[మోహనరావు మంత్రిప్రగడ గారు రచించిన ‘అద్దం పగిలింది’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


భవ్య చేతిలోంచి అద్దం క్రిందపడి పగిలింది – ఆ శబ్దానికి నవ్య గబగబా భవ్య గదిలోకొచ్చింది. “అద్దం పగలగొట్టావా” గట్టిగా అరచింది.
“ఏది? ఇక్కడ ముక్కలు లేవుగా? ఇవి రెండద్దాలు కదా” అంది భవ్య నవ్వుతూ.
“ఏంటి రెండద్దాలు ఎలా వచ్చాయి? నీ గదిలో ఒకటే కదా ఉంది” కోపంగా అడిగింది నవ్య.
“మై డియర్ నవి సిస్టర్, దాన్నే రెండుగా మార్చాను, ఒకటి నీకిద్దామని” అంది భవ్య నవ్వుతూ.
“ఏంటి నాటకాలు ఆడుతున్నావా? డాడీని తీసుకొస్తానుండు” అని వెలుపలకి పరిగెత్తింది.
వెంటనే వాళ్ళ డాడిని తీసుకొచ్చి “ఇది అద్దం పగలకొట్టి నాటకాలు ఆడుతోంది” చెప్పింది కోపంగా.
“లేదు డాడీ, ఇవి రెడు అద్దాలు కదా చూడు” అంది భవ్వ నవ్వుతు.
“ఎస్. అవి రెండేగా, బాగానే ఉన్నాయిగా, వాటీజ్ రాంగ్” అన్నాడాయన.
“అది కాదు డాడీ దీని రూములో ఒకద్దమే కదా ఉండింది, రెండెలా వచ్చాయి?” అని మళ్ళా అడిగింది నవ్య.
“ఎస్, అవును, రెండెలా వచ్చాయి?” అడిగాడు ఆయన.
“ఓ మై డియర్ డాడ్, నేనే మేక్ చేసాను బాగుందా?” అని అడిగింది భవ్య.
“వావ్ వండరఫుల్, అవును నవీ, అద్దం పగిలితే ముక్కలుండాలి కదా ఏవి? నువ్వు పొరపాటుపడ్డావు. అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేసావు” అని ఆయన వెళ్ళిపోయాడు.
“యు పిచ్చి డాడీ! చెప్పింది అర్థం చేసుకోక పిచ్చిగా నిన్ను పొగిడేశాడు, ఇలాక్కాదు ఈసారి మమ్మీని తీసుకొస్తా. దెబ్బకి నీ పని ‘ఠా’ చూడు” అంటూ లోపలకి పరిగెత్తింది నవ్య.
కాసేపయ్యాక వాళ్ళ అమ్మని తీసుకొచ్చింది “చూడు మమ్మీ భవ్య అద్దం పగలుకొట్టింది” అంది. ఆవిడ గదంతా చూసి “ఇక్కడ అద్దం ముక్కల్లేవు కదా” అంది.
“అదిగో చూడు. ఇక్కడ అదివరకు ఒక అద్దమే ఉండేది కదా, ఇప్పుడు రెండయ్యాయి” అంది.
“అదా, అవును, రెండద్దాలెలా వచ్చాయి?” ఆశ్చర్యంగా అడిగిందావిడ.
“అబ్బ, నువ్వు మరీను అదే రెండుగా పగలకొట్టింది” అంది కంగారుగా నవ్య.
“నీ మొహం, అద్దం పగిలితే ముక్కలుగా అవుతుంది గాని రెండద్దాలవడం ఏమిటే?” చిరాకు పడింది ఆవిడ.
“అయ్యో అమ్మా నీకర్థం కావటం లేదు, అది అద్దం క్రింద పడేసింది, బద్దలైయింది” అంది ఏడుపుమొహంతో నవ్య.
