[హైదరాబాద్‌ను పూర్తి స్థాయిలో తెలుసుకోవాలనే కోరికతో నగరంలో ప్రయాణించి పి. జ్యోతి గారు అందిస్తున్న ఫీచర్ ‘ఆదాబ్ హైదరాబాద్’.]
బన్సీలాల్ పేట్ లోని 300 సంవత్సరాల నాటి మెట్ల బావి
మన నగరంలో మనకే తెలియని ఎన్నో అద్భుతమైన కట్టడాలు నగర విస్తీరణలో ఇరుక్కుపోయి మరుగున పడిపోయాయి. ప్రస్తుతం ప్రజలలో టూరిజం పట్ల అవగాహన, చరిత్ర పట్ల కాస్త ఆసక్తి కలుగుతుందన్నది నిజం. అందుకే కొన్ని అలనాటి అపురూపాలని, నిర్లక్ష్యానికి గురయిన చారిత్రిక కట్టడాలని తిరిగి మరమ్మతులు చేసి వెలికి తీసే ప్రయత్నం మొదలయింది. అలా మళ్లీ ప్రాణం పోసుకున్నది బన్సిలాల్ పేట్ మెట్ల బావి.
మన హైదరాబాద్ నగరంలో ఇలాంటి బావులు ఎన్నో ఉండేవి. బావిని ‘బౌలి’ అని ఉర్దూలో అంటారు. గచ్చీబౌలీ, రేథీ బౌలి, దూధ్ బౌలి, పుత్లిబౌలి, గంగాబౌలి, హరిబౌలి, హాథీబౌలీ, ఇంజిన్ బౌలి– ఈ పేర్లు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. అవన్నీ నగరంలో నీటి వసతికి కట్టిన బావుల ప్రాంతాలు. గడిమల్కాపూర్లో భగవాన్ దాస్ బౌలీని కూడా ప్రభుత్వం వెలికి తీసింది. పుత్లీ బౌలి దగ్గర ఓ శిల్పం ఉండేదట. అందుకని అక్కడి బావికి పుత్లీ బౌలీ అన్న పేరు వచ్చింది. దూధ్ బౌలి దగ్గరి ఫతే దర్వాజా సమీపంలో అప్పట్లో పాల వ్యాపారస్థులు పాలు విక్రయించే వారట.
ఈ మెట్ల బావులను కట్టడం వెనుక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి నీటివనరులుగా ఉపయోగపడేవి. తాగు నీటికి ఇతర అవసరాలకు నీటి పారుదల కోసం నీటిని అందించేవి. కరువు పీడిత ప్రాంతాల్లో ఏడాది పొడవునా నీటిని అందించేందుకు వీటిని నిర్మించారు. అంతే కాకుండా ఇవి ప్రయాణికులు విశ్రాంతి తీసుకునే వసతి గృహాలుగా కూడా ఉపయోగపడేవి. ఆ బావుల మధ్య చల్లటి వాతావరణంలో ప్రయాణికులు సేద తీరేవాళ్ళు.
చాలా చోట్ల ఈ మెట్ల బావులలో సామాజిక సమావేశాలు జరిగేవి, మతపరమైన వేడుకలకూ ప్రజలు ఇక్కడ చేరేవాళ్ళు. కొన్ని మెట్ల బావులను స్మారక చిహ్నాలుగా ఉపయోగించేవాళ్లు. విస్తృతమైన శిల్పాలతో ఈ పరిసరాలను అలంకరించేవాళ్లు. ఇవి సంపన్నులు, శక్తివంతమైన రాజ పోషకులచే నిర్మించబడ్డ సంక్లిష్టమైన కట్టడాలు. ముఖ్యంగా ఇవి హిందూ ఇస్లామిక్ వాస్తుశిల్పానికి ఉదాహరణలుగా నిలిచాయి. నీటి సంరక్షణకు ప్రజలు వీటిపైనే ఎక్కువగా ఆధారపడేవాళ్లు.
ప్రస్తుతం నీటి సంరక్షణపై అవగాహన పెరిగింది. దాని అవసరాన్ని ఇప్పటి తరం గుర్తించింది. అందుకే ఈ పాత మెట్ల బావులను పునరుద్ధరించడం పట్ల ప్రభుత్వాలలో శ్రద్ధ పెరిగింది. దీనితో భూగర్భ జలాశయాలను తిరిగి నింపవచ్చన్న సంగతి అందరికీ అర్థమయింది. అందుకే అన్ని రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలు ఈ బావుల పునరుద్ధరణ పనులను చేపట్టాయి. హైదరాబాదులోనే బయటపడిన ఈ బావులన్నిటినీ లెక్కపెడితే నాకు ఇరవై దాకా తేలాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వంద దాకా మెట్ల బావులను పునరుద్ధరీకరించే పనులు మొదలయ్యాయి. ముందుగా మన సికింద్రాబాద్‌లో ప్రభుత్వం తలపెట్టిన పునరుద్ధరణ తరువాత ప్రజల కోసం తెరుచుకున్న బన్సిలాల్ పేట్ మెట్ల బావి గురించి చెప్పుకుందాం.
(బన్సీలాల్ పేట్ మెట్ల బావి పునరుద్దరణ)
(వెలికి తీసిన మెట్ల బావి)
ఇది సరిగ్గా ఎప్పుడు ఎవరి హయాంలో నిర్మించారన్న విషయం పట్ల స్పష్టత లేదు. అయితే చరిత్రకారుల పరిశోధనలో ఇది 17వ శతాబ్దంలో నిర్మించబడి ఉండవచ్చని తేలింది. ఈ ప్రాంతాన్ని నాగన్నకుంట అని పిలిచేవారట. ఫరోవా అండ్ కో 1954లో తయారు చేసిన ఒక పటం (map) లో ఈ మెట్లబావి పరిసరాలు నాగన్నకుంటగా రికార్డు అయ్యాయి. దీని చుట్టూ పెద్ద చెట్లతో మైదానం ఉండేదని ఈ పటం ద్వారానే తెలుస్తుంది. 1933లో టీ. హెచ్. కీస్ అనే బ్రిటీషరు ఈ బావి చుట్టు ఉన్న స్థలంలో ఓ గ్రామాన్నినిర్మించడానికి పూనుకున్నారు. దానికి ఆర్థిక సహాయాన్ని సేఠ్ బన్సీలాల్ అనే ఓ వ్యాపారస్థుడు అందించారు. అప్పటి నుండి ఈ ప్రాంతం బన్సీలాల్ పేట్ అయింది ఈ బావిని బన్సీలాల్ బౌలి అని పిలిచేవారు. ఆ తరువాత కూడా బతుకమ్మల విసర్జన సమయంలో గణేశ్ చతుర్థి ఉత్సవాలలోనూ ఈ మెట్లబావి దగ్గర పండుగ జరుపుకునేవారట. అయితే 1980 ల సమయంలో ఇద్దరు వ్యక్తులు ఇక్కడ మరణించిన తరువాత ఈ దారిని మూసివేసారు. క్రమంగా చెత్త పేరుకుపోయి ఈ బావి మరుగునపడిపోయింది.
(పునరుద్ధరణ సమాచారం)
(పునరుద్ధరణ సమాచారం)
(అప్పుడు దొరికిన చారిత్రిక అవశేషాలు)
దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత, స్థిరమైన నీటి నిర్వహణపై దృష్టి సారించే సామాజిక సంస్థ ది రెయిన్వాటర్ ప్రాజెక్ట్ ద్వారా ఈ మెట్ల బావి పునరుజ్జీవన ప్రణాళికను రూపొందించింది. 2022 మధ్యలో, తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ భాగస్వామిగా స్టెప్‌వెల్ పునరుద్ధరణ ప్రారంభమైంది. రెండు వేల టన్నుల చెత్తను ఇక్కడి నుండి తొలగించారు. మెల్లిగా ఆరు-దశల మెట్లబావి భూమిలోకి 50 అడుగులు దిగుతున్నదని బైటపడింది. అలా పునరుద్ధరించబడిన ఈ బావి చివరకు డిసెంబర్ 5, 2022న ప్రజల కోసం తెరవబడింది.
(గ్యాలరీలో కనిపించే పునరుద్ధరణ ముందు తర్వాతి ఫోటోలు)
(గ్యాలరీలో కనిపించే పునరుద్ధరణ ముందు తర్వాతి ఫోటోలు)
(బన్సీలాల్ పేట్ మెట్లబావికి వెళ్ళే ముందు వచ్చే ముఖద్వారం)
(ఇప్పుడు మన కోసం అలంకరించబడిన బావి లోపలి నిర్మాణం)
నేడు ఈ మెట్ల బావి అందంగా ముస్తాబయి ప్రజలకు కనువిందు చేస్తుంది. ఈ కాంప్లెక్స్‌లో ఒక కేఫ్, యాంఫి థియేటర్ కూడా నిర్మించారు. మెట్ల బావి చరిత్ర, దాని పునరుద్ధరణ వివరాలను వివరించే మూడు గ్యాలరీలు అక్కడ ప్రాంగణంలో ఉన్నాయి. ఈ గ్యాలరీలలో నీటి సంరక్షణ ప్రాముఖ్యతను తెలిపే సమాచారం కూడా ఉంది. మొదటి గ్యాలరీ మెట్ల బావి నమూనా చుట్టూ కేంద్రీకృతమై ఉంది. అలాగే పునరుద్ధరణకు ముందు, తర్వాత మెట్లబావి ఫోటోలను అక్కడ ప్రదర్శించారు. రెండవ గ్యాలరి నీటి సంరక్షణపై దృష్టి పెడుతుంది. మెట్లబావి ఫోటోలు డ్రాయింగ్లు ఇక్కడ కనిపిస్తాయి. మూడవ గ్యాలరీ మొదటి అంతస్తులో ఉంది. ఇక్కడ ఒక గాజు క్యాబినెట్లో చెత్తను తొలగించే సమయంలో దొరికిన కళాఖండాలను ప్రదర్శించారు. వాటిలో విగ్రహాలు, శంఖం గుండ్లు, కొన్ని కత్తులు,ఈటె తలలతో కొన్ని లోహ వస్తువులు కూడా ఉన్నాయి.
(గ్యాలరీలో ప్రదర్శనకు పెట్టిన చారిత్రిక ఆనవాళ్ళు
(యాంఫీ థియేటర్ భవనం)
20 లక్షల లీటర్లకు పైగా నీటి సామర్థ్యం కలిగిన ఈ బావికి భూగర్భ జలాలు, వర్షపు నీరు పునరుద్ధరణకు ఆధారం. వర్షా కాలంలో ఇప్పటికీ ఈ బావి దిగువ మూడు అంతస్తులు నీటిలో మునిగి కనిపిస్తాయి. ఈ 300 సంవత్సరాల నాటి నిర్మాణం చూసి ఆనందించడం ఓ గొప్ప అనుభూతి. ఈ బావి నీటిని అప్పట్లో గాంధీ ఆసుపత్రి వర్గాలు ఉపయోగించుకునేవని కూడా అంటారు.
(ప్రత్యేక అనుమతితో ఈ మెట్ల బావిపై సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తున్న ప్రేక్షకులు)
(ప్రత్యేక అనుమతితో ఈ మెట్ల బావిపై సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తున్న ప్రేక్షకులు)
ప్రస్తుతం ఈ బావి దగ్గర కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను జరుపుకోవడానికి అనుమతి ఇస్తున్నారు. అలా ఓ రెండు కార్యక్రమాలలో పాల్గొని ఆనందించే అవకాశం నాకు దొరికింది. అవి రెండూ సంగీత కార్యక్రమాలు. అతి పురాతన కట్టడంలో దీపాల నడుమ ప్రత్యేకమైన అలంకరణతో నీటిపై తేలుతున్న తెప్పలో సువాసనలు వెదజల్లే పూలు తేలియాడుతుండగా సంగీతాన్ని ఆస్వాదించడం ఓ గొప్ప అనుభూతి. ఈ బావి వెనుక భాగంలో చిన్న తోట ఉంది. అక్కడ భోజనాలు చేయడానికి వెసులుబాటు ఉంది. పున్నమి రాత్రి ఇక్కడ సంగీత కచేరి వినడం మరుపురాని అనుభవం.
(సాంస్కృతిక కార్యక్రమం జరిగేటప్పుడు బావి దగ్గరి అలంకరణ)
(సాంస్కృతిక కార్యక్రమం జరిగేటప్పుడు బావి దగ్గరి అలంకరణ)
ఈ మెట్ల బావి సోమవారం తప్ప అన్ని రోజులలోనూ సందర్శకుల కోసం ఉదయం పది నుండి ఒంటి గంట దాకా, సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది దాకా తెరిచి ఉంటుంది. టికెట్టు ధర యాభై రూపాయలు. నీటి సంరక్షణకు సంబంధించిన సమాచారంపై ఆసక్తి ఉన్నవాళ్ళు, నగర చరిత్రను తెలుసుకుని ఆనందించే సందర్శకులు, అలనాటి కట్టడాలను పరిశీలించాలనుకునే వాళ్లు తప్పకుండా చూడవలసిన కట్టడం ఇది.
(దీపాల వెలుగులో మెట్లబావి అందాలు)
దీనితోపాటు ఇంకా నగరంలో ఎన్నో మెట్ల బావులను పునరుద్దీకరించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ బావులన్నీటికి సంబంధించిన సమాచారాన్ని వీలయినంత విపులంగా నమోదు చేసే ప్రయత్నం చేస్తాను. మన నగరపు చారిత్రిక అవశేషాలను వెలికితీసే ప్రయత్నంలో కొన్ని సంస్థలు కలిసి పని చేస్తున్నాయి. వీటిలో స్త్రీలు అగ్రస్థానంలో ఉండి పర్యవేక్షణ చేయడం గమనింవలసిన విషయం. వారి అనుభవాలను అక్షరబద్దం చేయాలనే ఆలోచన ఉంది.
(సందర్శకులకు ప్రతి సాయంత్రం కనువిందు చేసే అందమైన దృశ్యాలు)
(సందర్శకులకు ప్రతి సాయంత్రం కనువిందు చేసే అందమైన దృశ్యాలు)
(సందర్శకులకు ప్రతి సాయంత్రం కనువిందు చేసే అందమైన దృశ్యాలు)