Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

యాక్సిడెంట్

[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో థ్రిల్లర్ కథల విభాగంలో బహుమతి పొందిన కథ ‘యాక్సిడెంట్’. రచన శ్రీమతి రోహిణి భైరవజోశ్యులు.]

ల్లటి తారు రోడ్డు మీద, చిక్కటి చీకట్లో ప్రయాణిస్తోంది కారు.

మనీష్ డ్రైవ్ చేస్తున్నాడు. పక్కన సీట్లో స్నిగ్ధ పాటలు వింటూ, కూనిరాగాలు తీస్తూ, కూచుంది.

“అబ్బా! ఇంకా ఎంత దూరముందండీ?” అన్నది గారాలు పోతూ.

“ఏం! మీ అమ్మవాళ్ళను చూడాలని అంత తొందరగా ఉందా?” అన్నాడు చిలిపిగా.

దూరంగా మైలురాయి కనిపించింది. ‘ధరణీపురం 20 కిలోమీటర్లు’ అని చూపించింది.

“ఇంకా ఇరవై కిలోమీటర్లు ఉందా?” అసహనంగా అన్నది స్నిగ్ధ.

“ఎంత సేపు? అరగంట.. ముప్పావు గంట పడుతుంది. అంతే.” అన్నాడు మనీష్.

మరో గంట గడిచింది.

“ఏంటండీ? ఇంకా ఊరు రాలేదు. తప్పు దారిలో వెళ్తున్నామా?” కొంచెం గాభరాగా అడిగింది.

మనీష్‌కు కూడా కంగారుగానే ఉంది. కానీ దాన్ని కనిపించనీయకుండా గంభీరంగా అన్నాడు.

“ఏమో గతుకుల రోడ్డు కదా! అందుకే ఇంత సమయం పడుతోందేమో?”

ఇంతలో ఇంకొక మైలు రాయి కనిపించింది. ‘ధరణీపురం.. 20 కిలోమీటర్లు’ అని చూపిస్తోంది.

“అదేమిటండీ? ఇంత దూరం వచ్చినా, మళ్ళీ 20 కిలోమీటర్లు చూపిస్తోంది.” కళ్ళు పెద్దవి చేసి భయంగా అన్నది స్నిగ్ధ.

అంతలో..

ఎదురుగా నడుస్తూ వస్తోంది ఎవరో అమ్మాయి. వెంటనే కారును సర్రుమంటూ పక్కకు తిప్పాడు మనీష్.

కానీ ప్రమాదం జరిగిపోయింది. కారు ఆ అమ్మాయిని గుద్దేసింది. ఆ అమ్మాయి ఎగిరి కారు బోనెట్ మీద అడ్డంగా పడింది. కారు అద్దాలమీద, బోనెట్ మీదంతా ఎర్రటి రక్తం.

కెవ్వు కెవ్వుమంటూ కేకలు వేసింది స్నిగ్ధ.

“స్నిగ్ధా! లే? ఏమైంది? ఎందుకలా కేకలేస్తున్నావు?” కుదుపుతూ లేపుతున్న భర్త మనీష్ వైపు భయం భయంగా చూస్తోంది. మళ్ళీ ఆ సంఘటన గుర్తొచ్చి, మళ్ళీ అరవసాగింది.

స్నిగ్ధ కలలో ఏదో చూడరానిది చూసిందని అనుమానం వచ్చిన మనీష్, వెంటనే నీళ్ల గ్లాసు తెచ్చి స్నిగ్ధతో తాగించాడు. కాస్త స్థిమిత పడింది.

“అమ్మో! ఎంత భయంకరమైన కల?” అన్నది గుండెలమీద చేయి వేసుకుని.

“మళ్ళీ వచ్చిందీ?.. పడుకునే ముందు నీవా పుస్తకాలు చదవడం మానెయ్యమంటే మానవు కదా!” అన్నాడు కోప్పడుతూ.

పక్కనే ఉన్న టేబుల్ వైపు చూసింది.

