శీతాకాలం ఇప్పుడిప్పుడే తన చోటుని వెతుక్కుంటూ బయలుదేరింది, వస్తే శివరాత్రి దాకా ఉండి పోదామని. చల చల్లని గాలులు రెక్కలు విప్పుకొని వెచ్చదనం కోసం ఆ ఊర్లోకి ప్రవేశించాయి. పొగమంచు ఊరి పొలిమేరలో పొంచి ఉంది. వెన్నెల ఇప్పుడిప్పుడే ఒళ్ళు విరుచుకుంటుంది. ఊర్లో ఉన్న జనమంతా లైట్లు ఆపి తలుపులు కిటికీలు బిర్రుగా బిగిస్తున్నారు కాస్తయినా ఆ శీతాకాలానికి చోటు దక్కకుండా.
ఊరంతా ముసుగుతన్ని పడుకోవడానికి ప్రయత్నిస్తోంది.
కానీ, రమాదేవి మాత్రం ఇంకా పొయ్యి దగ్గరే పాట్లుపడుతుంది. అంత చలిలో కూడా చెమటలు వదలడం లేదు రమాదేవిని.
“ఇది కూడా ఆయనలాగా మొండిదై ఉంటుంది, ఎంత మంట పెట్టి మసాలా వేసిన అది ఉడకకుండా నన్ను ఉడికిస్తుంది. బాగా ముదిరిపోయింది నాలాగా, మొండికోడి.. ఏం చేస్తాం ఆయనకి ముక్క లేనిదే ముందు దిగదు” అని మనసులోనే తిట్టుకుంటూ, విసుక్కుంటూ పొయ్యి మీద నుండి కోడికూర గిన్న దింపేసి చెంగుతో చెమటలు తుడుచుకుంటూ ఉండగా, “రమా.. రమా” అన్న పిలుపు విని బయటకు వచ్చింది. బయటకు వచ్చి చూస్తే ఎదురుగా వెదురు కర్ర లాగా నిటారుగా నిలబడి ఉంది నీలవేణి. “ఏంటి రమా, ఊరంతా తిని పడుకుంటుంటే నువ్వు ఇంకా వంట గదిలో మంట పెడుతున్నావా” అని నీలుగుతూ అన్నది నీలవేణి. “అవునే నీలూ ఈరోజు వంట కాస్త వాయిదా పడ్డది,కోడికూర చేస్తున్న.. ఇది మామూలు కోడి కాదు, పందెంలో ఓడిపోయిన కోడి. అందుకే ఇప్పటిదాకా ఉడక్కుండా నాతో పందెం కాసి ఓడిపోయి చివరికి ఉడికిపోయింది” అని చెప్పి రమాదేవి వరండాలో లైట్ వేసింది.
“నీ చేతిలో పడితే ఏదైనా ఓడిపోవాల్సిందే” అని నీలవేణి వెంట తెచ్చుకున్న ఖాళీ చెంబు బకెట్లో వేసి అరుగు మీద కూర్చుంది.
“ఇంకా ఆయన రాలేదా”
“వచ్చేవేళ అయ్యింది ఇక్కడే కూర్చో ఓ పది నిమిషాలు, గబగబా వెళ్లి నాలుగు చెంబులు నీళ్లు పోసుకుని వస్తా” అని రమాదేవి స్నానాలు గదిలోకి వెళ్లిపోయింది.
సలసలా కాగే వేడి నీళ్లు ఒంటిమీద కుమ్మరించుకుంది. చందనం లాంటి తన ఒంటికి మైసూర్ శాండిల్ రుద్దుకోగానే నునుపైన తన శరీరం మీద పాపం ఆ సబ్బు నిలబడలేక జారిపోయింది. కుంకుడుకాయలతో కురులను శుభ్రంగా తోమింది. ఇదంతా చూస్తున్న చంద్రుడు ఇంక చూడలేక సిగ్గుతో మబ్బులు చాటున తలదాచుకున్నాడు.
