Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దైన్యం ఆర్తనాదం : “అధీన్”

“ఈ సాంకేతిక యుగంలో మనుషుల మధ్య దూరాలు తగ్గాయా, పెరిగాయా?” అని ప్రశ్నించే లఘుచిత్రం ‘అధీన్’ని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి.

వారం మరో లఘు చిత్రం. యశ్ వర్మ తీసిన “అధీన్”. కథ వొక కుటుంబానిది. భార్యాభర్తలు, కొడుకు, కూతురు. పిల్లల బాల్యం నుంచీ తల్లిదండ్రుల వృధ్ధాప్యం దాకా సన్నివేశాలు తడుముతూ ముఖ్యంగా వొకే ఇంట్లో ముగ్గురి మధ్యా నడిచే సంభాషణలతో నడుస్తుందీ చిత్రం.

తండ్రి (సంజయ్ మిశ్రా) వంటింట్లో సేమ్యా పాయసం వండుతున్నాడు. తనకి బాగాలేదని మిత్రుని చేత కబురు పంపిస్తే రానున్న కొడుకు వీర్ (నీరజ్ ప్రదీప్ పురోహిత్), మీరా (అనుప్రియా గొయెంకా) కోసం. లోపలి గదిలో (ఆ తలుపు ఎప్పుడూ మూసే కనిపిస్తుంది, కెమెరా లోపలికి పోనే పోదు, చివర్లో తప్ప) భార్య (సుహాశిని ములయ్ అనుకోవాలి, ఆమె చిత్రపటం ఆధారంగా) గత ఏడు సంవత్సరాలుగా మంచాన పడి వుంది. నయమయ్యే జబ్బు కాదు. ఈ లోకంలోనూ వుండదు. స్పృహలో వున్నప్పుడు మనోజ్ పేరు కలవరిస్తూ వుంటుంది.

తండ్రి బాగానే వుండటం చూసి పిల్లలిద్దరూ చిరాకు పడతారు. తల్లికి ఆరోగ్యం పాడైన తర్వాత ఏడాదికో, పండక్కో చుట్టం చూపుగా వస్తారు. బయటివాళ్ళ లాగా. అంతకంటే బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడరు. చిన్నప్పట్లాగే ప్రస్తుతం కూడా అన్నా చెల్లెళ్ళు (లేదా అక్కా తమ్ముళ్ళు) దెబ్బలాడుకుంటూ, ఒకరి తప్పును మరొకరు గుర్తు చేసి దెప్పి పొడుస్తూ. కొడుకు నిష్ప్రయోజకుడు, అప్పుల అప్పారావు, జూదరి, బాధ్యతారహితుడు. టీచర్ గా చేస్తున్న కూతురు షాలిని అనే అమ్మాయితో సాహచర్యం. ఆ సజాతి ప్రేమ పట్ల తల్లిదండ్రుల వైఖరి ఎలా వుంటుందంటే, తండ్రి ఇప్పటికీ ఆమె ప్రసక్తి వచ్చినప్పుడు మరేదో పేరు చెబుతాడు. తల్లి మొదట కోపం వచ్చి మీరాని ఇంట్లోంచి గెంటేసినా తర్వాత సమాధానపడి పిలిపిస్తుంది, కాని మీరా రాదు.