‘రక్తం అంటిన కారు’, ‘కారులో శవం’, ‘మాట్లాడిన దయ్యం’ – అన్నీ ఇలాంటి పుస్తకాలే.

“ఎన్నిసార్లు చెప్పాను? పడుకునే ముందు ఏ దేవుడి పుస్తకమో చదువుకో! ప్రశాంతంగా నిద్ర పడుతుంది అని. నాకవి చదవాలంటే బోర్ అంటావు. పోనీ మామూలు నవలలైనా చదువు. ఇలాంటి దయ్యాల కథలు చదివి, రాత్రంతా కేకలేస్తూ నీవూ నిద్రపోవు, నన్నూ నిద్ర పోనివ్వవు. అంత భయపడే దానివి, అసలా పుస్తకాలు చదవడమెందుకు? భయపడడమెందుకు?”

రోజూ చెప్పినట్టే ఆ రోజు చెప్పాడు. మరో గంటకు ఇద్దరూ నిద్రపోయారు.

***

 “ఏమండీ! మా తమ్ముడికి ఈ ఊర్లోనే ఉద్యోగం వచ్చేటట్టు ఉంది. అప్పుడు అమ్మవాళ్లు కూడా ఈ ఊరికే వచ్చేస్తారు. వాళ్ళు ఆ ఊరు వదిలిపెట్టే లోపల ఒకసారి అక్కడికెళ్లి, నా స్నేహితురాళ్లను కలుసుకొని వస్తానండి.” బతిమాలుతున్న ధోరణిలో అడిగింది స్నిగ్ధ.

“అలాగే చూద్దాంలే!” అంటూ ఆఫీసుకు వెళ్ళిపోయాడు.

సాయంత్రం..

“ఏమండీ! ఒక శుభవార్త. మా స్నేహితురాలు స్నేహ పెళ్లి నిశ్చయమైంది. మనం ఈ శుక్రవారం మా ఊరు వెళ్లాలి. శనివారం పొద్దున తనను పెళ్లి కూతుర్ని చేస్తున్నారు.” అన్నది స్నిగ్ధ ఆనందంగా అప్పుడే ఆఫీసునుంచి వచ్చిన మనీష్‌తో.

“అవును! స్నేహ వాళ్ల నాన్న నాకూ ఫోన్ చేసి, నిన్ను తీసుకుని రమ్మని, నన్ను కూడా ఆహ్వానించాడు. అయినా నాకెలా వీలవుతుంది చెప్పు? శుక్రవారం పొద్దున ఆఫీసులో అర్జెంట్ పనుంది. పోనీ నిన్ను బస్సు ఎక్కిస్తాను, నువ్వెళ్ళకూడదూ?” అన్నాడు.

“అమ్మో! ఆ గతుకుల రోడ్డులో, ఆ బస్సులో నేనెళ్లను బాబూ! ప్లీజ్ మీరూ రండి. సరదాగా వెళ్ళొద్దాం.” బతిమాలుతూ అడిగింది.

“సరే! అయితే శుక్రవారం సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాక వెళ్దాం. మూడు గంటల్లో రాత్రి భోజనం టైంకు వెళ్ళిపోతాం.” అన్నాడు మనీష్.

ఆనందంగా ఒప్పుకున్నది స్నిగ్ధ.

ఇక షాపింగ్ మొదలుపెట్టి ఏమిటేమిటో కొనుక్కున్నది. అది చూసి నవ్వుకున్నాడు మనీష్.

శుక్రవారం సాయంత్రం సూట్ కేసు సర్దుకుని, భర్త కోసం ఎదురుచూడసాగింది. మధ్యాహ్నమే వస్తానన్న భర్త, అయిదయినా రాలేదు. అసహనం పెరిగిపోయింది. అసహనం కాస్తా మెల్లగా కోపంలోకి మారింది. మూతి ముడుచుకుని సోఫాలో కూర్చుంది. అయిదున్నరకు వచ్చాడు మనీష్.