40 వసంతాలు దాటినా కూడా రమాదేవిలో చురుకు తగ్గలేదు. మనిషి కాస్త బొద్దుగా ఉన్న ముద్దుగానే ఉంటుంది. ఎరుపు రంగు లేకపోయినా కళ్ళల్లో ఉన్న మెరుపుతోటే అందరినీ కట్టిపడేస్తుంది. బరువైన ఆమె హృదయం ఆమెకు అదనపు ఆకర్షణ. తేలికైనా ఆమె మనసు ఆమెకు వదనపు సంఘర్షణ.
స్నానం పూర్తి చేసి లంగా కట్టుకొని, తల తుడుచుకుంటూ, పాటలు పాడుకుంటూ వరండాలో ఉన్న నీలవేణి దగ్గరకు వచ్చింది రమాదేవి.
“అలాగే అర్ధనగ్నంగా బయటికి రాకపోతే, చీర కట్టుకొని రావచ్చుగా, ఎవరైనా చూస్తారని కూడా లేదు దీనికి” అని నీలవేణి గొణుగుతుంటే “ఆడది కోరుకునేది కూడా అదేనే, నలుగురు చూడాలని, నలుగురు చూస్తేనే కదా మన విలువ పెరిగేది” అని రమాదేవి కొంటెగా నవ్వింది.
“చిన్నప్పుడు నీలో ఇన్ని మాటలు లేవు, భలే నేర్చావు మాటలు.”
“నేనేమీ నేర్చుకోలేదు ఈ సమాజం, మనుషులే నేర్పారు. అవసరమే అన్నిటినీ నేర్పిస్తుందిలే కానీ లోపలికి వెళ్లి చీర తీసుకురావే, ఆయన వచ్చాడంటే ‘అందాన్ని అందరి ముందు ఆరబోస్తున్నావా? పారబోస్తున్నావా’ అని చతుర్లాడుతారు నాతోటి” అని రమాదేవి చెప్పగానే నీలవేణి వెళ్లి బీరువా తీసి ఒక చీరను లాగింది. అంతే అక్కడ ఉన్న పట్టు చీరలు మొత్తం ఒకదాని మీద ఒకటి కింద పడ్డాయి. ఆ చీర మడతల్లోనే పాపం ఎన్నాళ్ళ నుండి దాక్కున్నాయో ఏమో నోట్లో కట్టలు నలిగి నలిగి అలిగి కింద పడ్డాయి ఏ శబ్దం చేయకుండా. వాటితోపాటు నాలుగైదు నగలు పెట్టెలు కూడా క్రింద పడ్డాయి. ఆ శబ్దానికి రమాదేవి ఎలాంటి కంగారు పడకుండా లోపలికి వచ్చింది. “పర్వాలేదులే నీలూ, వదిలేయ్. నేను తర్వాత సర్దుకుంటాలే రా పోదాం” అని నీలవేణి చేతిలో ఉన్న చీరను తీసుకొని బయటికి వచ్చేసారు ఇద్దరు.
సగం ఆరిన తడి కురులను రమాదేవి అలాగే వదిలేసి చీర కట్టుకోవడం మొదలుపెట్టింది. అలాగే ఊరిలో జరిగిన సంగతులను అడగడం మొదలుపెట్టింది. నీలవేణికి ప్రాపంచిక విషయాల పట్ల దృష్టి ఎక్కువ కాబట్టి నీలవేణిని అందరూ నడిచే న్యూస్ పేపర్ అంటారు. నీలవేణి వార్తలు చదవడం ప్రారంభించింది.
“సుబ్బాయమ్మని పోలీసులు తీసుకెళ్లారు, ఇంట్లో దొంగచాటుగా మందు అమ్ముతుందని, పాపం ఏం చేస్తది ఆ ముసలిది వచ్చిన పింఛన్ సొమ్మంతా వాడి కొడుకు తాగి తందనాలాడుతుంటే”.
