[హైదరాబాద్‌ను పూర్తి స్థాయిలో తెలుసుకోవాలనే కోరికతో నగరంలో ప్రయాణించి పి. జ్యోతి గారు అందిస్తున్న ఫీచర్ ‘ఆదాబ్ హైదరాబాద్’.]
సికింద్రాబాద్ క్లాక్ టవర్
సికిందరాబాద్ క్లాక్ టవర్‌ను 1860లో పది ఎకరాల స్థలంలో నిర్మించారు. దర్పంగా నల్ల రాతితో ఎత్తుగా నిలిచి ఉన్న ఈ క్లాక్ టవర్ సౌందర్యం చూసి తీరవలసిందే. ఇదే దారిలో సంవత్సరాల కొద్దీ తిరిగినా చాలా మంది ఈ క్లాక్ టవర్‌ను పరిశీలనగా చూసింది తక్కువే. చరిత్రను ప్రేమించే వాళ్ళు, నగరానికి ఓ ఆత్మ ఉంటుందని నమ్మేవాళ్లు తప్ప పాత కట్టడాలపై అందరూ ఉత్సాహాన్ని చూపరు.
నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలి అలవాటయిపోయిన రోడ్లు క్లాక్ టవర్ అందాన్ని చూసే తీరిక మనకు ఇవ్వవు కాని ఈ మధ్య ప్రభుత్వం జాగ్రత్తగా బాగు చేసిన ఆ పార్క్ లోకి వెళ్లి చూస్తే ఆ సౌందర్యానికి ముగ్ధులవకుండా ఉండలేం.
ఫిబ్రవరి 1, 1897న దీని నిర్మాణం ప్రారంభించారని రికార్డులు చెబుతున్నాయి. 1806లో నిజాం సికందర్ జా పేరు మీద సికింద్రాబాద్ నగరం స్థాపించారని ఆ కాలంలో జారీ చేసిన ఓ ఫర్మాన్ ప్రకటిస్తుంది. సికందర్ జా, అసఫ్ జా III (11 నవంబర్ 1768 – 21 మే 1829), 1803 నుండి 1829 వరకు హైదరాబాద్ 3వ నిజాంగా పరిపాలించారు. ఇతను ఖిల్వత్‌లోని చౌమహల్లా ప్యాలెస్‌లో, అసఫ్ జా II, తహ్నియత్ ఉన్-నిసా బేగం దంపతుల రెండవ కుమారుడిగా జన్మించాడు.
ఇతని అసలు పేర్లు సికందర్ జా, అసఫ్ ఉల్-ముల్క్, అసద్ ఉద్-దౌలా, వాలాషన్ నవాబ్ మీర్ అక్బర్ ‘అలీ ఖాన్ సిద్ధిఖి బహదూర్, అసద్ జంగ్. అతన్ని అధికారికంగా అసఫ్ జా III, నిజాం ఉల్-ముల్క్, నిజాం ఉద్-దౌలా, మీర్ అక్బర్ ‘అలీ ఖాన్ సిద్ధిఖి బహదూర్, ఫౌలాద్ జంగ్, హైదరాబాద్ నిజాం అని పిలిచేవారు. హుస్సేన్ సాగర్ సరస్సుకు ఉత్తరాన ఉన్న ప్రాంతం బ్రిటిష్ కంటోన్మెంట్‌గా ఈయన పాలనలోనే స్థాపించబడింది. తరువాత అదే సికింద్రాబాద్ అయింది.
బ్రిటిష్ ప్రభుత్వంతో స్థానికులు సత్సంబంధాలు కలిగి ఉండేవాళ్ళు. సికింద్రాబాద్‌లో నివసించే వయోవృద్దులు దీన్ని ‘లష్కర్’ అని పిలవడం కొందరికయినా తెలిసిన అనుభవమే. ‘లష్కర్’ అంటే ఉర్దూ, పర్షియన్ భాషల్లో సైన్యం లేదా శిబిరం అని అర్థం. సికింద్రాబాద్ బ్రిటిష్ వారు సృష్టించిన సైనిక కంటోన్మెంట్‌గా ప్రారంభమైనప్పటి నుండి ఈ ప్రాంతాన్ని ‘లష్కర్’ అని స్థానికులు పిలిచేవాళ్లు. సైనికులకు స్థానికుల నుండి లభించిన సహాయ సహకారాలకు గుర్తుగా బ్రిటీష్ ప్రభుత్వం ఇక్కడ ఓ క్లాక్ టవర్ నిర్మించాలని నిశ్చయించుకుని 1860లో 10 ఎకరాల భూమిని ఏర్పాటు చేసింది.
