నరనరానా దహిస్తూ
పిడికిళ్ళెత్తి
అన్యాయాన్ని ఎదిరించే ఆయుధం
ఒక్క నీలికళ్ళ
చూపుతో మనసుని
తంపట కాచే చలిమంట
ఖాళీ కడుపున పరుగెత్తి
నాలుక కళ్ళను పిడచకట్టించే
ఆకటి చిచ్చు
అహంకారపు చీకటి ముసుగును చీల్చి
కాసింత జ్ఞానాన్ని రగిల్చే
చిరుదివ్వె
కాగిస్తూ ప్రతి సమ్మెట దెబ్బనీ
పదునెక్కిస్తూ ఇనుప ముక్కలనీ
ఆయుథాల్ని గా మలిచే జ్వాల
ఆకాశపు చీకటి దుప్పటిలో
రువ్వి వెదజల్లిన
నక్షత్ర సమూహపు వజ్ర రాశి
నులివెచ్చని ప్రేమ నుంచీ
కన్నీటి జ్వాలదాకా
కడలి నుంచీ
కవనం దాకా
బహురూపిలా…
విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. పాశ్చాత్య రచయితలను పరిచయం చేస్తూ ‘ పడమటి రాగం’ ఆనే వ్యాస సంపుటిని,
కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. ‘ ద స్పారో అండ్ ద కానన్’ అనే ఆంగ్ల కవితల సంపుటిని 2021 లో ప్రచురించిన డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ‘పైనాపిల్ జామ్’ (2023) ఈయన మొదటి కథా సంపుటి.
డా. కోగంటి విజయబాబు ప్రస్తుతం కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు.
drvijaykoganti2@gmail.com
8309596606