“మరియమ్మ ఆ సూరిగాడిని మరిగిన విషయం దాని మొగుడికి తెలిసి నిన్న చావబాదాడు. పాపం మరియమ్మ ఇయ్యాల హాస్పిటల్‌కి వెళ్ళింది అక్కడ అయిన బిల్లు కూడా సూరిగాడే కట్టాడంట”.
“రామిరెడ్డి కూతురికి ఏదో పెద్ద కాలేజీలో సీటు వచ్చిందని ఆయన ఊర్లో వాళ్ళందరికీ స్వీట్లు పంచి పెట్టినాడు. కానీ ఆ పిల్లకి ఆడ చదువుకోవడానికి చాలా డబ్బులు కావాలంట, ఏదో సంఘం వాళ్ళు వచ్చి 25 వేల చెక్కు ఇచ్చి వెళ్ళినారు అంట.”
“ఇంతకీ నీ సంగతి చెప్పవే” అని చీర కట్టుకోవడం పూర్తయిన రమాదేవి అడిగితే “నా సంగతి ఏముందమ్మా, జగమెరిగిన సంసారం మాది, మా ఆయన నిజాయితీగా 20 ఏళ్ల నుండి ఆ గవర్నమెంట్లో పని చేస్తున్నాడు, అందుకే ఇప్పటికీ మాకు అదే ఇల్లు, అద్దె ఇల్లు. మా సంసారం చాకలి బండ కాడ..” అని ఏదో చెప్పబోతుంటే సర్రున ఒక కారు వచ్చి రమాదేవి ఇంటి ముందు ఆగింది.
“ఇంక నాతో నీకేం పనమ్మా.. ఆయన వచ్చాడుగా, ఇంక మొదలుపెట్టు కాపురం, మా ఆయన ఇప్పటికే గురకలు పెడుతూ ఉంటాడు, నేను పోతున్నా” అని నీలవేణి చెంబు తీసుకొని చీకట్లో కలిసిపోయింది.
కారులో నుండి దిగిన మూర్తి చిన్న బ్యాగు చేతి పట్టుకొని సరాసరి బీరువా దగ్గరికి వచ్చాడు. “దీనిని జాగ్రత్తగా బీరువాలో పెట్టు” అని ఆ బ్యాగుని రమాదేవి చేతిలో పెట్టాడు. రమాదేవి ఆయన చెప్పినట్టే చేసింది. అదే బీరువాలో నుండి కొత్త లుంగీ తీసి మూర్తి భుజాన వేసి, “వేడి నీళ్లు పెట్టాను త్వరగా స్నానం చేసి రండి ఆకలవుతోంది, నిద్ర వస్తోంది” అని రమాదేవి మూర్తిని నెట్టబోతే మూర్తి ఆ లుంగీతో రమాదేవి నడుము చుట్టి మీదకు లాక్కొని బుగ్గ కొరికాడు, రమాదేవి కయ్యమని అరిచింది. మూర్తి వెళ్లిపోయాడు. ఈ లోపు బీరువాలో ఇందాక కింద పడిన నగలు, డబ్బులు, చీరలు జాగ్రత్తగా సర్దింది.
పావుగంట తరువాత మీసాలు దువ్వుకుంటూ వచ్చిన మూర్తికి రమాదేవి చేసిన ఏర్పాట్లు చూసి పిచ్చెక్కిపోయింది. కోడి ఫ్రై, మటన్ పులుసు, మొక్కజొన్న పకోడీ, నెయ్యిలో వేయించిన జీడిపప్పు చూసి మూర్తికి మనసు నిండిపోయింది. అన్నీ సిద్ధం చేసి తనకోసం ఎదురుచూస్తున్న రమాదేవిని చూస్తుంటే పాపం మూర్తికి ఎక్కడలేని వింత మోహం మొదలైంది. మూర్తి బీరువా దగ్గరికి వెళ్లి బ్యాగు తీసి కింద పెట్టి తాను కూర్చున్నాడు. ఆ బ్యాగ్‌లో నుండి గోవా నుండి తెచ్చిన రెండు తెల్ల రమ్ము సీసాలను బయటికి తీసి, రమాదేవికి ఒక గ్లాసులో పోసి, తానొక గ్లాసులో పోసుకున్నాడు. “ఏంటి రమా అలాగే చూస్తున్నావు తాగు” అని రమాదేవి గ్లాసు ఎత్తిన దాకా ఆగి, రమాదేవి తాగిన తరువాత తానూ ఒక గ్లాసు తాగి ఒక కోడి ముక్క నోట్లో వేసుకున్నాడు “అబ్బా రమాదేవి ఎంత అద్భుతంగా ఉంది రుచి, ఈ రుచి ఈ కోడిలో ఉందో లేక నీ చేతిలో ఉందో తెలియడం లేదు”అని రమాదేవి చేతిని ముద్దాడాడు మూర్తి.
“బ్యాగు తీసుకొచ్చి గబగబా బీరువాలో పెడుతుంటే ఇవాళ ఏదైనా పెద్ద పార్టీ తగిలింది అనుకున్నా” అని రమాదేవి ఇంకో గ్లాసు రమ్ము పోసుకొని గట గట తాగేసింది.
“పెద్ద పార్టీయే తగిలింది బంగారం, వాళ్లే ఈ మందు బాటిల్లు ఇచ్చారు. డబ్బులు వచ్చే వారం ఇస్తారంట. అందాకా వీటిని దాచుకొని, నీ దగ్గర తల దాచుకోమని చెప్పారు” అని మూర్తి రమాదేవి తొడ మీద తలపెట్టి పడుకున్నాడు.
“నువ్వింకా ఎన్నాళ్ళు ఉంటావు ఈ ఊర్లో VROగా”
“ఇంకో ఆరు నెలలు ఉంటాను”
“నువ్వు వెళ్లే లోపు నేను అడిగిన ఆ స్థలం నా పేరు మీదకి ఎక్కించండి”
“ఆ పని మీదే ఉన్నాను బంగారం, అది కాస్త లిటిగేషన్ స్థలం, కాస్త ఓపిక పట్టు, కొంచెం ఈ కాళ్లు పట్టు” అని మూర్తి రమాదేవి ఒళ్లో కాళ్లు పెట్టి పడుకున్నాడు.
కాళ్లు ఒత్తడం మొదలుపెట్టిన రమాదేవి “నన్ను మరిగిన కాడ నుండి ఇదే కూత కోస్తున్నావ్, చివరికి ఏమైద్దో ఏమో, చూద్దాం” అని రమాదేవి అలిగితే మూర్తి గబుక్కున లేచి రమాదేవి గడ్డం పట్టుకుని “ఓసి పిచ్చిదానా, ఆ నాలుగు సెంట్లు స్థలం నీకెందుకే? నానా సంకలు నాకి, నానా తిప్పలు పడి, ఎవరికి దొరక్కుండా, చాలా జాగ్రత్తగా, కష్టపడి రైతుల దగ్గర నుండి లంచాలు తీసుకొని,నీ మంచం మీదనే కదే పోస్తూ ఉన్నాను.ఆ డబ్బులతో ఒక బంగ్లా కొనుక్కోవచ్చుగా ఆ సూరారెడ్డిపాలెంలో, కావాలంటే ఆ కారులో 10 లక్షలు ఉన్నాయి తెచ్చివ్వమంటావా” అని మూర్తి లేవబోతుంటే కాళ్లు పట్టుకున్న రమాదేవి “ఇప్పుడు వాటికేం తొందర వచ్చింది లే కానీ, రేపు పొద్దున తీసుకుంటాలే, ఇది తాగు ముందు” అనగానే సీసా మొత్తం ఎత్తేసాడు మూర్తి.
ఆ తరువాత రమాదేవి వండిన రొయ్యల బిర్యానీని పీకలు దాకా తిని, ఫిల్టర్ సిగరెట్ తాగుతూ ఉండగా రమాదేవి పక్క సర్దింది. మూర్తి వెళ్లి మూర్తీభవించిన కృష్ణుడిలాగా ఆ మంచం మీద పవళించాడు. రమాదేవి దేవుడి పటాల దగ్గర పెట్టిన మల్లెపూలు కాసిని తలలో తురుముకుని మూర్తి పక్కలోకి దూరింది. ఇద్దరూ కాసేపు ఏవో గిల్లికజ్జాలు ఆడుకున్నారు.
“ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ రేపు ఇక్కడికి వస్తానన్నాడు, కాబట్టి నీకు రేపు సెలవు” అని రమాదేవి మూర్తి గుండెల మీద ఉన్న వెంట్రుకల్లోకి వేళ్ళు పోనిచ్చింది. “నీ దగ్గర ఏముందనే, ప్రతి మగాడు నీ వెంట పడుతున్నాడు, నీకంటే ఎర్రగా బుర్రగా ఉండే కుర్ర పిల్లలు చాలా మంది ఉన్నారుగా ఈ ఊళ్లో, వాళ్ళ దగ్గరకు పోవచ్చుగా, నీకు 40 దాటాయి, ఇంకేం ఒళ్ళు వంచి పనిచేస్తావు చెప్పు, ఈ వయసులో” అని మూర్తి విసుక్కోగా వెంటనే రమాదేవి పౌరుషంతో
“చాలామంది మగాళ్లు మా దగ్గరికి కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే రారు, మానసిక సాంత్వన కోసం మా దగ్గరికి వస్తారు. మా దగ్గర స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు దొరుకుతాయి కాబట్టి వస్తారు, ఊరికే వచ్చే డబ్బులుంటాయి, ఎలా ఖర్చు పెట్టాలో తెలీదు. కొంతమంది మగాళ్లు అయితే కేవలం నాతో కలిసి మందు తాగడానికే వస్తారు, అడిగినంత ఇచ్చి వెళ్తారు. ఇంట్లో భార్య దగ్గర దొరకనిది నా దగ్గర ఏదో దొరుకుతుంది వాళ్లకి. కాసేపు శృంగారపురితమైన కబుర్లు చెప్తే చాలు గిలగిల లాడిపోతారు. మందు తాగాక మగాడికి వాళ్ళు చెప్పె మాటలు వినే మనిషి ఉంటే చాలు ఎంత దూరమైనా వెళ్తారు. నాకు ఆ ఓపిక చాలా ఉంది. నేనెప్పుడూ కేవలం శారీరక సుఖం మాత్రమే ఇచ్చి పంపను, వాళ్ళ మనసు కడిగేసి పంపిస్తాను. అందుకే నాకు ఇంకా గిరాకీ ఉంది ఈ ఊర్లో” అని గర్వంగా చెప్పింది రమాదేవి.
ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం ఏ శబ్దం చేయకుండా ఉంది. మల్లెపూలు మౌనం పాటించాయి. రమాదేవి గాజులు మాత్రం సంగీతాన్ని సృష్టిస్తున్నాయి. రమాదేవి చీర సిగ్గుతో మంచం కింద దాక్కుంది. మూర్తి మన్మథుడు అయ్యాడు. స్వర్గానికి గురి పెట్టి బాణాలు వదులుతున్నాడు. రమాదేవి మాత్రం మూర్తి చేయి పట్టుకొని మరీ స్వర్గ లోకాలన్నీ విహరింపజేసింది. అలసిన మనసులతో ఇద్దరు గాఢ నిద్రలోకి జారుకున్నారు.
బయట నుండి ఎవరో తలుపులు బాదుతున్నారు, రమాదేవికి మేలుకువ వచ్చి చీరను సగం చుట్టుకొని వరండాలో లైట్ వేసి వెళ్లి తలుపుతీసింది. ఎదురుగా పోలీసులు. మూర్తిని, రమాదేవిని పోలీసులు జీపు ఎక్కించారు. మిగిలిన రాత్రంతా ఇద్దరూ ఆ స్టేషన్ లోనే గడిపారు. ఆ మరుసటి రోజు పది గంటలకి ఇద్దరిని కోర్టులో హాజరు పరిచారు వ్యభిచారం కేసు క్రింద.
ఇద్దరినీ బోనులో నిలబెట్టారు. లాయర్లు ఏవేవో సెక్షన్లు, చట్టాలు చదివి వాదోపవాదాలు ఆడుకుంటున్నారు. సుదీర్ఘ ఆలోచనలో ఉన్న రమాదేవికి ఇవేమీ వినిపించడం లేదు. మూర్తి మనసులో మాత్రం కోపం అగ్నిగోళమై తిరుగుతూ ఉంది.
‘థూ.. దీనమ్మ బతుకు, ఎవరి ముందు చేతులు కట్టుకొని నిలబడని నేను ఈరోజు ఈమె వల్ల ఇలా బోనులో అందరి ముందు చేతులు కట్టుకొని నిలబడేలా చేసింది. ఎన్ని లంచాలు తీసుకున్నా ఎప్పుడు ఏ సిబిఐ ఆఫీసర్‌కి దొరకలేదు. దీనివల్ల ఈయాల నా పరువు మొత్తం పోయింది. ఆ సిబిఐ వాళ్ళు అరెస్టు చేసినా కాస్త సంఘంలో గౌరవం ఉండేది. పోయిపోయి ఈ సాని దాని కొంపలో దొరికాను చూడు నాది బుద్ధి తక్కువ, బయటకు రానీ, దీని పని చెప్తా’ అని మూర్తి పళ్ళు కొరుక్కుంటున్నాడు.
రమాదేవి మాత్రం ఏ జంకు గొంకు లేకుండా ధైర్యంగా నిలబడింది. ఇంతలో జడ్జి రమాదేవిని పిలిచి “ఏమ్మా నీ గురించి వాకబు చేస్తే నువ్వు ఒక మంచి నృత్య కళాకారిణివని విన్నాను, ఈ పాడు పని చేయడానికి నీకు సిగ్గు లేదు?”
వెంటనే రమాదేవి తన పైటకొంగుని బొడ్డులో దోపుకుని “అవును సార్ నేను కళాకారిణినే. కానీ కళను నమ్ముకున్న వాళ్ళందరూ నాశనమయ్యారు. కళని అమ్ముకున్న వాళ్ళందరూ బాగా సంపాదించారు, బాగుపడ్డారు. కళాకారులకి షికారులు తప్ప కారులు ఉండకపోవచ్చు, కానీ మా కోసం చాలామంది ఇంటికి కారు పంపిస్తారు. కళ కూడు పెట్టదు. ఎందుకంటే దానికి కూడా కులం, మతం, వర్గం, ప్రాంతం అనే భేదాలు ఉంటాయి. స్టేజి ముందు చప్పట్లు కొట్టే జనాన్ని చూసి ఆనందపడాలా? లేక స్టేజి వెనుక దుప్పట్లు పరిచే మగవాళ్ళను చూసి ఏడవాలా? చప్పట్లు మనసు నింపితే దుప్పట్లు కడుపు నింపుతాయి. మేము ముఖానికి రంగు వేసుకుంటాం, కడుక్కుంటే పోతుంది. కానీ కొంతమందికి ఒళ్లంతా రంగులే వాళ్ళు రోజుకి ఎన్ని సార్లు స్నానం చేయాలి?
మా రంగులన్నీ వెలుగులోనే కనబడతాయి, కానీ కొంతమంది రంగులు చీకట్లోనే బయటపడతాయి.
మీ ముందు బట్టలిప్పి డాన్స్ ఆడుతున్నాం అంటే మీకు మా శరీరమే కనపడుతుంది కానీ మాకు మా ఆకలి కేక వినపడుతుందా?
నాలుగు గోడల మధ్య ఉండాల్సిన ఆడది నలుగురు మధ్యలోకి వచ్చిందంటే ఇంట్లో ఉన్న నలుగురి కడుపు నింపడానికే.
మేము స్టేజి మీద ఆడతాం, పాడుతాం దానికి మాకు డబ్బులు ఇస్తారు, అయినా మేము స్టేజి వెనక్కి వచ్చి ఎందుకు వెల్లకిలా పడుకుంటామో తెలుసా? ఎందుకంటే మాకు దానికి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి.”
ఇంతలో లాయరు రామనాథం అందుకొని “స్టేజ్ ముందు ఆడితే డబ్బులు వస్తాయన్నావుగా, ఇంకా స్టేజి వెనక్కి వెళ్లడం ఎందుకు? ఆ డబ్బులు సరిపోవట్లేదా?” అన్నాడు.
“ఏం మూర్తి గారు మీకు గవర్నమెంట్ నెలనెలా జీతం ఇస్తోంది కదా? అయినా మళ్ళీ మీరు బల్ల క్రింద చేతులు పెట్టి లంచాలు ఎందుకు తీసుకుంటున్నారు? ఆ జీతం డబ్బులు సరిపోవటం లేదా? చెప్పండి మూర్తి గారు” అని రమాదేవి మూర్తిని ప్రశ్నించగానే అందరూ మూర్తివైపు చూశారు. మూర్తి తలవంచుకొని నిలబడ్డాడు.
“లాయర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం మూర్తి గారు చెప్తారు “అని రమాదేవి మళ్ళీ చెప్పడం ప్రారంభించింది.
“సిగ్గు లేదా అని అడిగారు కదా జడ్జిగారు! అవును సార్ నాకు సిగ్గు లేదు. అయినా నేనెందుకు సిగ్గుపడాలి? స్టేజి మీద చూసిన నన్ను ఎప్పుడెప్పుడు లొంగ తీసుకుందామా అని ఎదురు చూసినా ఆ పెద్దలు సిగ్గుపడాలి. డబ్బు ఆశ చూపి పబ్బం గడుపుకుందామనుకున్నా ఆ నాయకులు సిగ్గుపడాలి. పక్కలోకి రాకపోతే ప్రోగ్రామ్స్ కూడా ఉండవు అని బెదిరింపులు, రూమ్‌కి రాకపోతే రికమండేషన్లు.
డబ్బులు వెదజల్లి.. రాజకీయ నాయకులు, సినీ తారలు, గవర్నమెంట్ ఆఫీసర్లు నన్ను వ్యభిచారిగా చేశారు.
నలుగురు మధ్య ఆడుతూ పాడుతూ ఉండే దానిని సంకెళ్లు వేసి నాలుగు గోడలకే పరిమితం చేశారు. ముందు వాళ్ళని అరెస్ట్ చేయండి సార్. నన్ను ఆ స్టేజి నుండి ఈ స్టేజి వరకు తీసుకొచ్చినందుకు.
అయినా నేనేం బాధపడటం లేదు సార్, చాలా డబ్బు సంపాదించాను. నా ఇద్దరు పిల్లలు బాగా చదువుకున్నారు. కానీ ఒక్కటే బాధ సార్ వాళ్ళ తండ్రి ఎవరో ఇంతవరకు వాళ్లకు చెప్పలేకపోయాను.
నా పక్కలో మొగుడిలా పడుకున్నారే కానీ ఒక్కడైనా నా పిల్లలకి తండ్రి కాగలిగాడా అందుకు అరెస్ట్ చేయండి సార్ వాళ్ళని.
