Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అడవిలో తోడేళ్ళు, నక్కలు, అమాయక మేకలు!

[కస్తూరి మురళీకృష్ణ రచించిన ‘అడవిలో తోడేళ్ళు, నక్కలు, అమాయక మేకలు!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

వార్త దావానలంలా అడవంతా వ్యాపించింది. మారువేషాల్లో ఉన్న తోడేళ్ళు, నక్కల గుండెల్లో బడబాగ్నుల్ని రగిలించింది.

ఇంత కాలం పులుల వేషంలో తిరుగుతూ అడవిలోని జంతువులన్నిటినీ భయభ్రాంతుల్ని చేస్తున్న మేకలు కొన్ని, తాము కృత్రిమంగా ధరించి ఇతర జంతువుల్ని వేటాడి చంపేందుకు వాడుతున్న పులుల గోళ్ళను, కోరలను అడవి రక్షణ దళాలకు అప్పగించి, తమ తప్పు ఒప్పుకుని లొంగిపోవటం ప్రారంభించాయి.

“ఎంతగా పులి గోళ్ళు, కోరలను అమర్చుకున్నా తాము అడవిపై అధికారాన్ని సాధించటం కుదరదన్న సత్యాన్ని గ్రహించామనీ, ఇకనుంచీ అడవిలోని జీవులన్నీ కలసి ఏకాభిప్రాయంతో ఏర్పాటు చేసుకున్న నియమాలకు లొంగి జీవిస్తాము” అనీ వాగ్దానం చేసి అవి లొంగిపోయి అడవి జీవన స్రవంతిలో కలసిపోయాయి.

అడవిలోని జీవులన్నీ సంతోషించాయి. ఇకపైనన్నా అడవిలో జీవితం ప్రశాంతంగా వుంటుందని సంబరపడ్డాయి.

అడవి అంతా ఎంతగా సంబరపడుతోందో మేకల వేషాల్లో ఉన్న తోడేళ్ళు, నక్కలు అంతగా విచారించాయి. ఇంతకాలం పులుల గోళ్ళు పెట్టుకున్న మేకలు అడవిని అల్లకల్లోలం చేస్తూంటే వాటిని చూపి బెదిరిస్తూ పబ్బం గడుపుకున్నాయీ తోడేళ్ళు, నక్కలు. అమాయక మేకలను పులులుగా మారుస్తామని బెదిరించి ఆకర్షించేవారు. అన్ని జీవులనూ చంపుతున్న మేకలకెవరయినా ఎదురునిలిచినా, వాటికి హాని కలిగించినా, చంపినా గోల గోల చేసేవారు. పులులకు చంపే హక్కుందనీ, దాన్ని ఉల్లంఘించటం కుదరదనీ అల్లర్లు చేసేవారు. ఇప్పుడు అలాంటి మేకలన్నీ లొంగిపోతే? ఏం చేయాలో తోచటంలేదు.

“ఈ మేకలన్నీ ఇలాగే లొంగిపోతే మన గతి ఏం కావాలి? ఇంతకాలం మనం అనుభవించిన వైభోగం, ప్రాధాన్యం, భోగాలు, భాగాలు అన్నీ ఏమైపోవాలి?” ఆక్రోశించింది ఒక తోడేలు.

“మనమే అడవి ఉద్ధారకులమని, అభ్యుదయ పథంలో నడిపించగలమనీ నమ్మించాం, ఇప్పుడీ మేకలు లొంగిపోతే మన పథం కుపథం అని, నిష్ఫలం అనీ అడవి గ్రహిస్తే మన గౌరవం ఏం కావాలి?” ఓ నక్క వాపోయింది.

“మేకలు ఇలా లొంగిపోతే మా రక్త కవితలేమైపోవాలి. మా రక్తసిక్త కథలు, నవలలు ఏమైపోవాలి. మరిన్ని మేకలు పులుల గోళ్ళూ పళ్ళూ పెట్టుకుని అడవిలో వీరవిహారం చేసేందుకు ప్రేరణనిచ్చే మా హింసా సాహిత్యం ఏమై పోవాలి?” సాహిత్య తోడేళ్ళు, నక్కలూ విషాదంతో దొర్లుతూ పొర్లుతూ ఊళలు, కేకలూ పెట్టాయి.

“ఈ పరిస్థితి ఇలా కొనసాగితే లాభం లేదు. మనం ఏదో చేయకపోతే మనం మళ్ళీ తోడేళ్ళు, నక్కలుగానే మిగిలిపోతాం. అడవిపై అధికారం సాధించే అవకాశం ఆశను కోల్పోతాం” విషాదంగా అందో నక్క.

“అధికారం సంగతి అటుంచి మన అస్తిత్వాన్ని, ఉనికినే కోల్పోతాం” ఆవేశంగా అంది ఓ తోడేలు.

“అందుకే మనమందరం కలసికట్టుగా ఒక పని చేయాలి. ఇంతవరకూ లొంగిపోయిన మేకలను దూషించాలి. ఇంకా లొంగని మేకలను లొంగనివ్వద్దు. ఈలోగా కొత్త మేకలను ఆకర్షించాలి” అంది జిత్తులమారి నక్క.

“ఆలోచన బాగుంది. కానీ మిగతావి లొంగకుండా ఎలాగ ఆపుతాం?” అడిగాయి.

“దీనికి ఒక పథకం ఉంది” అంది జిత్తులమారి నక్క.

“ఏమిటి?”

“అడవిలో మారువేషాల్లో ఉన్న మనవాళ్ళందరికీ సందేశాలు పంపాలి. లొంగిపోతున్న మేకలను విమర్శించాలి. దూషించాలి. పిరికిపందలని తిట్టాలి. ప్రాణభయంతో బెదిరిపోయాయని ఆరోపించాలి. వీలయితే వీరంతా ద్రోహులని ఒక పథకం ప్రకారం వెన్నుపోటు పొడిచారనీ ప్రచారం చేయాలి. ఇది ఎంత పెద్ద స్థాయిలో జరగాలంటే, లొంగాలని నిర్ణయించుకున్నవారు కూడా వెనుకడుగువేసి, ఇలాంటి దూషణకు గురయ్యేకన్నా, పోరాడి చావటమే మంచిదనుకోవాలి. ఈలోగా, మనమంతా చర్చలు జరగాలని గోల చేయాలి. చర్చలు సాగదీయాలి. ఈ సమయంలో బలం పుంజుకోవాలి. ఈ పోరాటం రావణకాష్టంలా రగులుతూనే ఉండాలి” కళ్ళు మిలమిలలాడుతూండగా చెప్పింది జిత్తులమారి నక్క.

ఆ నక్క మాటలు వింటున్న తోడేళ్ళు, నక్కల్లో ఆశలు చిగిరించాయి.

“ఒకవైపు ఇది జరుగుతూంటే, మరోవైపు కొత్త మేకలను ఆకర్షించి మేకలను పులులు చేస్తామని నమ్మించాలి. ఈ పోరాటం నిరంతరం తరం తరం సాగాలి”

అక్కడున్నవన్నీ ఆమోదం తెలిపేయి. మరుసటి రోజునుంచీ ఈ పథకాన్ని అమలుచేయాలని నిశ్చయించాయి

***

మరుసటి రోజునుంచీ అడవి మొత్తం దద్దరిల్లిపోసాగింది.

“ద్రోహి మేకలు లొంగిపోతున్నాయి. మోసం.. మేకలు మోసం చేస్తున్నాయి. అడవికి అన్యాయం చేస్తున్నాయి. ప్రాణ భయంతో పోరాటవీరుల ప్రాణాలు తీస్తున్నాయి” అంటూ అడవి అంతా ప్రచారం మొదలయింది.