“సారీ స్నిగ్ధా! మా బాసు మీటింగ్ పెట్టుకున్నాడు. ఇప్పటికి అయిపోయిందా మీటింగ్. పరిగెత్తుకుంటూ వచ్చాను.” సంజాయిషీ చెప్తున్న భర్తను కోపంగా చూసింది.

మళ్ళీ ఏమనుకుందో “కాఫీ తెస్తాను.” అని లోపలికి వెళ్ళింది.

ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చాడు. కాఫీ తాగి ఇద్దరూ కారులో బయలుదేరారు.

కారులో కూర్చున్నాక తండ్రికి ఫోన్ చేసింది స్నిగ్ధ.

“నాన్నా! ఇప్పుడే బయలుదేరుతున్నాము. తొమ్మిది గంటలకంతా చేరుకుంటాము.” అన్నది గొంతునిండా సంతోషం తొణికిసలాడగా.

***

కారు మెయిన్ రోడ్డుమీద కొంత దూరం వెళ్ళి, పక్కకు తిరిగింది. అది కొంచెం గతుకుల రోడ్డు. అందుకే రెండు గంటల ప్రయాణం.. మూడు గంటలు పడుతుంది.

మెల్లగా చీకటి చిక్కబడుతూ ఉంది. పాటలు పెట్టుకుని వింటున్నారు ఇద్దరూ.

హఠాత్తుగా తన కల గుర్తొచ్చి, ఒళ్ళు గగుర్పొడిచింది. వెంటనే భర్త భుజం మీద చేయి వేసింది. అర్థమైన మనీష్ ‘ఏం భయం లేదు’ అన్నట్టు భార్య చేతిని ప్రేమగా నొక్కాడు.

బ్యాగులోనుంచి బిస్కెట్లు తీసి భర్తకు ఇచ్చి తనూ తిన్నది.

“ఇప్పుడు టీ తాగితే బాగుంటుంది.” అన్నాడు మనీష్.

“ముందే చెపితే, ఇంట్లోనే చేసుకుని, ఫ్లాస్కులో వేసి, తెచ్చేదాన్నిగా! ఈ దారిలో కాఫీలు, టీలు ఎక్కడ దొరుకుతాయి. మెయిన్ రోడ్డు మీదయితే డాబాలు ఉంటాయి.” తెగ బాధపడి పోయింది స్నిగ్ధ.

“పోనీలేవోయ్! నాకూ ఐడియా రాలేదు.” అన్నాడు భార్యను ఓదారుస్తూ.

మరో రెండు గంటలు పోయాక తండ్రికి ఫోన్ చేసింది స్నిగ్ధ.

“ఎక్కడున్నారమ్మా?” అడిగాడు ఆయన.

ఏదో ఒక ఊరు వచ్చింది. ఆ ఊరి పేరు చదివింది.

“ఇంకా అక్కడే ఉన్నారా? ఇంకా మూడు గంటలు పడుతుంది.” అన్నాడు ఆయన.

గాభరా పడిపోయారు.

“ఛీ.. ఛీ డొక్కు గతుకుల రోడ్లు. ఎంతసేపు ప్రయాణం చేయాలి బాబూ?” విసుక్కున్నారు ఆ రోడ్డును.

మరో గంట పోయాక దూరంగా సినిమా పాటలు వినపడ్డాయి. దగ్గరకు వెళ్ళి చూసారు. అది ఒక సినిమా టాకీసు. టాకీసు బయట ఒక టీ కొట్టు కనబడింది. ఇద్దరికీ ప్రాణం లేచొచ్చింది. దాని ముందు కారు ఆపారు.

ఆ టీ షాపులోని ముసలాయనకు రెండు టీలు ఇవ్వమని, డబ్బులు ఇచ్చారు. టీ తాగాక కొత్త శక్తి వచ్చినట్టైంది.

“ఏంటి సార్? ఏ ఊరెళ్ళాలి?” అడిగాడా ముసలాయన.

