Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అచంచల భక్తి శ్రద్ధలు

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘అచంచల భక్తి శ్రద్ధలు’ అనే రచనని అందిస్తున్నాము.]

యస్య దేవే పరాభక్తిర్యధా దేవే తథా గురౌ
తస్యతే కథితా వ్యర్ధాః ప్రకాశంతే మహాత్మనః

సుప్రసిద్ధ శ్వేతాశ్వతరోపనిషత్తులో 6వ అధ్యాయం లో 23వ శ్లోకం ఇది.

భగవంతుని యందు మరియు సద్గురువు యందు సంపూర్ణ విశ్వాసం కలిగియున్న సాధకులకు మాత్రమే వేద జ్ఞానం లోని అతి నిగూఢమైన రహస్యాలు అవగతం అవుతాయి. ప్రగాఢమైన శ్రద్ధా, భక్తి విశ్వాసాలు కలవారు మరియు తమ మనో-ఇంద్రియములను నియంత్రణ చేసి అహర్నిశలు భగవంతుని పాదారవిందారములను భక్తి శ్రద్ధలతో కొలిచేవారు మాత్రమే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. ఇటువంటి శ్రేష్ఠమైన అలౌకిక, ఆధ్యాత్మిక జ్ఞానంతో వారు అతిత్వరగా శాశ్వతమైన పరమ శాంతిని పొందుతారు. ఈ జన్మలో కాని, వచ్చే జన్మలో కాని ఎటువంటి భౌతిక ఫలాపేక్ష లేకుండా భగవంతునికి లేదా సద్గురువుకు చేసే సేవే భక్తి అని, అటువంటి సేవ చెసిన సాధకులకు భక్తి, ముక్తి కరతలామలకములని సదరు ఉపనిషత్తు ప్రస్పుటంగా చెబుతోంది.

ఇదే అంశం సద్గురువు శ్రీసాయి చరిత్రలో వుంది. సాయి భక్తులలో అగ్రగణ్యురాలు బయాజాకోతే పాటిల్. సాయి మహిమ వలన కాక మమతానుబంధంతో బాబాతో తమను తాను ముడివేసుకుంది. షిరిడీ నివాసి, ధనవంతుడు మరియు భూస్వామి అయిన గణపతి కోతే పాటిల్‌ను వివాహం చేసుకొని బయజాబాయి షిరిడీకి వచ్చింది. ఆమె ఒక గృహిణిగా తన గృహస్థు ధర్మం నిర్వర్తిస్తూ, ప్రేమతో, వాత్సల్యంతో, కరుణతో అందరినీ ఆదరించేది. ఆమె ఇంటికి వచ్చిన అతిథులకు మరియు బంధువులకు ప్రేమతో వండి వడ్డించేది. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్న సత్యాన్ని నమ్మి నిత్యాన్న సంతర్పణలు చేస్తూ ఉండేది. ఆమెకి మొదటి దర్శనంలోనే బాబాపై భక్తి శ్రద్ధలు కల్గి ఆయనకు భిక్ష పెట్టకుండా భోజనం చేయకూడదని నిశ్చయించుకుంది. సాయిబాబా అంటే బిచ్చమెత్తుకుంటూ బ్రతికే పిచ్చి ఫకీరని అందరూ అనుకుంటున్న ఆ రోజుల్లోనే ఆయనలోని దైవత్వాన్ని గుర్తించి సాక్షాత్తూ భగవంతునిగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆమె బాబాకు నిస్వార్థమైన సేవ చేసింది. ఆమెకు కన్న తల్లి కంటే ఎక్కువ సేవ చేసిందంటే అతిశయోక్తి కాదు. సాయి సద్గురువు ఏకాంతంగా ధ్యానంలో కూర్చొని వుంటే వారి ముందు ఆకువేసి భోజనం వడ్డించి, కలిపి బిడ్డకు తినిపించినట్లే తినిపించేది. చివరికి ఆయన తిన్నాకే ఇంటికి తిరిగి వచ్చి తాను తినేది. ఆమె చేసిన అనన్యమైన, అసామాన్యమైన సేవకు ప్రతిఫలంగా ఆమెకు మోక్షం ప్రసాదించడంతో పాటు ఆమె కుమారుడైన తాత్యా కోతే పాటిల్‌ను మృత్యువు నుండి తప్పించారు శ్రీ సాయి.

