడంతో తను అలుగుతుంది. రాఘవకి జవాబు రాయమని చెప్తారు శాస్త్రి. రాఘవ తల్లి వసుంధర సంతోషిస్తుంది. మావయ్య వచ్చి కలవమన్నాడని తమ్ముడికి చెప్తుంది వసుంధర. సరే వెళ్ళి కలిస్తొస్తననై చెప్పి, బయల్దేరుతారు శాస్త్రి. మావయ్య ఇంటికి వెళ్ళేదారిలో ఇందాక నినాదాలు చేసుకుంటూ వెళ్ళినవారు కనబడతారు. వివరాలడిగితే తమ పశువులను రాబర్ట్ దొర విడిపించామనుకుని అతనికి జేజేలు కొట్టామని, కానీ ఆ పని చేసింది అతని కూతురు ఇండియా అని తెలిసిందని చెప్తారు. వీధి భాగవత బృందం నరసింహశాస్త్రి ఇంటి ప్రక్కనున్న విశాలమైన స్థలంలో గోడ ప్రక్కగా ముందు వున్న స్థలం  మధ్యలో తెరలు కట్టి శ్రీకృష్ణ రాయబారం నాటకాన్ని తెలంగాణా యాసలో ప్రదర్శిస్తారు. నాటకం జరుగుతుండగా అక్కడికి ఇండియా కారులో వస్తుంది. నేరుగా నరసింహశాస్త్రి వైపు వస్తుంటే, తండ్రి సూచనలను గ్రహించి అద్వైత్ ఎదురు వెళ్ళి ఆమె రాకకు కారణం కనుక్కుంటాడు. రాబర్టు ఒళ్లంతా మంటలని అరుస్తున్నాడనీ, శరీరం బాగా వేడేక్కిపోయిందని, వెళ్ళి నరసింహశాస్త్రిగారిని కలవమని అమ్మ పంపిందని చెఫ్తుంది. అద్వైత్ తండ్రికి విషయం చెప్తాడు. పరిస్థితి తీవ్రత అర్థమైన నరసింహశాస్త్రి, అద్వైత్‍తో సహా కారులో కూర్చుని రాబర్ట్ ఇంటికి వెళ్తారు. అక్కడ స్నానం చేసి, జపం చేసి, ఓ గ్లాసులో నీళ్లు నింపుకుని – ఐదు సార్లు తన నోటితో ఆ గ్లాసులోకి గాలిని ఊది, వేగంగా రాబర్ట్ గదిలోకి ప్రవేశించి, అతని తలని ఎత్తి పట్టుకోమని అద్వైత్‍కు చెప్పి, నోరు తెరిపించి ఆ నీళ్ళని అతని గొంతులో పోస్తారు. తన కుడి చేతిని రాబర్ట్ తలపై వుంచి మంత్రోచ్చారణ చేసి, తల నుండి కాళ్ళ వరకు తన నోటి గాలిని అతనిపై ప్రసరింపజేస్తారు. భయంగా ఉన్న ఆండ్రియాతో, దిగులుపడకండి, అమ్మ దిగిపోతుంది, అతని ఆరోగ్యం బాగుపడుతుందని ధైర్యం చెప్తారు. పశువులను విడిపించినందుకు ఇండియాని అభినందిస్తారు. వాళ్ళని కారులో ఇంటి వద్ద దింపుతుంది ఇండియా. – ఇక చదవండి.]

అధ్యాయం 18:

తండ్రి కొడుకులు ఇండియా రావడంతోనే ఆమెతో కారులో వారు వెళ్ళిపోవడం.. సీతకు ఏ మాత్రం నచ్చలేదు. “అత్తయ్యా!.. నాకు బోరుగా వుంది. ఇంటికి వెళుతున్నాను..” లేచింది సీత.

“నాకూ నడుములు లాగుతున్నాయే సావిత్రీ.. యింటికి పోదామా!..” అంది వసుంధర.

“సరే పదండి..” సావిత్రి కూడా లేచింది.

ఆ నాటక ప్రదేశం ఇంటి ప్రక్కనే కాబట్టి ఐదు నిముషాల్లో వారు ఇంట్లో ప్రవేశించారు.

“అత్తయ్యా!.. నాకు తెలీక అడుగుతున్నా!.. ఆ తెల్లకోతిని చూచి మామయ్యా బావా దాని వెనకాలే వెళ్ళడం ఏమైనా బాగుందా!..” చిరాగ్గా అడిగింది.

“అవునే.. మన వాళ్ళు చేసిన పని నాకూ నచ్చలేదు” అంది వసుంధర.

“వదినా!.. ఆ అమ్మాయి ఆ సమయంలో ఒంటరిగా వచ్చిందంటే ఏదో బలమైన కారణం వుండి వుంటుంది” మెల్లగా చెప్పింది సావిత్రి.

“ఏ కారణమైనా మనతో చెప్పి వెళ్ళాలిగా!..”

సీత ఆ మాటలకు సావిత్రికి రోషం.. నవ్వూ వచ్చాయి.

“ఆదిని గురించేగా నీవు అనేది!.. వాడు యింకా నీ మెడలో మూడు ముళ్ళూ వేయలేదుగా..!” చిరునవ్వుతో చెప్పింది సావిత్రి.

మూతి తిప్పుకొంటూ సీత తన గదిలోకి వెళ్ళిపోయింది.

“అవునే సావిత్రీ!.. యింతకీ విషయం ఏమయ్యుంటుందని నీవు అనుకుంటున్నావు!..” అడిగింది వసుంధర.