“ధరణీపురం వెళ్తున్నాం. ఇక్కడినుంచి ఇంకా ఎంతసేపు పడుతుంది?” ఎన్ని కిలోమీటర్లు అని అడిగితే అర్థం కాదని ఎంత సేపు పడుతుంది అని అడిగాడు మనీష్

“ఇంకో గంట పడుతుంది. ఇంత అర్ధరాత్రి అమ్మగారిని తీసుకుని వెళ్తున్నారేం సారూ?” అన్నాడు.

“చూసావా? రాత్రి ఎనిమిది గంటలకే వీళ్ళు అర్ధరాత్రి అంటున్నారు. ఈ పల్లెటూళ్ళలో ఇంతే.” ఇంగ్లీష్‌లో అన్నాడు స్నిగ్ధతో.

ముసలాయన వీళ్ళవైపు అదోలా చూసి, నవ్వాడు.

కారులో కూర్చుని టైమ్ చూసిన మనీష్ అదిరిపడ్డాడు. అప్పుడు టైమ్ రాత్రి పదకొండు గంటలయింది. అందుకా ఆ ముసలాయన అర్ధరాత్రి అని తమ వైపు అదోలా చూశాడు. మనసులో అనుకున్నాడు. కానీ టైమ్ పదకొండు అయినట్లు స్నిగ్ధకు చెప్పలేదు.. తను భయపడుతుందని.

కారు స్టార్ట్ చేసి, వెనక్కి తిరిగి ముసలాయన వైపు చూసాడు. అతనెందుకో నవ్వుతున్నాడు. ఆ నవ్వు చూసి ఒళ్ళు జలదరించింది మనీష్‌కు. ఇవేవీ గమనించలేదు స్నిగ్ధ.

కారును కాస్త స్పీడ్ గా నడుపుతున్నాడు. ఎందుకో తెలియని కలవరం చోటు చేసుకుంది. అరగంట ప్రయాణం చేశారు. కాస్త సాఫీగానే సాగుతోంది ప్రయాణం. ఇంకో అరగంటకంతా ఊరు చేరతామనుకోగానే కొత్త ఉత్సాహం చోటు చేసుకుంది.

ఇంతలో హఠాత్తుగా ఎవరో కారుకు అడ్డంగా పరుగెత్తుతూ, కారు గట్టిగా గుద్దేయడంతో, కారు బోనెట్ మీద పడి, దొర్లుతూ కింద పడిపోయాడు.

“అబ్బా!” అంటూ గట్టిగా కేక వేశాడు.

కారు అద్దాలమీద, బోనెట్ మీద, రోడ్డుమీద రక్తం..

అంతే..

కారు క్రీచుమంటూ ఆగిపోయింది. గాభరా పడిపోయారు ఇద్దరూ. కారు దిగారు కంగారుగా. అతని కేకలకు ముగ్గురు వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు.

ఆ హఠాత్పరిణామానికి మనీష్ కు నోట మాట రాలేదు.

“క్షమించండి! ఈయన హఠాత్తుగా కారుకు అడ్డంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. మేము కూడా చూసుకోలేదు.” దాదాపు ఏడుపు గొంతుతో చెప్తోంది స్నిగ్ధ.

“ఫరవాలేదమ్మా! తాగి వచ్చుంటాడు. అందుకే మీ కారును చూసుకోలేదు. తప్పు మా చిన్నాన్నదే.” అన్నాడు వాళ్ళలో ఒకరు.

“ఇక్కడికి దగ్గర్లో ఏదన్నా హాస్పిటల్ ఉంటే, అతన్ని మా కారులో తీసుకెళ్దాము.” అన్నాడు మనీష్ నోరు పెగల్చుకుని.

వాళ్ళు ముగ్గురూ అతన్ని మోసుకుని తీసుకెళ్తూ, “ఇదిగో ఈ పక్కనున్నదే మా ఇల్లు. లోపలికి వచ్చి కాస్త నీళ్ళు తాగి వెళ్ళండి. పాపం బాగా కంగారు పడినట్టుంది. పెద్ద దెబ్బలేం కావులెండి.” అన్నాడు ఒకతను.