మరో వైపు “అడవి రక్షణ పేరుతో అమాయక మేకల ప్రాణాలు తీస్తున్నారు. ఇది అన్యాయం. మేకలకు లేనిపోని పులి ఆయుధాలు అమర్చి దోషులుగా నిలుపుతున్నారు” అని ఇంకోవైపు ఆరోపణలు మొదలయ్యాయి.

“అడవిలో అమాయక మేకలను హత్య చేయటం పొరపాటు. ముందు ఆ మేకలకేం కావాలో తెలుసుకోవాలి. శాంతి చర్చలు చేయాలి. అవి పులిగోళ్ళతో ఇతర జంతువులను చంపినా దాన్ని అడవి క్షేమం కోసం జరిపిన శాంతి చర్యగా భావించాలి” అన్న కోరికలు వెల్లువలయ్యాయి.

“హింస వద్దు. శాంతి ముద్దు” అంటూ అంతవరకూ పులిగోళ్ళమేకల హింసకు సంబరాలు చేసుకుంటూ “హింస ఇంకా.. ఇంకా హింస” అంటూ సంబరాలు జరిపిన వాళ్ళంతా ఇప్పుడు శాంతి మంత్రం జపించనారంభించారు.

“లొంగిపోతున్న మేకలన్నీ ప్రాణభయంతో లొంగిపోతున్నాయి. “అసలు వీర మేకలు ప్రాణాలు వదలుతాయి తప్ప లొంగవు” అని రక్షణ కవచాలు, శిరస్త్రాణాలు ధరించిన తోడేళ్ళు, నక్కల సమర్ధకుల ప్రకటనలు ప్రతిధ్వనించసాగాయి.

లొంగిపోతున్న మేకల చిరుదరహాసాలకంటే, మేకలు లొంగిపోవటం వల్ల అస్తిత్వం కోల్పోయే తోడేళ్ళు, నక్కల ఆక్రోశపుటూళల గోల అధికమైపోయింది.

ఇదంతా చూస్తూ అడవిలోని ఇతర జంతువులు, పశు పక్ష్యాదులు ఆరంభంలో నవ్వుకున్నాయి. ఈ గోల తగ్గకపోగా లొంగిపోయే మేకల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోవటంతో మరింత తీవ్రమై విపరీతమవసాగింది. సాగుతూనే వుంది.

దాంతో, అడవిలోని అల్పజీవులయిన కుక్కలు, నల్లులు, పిల్లులు, బల్లులు, సాలీళ్ళు, ఎలకలు, పలకలు, నలకలు, చీమలు, దోమలు, ఉడతలు, బుడతలన్నీ ఆములూ, ధూములంటూ చిరాకు పడ్డాయి. ఆగ్రహం భూగ్రహం దాటింది.

ఒక మంచిరోజు చూసుకుని, తోడేళ్ళు, నక్కల తరఫున ఆందోళన చేస్తున్న ఆందోళన జీవులమీదకు దూసుకుంటూ వెళ్ళాయి.

‘తమ ప్రాణమే ప్రాణం ఇతరుల ప్రాణం చన్నీళ్ళు’ అని నమ్మిన ఆందోళన జీవులు బెదిరాయి. అంతవరకూ మేకలు పులిగోళ్ళు, పళ్ళూ ధరించి పోరు కొనసాగించాలని కోరుతూ నినాదాలు చేసిన ఆందోళన జీవులన్నీ, తమ ప్రాణాలు అరచేతిలో భద్రంగా దాచుకుని పరుగులారంభించాయి.

అప్పుడు పులులకు, సింహాలకూ, ఏనుగులతో సహా అడవిలోని ఇతర జీవులన్నిటికీ తోడేళ్ళు, నక్కల కుట్రలు అర్థమయ్యాయి.