“వదినా!.. రాబర్ట్ దొర గారికి అమ్మ పోసింది. పెద్ద అమ్మవారు. వీరు మంత్రించి కుంకుమను ఇచ్చి పంపారు. బహుశా ఆ విషయంగానే ఆ అమ్మాయి వచ్చి వుంటుంది.. పాపం వాళ్ళ నాన్నగారికి ఎలా వుందో ఏమో!.. బహుశా వాళ్ళ నాన్నగారి అస్వస్థత విషయంగానే ఆ అమ్మాయి వచ్చి వుండవచ్చు వదినా!..” అనునయంగా చెప్పింది సావిత్రి. కొన్ని క్షణాల తర్వాత..

“ఆ తల్లీ కూతుళ్ళకు మీ తమ్ముడిగారి మాట అంటే ఎంతో నమ్మకం.. గౌరవం వదినా!..” అంది.

“మరి ఆ రాబర్ట్ దొర సంగతి.. వాడు కొంచెం అహంకారి అని మీ మామయ్య చెప్పగా విన్నాను. నిజమేనా!..” అడిగింది వసుంధర.

“వదినా!.. మీ తమ్ముడుగారు నాతో వారికి నచ్చిన, ఆనందం కలిగించిన వారిని గురించి మాత్రమే చెబుతారు. మీరన్న బాపతు మనుషులను గురించి నాతో ఏమీ చెప్పరు”

వాకిట్లో కారు ఆగింది. వరండాలో కూర్చొని వున్న వసుంధర సావిత్రి చూపులు అటు మళ్ళాయి.

నరసింహశాస్త్రి.. అద్వైత్‍లు కారు దిగారు. ఇండియా కూడా కారు దిగి గురువుగారికి నమస్కరించడం.. కార్లో కూర్చోవడం అది కదిలిపోవడం.. ఇరువురూ చూచారు.

కుర్చీ నుంచి లేచి.. సావిత్రి.. “వదినా!.. వాళ్ళు వచ్చేశారు..” అంది.

“ఆఁ.. నేనూ చూచాను..”

నరసింహశాస్త్రి.. అద్వైత్‍లు వరండాను సమీపించారు.

“ఏం అక్కా!.. నాటకాన్ని చూడలేదా!..”

“రాయబారం పోయే సీను ముగిసింది. సీత బోరుగా వుందని.. ఇంటికి వెళతానని అంది. దాని తోటే మేమూ వచ్చేశాము. అవున్రా అంత ఆఘమేఘాల మీద ఆ పిల్లవెంట మీరిద్దరూ వెళ్ళారే ఏమిటి విషయం?..” అడిగింది వసుంధర.

“మీ బట్టలు..” సావిత్రి పూర్తి చేయక మునుపే..

“తడుపుకోవలసి వచ్చింది సావిత్రి.. అక్కా స్నానం చేసి వచ్చి నీకు అన్ని విషయాలూ వివరంగా చెబుతాను” లోనికి వెళ్ళాడు నరసింహశాస్త్రి. వారి వెనకాలే సావిత్రి వెళ్ళింది. తండ్రి తల్లిని అనుసరించాడు అద్వైత్.

నరసింహశాస్త్రి నేరుగా స్నానాల గదికి వెళ్ళి స్నానం మరో మారు తలకు చేసి పై పంచను పిండి కట్టుకొని యింట్లోకి వచ్చాడు. దండెం పైన వున్న పంచను తీసి వారి చేతికి అందించింది సావిత్రి.

అద్వైత్.. బావి దగ్గరకు వెళ్ళి స్నానం చేశాడు.

వారి రాకను.. జరిగిన సంభాషణను విన్న సీత.. గది కిటికీ గుండా అద్వైత్ స్థానం చేస్తున్నది చూచింది. “అమ్మా!.. ఒక టవల్ యిస్తావా!..” బిగ్గరగా పలికిన అద్వైత్ మాటలను విన్న సీత వేగంగా వెళ్ళి దండెంపై వున్న టవల్‍ను చేతికి తీసుకొంది.

సావిత్రి అక్కడికి వచ్చింది.

“అత్తయ్యా!.. బావకు టవల్ నేను యిస్తాను. మీరు మీ పని చూచుకోండి. భోజన సమయం కావస్తూ వుందిగా!..” వినయంగా నవ్వుతూ చెప్పింది సీత.

సీత ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూచి నవ్వుతూ..

“సరేనే పిల్లా.. వెళ్ళు..” అంది.

సీత పెరటు వైపున ఈశాన్య మూలన వున్న బావిని సమీపించింది. టవల్‍ను తన వెనక వుంచుకొంది.

“సీతా!.. అమ్మను టవల్ తెమ్మని చెప్పు..”

“ఏం నేను తెస్తే పనికిరాదా!..”

“చలిగా వుంది. త్వరగా వెళ్లి అమ్మను పంపు”

వెనక చేతుల్లో వున్న టవల్‌ను ముందుకు త్రిప్పి.. “ఇదిగోండి తమరికి కావలసిన టవల్” అద్వైత్ సీత చేతిలోని టవల్‌ను అందుకొని తల తుడుచుకొంటూ.. “థ్యాంక్యూ సీతా!..” అన్నాడు.

“నేను ఇండియాను కాను. నీ మరదలు సీతను..” చిరునవ్వుతో గోముగా అంది సీత.

“ఇంకా ఏమైనా కావాలా బావా!..” క్రీకంట అద్వైత్‍ను చూస్తూ అడిగింది సీత.

“ఇంకేమీ అక్కరలేదు. నీవు లోనికి వెళ్ళు..”

“ఇక్కడ వుంటే ఏం?..”

“వెళ్ళమన్నానుగా.. వెళ్ళు సీతా!..” బ్రతిమాలినట్లు అడిగాడు అద్వైత్.

“బ్రతిమాలావు కాబట్టి వెళుతున్నా..” నవ్వుకుంటూ సీత లోనికి నడిచింది.

అద్వైత్ తన గదిలో ప్రవేశించి బట్టలు తొడుక్కున్నాడు.

జగత్ మాతాపితల ముందు పూజా మందిరంలో కూర్చొని.. నమస్సుమాంజలి సమర్పించి నరసింహశాస్త్రి వరండాలోకి వచ్చి అక్కగారి ప్రక్కన కూర్చున్నాడు. జరిగిన విషయాన్ని వసుంధరకు తెలియజేశాడు.

సావిత్రి ముఖ ద్వారం వద్దకు వచ్చి.. “వస్తే భోజనం వడ్డిస్తాను” అంది.

“అక్కా.. పద భోంచేద్దాం..” అన్నాడు నరసింహశాస్త్రి.

“సరే పదరా!..” వసుంధర కుర్చీ నుంచి లేచింది.

ఇరువురూ లోనికి వెళ్ళారు.

భోజనానంతరం.. అద్వైత్ తన గదికి.. నరసింహశాస్త్రి వారి గదికి వెళ్ళిపోయారు. వసుంధర తన మంచాన్ని చేరింది. సీతా.. సావిత్రి కలసి భోంచేశారు. అనంతరం.. సీత సావిత్రికి సర్దడంలో సాయం చేసి.. తన గదికి వెళ్ళిపోయింది.

సావిత్రి సింహద్వారాన్ని మూసి తమ పడక గదిలో ప్రవేశించింది.

అద్వైత్.. తన బావమరది రాఘవకు లెటర్ వ్రాయడం ప్రారంభించాడు.

‘ప్రియాతి ప్రియమైన రాఘవా!.. నీవు వ్రాసిన వుత్తరం చేరింది. అందరి సమక్షంలో చదివాను. అందరూ ఆనందించారు. తన పేరును చివర వ్రాసినందుకు నీ ముద్దుల చెల్లికి కోపం వచ్చింది. కోపంతో చిర్రుబుర్రులాడుతున్నప్పుడు సీతలో దుర్గమ్మను చూడవచ్చు. ఆమెను చూచి అందరం నవ్వుకొన్నాము. మన కళ్ళముందు పుట్టిన పిల్ల.. ఇప్పుడు మాటల్లో జాణ అయింది. స్కూల్లో లీవు వేకెన్సీలో చేర్చాను. హెడ్ మిసెస్‍కు సీత అంటే చాలా ఇష్టం, అభిమానం. పిల్లలంతా సీతను ఎంతగానో అభిమానిస్తారు. మేనేజ్మెంటు వారితో మాట్లాడి సీతను పర్మినెంట్ చేయిస్తానని గౌరీ మేడమ్ చెప్పింది. ఇక్కడ అందరం సంతోషంగా వున్నాము.

రెడ్డి రామిరెడ్డిగారు యజ్ఞం చేయ సంకల్పించారు. ఆ బాధ్యతను నిర్వహించవలసిందిగా నాన్నగారిని కోరారు. వారు.. సమ్మతించారు. తేదీల నిర్ణయం చేసిన తర్వాత నీకు వ్రాస్తాను. తప్పక రావాలి. నీ పైవారికి నాలుగు రోజుల లీవు కావాలని ముందుగానే చెప్పు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఈ కాలంలో ఎలాగైనా బ్రతకాలనే వారే ఎక్కువ. ముక్కుకు సూటిగా నడిచి యిలాగే బ్రతకాలను కొనేవారు తక్కువ. వారు మనం అందరం కలసి బ్రతకాలి కాబట్టి.. నీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకు. ఎవరితోనూ వాదనకు దిగకు. పై వారి ఉత్తరువులను పాటించి నడుచుకో. ధర్మాధర్మ వితర్కానికి దిగవద్దు. పాపం చేసిన వాడు.. పరులను మోసం చేసిన వాడు తాత్కాలికానందాన్ని పొందినా.. పైవాడు అలాంటి వారిని ఒకనాడు వారు ఊహించని రీతిలో శిక్షిస్తాడు. మనం ఖర్మ సిద్ధాంతాన్ని నమ్మినవారము. ఆ సర్వేశ్వరుని నిర్ణయానికి అతీతంగా యీ ప్రపంచంలో ఏదీ జరగదు. ఎవరి వలనైనా నీ మనస్సుకు బాధ కలిగితే.. ఆ దైవాన్ని తలచుకో. మనస్సుకు శాంతి కలుగుతుంది. నాన్నా, అమ్మ, అత్తయ్య, సీత అంతా బాగున్నాము. ఇండియా నిన్ను అప్పుడప్పుడూ ‘వెరీ గుడ్ మ్యాన్’ అని శ్లాఘిస్తుంది. ఆమె మంచితనం నీకు తెలిసిందేగా. మేడం ఆండ్రియా చాలా మంచిది. రాబర్ట్‌కు పెద్ద అమ్మ పోసింది. చాలా బాధ పడ్డాడు. నాన్నగారు వారికి ఉపశమనాన్ని కలిగించారు.’

ఆప్రయత్నంగా ఆద్వైత్ చూపులు గది ద్వారం వైపు మళ్ళాయి. సీత ఓరకంట తన్ను చూస్తుండడం గమనించాడు.

“నీవు ఎప్పుడొచ్చావ్ సీతా..”

“పది నిముషాలయింది”

“పడుకోలేదా!..”

“నిద్ర రావడం లేదు..”

“కాసేపు కళ్ళు మూసుకొని పడుకొంటే అదే వస్తుందిగా!..”

“కళ్ళు మూతలు పడడం లేదు”

“ఏమిటీ!..” ఆశ్చర్యంతో అడిగాడు అద్వైత్.

“నేను చెప్పింది నిజం బావా!.. ప్రపంచాన్నే మరచి వ్రాస్తున్నావ్ ఏమిటది!.. లవ్ లెటరా!..” నవ్వుతూ అద్వైత్ టేబుల్‌ను సమీపించింది సీత.

క్షణం సేపు.. తన్ను సమీపించిన సీత ముఖంలోకి చూచి..

“రాఘవకు వుత్తరం వ్రాస్తున్నాను సీతా!..”

“అయిపోయిందా!..”

“మరో నాలుగు లైన్సు వ్రాస్తే అయిపోతుంది..”

“నేను చదవచ్చా!..”

“కుదరదు..”

“ఎందుకు కుదరదు.. నీకు నా మీద ప్రేమ వుంటే!..” కొంటెగా నవ్వింది సీత.

“వాడు నా బావమరది.. మా మధ్యన..”

“ఆఁ వాడు.. నాకు అన్నయ్య..”

“అయితే!..”

“మా అన్నయ్యకు నీవు ఏం వ్రాశావో నేను చూడవచ్చుగా!..”

“కూడదని అన్నానుగా!.. నీకు అర్థం కాలేదా!..”

“అర్థం అయింది!..” వెటకారంగా అంది సీత.

“ఏం అర్థం అయింది?..”

“ఉత్తరం నిండా ఆ తెల్లదాన్ని గురించి వ్రాసి వుంటావు. అందుకే నేను చదివేదానికి వీలుపడదంటున్నావు. అవునా!..”

అద్వైత్ ఆశ్చర్యంతో సీత ముఖంలోకి చూచాడు. తన ముందున్న కాగితాన్ని చేతికి తీసుకొని సీతకు చూపుతూ..

“తీసుకో.. చదువు..” అన్నాడు.

అతని ముఖం భంగిమను చూచి.. సీత గలగలా నవ్వింది.

“ఎందుకు నవ్వుతున్నావ్..”

“నీ ముఖాన్ని ఒకసారి అద్దంలో చూచుకో బావా!..” లాలనగా అంది సీత.

“సీతా!.. చదవాలనుకొంటే చదువు. నాకు అభ్యంతరం లేదు. చదవకూడదనుకొంటే.. వెళ్ళి పడుకో. నేను ఉత్తరాన్ని పూర్తి చేయాలి”

“సరే!.. ఉత్తరాన్ని వ్రాసుకో..” ప్రక్కగా వున్న అద్వైత్ మంచంపైన పడుకొంది సీత.

“సీతా!.. ఇక్కడ కాదు నీ గదికి వెళ్ళి పడుకో!..”

“బావా!.. భయపడకు. నీవు ఉత్తరం పూర్తి చేయగానే నేను వెళ్ళిపోతాను. త్వరగా వ్రాయి” ఆవలించింది సీత.

“అదుగో.. నీకు నిద్ర వస్తూ వుంది. వెళ్ళి నీ గదిలో పడుకో!..”

“నేను.. యీ రోజుకు యిక్కడే పడుకొంటాను. నీవు.. ఉత్తరాన్ని పూర్తి చేసి.. యిక్కడ పడుకోవాలన్నా పడుకోవచ్చు.. లేకపోతే.. నా గదికి వెళ్ళయినా పడుకోవచ్చు. నీ యిష్టం”

“సీతా!.. అమ్మా నాన్న చూస్తే ఏమన్నా అనుకొంటారు..” కంగారుగా అన్నాడు అద్వైత్.

“బావా!.. నేనెవరు?.. నీకేమౌతాను!..”

“నీకు తెలియదా!..”

“నాకు తెలుసును కాబట్టే ఆ మాటలను నీ నోట వినాలనుకొంటున్నాను”

“ఏ మాటలు!..”

“అదే.. మన సంబంధ బాంధవ్యాలను గురించి..” నవ్వింది సీత.

అద్వైత్.. కొన్నిక్షణాలు సీత ముఖంలోకి చూచి.. నిట్టూర్చి

“సరే.. నీవు ఇక్కడే పడుకో. నేను ఆ గదికి వెళుతున్నాను” కాగితాన్ని చేతికి తీసుకొని కుర్చీ నుంచి లేచాడు.

సీత నవ్వుతూ మంచం దిగింది. అద్వైత్‍ను సమీపించింది.

“వరసకు మరదల్ని.. నాతో కాసేపు సరదాగా మాట్లాడితే.. నీ కొంపేం మునుగుతుంది బావా!..”

“సీతా!.. నన్ను వెళ్లమంటావా!.. నీవు వెళతావా!..” కాస్త వేగంగా అన్నాడు అద్వైత్.

చిరునవ్వుతో అద్వైత్ ముఖంలోకి చూచింది సీత. ఆ చూపుల్లో.. ఎన్నో భావాలు.. ఎంతో ప్రేమ.. ఎంతో అభిమానం.. క్షణం సేపు ఆమె ముఖంలోకి చూచి తలను ప్రక్కకు త్రిప్పుకొన్నాడు అద్వైత్.

“హఁ.. సరే బావా!.. నేను యిక వెళతాను..”

“మంచిది..”

“ఆఁ.. ఏది మంచి?..” రోషంతో అడిగింది సీత.

సీతకు కోపం వచ్చిందని గ్రహించిన అద్వైత్..