అంత రక్తం కారుతూ ఉంటే, పెద్ద దెబ్బలు కావు అంటున్న అతన్ని వింతగా చూసారు మనీష్, స్నిగ్డలు.

“ఫరవాలేదు. మేము వెళ్ళిపోతాం.” అన్నాడు మనీష్.

లోపలికి వెళుతున్న వాళ్ళు, వెనక్కు తిరిగి, వీళ్ళను రమ్మన్నట్టు చేత్తో సైగ చేశారు.

“పోనీ వెళదాం పద! ఎంతైనా మన కారుకింద పడ్డాడు కదా! వీళ్ళు మంచివాళ్ళు కాబట్టి.. మన తప్పేం లేదని అంటున్నారు. అందుకు కృతజ్ఞతగా అయినా, మనం వెళ్ళి అయిదు నిమిషాలలో వచ్చేద్దాం.” అన్నాడు మనీష్.

రక్తం మరకలను తుడవడానికి సిద్ధపడిన స్నిగ్ధ, ఆ గుడ్డ కారు మీద పెట్టేసి “అలాగే” అన్నది.

ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళారు. పెద్ద కాంపౌండ్ దాటాక, మెట్లు ఎక్కాలి. బాగా ఎత్తులో ఉందా భవనం. లోపల విశాలమైన హాలుంది. ఆ దెబ్బలు తగిలిన మనిషిని, హాలు పక్కగా ఉన్న గదిలోకి తీసుకెళ్లారు. ఒకతను దెబ్బలు తగిలిన భాగమంతా శుభ్రంచేసి, కట్టు కడుతున్నాడు. పక్కనే ఇంజెక్షన్ సిరెంజీలు, ఇతర మందులు ఉన్నాయి. కట్టు కడుతుంటే, ఆ మనిషి మూలుగుతున్నాడు.

అందరికన్నా పెద్దాయన, వీళ్ళను హాల్ లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు. ఇల్లంతా ఎంతో కళాత్మకంగా ఉంది. పైకప్పుకు వేళ్ళాడుతున్న షాండిలియర్లు, మూలమూలలా ఉన్న రంగురంగుల ఫ్లవర్ వేజులు, గోడలమీద అందమైన పెయింటింగులు.. ధనవంతుల ఇల్లులాగా ఉంది.

అక్కడే ఉన్న భార్యతో, “వీళ్లకు టీ చేసివ్వు” అన్నాడు.

“అబ్బే ఇప్పుడేం వద్దండీ.” అన్నది స్నిగ్ధ, అంత రాత్రివేళ వాళ్ళను ఇబ్బంది పెట్టడమెందుకని.

“కనీసం నీళ్లన్నా తాగండి.”

అంటూ “వెళ్ళి, నీళ్ళు తీసుకురా!” అన్నాడు భార్యతో.

తమ దగ్గర నీళ్ళున్నాయని చెప్పినా వినడని అర్థమయి, ఏమీ మాట్లాడకుండా ఊరికే అయిపోయారు.

ఆవిడ మొహంలో ఏ భావమూ లేదు. నిర్వికారంగా లోపలికి వెళ్ళింది.

అప్పుడు గమనించారు ‘వీళ్ళందరి మొహాల్లోనూ దుఃఖం కానీ విచారం కానీ కనబడడం లేదు.’ అని ఆశ్చర్యపోయారు.

“ఈవిడ నా భార్య. ఆ దెబ్బలు తగిలిన వ్యక్తి నా తమ్ముడు. పెళ్లయింది కానీ ఇతని తాగుడు చూసి, విసిగిపోయిన ఆవిడ, ఎప్పుడూ భర్తతో గొడవపడి, పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడూ అంతే.. వారం క్రితం వెళ్ళిపోయింది. కట్టు కడుతున్నవాడు నా పెద్దకొడుకు డాక్టర్. వాడి భార్య పురిటికి పుట్టింటికెళ్ళింది. ఆ రెండో వాడు నా చిన్నకొడుకు. నా వ్యాపారమే అతనూ చేస్తున్నాడు. వాడికి పెళ్ళి చేయాలనుకుంటున్నాము.” అందరి గురించీ చెప్పాడు.