తాము మేకల వేషాలు వేసుకుని మేకలన్నిటికీ లేనిపోని ఆవేశాలు కల్పించి, అవి మేకలు కావు పులులని భ్రమింపచేసి, వాటికి పులిగోళ్ళు, పులుల కోరలు అమర్చి, అడవి స్వరూపాన్నే మార్చేయమని, అధికారం సాధించి అప్పచెప్పమని ఈ తోడేళ్ళు, నక్కలు హాయిగా అన్ని సౌఖ్యాలు అనుభవిస్తూ అమాయక మేకలను భ్రమింపచేస్తూ హింసకు ప్రేరేపిస్తూ మరో అడవి ప్రపంచపు మజామజా కలలు కంటూ, చూపిస్తూ అందరినీ మోసం చేస్తున్నాయని, అడవిలోని ఆకుఆకుకూ, నీటిలోని ప్రతి నీటి అణువుకూ, గాలిలోని ప్రతి గాలి తరగకూ అర్థమయింది.

దాంతో, మొత్తం అడవి ఒక్కటయి వాటిని వెంబడించింది.

తమ ఆటకట్టని గ్రహించిన పెద్ద తోడేళ్ళు, నక్కలు ఎవరికీ తెలియకుండా తమ మేకల తోళ్ళను తీసేసి అమాయక తోడేళ్ళలా, నక్కల్లా నటిస్తూ, అంతవరకూ ఎవరిని పోరాడమని ప్రోత్సహిస్తూ, పథకాలనిస్తూ వచ్చాయో వాటి వెంబడి పడ్డాయి.

తోడేళ్ళూ, నక్కలలో కూడా నిజాయితీ కల అమాయకమైనవి కొన్ని దొరికి సమస్త అడవి సమష్టి ఆగ్రహానికి బలయిపోయాయి. అదృష్టమున్నవి, భూమిపై ఇంకా మాంసం రాసి ఉన్నవి ఆ ఆడవి సరిహద్దు దాటిపోయాయి ప్రాణాలతో..

ఆ అడవి సరిహద్దు వద్ద నుంచిని అడవి పెద్దలు గట్టిగా ఘూర్ణించాయి.

“పొండి.. ఈ అడవికి ద్రోహం తలపెట్టినవారికి ఈ అడవిలో స్థానం లేదు. ధైర్యం వుంటే, మా దగ్గరకు వచ్చి మా గోళ్ళూ, కోరలూ, పళ్ళూ పీక్కుపోండిరా.. మేము మిమ్మల్ని ఏమీ చేయము. రండి.. పెద్ద మరో అడవి సృష్టించాలని ప్రగల్భాలు పలికారు. రండి”

వెనుతిరిగి చూడకుండా పారిపోయాయి.

ఇంకా లొంగకుండా ఉన్న మేకలన్నీ గోళ్ళూ, కోరలూ పారేసి లొంగిపోయి ప్రాణాలు కాపాడుకున్నాయి.

అడవి మొత్తం దీర్ఘంగా నిట్టూర్చింది. ఇకపై ఎలాంటి గోలలూ, ఆందోళనలు, అసహనాలు, దురాశలు, హింసలు, ఆబద్ధాలు లేకుండా అడవి అంతా ప్రశాంతంగా వుంటుందని ఆశించాయి.

వాటికి తెలియనిది ఏమిటంటే, అమాయకులను మాయచేసి, అసలీ గొడవంతటికీ కారణమైన తోడేళ్ళూ, నక్కలూ ఇప్పుడు తమ మధ్యనే ఏమీ ఎరగనట్టు అమాయకుల్లా చలామణీ అవుతున్నాయన్న నిజం.. సరిహద్దు దాటిపోయిన తోడేళ్ళూ, నక్కలూ, అక్కడినుంచి ఇక్కడ మిగిలిపోయిన వారి సహాయంతో మళ్ళీ నిశ్శబ్దంగా విషబీజాలు అడవిలో విస్తరింపచేస్తూ ఆ బీజాలు విషవృక్షాలయ్యే సరయిన సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాయన్నది తెలియదు.

ఓమ్! శాంతిః! ఓమ్ శాంతిః!! ఓమ్ శాంతిః!!!

Exit mobile version