“అంటే!.. పొద్దుపోయింది కదా!.. వెళ్లి పడుకోవడం మంచిదని..”

“అలా అన్నావా!..” అమాయకంగా అడిగింది.

“అవును సీతా!..” అనునయంగా చెప్పాడు అద్వైత్.

సీత గలగలా నవ్వింది.

“బావా!.. నా పిచ్చి బావా!.. గుడ్‌నైట్..” చెప్పి చిరునవ్వుతో సీత వెళ్ళిపోయింది.

‘మరలా వస్తుందేమో!..’ అనుకొంటూ అద్వైత్ తలుపు గడియ బిగించాడు.

కుర్చీలో కూర్చొని రాఘవ ఉత్తరాన్ని పూర్తి చేసి, ఒకసారి మొత్తం చదివి కవర్‍ను మూసేసాడు. మంచంపై వాలిపోయాడు.

అతని కళ్ళముందు సీత నిలచింది. కొంటెగా తన్నే చూస్తున్నట్లనిపించింది.

‘సీత.. ఎంత అందంగా తయారయింది!.. తేట తెలుగింటి ఆడపిల్ల సీత. నన్ను ప్రేమిస్తుంది. వున్న బంధుత్వం రీత్యా నాతో ఎంతో చొరవగా మాట్లాడుతూ వుంది. నన్ను హేళన చేస్తూ నా ముఖం భంగిమలను చూచి తాను పరవశిస్తూ వుంది. నా కోసం తాను ఏమైనా చేసేదానికి సిద్ధం. కానీ.. నాన్న అమ్మల నిర్ణయం ఎలా వుందో! నేను వారికి ఒక్కగానొక్క కొడుకును. మాతాపితల ఋణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. నా యోగం.. నాకు దేవతల వంటి తల్లిదండ్రులు అండగా వున్నారు. నా యిష్టానుసారంగా చదివించారు. నా ఏ నిర్ణయాన్ని ఇంతవరకూ కాదనలేదు. నేనూ వారి ఏ నిర్ణయాన్ని నా జీవితాంతం కాదనకూడదు. వారి ఆనందం నా ఆనందంగా భావించాలి. వారి ప్రతి మాటనూ గౌరవించాలి. నా చర్యల వలన వారికి ఆనందం కలగాలే కాని ఆవేదన కలుగకూడదు. నా తండ్రి గారికి.. అయినవాళ్ళ మధ్యన.. వారికి తెలిసిన వాళ్ళ దృష్టిలో ఎంతో గౌరవం.. కీర్తి ప్రతిష్ఠలున్నాయి. వారికి తలవంపులు కలిగించే ఏ పనినీ నేను చేయకూడదు. నా వివాహం.. వారికి నచ్చిన.. వారు మెచ్చిన పిల్లతోనే జరగాలి. అవి యిప్పుడు కాదు మరో రెండేళ్ళ తర్వాత..’ అనుకొన్నాడు అద్వైత్.

సీత తన మంచంపై వాలింది. ఆమె మస్తిష్కం నిండా అద్వైత్‍ను గురించిన ఆలోచనలే.

‘బావ!.. చాలా మంచివాడు. అందగాడు, ఆత్మ సౌందర్యం కలవాడు. తల్లిదండ్రులను, బంధు మిత్రులను ఎంతగానో అభిమానించే వాడు. నా అన్న రాఘవ అంటే అతనికి ఎంతో ప్రేమ. అలాగే అన్నయ్యకు కూడా బావ అంటే ఎంతో గౌరవం అభిమానం. బావకు అత్యాశలు లేవు. ఉన్నంతలో గౌరవంగా బ్రతుకుతూ చేతనైన సాయం పదిమందికి చేయాలనేదే వారి అభిప్రాయం. దైవం మీద భక్తి.. భయం కలవాడు. పాపపుణ్య విచక్షణను ఎరిగిన వాడు. అందుకే నేను ఎంత చొరవగా తనను అల్లరి పెడుతుంటే.. నిగ్రహంతో నన్ను బ్రతిమాలుతాడేగాని కోపగించుకోడు. నా విషయంలో బావ మనస్సులో ఏముందో!.. బావ లాంటి వ్యక్తికి భార్య కావాలంటే నిజంగా అదృష్టం వుండాలి. నాకు ఆ అదృష్టం వుందో లేదో!.. ఆఁ.. నాకేం తక్కువ!.. నాకూ చదువు సంస్కారం.. బావ మనస్సును ఎరిగి మసలుకొనే నేర్పు.. సామర్థ్యం.. సహనం.. వున్నాయిగా!.. మా మధ్యన ఆ తెల్లకోతి ఒకటి చేరింది. అది బావను గురించి కలలు కంటూ వుందా!.. దాంది మా జాతి కాదు కదా!.. బావను గురించి పిచ్చి ఊహలను ఎలా అల్లగలదు!.. ఏమో దాని మనస్సులో ఏముందో!.. వాళ్ళ తెల్లదొరల కన్నా నా బావ అందగాడు. మంచి మనస్తత్వమున్నవాడు. అది బావను తన మనస్సున నిలుపుకొన్న కారణంగా బావ వెంట తిరగడం లేదు కదా!.. ఈ వయస్సు.. ఎవరి విషయంలోనైనా చాలా చెడ్డది.. నేను దాని ప్రతి కదలికనూ బావ ముందు అది వున్నప్పుడు గమనించాలి. అదీ అందంలో తక్కువయింది కాదు. నాలాగే తనూ అందంగా వుంటుందిగా!.. మరి.. బావ.. దాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తాడా!.. వూహూ!.. ఆలోచించడు. బావ ప్రవరాఖ్యుడు. ఏదో నాట్యం నేర్చుకొనే దానికి వస్తూ వుంది కాబట్టి మాట్లాడుతాడు. అంతే.. బావకు తానెవరో.. అదెవరో బాగా తెలుసు. దాన్ని గురించిన పిచ్చి పిచ్చి ఆలోచనలు బావ మనస్సులో వుండవు. కానీ.. దాని మనస్సులో బావను గురించి ఎలాంటి ఆలోచనలు వున్నాయో!.. ఇది నా వూహకు అందని విషయం.. ఏది ఏమైనా బావకు అది దగ్గరైనప్పుడు దాన్ని.. ఒక కంట కనిపెడుతూ వుండాల్సిందే.. తనలాగే తెల్లగా.. వస్తాదులా వున్న బావను గురించి ఇండియా ఏమనుకొంటూ వుందో ఏమో!..’ ఇండియా అద్వైత్‍లను గురించిన ఆలోచనలతో సీత.. పడక పైన అటూ ఇటూ దొర్లుతూ పడుకొంది.

***

నరసింహశాస్త్రి మంచంపై పడుకొని వున్నారు. ప్రక్కన చేరి పడుకొన్న సావిత్రి.. వారి ముఖంలోకి చూచింది కొన్నిక్షణాలు. వారి వదనంలో చిరునవ్వు ఎంతో ప్రశాంతతను చూచింది సావిత్రి.

“ఏమండీ!..” మెల్లగా పిలిచింది.

మెల్లగా కళ్ళు తెరచి చూచాడు నరసింహశాస్త్రి. “ఏం” అన్నట్లు కనురెప్పలను కదిలించాడు చిరునవ్వుతో.

“నిద్ర పోలేదా!..”

“లేదు సావిత్రీ!….”

“ఏ విషయాన్ని గురించో ఆలోచిస్తున్నట్లున్నారు?..”

“అవును..”

“ఏమిటో అది!..”

“ఇండియా వ్యక్తిత్వం..”

“ఏమిటీ!..”

“మన ఇండియాలోని మంచితనం..”

“మీరేమంటున్నారో నా మట్టిబుఱ్ఱకు అర్థం కాలేదండీ!..” మంచం పైన లేచి కూర్చుంది సావిత్రి.

“ఇండియా!.. ఆ జాతిలో తప్ప పుట్టిన బంగారం సావిత్రి. తండ్రి పేదలు శిస్తు కట్టలేదని.. వారి పశువులను బందిల్ దొడ్డికి తోలిస్తే, ఆ అమ్మాయి.. ఆ రైతులు కట్టవలసిన శిస్తును కరణానికి చెల్లించి ఆ ఆవులను గేదెలను విడిపించింది. దీన్ని బట్టి ఇండియా తత్వం ఎలాంటిదో ఆలోచించు సావిత్రి..” చిరునవ్వుతో చెప్పాడు నరసింహశాస్త్రి.

“ఇండియా ఎవరు?.. మీ శిష్యురాలు కదా!..” నవ్వింది సావిత్రి.

“అవును. ఇండియా నాకు గర్వాన్ని కలిగించే శిష్యురాలు..” ఆనందంగా చెప్పాడు నరసింహశాస్త్రి. కొన్నిక్షణాల తర్వాత..

“సావిత్రీ!.. ఇండియా ఆ జాతిలో తప్ప పుట్టింది”

“జాతి వేరయినా.. ఆమె పుట్టింది ఈ దేశంలోనే కదా!..”

“ఆఁ.. అవును. ఈ దేశపు మట్టి వాసనలు ఆమె ప్రతి అణువులోనూ వున్నాయి. ఎంతో గొప్ప మనస్తత్వం”

“ఆ పిల్ల మన జాతిలో పుట్టి వుంటే!..”

“మన కోడలిగా చేసుకొని వుండేవాణ్ణి” నవ్వాడు నరసింహశాస్త్రి.

“మరి సీత!..”

“మనం సీతను కోడలుగా చేసికొన్నా.. చేసికోకపోయినా పుట్టుకతో ఆమెకు ఆ హోదా లభించిందిగా సావిత్రీ!..”

“అంటే!..”

“సీత నా అక్క కూతురు కదా సావిత్రీ!..”

“నా ప్రశ్నకు జవాబు..”

“అది కాదంటావ్!.. అవునా!..”

“అవును. అద్వైత్ సీతల జాతకాలను..”

సావిత్రి పూర్తి చేయకముందే నరసింహశాస్త్రిగారు.. “యజ్ఞం.. మన కాశీ యాత్ర అనంతరం చూస్తాను.”

“వదినగారు ఆ విషయాన్ని గురించి నన్ను అడిగారు”

“ఈసారి అడిగితే.. నేను చెప్పిన సమాధానాన్ని చెప్పు. నన్ను అక్క అడిగినా నేను అదే మాట చెబుతాను”

“వరసైన వారి విషయంలో కూడా జాతకాలు చూడాలా అండీ!..” అమాయకంగా అడిగింది సావిత్రి.

“వివాహం నూరేళ్ళ పంట. చూడడం మంచిది కదా సావిత్రీ!..”

“ఆ.. అవునవును. చూడాల్సిందే!..”

నరసింహశాస్త్రి నవ్వి.. “సరే పొద్దుపోయింది. ఇక పడుకో..” అన్నాడు.

సావిత్రి మంచంపై వాలిపోయింది.

అధ్యాయం 19:

అది 1922వ సంవత్సరం..

ఆ రోజు కార్తీక పౌర్ణమి. ఐదు గంటలకు నాట్యాభ్యాసాన్ని ముగించి.. వచ్చిన బాలబాలికలు గురువులు నరసింహశాస్త్రిగారికి నమస్కరించి వెళ్ళిపోయారు.

సీత వారికి నమస్కరించి.. “మామయ్యా.. దీపాలు పెట్టాలిగా నేను వెళ్ళి అత్తయ్యకు సాయం చేస్తాను” అంది.

“వెళ్ళమ్మా!..”

సీత యింట్లోకి వెళ్ళిపోయింది.

ఇండియా నిలబడి వుంది.

ఇండియాను చూచి నరసింహశాస్త్రి.. “ఇండియా.. బయలుదేరలేదేం?..” అడిగాడు.

“గురూజీ!.. నాకు దీపాలు వెలిగించాలని వుంది. మీరు అమ్మగారితో చెబితే..” చెప్పడం ఆపి తల దించుకొంది ఇండియా.

‘దినదినానికి.. యీమె తనలోని మంచితనం వలన నాకు నా యిల్లాలికి ఎంతో ప్రీతిపాత్రురాలౌతూ వుంది. హైందవ దేవతలన్నా.. వారి ఆరాధనా విధానాలన్నా యీమెకు ఎంతో మక్కువ. అందుకు సాక్షి మహాశివరాత్రినాడు ఆమె చేసిన జాగరణ.. వేకువనే తాను చేసిన నదీ స్నానం.. పరమశివుని దర్శించడం. నేడు కార్తీక దీపాలను వెలిగిస్తానంటూ వుంది. యీమెలోని భావాలు.. చర్యలు.. సంకల్పాలు అన్నీ హైందవ యువతికి చెందిన లక్షణాలు. కలకత్తాలో పుట్టినందున ఆ కాళీమాత తన లక్షణాలను.. అంశను యీమెకు సంప్రాప్తింప చేసిందేమో!.. తండ్రీ!.. సర్వేశ్వరా!.. ఏమిటి నీయీ లీల!..’ కళ్ళు మూసుకొని వున్న నరసింహశాస్త్రిగారి చింతన అది. కొన్ని క్షణాల తర్వాత శాస్త్రిగారు కళ్ళు తెరిచారు.

ఇండియా తల వంటుకొనే క్రీకంట వారిని చూచింది. ఆమె తనను చూచిన భంగిమను నరసింహశాస్త్రిగారు వీక్షించారు. వారి పెదవులపై చిరునవ్వు..

“ఇండియా!.. నిర్భయంగా లోనికి వెళ్ళు.. నీవు నాతో చెప్పిన మాటలను సావిత్రికి చెప్పు. నీ కోర్కె తీరుతుంది.” అన్నారు శాస్త్రిగారు.

ఇండియా వారి పాదాలను తాకి కళ్ళకు అద్దుకొని.. “ధన్యవాదాలు గురూజీ!..” సంతోషంగా నవ్వుతూ ఇంట్లోకి పరుగెత్తింది. ఆ ఆనందంలో తనకు ఎదురుగా వస్తున్న అద్వైత్‍ను చూడలేదు. ఇరువురి భుజాలూ కలబడ్డాయి. బలిష్టమైన అద్వైత్ భుజబలానికి ఢీకొన్న.. ఇండియా ఒరిగి నేల పడబోయింది. తన ఎడమ చేతిని చాచి పడబోయిన ఇండియాను ఆపాడు అద్వైత్.

ఇండియా.. భయంతో దీనంగా అతని ముఖంలోకి చూచింది. ఆమె స్పర్శతో అద్వైత్ మనస్సూ కొన్నిక్షణాలు లయ తప్పింది. నిశితంగా ఆమె ముఖాన్నే చూస్తూ వుండిపోయాడు. వయస్సులో వున్న వారికి ఇలాంటి అనుభవాలు చాలా క్రొత్తగా మనసున వింత అనుభూతులను కలిగిస్తాయి.

కొన్నిక్షణాల తర్వాత అద్వైత్ తేరుకొని ఇండియాను పైకి లేపి..

“సారీ ఇండియా నేను నిన్ను గమనించలేదు.”

“నో.. సారీ చెప్పవలసింది మీరు కాదు నేను. తప్పు నాది. నేనే మిమ్మల్ని గమనించలేదు. సో.. సారీ సార్..” చిరునవ్వుతో చెప్పింది ఇండియా.

అద్వైత్.. నవ్వుకొంటూ వరండాలోకి వెళ్ళాడు.

సావిత్రి అక్కడికి వచ్చింది. ఆమెను చూచిన ఇండియా..

“అమ్మా!..” నవ్వుతూ సావిత్రిని సమీపించింది.

ఇండియా అంటే ఎంతో ప్రేమాభిమానాలు వున్న సావిత్రి నవ్వుతూ..

“ఏం ఇండియా ఇంటికి వెళ్ళలేదా!..”

“నాకు.. మీతో కలసి దీపాలు పెట్టాలని వుంది”

సావిత్రి.. అద్వైత్.. వెనుతిరిగి ఇండియా ముఖంలోకి ఆశ్చర్యంతో చూచారు.

“అమ్మా!.. నేను అడిగింది తప్పా!..” బిక్క ముఖంతో అడిగింది ఇండియా.

‘ఏం చెబుతావ్!..’ అన్నట్లు అద్వైత్ తల ఎగరేశాడు.

ఇండియా ఇద్దరి ముఖాలను మార్చి మార్చి చూచింది.

“మా గురూజీ మిమ్మల్ని అడగమన్నారు..” తల దించుకొంటూ మెల్లగా అంది.

ఇండియా స్థితికి సావిత్రికి జాలి కలిగింది.