“నీ బొంద. నీ బుర్ర చెడిపోయింది, లేపోతే అది అద్దం క్రింద పడేస్తే సహస్రం ముక్కలవుతుంది కానీ రెండవ్వడమేమిటే, అనవసరంగా పని పాడుచేసుకొచ్చాను. ఇంక చాలు. నువ్వు పో” అని ఆవిడ వెళ్ళిపోయింది.
“అనవసరంగా మమ్మీని పిలిచాను. ఈసారి తమ్ముడ్ని పిలుకొస్తానుండు”, అంటు విసవిసా వెళ్ళిపోయింది నవ్య.
“హలో వాట్ బిగ్ సిష్టరు? ‘క్యా’ అద్దం ముక్కలు చేసావుట కదా? ముక్కలు ఏడున్నవి?” అంటూ ముందుకొచ్చాడు తమ్ముడు.
“అదిగో చూడు తమ్ముడు, ముక్కలు” అంది నవ్య.
“అవా! అవి రెండద్దాలు కదా ముక్కలంటావేంటి” అని నవ్వుతూ అడిగాడు అతగాడు.
“అదే, దీని గదిలో ఒకటే పెద్ద అద్దం ఉంది కదా ఇప్పుడు రెండయ్యాయి చూడు” అని చెప్పింది నవ్య.
“ఓ ఐ సీ. మై డియర్ ఎల్డర్ సిస్టర్, నీవు చాలా ఎక్సర్టు. ఒక అద్దాన్ని రెండుగా మార్చావా, వెరీ గుడ్. హలో చిన్న అక్కాయ్, నువ్వు కూడా మెచ్చుకోక పిచ్చిగా మాట్లాడి నా పని పాడు చేసావు. ఓకే, కేరీ ఆన్ పెద్ద అక్కాయ్,” అని వెళ్ళిపోయాడు వాళ్ళ బ్రదర్.
“నిన్ను పిలిచాను చూడు అది పిచ్చి పని. నువ్వే పిచ్చి అడవి లాంటి వాడివి. నిన్ను పిలవడం నా బుధ్ధి తక్కువ.” అని తల కొట్టుకుంది నవ్య.
“హలో చెల్లాయ్ నువ్వు కోపం తగ్గించుకొని నే చెప్పేది విను, ఇద్దరికి లాభం” అంది భవ్య.
“ఏం లాభం?” అని విసురుగా అడిగింది నవ్య.
“చూడు చెల్లాయ్, నీవ్వు రోజు అద్దం కోసం నా గదికొస్తున్నావు కదా శ్రమపడి, ఇంక రావక్కరలేదు. ఇదిగో ఓ పీస్కి ఫ్రేమ్ చేయించి ఇస్తాను వాడుకో” అంది భవ్య.
వెంటనే నవ్య కోపం ఎగిరిపోయింది, “అలాగా నిజంగా ఇస్తావా?” అడిగింది సంతోషంగా.
“యా” అంది భవ్య,
“ఓకే థేంక్యూ”, అంటు వెళ్ళిపోయింది నవ్య.
‘అమ్మయ్య దేముడి దయ వల్ల క్రిందపడిన అద్దం ముక్కలు కాకుండా రెండవడంతో మంచి జరిగింది’ అనుకుని, మళ్ళా, ‘అవును అద్దం కరెక్టుగా రెండవడం వెనుక ఏదో ఉంది’ అని అద్దాల్ని పరిశీలించి ‘అమ్మ ఎంత మోసం, రెండద్దం ముక్కలు తెలివిగా ఎవరికి కనిపించకుండా జాయింటు చేసి ఫ్రేమ్ చేసి ఇచ్చాడన్నమాట, అందుకే ఫ్రేమ్ ఊడగా అద్దాలు రెండయ్యాన్న మాట. ఎలా అయితేనేం మాట పడకుండా బైటపడ్డాను’ అనుకుంటూ అద్దం ముక్కలని ఫ్రేమ్ చేయించడానికి వెళ్ళింది భవ్య.