ఆ హాల్లో వాళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నతసేపూ పిల్లలకి ఫోన్ కాల్స్ వస్తూనే వుంటాయి. కాని తల్లిదండ్రులతో ఇద్దరికీ ఎలాంటి బంధమూ మిగలలేదనిపిస్తుంది. తండ్రి చెబుతాడు, నేను నలుగురి జీవితాలకీ స్వేచ్చనివ్వడానికి నిర్ణయించాను; మీ అమ్మకు ఎక్కించే సలైన్ లో విషం కలిపాను; భర్తగా ఆ నిర్ణయం తీసుకున్నాను, కానీ పిల్లలుగా తల్లి పట్ల మీరు తీసుకునే నిర్ణయంలో నేను జోక్యం చేసుకో కూడదు కాబట్టి ఇక్కడ విషానికి విరుగుడు పెడుతున్నా; మీలో ఎవరికి తల్లి కావాలో వారు బతికించుకుని తీసుకెళ్ళొచ్చు; నేను వెళ్తున్నాను, ఇక ఎప్పటికీ రాను. ఇదీ ఆ సుదీర్ఘ సంభాషణ. దాని ముందు నాటకం : వీర్, మీరాలు అమ్మను నువ్వే వుంచుకో అంటే నువ్వే వుంచుకో అని కాసేపు ఒకరి మీద ఒకరు త్యాగ భావనతో చెప్పుకోవడం, కాసేపు దెబ్బలాడుకోవడం. తండ్రిని చూస్తే మనిషి విరిగి పోయి వున్నాడు. చిత్రం మొదట్లోనే చెప్పినట్టు బలమైనదే విరుగుతుంది, మెత్తనైనది కాదు. ఇల్లు తప్ప ఆస్తి లేదు; ఆదాయం ఏడేళ్ళ నించీ ఆగిపోయింది. ఎందుకంటే ఆమె సంపాదన మీదే ఇల్లు గడిచింది, తండ్రి homemaker. (నువ్వేం చేశావు, అమ్మ సంపాదించి సంసారాన్ని లాక్కొచ్చింది అన్న పిల్లలు నిలదీస్తే అంటాడు, అవును నేను వండి తినిపిస్తే, నా బుగ్గ నిమిరి తాంక్‌యూ అనేది, గత ఏడేళ్ళుగా అదీ లేదు. అంటే రోల్ రివర్సల్ అయినా ఆ ప్రశ్న అలాగే వుంది.) భార్యను అనాథాశ్రమంలో పెట్టలేడు, ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం రోజూ దుప్పటైనా మార్చరు. అందుకే తనే సేవలు చేస్తాడు. ఉచ్చ, మలం వాసనలతో నిండిన ఆ గదిలోనే రోజూ పడుకుంటూ. ఒక్క రోజు బయట హాల్లో పడుకునేసరికి మర్నాడు భార్య వీపంతా మలం అంటుకుపోయి వుంటుంది. అది శుభ్రం చేయబోతే చర్మం అంతా పుండ్లు రసి కారుతూ మరింత బీభత్సంగా అవుతుంది వొళ్ళు. భార్యను ఇంతగా చూసుకుంటున్న అతనికీ అంతుపట్టనిది ఆమె కలవరించే పేరు “మనోజ్”. ఎవరతను? ఆమె గతకాల ప్రేమికుడా, లేక ఆమె మతిస్థిమితం పోయి చేస్తున్న ప్రేలాపనా? ఏమో?

హాల్ మధ్యలో బల్ల మీద వున్న విరుగుడు మీద కెమెరా ఫోకస్, తర్వాత తండ్రి వెళ్ళిపోతాడు. అతను తిరిగి వచ్చేసరికి ఆ సీసా అలానే వుంది, భార్యకు సలైన్ అందుతూనే వుంది. వాకిట్లో ఎండుటాకులు ఊడుస్తూ వుంటే నేపథ్యంలో పాట (నీరజ్ ప్రదీప్ పురోహిత్ పాడినది). “కుటుంబమంతా నా లోనే వున్నా, నేను మాత్రం ఖాళీ గానే వున్నాను”.

ఈ కథ లాంటివి ఇదివరకు మనం చూసే వుంటాము. కాని కేవలం 20 నిముషాల్లో, సంభాషణల బలంతో, మెలోడ్రామా అన్నది లేకుండా చెప్పడం ఇక్కడే చూస్తాము. వృధ్ధాప్యం లో మనిషి దీనత్వం, పరాధీనత ఎలా వుంటుందో చెంప చెళ్ళుమనిపించేలా చెబుతుంది ఇది. కథ కేవలం సంభాషణలతోనే కాదు (సంజయ్ మెహతా) కెమెరాతో కూడా చెప్పబడింది. కూతురు దూరంగా సోఫా మీద కూర్చుంటుంది. కొడుకును కూర్చోమంటే కుర్చీని తండ్రికి దూరంగా లాక్కుంటూ కూర్చుంటాడు. తల్లిదండ్రుల మీద శ్రధ్ధ లేని ఆ పిల్లల బాల్యకాలపు చిహ్నాలని జాగ్రత్తగా దాచినవి వాళ్ళకు ఇవ్వడం. ఇల్లు అమ్మేశాననడం. దానికి పిల్లల స్పందన. ఆస్తిలో వాటాకోసం చూసే పిల్లలకు తల్లి మాత్రం అక్కరలేనిదవ్వడం. ఇలా చాలా వాటిని కెమెరా తనదైన భాషలో చెబుతుంది. మొదట్లో చూపించిన పాయసమే, తండ్రి వెళ్తూ కూడా గుర్తుపెట్టుకుని చెబుతాడు పాయసం వుంది తినండి మరచిపోకుండా అని. ఇక సంజయ్ మిశ్రా గురించి ఎంత చెప్పినా తక్కువే. మనకున్న గొప్ప నటులలో వొకడు. మసాన్లో విశ్వరూపాన్ని చూపించినవాడు. నీరజ్ నటన, గానం, కథ (కథకులలో ఇతను వొకడు) కూడా బాగున్నాయి. అనుప్రియ నటన కూడా బాగుంది.

ఈ సాంకేతిక యుగంలో మనుషుల మధ్య దూరాలు తగ్గాయా, పెరిగాయా?

Exit mobile version