“మీరు నిద్రపోయే టైమ్ అయినట్టుంది. మేం వెళతాం.” లేవబోయారు మనీష్ వాళ్ళు.

“మేమంత తొందరగా పడుకోము. మా వ్యాపారం ముగించుకుని, ఇంటికి వచ్చేటప్పటికే, ఈ టైమ్ అవుతుంది. ఇక మా పెద్దబ్బాయి డాక్టర్ కదా! ఒక వేళా పాళా అంటూ ఏమీ ఉండదు అతని వృత్తికి. ఇక మా తమ్ముడు.. ఇంట్లో అయితే తాగనివ్వడం లేదని, రాత్రిపూట బయటకెళ్ళి, తాగి వస్తాడు.”

నీళ్ళు తెస్తానన్న అతని భార్య, ఎంతకూ బయటికి రాలేదు. అది గమనించి,

“ఇంకా నీళ్ళు తీసుకురాలేదేం.” అంటూ ఆయన లోపలికి వెళ్ళాడు. అయిదు నిమిషాలు గడిచినా, వాళ్ళు బయటికి రాలేదు. లోపలినుంచి ఎలాంటి గిన్నెల శబ్దాలూ రావడంలేదు.

“ఇక వెళ్దాం పద.” అని ఇద్దరూ లేచారు.

“వాళ్లకు చెప్పి వెళ్దాం.” అన్నది స్నిగ్ధ.

“ఏమండీ! ఇక మేము బయలుదేరుతాం.” అని వంటింట్లోకి తొంగిచూసి షాక్ అయ్యారు.

అక్కడ ఎవ్వరూ లేరు. ఈ తలుపు తప్ప, వంటింట్లోంచి వేరే ద్వారం లేదు.

‘ఎక్కడికి వెళ్ళారు?’ అనుకుని ఇల్లంతా చూసారు. ఎక్కడా లేరు.

దెబ్బ తగిలిన వ్యక్తి గదికి వెళ్ళారు, కనీసం డాక్టర్ గారికి చెప్దాం అని. ఆ గది ఖాళీ..

దెబ్బ తగిలిన వ్యక్తి, డాక్టర్, అతని తమ్ముడూ.. ఎవ్వరూ లేరు.

‘ఎక్కడ మాయమయ్యారు?’ అనుకుని వెనక్కు తిరిగి చూసారు. గోడలమీద వీళ్ల ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి.. దండలు వేళ్ళాడుతూ.

కళ్ళల్లోంచి సన్నగా వణుకు మొదలైంది. ఒక్క పరుగులో కారులోకి వచ్చి పడ్డారు.

కారుకంటిన రక్తం కూడా మాయం. కారు ఒక్క ఉదుటున స్టార్ట్ చేశాడు.

తల తిప్పి ఈ భవనం వైపు చూసారు ఒక్క క్షణం.

అక్కడ.. నుజ్జునుజ్జయిన తలలు, సగం విరిగిపోయిన కాళ్ళు, చేతులు, రక్తం ఓడుతూ, విరిగిన చేతులతో, వీళ్ళను లోపలికి రమ్మని సైగ చేస్తున్నారు.

గుండె ఆగిపోయినట్టయింది. స్నిగ్ధ గట్టిగా కేకలు వేసి స్పృహ కోల్పోయింది.

మనీష్ గుండె చప్పుడు గట్టిగా తనకే వినిపిస్తోంది.

ఎంత వేగంగా వీలయితే అంత వేగంగా ఈ స్థలాన్ని వదిలిపెట్టాలి అనుకుని కారు స్పీడుగా నడిపాడు.

అరగంటకి ఇల్లు చేరుకున్నారు.

కారు శబ్దానికి స్నిగ్ధ తల్లి, తండ్రి, తమ్ముడు బయటికి వచ్చారు.