1896లో 2.5 ఎకరాల ఉద్యానవనంలో 120 అడుగుల ఎత్తైన క్లాక్ టవర్‌ను అప్పుడు అక్కడ నిర్మించారు.. ఈ టవర్‌ను ఫిబ్రవరి 1, 1897న రెసిడెంట్ సర్ ట్రెవర్ జాన్ చిచెల్ ప్లోడెన్ ప్రారంభించారు. టవర్‌పై ఉన్న గడియారాన్ని వ్యాపారవేత్త దివాన్ బహదూర్ సేథ్ లక్ష్మీ నారాయణ్ రాంగోపాల్ విరాళంగా ఇచ్చారు. ఈ దివాన్ బహదూర్ రాంగోపాల్ గారే మన డీ.బీ.ఆర్ మిల్స్ ప్రారంభించారు. ఈయన పేరు మీదే సిక్రింద్రాబాద్ ప్రాంతంలోని రాంగోపాల్ పేట్ ఏర్పడింది. రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ లోని గడియారాన్ని కూడా ఆయన 1900లో అప్పటి జేమ్స్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు విరాళంగా ఇచ్చారు, అలాగే సెయింట్ జాన్స్ చర్చి యొక్క గంటస్తంభం కూడా ఆయనే బహుకరించారు. ఇప్పుడు శాసనసభగా ఉన్న అప్పటికి టౌన్ హాల్ అభివృద్దికి కూడా కృషి చేశారు.
పారడైజ్ హోటల్ ముందు తలపాగా, జోధ్‌పుర్ వేషధారణలో పాకెట్ వాచ్ ధరించి, ఎడమ చేతిలో గుడ్డ ముక్క పట్టుకున్న పొట్టి వ్యక్తి విగ్రహాన్ని మనం చూడవచ్చు. ఆ వస్త్రం హుస్సేన్‌సాగర్ సరస్సు అంచున నిర్మించిన డీ.బీ. ఆర్ మిల్లులతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. రాజురా (ఇప్పుడు మహారాష్ట్రలో) బూండాక్స్ నుండి వచ్చిన ఓ సాధారణ యువకుడు, సికింద్రాబాద్‌లో వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకోవడం ఒక అసాధారణ కథే. పారడైజ్ హోటల్ ముందు ఉన్న చిన్న పార్క్‌లో ఈయన విగ్రహం ఇప్పుడు కూడా చూడవచ్చు.
సికింద్రాబాద్ ప్రజల పట్ల కృతజ్ఞత చూపడానికి నిర్మితమైన సికింద్రాబాద్ క్లాక్ టవర్‌ను విశిష్టంగా నిర్మించింది బ్రిటీష్ ప్రభుత్వం. 120 అడుగుల ఎత్తులో ఉన్న సికింద్రాబాద్ క్లాక్ టవర్, బ్రిటిష్ నిర్మాణ శైలికి ఒక చక్కని ఉదాహరణ. ఇది యూరోపియన్ క్లాసికల్ శైలిలో, అద్భుతమైన రూపాన్ని కలిగి ఉంది. టవర్ బేస్ రాతితో తయారు చేసారు. పై భాగంలో ప్రతి దిశకు ఎదురుగా నాలుగు గడియారాలు ఉన్నాయి. గడియారాలు దాదాపు ఒక శతాబ్దం పాటు పని చేస్తూనే ఉన్నాయి, ఇది ఈ నగర వలస గతాన్ని గుర్తు చేస్తూ బ్రిటిష్ వలస నిర్మాణ శైలికి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. ఇది యూరోపియన్ రూపాలను స్వదేశీ ప్రభావాలతో మిళితం చేస్తుంది. పంతొమ్మిదవ శతాబ్దం చివరలో నిర్మించబడిన ఈ క్లాక్ టవర్ సంక్లిష్టమైన డిజైన్ అంశాలతో ఎత్తుగా గర్వంగా నిలిచి ఉంది.
టవర్ బేస్ పూర్తిగా రాతితో నిర్మితమయి పైన గీతలతో ఓ కప్పు ఆకారంలో ఉంటుంది. తలుపు భాగం ఓవెల్ షేపులో ఉండి పూర్తిగా యూరోపియన్ ఇంటి ద్వరాన్ని పోలి కనిపిస్తుంది.
మొదటి అంతస్తు కూడా పటిష్టమైన రాతి నిర్మాణమే. దీనికి నాలుగు పక్కలా వెంటిలేషన్ కోసం పొడుగాటి ఖాళీ భాగాలు కిటీకిలుగా గోడలో నిర్మితమైన ఉంటాయి.
మూడవ అంతస్తులో నాలుగు రెక్టాంగిల్ ఆకారంలో ఉన్న కిటికీలు కనిపిస్తాయి. కిటికీల మధ్య గోడలో ఎలివేషన్ ఉంది. దాన్ని ఆధారం చేసుకుని పైన రెండు అర్ధ చంద్రాకారంలో ఆర్చ్‌లు ఈ టవర్ అందాన్ని పెంచుతాయి. వాటిపైన గోడకున్న ఎలివేషన్ చూడవలసిందే. దానిపైన పెద్ద గడియారం అమర్చి ఉంటుంది. ఆ గడియారం చుట్టు ఉన్న డిజైన్ పూర్తి యూరోపియన్ శైలిలో ఉంటుంది.
గడియారం పైన మరో అంతస్తు కాస్త సన్నగా డిజైన్ చేసి ఉంటుంది. దానిలో ఒకో వైపు మూడు కిటీకీ ఔట్లెట్లు ఉంటే వాటి పైన ఓవెల్ షేప్‌లో డజైనింగ్ ఉండి ఆ పైన నాలుగు చిన్న కిటికీను ఓవెల్ ట్రయాంగ్యులర్‌గా డిజైన్ చేసారు. దూరం నుండి చూస్తే ఇవి ఈ టవర్ అందాన్ని పెంచుతాయి. ముఖ్యంగా టవర్ మొత్తం యూరోపియన్ శైలిలో ఉండి ఇక్కడ కాస్త పర్షియన్ శైలి ఉండి లేనట్లు కనిపిస్తుంది.
క్లాక్ టవర్ గడియారం చుట్టు స్తంభాలు చెక్కి ఉంటాయి. స్తంభాల క్రింద సింహం ముఖం అందంగా చెక్కి ఉంటుంది. జులపాలతో రాజసంగా కనిపించే ఈ సింహం బొమ్మలు సైనికుల శౌర్యానికి నిదర్శనంగా అనిపిస్తాయి. గడియారం నాలుగు వైపులా ఐదు మొనలున్న స్టార్స్ చెక్కి ఉంటాయి. ఇది పూర్తిగా యూరోపియన్ శైలి. అసలు హైదరాబాద్‌లో ఉన్న అన్ని క్లాక్ టవర్లలో పూర్తి యూరోపియన్ శైలిలో కనిపించే ఒకే ఒక్క కట్టడం ఈ సికింద్రాబాద్ క్లాక్ టవర్.
ఈ టవర్ శిఖరం, వంపు తిరిగిన కిటికీలు, విస్తృతమైన ఇటుక పనితో క్లాసిక్ విక్టోరియన్ రూపాన్ని కలిగి ఉంటుంది. ఇంగ్లాండ్ నుండి దిగుమతి చేసుకున్న గడియారం, పైభాగంలో అమర్చబడింది, దాని ముఖం దూరం నుండి సులభంగా కనిపించేలా తీర్చిదిద్దారు. సికింద్రాబాద్‌తో బిటీష్ ప్రభుత్వానికి ఉన్న బాంధవ్యానికి గుర్తుగా కూడా ఈ క్లాక్ టవర్ చరిత్రలో నిలిచిపోయింది.
సికింద్రాబాద్ క్లాక్ టవర్ కేవలం ఒక నిర్మాణ కళాఖండం మాత్రమే కాదు అనేక చారిత్రిక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచిన మైలురాయి కూడా. టవర్ చుట్టూ ఉన్న ప్రాంతం అనేక ఉత్సవాలు, నిరసనలు, పెద్ద సమావేశాలను చూసింది. ఇది వలస రాజ్యాల కంటోన్మెంట్ నుండి సందడిగా ఉండే మెట్రోపాలిటన్ మహానగరంగా నగరంలోకి వెళ్ళే ద్వారంగానూ అనిపిస్తుంది.