ఇలా డబ్బులు విసిరానంటే అలా ఒళ్లో వచ్చి పడుతుంది సార్ నాకు బెయిల్, ఏమంటారు లాయర్ గారు” అని రమాదేవి లాయర్‌కి కన్ను కొట్టింది.
ఇంకో లాయర్ కోపంతో ఊగిపోతూ “ఇలాంటి ఒళ్ళు అమ్ముకుని బ్రతికే వాళ్ళతో వాదన ఏంటి సార్? ఉరితీసి పడేయక! వీళ్ళ వల్ల పచ్చని సంసారాలు కూలిపోతున్నాయి. సభ్య సమాజం చెడిపోతుంది సార్” అన్నాడు.
“హలో లాయర్ సాబ్, మేము ఒళ్ళు అమ్ముకునే వాళ్ళం కాదు, ఒళ్ళుని అద్దెకిచ్చే వాళ్ళం, మీరు గాంధీనగర్‌లో ఉన్న ఇంటిని ఎలా రెంట్‌కి ఇచ్చారో నేను కూడా నా ఒంటిని గంటలు లెక్క రెంటుకి ఇస్తాను.
అంతేకానీ మేము అందాన్ని అమ్ముకునే వాళ్ళం కాదు. అందాన్ని అద్దెకిచ్చి బతికే వాళ్ళం.
అవును లాయరు ఈమధ్య నీ దగ్గర నుండి ఫోన్ రావడం లేదేంటి? ఆమధ్య కొత్త పిట్టలు వచ్చాయా అని ఓ తెగ కొట్టేసుకునేవాళ్లు” అని రమాదేవి అనగానే కోర్ట్ అంతా పెల్లున నవ్వింది.
జడ్జిగారు పాపం సుత్తి తీసుకొని సైలెన్స్ సైలెన్స్ అని అరిచాడు.
రమాదేవి “ఇదిగోండి జడ్జిగారు మీరు నాకు ఏ శిక్ష వేసిన పర్వాలేదు, నేను వెంటనే బయటికి వచ్చేస్తాను. నాకు చాలామంది ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్నాయి” అని చుట్టూ చూసి.. “వాళ్లకి నేను జైల్లో ఉండి ఊచలు లెక్కబెట్టడం ఇష్టం ఉండదు. వాళ్ళ ఒళ్ళో ఉండి వాళ్ళ మాటలుకి ఊ కొట్టడం ఇష్టం. కాబట్టి నన్ను అక్కడ ఎక్కువ రోజులు ఉంచరు” అంది.
వాదోపవాదాలు విన్న అనంతరం జడ్జిగారు మూర్తిని రెండు నెలలు సస్పెండ్ చేసి రెండు లక్షలు జరిమానా విధించారు. రమాదేవిని 14 రోజులపాటు రిమాండ్‌కు తరలించారు. రమాదేవిని తీసుకెళ్తుంటే అక్కడున్న వాళ్ళందరూ రమాదేవి వైపు అదోలా చూస్తున్నారు కొరుక్కు తినేసేటట్టు.
ఆరోజు రాత్రి ఊళ్లో జనం “అవును ఆ రమాదేవిని పోలీసులకి పట్టించింది ఎవరై ఉంటారబ్బా?” అని గుసగుసలాడుకుంటున్నారు.. ఆ మాటలు విన్న నీలవేణి తలవంచుకొని నవ్వుకుంది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సాగర ద్వీపంలో సాహస వీరులు-6
సాఫల్యం-33
ఫస్ట్ లవ్-10
సాహితీ పోషకులు సుందరాచార్యులు
రాజకీయ వివాహం-1
జీవిత సత్యాల ‘యాత్ర’
గోలి మధు మినీ కవితలు-1
మలిసంజ కెంజాయ! -6
అలనాటి అపురూపాలు-107
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®