స్పృహ తప్పిన కూతుర్ని చూసి కంగారు పడ్డారు. అప్పటికి కాస్త స్థిమిత పడిన మనీష్, స్నిగ్ధ మొహం మీద నీళ్ళు చిలకరించి లేపాడు.

స్పృహనుంచి బయటికి వచ్చిన స్నిగ్ధ, ఇంతకు ముందు జరిగిన సంఘటన గుర్తురాగా, మళ్ళా కేకలు వేయసాగింది.

“ఏమైంది స్నిగ్ధా?” అన్నది వాళ్ళమ్మ.

“ఏం లేదు ఆంటీ. మీ అమ్మాయికి దయ్యాల పుస్తకాలు చదవడం అలవాటు కదా. ఇలా అప్పుడప్పుడూ నిద్రలో భయపడి కేకలు వేస్తూ ఉంటుంది.” అన్నాడు సర్ది చెపుతూ.

“అంటే.. ఇదంతా కలా?” నమ్మలేనట్టు చూసింది స్నిగ్ధ భర్త వైపు.

“అంతే కదా! ఇది మొదటిసారి కాదు.. నీవిలా భయపడి అరవడం.” అన్నాడు లేని నవ్వు బలవంతంగా మొహం మీద పులుముకుంటూ.

అన్నం తినమని అన్నారు. ఆకలి లేదన్నారు.

పెరుగన్నమన్నా తినమని బలవంతం చేశారు. పెరుగన్నం తినేసి, నిద్రమాత్రలు వేసుకుని, ఇద్దరూ నిద్రపోయారు.

***

“స్నిగ్ధా! లేమ్మా! అప్పుడే తొమ్మిది గంటలయింది. స్నేహను పెళ్ళికూతురిని చేసే టైమ్ కు వెళ్ళాలి.” తల్లి నిద్ర లేపుతుంటే బరువుగా ఉన్న కళ్ళను బలవంతంగా తెరచింది స్నిగ్ధ.

అప్పటికే అందరూ లేచి కాఫీలు తాగుతున్నారు. మొహం కడుక్కుని, ఒకటేసారి స్నానం కూడా ముగించి వచ్చింది. ఇప్పుడు కొంచెం తెరిపిగా అనిపించింది.

ఉత్సాహంగా స్నేహ ఇంటికి వెళ్ళారు. మరుసటి రోజు పొద్దున్నే ప్రయాణమయ్యారు.

“అమ్మాయి అలసిపోయింది. కొన్ని రోజులు ఇక్కడే ఉంటుందిలే బాబు.” అన్నాడు స్నిగ్ధ తండ్రి నాగభూషణం.

“బావా! నేనెటూ రేపు ఉద్యోగంలో చేరాలి కదా! నేనొస్తాను నీతోపాటు. అక్కడే ఇల్లు వెతుక్కుని, అమ్మవాళ్ళను తీసుకువస్తాను. అంతవరకూ అక్కయ్య ఇక్కడే ఉంటుంది. అమ్మవాళ్లతో పాటు వస్తుందిలే!” అన్నాడు బావమరిది అభినవ్.

‘అదీ ఒకందుకు మంచిదేలే!’ అనుకున్నాడు.

మధ్యాహ్నం భోజనాలయ్యక, ఒంటిగంటకంతా బయలుదేరారు బావా, బావమరిది.

దారిలో.. ముందురోజు రాత్రి తమకెదురైన భయానక సంఘటనల గురించి చెప్పాడు మనీష్, అభినవ్‌తో.

“బావా! ఆ భవనంలో ఉన్నవాళ్ళు, తమ చిన్న కొడుకు పెళ్లిచూపుల కోసం కారులో వెళుతూ యాక్సిడెంట్‌కు గురై, అక్కడికక్కడే చనిపోయారు.”

“అయ్యో పాపం!” అన్నాడు మనీష్.

ఆ భవంతిని సమీపించడంతో, కారు ఆపమన్నాడు అభినవ్.

