Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అడుగుల పుప్పొడి

[చొప్పదండి సుధాకర్ గారు రచించిన ‘అడుగుల పుప్పొడి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]

పుడపుడూ – కొంత ఆనందం దొరుకుతుంది!
పూలకిరణాల మధ్యలోంచి ఎవరో నవ్వుతారు
జీవితం మరీ అంత క్రూరమైనదేం కాదు
లేత చలిగాలికి తలలూపే వేల రెల్లు పూల నాట్యాలు ప్రదర్శిస్తాయి!
అక్షరాలు నడుస్తూ వృక్ష ఛాయలౌతాయి
సెలయేటి గలగలలు యుగళ గీతాలవుతాయి
తొలిసారి ప్రేమలేఖ రాసిన మధుర పుటలు రెపరెపలాడీ
మనసులో ఒక నవ్వు మొలకెత్తుతుందీ
ఎన్ని కష్టాలు దాటి ఇంత సుకుమారంగా మారానో
నెమరేసుకొని ఉదయాన్ని నిద్ర లేపుతాను
రిహార్సల్ లేని ఆనందాలు అలా – పులకరింపజేస్తాయి!
ఎదురు చూడని ఉత్తరం ఒకటి చేతికందుతుంది
వీధిలో ప్రతి ముగ్గు అందంగా విరబూస్తుంది
తెల్లవారి వాక్యాలు రుచిగా ఘుమ ఘుమ లాడతాయి
ఎన్నని భుజిస్తాం – కొన్ని ఇతరులకు పంచుతాం!
అపుడు ఊరపిచ్చుకలు మనల్ని మరింతగా కీర్తిస్తాయి!
తేదీ మారి ప్రియురాలిలా వెనక్కు తిరిగి ఓ నవ్వు నవ్వి వెళ్ళిపోతుంది
చేతులకు పూలు పూసి కొత్త వయ్యారాలు పోతాయి
ఇలా రోజుకో మొక్కయి నేను మొలకెత్తుతూనే ఉంటాను
ఎపుడో ఒకపుడు మనసు సీతాఫలమై పక్వానికి రావాల్సిందే
నా ముందు తరంలా జీవించి రాబోయే తరానికి మార్గమవుడం –
లోనే జీవిత సార్థకత ఉందని ప్రగాఢంగా నమ్ముతాను
కొంచెమైన నా అడుగుల పుప్పుడి ఇక్కడ వొదలాలని
బతికినంత కాలం – అనుక్షణం పరితపిస్తూనే పోతానూ!

Exit mobile version