“నాకు సీత ఎంతో నీవూ అంతే ఇండియా. రా.. దీపాలు వెలిగిద్దాం.” అంది.

తులసికోట చుట్టూ దీపాలు వెలిగించి సీత హాల్లోకి వచ్చింది. ఇండియాను చూచి.. “నీవు ఇంటికి వెళ్ళలేదా!..” ఇండియాను సమీపించి అడిగింది.

“మీతో అమ్మగారితో కలిసి దీపాలు వెలిగించి వెళతాను” నవ్వుతూ చెప్పింది ఇండియా. సీత ముఖ భంగిమలు మారాయి.

“అత్తయ్యా!.. దాని మాటలు విన్నావా!..”

“సీతా! నాకు చెవుడా!..” నవ్వుతూ అంది సావిత్రి.

“అంటే అదీ!..” సీత పూర్తి చేయక ముందే..

“అదీ కాదు, ఇండియా!.. మనతో కలిసి దీపాలు వెలిగిస్తుంది. వరండా లోకి పద” అంది సావిత్రి.

వసుంధర.. ఆ వూర్లోనే వున్న తన మేనమామ సీనియర్ లాయర్ గోపాల శర్మగారి ఇంటికి వెళ్ళింది. సీతకు తన మనోవేదనను చెప్పుకునే దానికి వేరెవరూ లేరు. ఇంట్లో వున్న వారంతా ఇండియాను అభిమానించే వారే. తన అన్నయ్య రాఘవ కూడా.. ‘వాదన పెంచితే చెడ్డదాన్ని.. అనిపించుకోవాలి’ అనుకొని.. తన అత్తయ్య సావిత్రి ప్రసన్నురాలిని చేసికొనేటందుకు ఇండియా వైపు చూచి..

“రా ఇండియా!.. దీపాలు వెలిగిద్దాం..” అంది సీత.

సావిత్రి చెప్పినట్లుగా ఇండియా క్రమంగా ప్రమిదలను వుంచింది. సీత వత్తిని వేసి ప్రమిదల్లో నూనెను పోసింది. దాదాపు నూట యాభై ప్రమిదలు. క్రొవ్వు వత్తిని వెలిగించి.. ముగ్గురూ అన్ని ప్రమిదలలోని వత్తులను వెలిగించారు.

నరసింహశాస్త్రి.. వరండాలో కూర్చొని తన అర్ధాంగి, సీత, ఇండియా వెలిగించే దీపాలను చూస్తూ వున్నాడు. ‘సీత.. నా చెల్లెలి కూతురు. మేనకోడలు.. చాలా తెలివైనది.. నేనన్నా అత్త సావిత్రి అన్నా ఎంతో ప్రేమ.. అభిమానం.. గౌరవం.. అది రక్తసంబంధం..’

‘ఇండియా.. నా శిష్యురాలు. జాతి వేరు.. మతం వేరు.. భాష వేరు. ఆమె తండ్రికి నేనంటే ద్వేషం. ఆమెకు ఆ విషయం తెలుసు. కానీ ఆమెలోని సుగుణాలు.. కార్యదీక్ష.. పట్టుదల.. సఖ్యతాభావన.. పెద్దల యందు వున్న గౌరవం.. కారణంగా ఆమె నాకు సావిత్రికి ప్రీతిపాత్రురాలయింది’ ఆ యిరువురు యువతులను చూస్తూ.. అనుకొన్నాడు నరసింహశాస్త్రి,

“అమ్మా!..” పిలిచింది ఇండియా.

“ఏం ఇండియా!..’

“ఈ ప్రమిదలతో నేను ఒక డిజైన్ వేయనా!..”

“ఏమిటా డిజైన్!..” అడిగింది సావిత్రి.

“వేయమంటారా!..”

“ఊఁ..”

పది నిముషాల్లో ముఖద్వారానికి ఇరువైపులా వున్న అరుగుల ముందు రెండు వైపులా వెలుగుతున్న ప్రమిదలను డైమండ్ ఆకారంలో క్రమంగా అమర్చింది.

“అమ్మా!.. ఎలా వుంది” అడిగింది ఇండియా.

సీత ఇండియాను చూచి మూతి ముడుచుకొంది. ‘యీ తెల్లదానిది మంచి బుఱ్ఱే..’ అనుకొని, తనపై సావిత్రికి అభిమానం పెరగాలని..

“ఇండియా!.. సూపర్…” నవ్వుతూ చెప్పింది సీత.

“థాంక్యూ సీతా!..” అంది ఇండియా.

“చాలా బాగుంది ఇండియా!..” ఆనందంతో చెప్పింది సావిత్రి.

“ఇండియా!.. అద్భుతం..” నవ్వుతూ చెప్పారు నరసింహశాస్త్రి.

సీత ఇండియా చేతులు కడుక్కొనేటందుకు ఇంట్లోకి పోయారు. సావిత్రి నరసింహశాస్త్రిని సమీపించింది. “చాలా అందంగా వుంది కదండీ!..” నవ్వుతూ అడిగింది.

“నీకంటేనా!..” నవ్వాడు నరసింహశాస్త్రి.

“నేను అడిగింది దీపాల అమరికను గురించి!..”

“ముగ్గురు అందమైన అతివలు కలసి అమర్చిన దీపాల అమరికలో అందానికి కొరత వుంటుందా సావిత్రీ!..” నవ్వాడు నరసింహశాస్త్రి.

సీత.. ఇండియాలు వరండాలోకి వచ్చారు. పెద్దలకు నమస్కరించి ఇండియా వెళ్లి కార్లో కూర్చుంది. సుల్తాన్ కార్ స్టార్ట్ చేశాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version