ప్రశ్నార్థకంగా చూసాడు మనీష్.

“బావా! ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పద!” అన్నాడు. భయపడుతూ చూసాడు మనీష్.

“ఇది పగలే కదా! రోడ్డుమీద ఎంతమంది తిరుగుతూ ఉన్నారో చూడు. ఏం భయంలేదులే! వెళ్దాం రా!” అన్నాడు అభినవ్.

ఇక తప్పదన్నట్టు కారు దిగి, భవంతి లోపలికి వెళ్ళాడు మనీష్, అభినవ్ వెంబడి.

లోపలంతా గబ్బిలాల వాసన. ఇల్లంతా బూజులు పట్టి ఉన్నాయి. నిన్న ఎంతో అందంగా, కళాత్మకంగా కనిపించిన భవనం ఇప్పుడు వెలసిపోయి, దయ్యాల కొంపలా కనపడసాగింది. లోపల హాలు, మూడు పడక గదులు ఉన్నాయి.

హఠాత్తుగా గుర్తొచ్చింది..

గాయపడిన వ్యక్తి ఉన్న గదిలోపలికి అడుగు పెట్టాడు. అక్కడ ఒక మంచంమీద మాసిపోయి, చినిగిపోయిన పరుపు, చుట్టూ విరిగిపోయిన సిరెంజీలు, మందుల సీసాలు ఉన్నాయి.

గోడల వైపు చూసాడు.

నిన్న కనపడిన వ్యక్తుల ఫోటోలు సగానికి వంగిపోయి వేళ్ళాడుతూ కనిపించాయి.

ఈ రోజెందుకో అంత భయమనిపించలేదు. బహుశా పగటివేళ అవడం వల్ల కావచ్చు. లేదా తోడుగా అభినవ్ ఉండడం వల్ల కావచ్చు. బయటికి వచ్చారు ఇద్దరూ.

“అవునూ! ఈ భవనానికి తాళం కూడా లేదే?” అనుమానం వ్యక్తం చేశాడు మనీష్.

“బావా! ఈ భవనాన్ని చూసి, కొంతమంది దొంగలు, తాళం విరగ్గొట్టి లోపలికి వెళ్ళారు. ఏం చూసారో కానీ మళ్ళీ పరుగున బయటికి వచ్చారు. వాళ్లలో ఒకడికి హార్ట్ ఎటాక్ వచ్చి, చచ్చిపోయాడు.” చెప్పాడు నవ్వుతూ.

“అమ్మో! మాది గట్టి ప్రాణాలే!” నవ్వుతూ జవాబిచ్చాడు.

మళ్ళీ బయలుదేరారు. దారిలో ముందురోజు చూసిన సినిమా టాకీసు, దాని ముందున్న టీ కొట్టూ కనబడ్డాయి. మనీష్ కారు ఆపి, ఆ టీ కొట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే, నిన్నటి పెద్దాయన కాకుండా, ఒక యువకుడు ఉన్నాడు.

టీ ఇవ్వమని చెప్పి మాటల్లోకి దించాడు.

“మొన్న రాత్రి పదకొండు గంటలప్పుడు ఒక పెద్దాయన ఈ కొట్లో కనపడ్డాడు. ఆయన నీకేమౌతాడు?” అడిగాడు ఆ యువకుడితో.

ఆ అబ్బాయి కనుబొమలు ముడివేసి, “ఎవరి గురించి బాబూ మీరడిగేది?” అడిగాడు.

“అదీ.. ఆరోజు రాత్రి కనపడిన పెద్దాయన గురించి.” అన్నాడు మనీష్ మళ్ళీ.

“క్షమించండి సార్! మీరు పొరపడి ఉంటారు. ఎవరిని చూసి ఎవరనుకున్నారో? ఈ కొట్టు నడిపేది నేనే. రాత్రి 9 గంటల తరువాత ఈ కొట్టు కట్టేస్తాను. ఇది వరకు మా తాత కూర్చునేవాడు ