Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అధికారులు

[‘అధికారులు’ అనే శీర్షికతో పది పద్య కవితలను అందిస్తున్నారు శ్రీ చిరువోలు విజయ నరసింహారావు.]

1.
పదవి నాధిపత్య మొసగ, ప్రభుత యందు
దక్కు నధికారి యననొప్పు దర్పము, పలు
బాధ్యతలు,పెత్తనంబును, పలువురి పయి
నంత నాదేశముల నిచ్చు నధిక ధృతియు

2.
కొందరు దయామతులగుదు రందరి యెడ
శాంత చిత్తంబు, ననుకంప, సత్త్వ బుద్ధి
నిత్తురాదేశములు, పనులెల్ల జరుప
క్రింది వారు శ్రద్ధగ జేయు చుందురపుడు

3.
కోపమున తిట్టి, పనిచేయ కోరు నపుడు
కార్మికులు తిరగ బడరె, కక్ష గట్టి
పనులు సాగవు క్రమగతి, భగ్నపడుచు
ప్రగతి, కార్యాలయము లందు పగలు పెరుగు

4.
ప్రేమ పంచిన నలుగురి క్షేమ మఱసి
అందరును సమైక్యత నొప్పి, ఆదరమున
సహకరించెద రనిశంబు, సానుకూల
బుద్ధి కార్య పూర్తియు నగు, సిద్ధి కలుగు

5.
ప్రతి విషయమందు, స్పర్ధతో పరుల తోడ
పోరు సల్పిన కలుగునే పూర్ణ ఫలము?
వేరు దారుల పడి పోవు వారు నేడు
జనులు తృప్తులై పనిచేయ మనసుపెట్టి
మంచి మాటలు, ప్రేమను పంచ వలయు

6.
చట్టములు మీరి తప్పులు సలప కుండ
న్యాయ బద్ధముగా పని చేయు టొప్పు
నట్టి వారికి ప్రొత్సాహ మంద జేసి
ముందునకు నడుప వలయు నందరెపుడు

7.
పైన యధికారు లందరు భయము గొలిపి
అరచి, దూషింపగ నెదురు తిరుగు వారు
క్రింది కార్మికు లావేశ మందు చుండి
ప్రక్కదారులు పట్టించ భగ్నమగును
పనులు, సత్ఫలంబులు రావు, ప్రగతి లేక

8.
తప్పులను చేయు మనరాదు గొప్పవారు
ఒప్పు చేసిన వారికి నొప్పి పెట్ట
రాదు, ధనము నాశను జూపరాదు,పరుల
పనుల నాపగా కూడదు పాడొనర్ప
ధర్మ సమ్మతముగ జేయ ధన్యత గను

9.
దర్ప మహమున నధికారి తక్కువ గన
వలదు కార్మికుల నెపుడు,ప్రభువు నన్న
చలము వీడి ప్రేమను చూప జరుగు పనులు
చక్కగా పూర్తి యగు వారు సహకరింప

10.
పనుల విషయాన క్రమశిక్ష బరగ జేసి
కష్టముల సాయమును జేయ ఖ్యాతి కలుగు
తనకు అధికార పీఠమే ఘనత దెచ్చు
కార్మికులు ప్రేమతో జేయు కార్యములను
సంఘ సహకార, శ్రేయముల్ సంఘటిల్లు.

Exit mobile version