భౌతికమైన విషయ సుఖాల పట్ల పట్ల ఆసక్తి ఉంటే అది భగవంతుని పట్ల అనన్య భక్తి కాదని భగవానుడు భగవద్గీతలో పలు మార్లు హెచ్చరించాడు. నిరంతరం దైవచింతన, స్మరణ, ధ్యానంలో ఉన్నవారే అనన్య భక్తులవుతారు. వారి పట్ల తన బాధ్యత ఎలాంటిదో భగవానుడు పైన పేర్కొన్న శ్లోకంలో స్పష్టంగా వివరించాడు. మరి ఎల్లప్పుడూ భగవంతుని ధ్యానంలో ఉండిపోతే సంసార బాధ్యతలను ఎవరు చూస్తారు అనే సందేహం ఇక్కడ కొందరు సాధకులకు మొదలవచ్చు. అనన్య చిత్తముతో, అచంచల భక్తి విశ్వాసాలతో కూడిన భక్తితో భగవంతుని శరణు కోరిన వారికి భగవంతుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని, వారి యోగక్షేమాల బాధ్యత తనదే అవుతుందని, కావల్సిందల్లా సాధకులకు భగవంతుడు లేదా సద్గురువు పట్ల భక్తి శ్రద్ధలు, అచంచల విశ్వాసం అని భగవంతుడు ఇచ్చిన అభయాన్ని మనం మరువకూడదు.

తనను భక్తులు లేదా సాధకులు అచంచల భక్తి విశ్వాసాలతో ఎలా కొలవాలో భగవంతుడు గీతలో మరొక చోట స్పష్టంగా చెప్పాడు. నా సంతృప్తి కోసం యజ్ఞయాగాదులు మరియు పుణ్యకార్యాలు చేసినవాడు, మరియు నన్ను స్థిరమైన శ్రద్ధతో పూజించేవాడు, నాకు నిశ్చలమైన భక్తి సేవను పొందుతాడు. తన సేవ యొక్క అద్భుతమైన నాణ్యత ద్వారా అటువంటి ఆరాధకుడు నా గురించి సాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతాడు. అయితే ఈ కలియుగంలో కలి కల్మషం వలన ఇటివంటి స్థిరమైన భక్తి విశ్వాసాలను పెంపొందించుకోవడం చాలా కష్టం. ఎందుకంతే విషయ వాంచలు ఎప్పటికప్పుడు పెరిగే కోరికలు, మన మనసులలో తిష్ట వేసుకుని ఉన్న అరిషడ్వర్గాలు మానవులను దైవం వైపు వెళ్ళకుండా అడ్డు పడుతుంటాయి. అందుకోసం ఎందరో ఆధ్యాత్మికవేత్తలు భగవత్ నామ సంకీర్తన అనే ఒక ప్రతిభావంతమైన, అతి సులువైన మార్గాన్ని మనకు అందించారు. సర్వశక్తిమంతుడైన భగవంతుడు అసంఖ్యాకమైన రూపాలలో అవతరించగలడు. కొన్నిసార్లు స్వయంగా తన నిజ రూపంలో, మరికొన్నిసార్లు ఆలయాల్లో అర్చామూర్తిగా, ఇంకొన్నిసార్లు శబ్దరూపంలో అవతరిస్తాడు. ఈ రూపాల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు. మనం ఏ గుడిలోని భగవంతుని వద్దకు వెళ్ళినా, ఏ భగవన్నామాన్ని జపించినా సర్వ శక్తిమంతుడైన ఆ సర్వేశ్వరుడినే ముఖాముఖి దర్శిస్తున్నామనే అర్థం. కాబట్టి హరినామ లేదా భగవంతుని నామం జపించడమే కలియుగంలోని అవాంతరాలను అధిగమించి, భగవన్నామాన్ని తిరిగి పొందగలిగే ఏకైక మార్గమని అనేకులు బోధించారు. ఈ భగవంతుని నామ సంకీర్తనయే కలి కల్మషాలను నాశనం చేయగలదు. సకల వేదాలనూ వెతికినా ఇంతకన్నా ఉత్తమమైన ఉపాయం మరొకటి కనిపించదు.

Exit mobile version