2003లో, పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రూపొందించిన కూల్చివేత జాబితాలో ఈ టవర్ కూడా ఉంది. కాని దాని చారిత్రికతను దృష్టిలో పెట్టుకుని దీని పునరుద్ధరణ పనులు చేపట్టారు. ₹10 మిలియన్ (US$120,000) ఖర్చుతో చేపట్టిన ఈ పార్కు రోడ్లను వెడల్పు చేయడానికి దాని పరిమాణాన్ని తగ్గించారు. అదనంగా, టవర్‌ను పునరుద్ధరించారు. పార్కును పచ్చిక బయళ్ళు, హెడ్జెస్‌తో అలంకరించారు. ఒక జలపాతాన్ని కూడా ఏర్పాటు చేశారు.
దీని పునరుద్ధరణ 2005లో పూర్తయింది. 2006లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ పార్కును ప్రారంభించారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఆందోళన సందర్భంగా జరిగిన మొదటి పోలీసు కాల్పుల జ్ఞాపకార్థం పార్కు లోపల ఒక అమరవీరుడి స్మారక చిహ్నాన్ని కూడా ఏర్పాటు చేశారు.
హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో ఈ టవర్‌ను వారసత్వ నిర్మాణంగా ప్రకటించారు. 2006లో, సికింద్రాబాద్ ఏర్పడిన 200 సంవత్సరాల వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. దానికి లోగోగా ఈ క్లాక్ టవర్‌ను ఎంచుకున్నారు, ఈ వేడుకలో భాగంగా దర్శకుడు మణిశంకర్ రూపొందించిన 9 నిమిషాల 30 సెకన్ల నిడివి గల ఒక చిన్న చిత్రాన్ని విడుదల చేశారు. నగర చరిత్రను వివరించే ఈ చిత్రంలో క్లాక్ టవర్ ప్రముఖ స్థానంలో నిలిచింది.
ఇప్పుడు ఈ టవర్ చుట్టు అందమైన తోట పెంచుతున్నారు. లోపలికి వెళ్లి చూస్తే తప్ప దాని అందం తెలియదు. ఒకప్పుడు ఈ స్థలంలో అసాంఘిక కార్యకలాపాలు సాగేవి. వాటిని అరికట్టడానికి అనుమతి లేకుందా ఇందులోకి ఎవరికీ ప్రవేశం కల్పించట్లేదు. కాని ఈ క్లాక్ టవర్‌ను చూడాలనే ఆసక్తి ఉంటే మన వివరాలు చెప్తే అనుమతి ఇస్తారు.
టవర్ నుండి కొంచెం దూరంలో, రేజర్ వైర్లు, మెటల్ హాలైడ్ దీపాలతో అలంకరించబడిన పార్క్ లోపల ఒక చిన్న ఫౌంటెన్ ఉంది. దాని ప్రారంభ తేదీ ఫిబ్రవరి 1, 1897 అని అప్పటి నివాసి సర్ ట్రెవర్ జాన్ చిచెల్ ప్లోడెన్‌చే ప్రకటించబడింది. ఈ ప్రాజెక్ట్ 1896లో పూర్తయింది. ఈ సర్ ట్రెవర్ కుమార్తె పమేలా విన్‌స్టన్ చర్చిల్‌తో అప్పట్లో ప్రేమలో ఉందని చెప్తారు. ఆయన పేదవాడని ఈమె అతన్ని వివాహం చేసుకోవడానికి తరువాత నిరాకరించిందట. ఆ చర్చిల్ తరువాత బిటీష్ రాజ్యానికే దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగారు.
క్లాక్ టవర్‌కు కాస్త పక్కన పార్కులో ఓ చిన్న టవర్ నమూనా కనిపిస్తుంది. ఇది మొదటి నుంచి ఉందా లేదా ఇప్పుడు ఆధునీకరణ నేపథ్యంలో నిర్మించారా అనే విషయంలో స్పష్టత లేదు. పాత గడియారం పని చేయకపోతే రమేష్ వాచ్ గాలరీ కొత్త గడియారాలను తయారు చేసి ఇచ్చిందని చెప్పే ఓ బోర్డు ఆ పరిసరాలలో కనిపిస్తుంది.
మన నగర చరిత్ర పట్ల కుతూహాలం ఉన్నవారు ఒక్కసారయినా తప్పకుండా వెళ్ళి చూడవలసిన టవర్ ఇది. దీన్ని కూల్చి వేయకుండా చారిత్రిక కట్టడంగా గౌరవించి దీన్ని పురరుద్ధరీకరించిన ప్రభుత్వానికి, ఎంతో అందంగా దీన్ని మెయింటెయిన్ చేస్తున్న ఎమ్.సీ.హెచ్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
(మళ్ళీ కలుద్దాం)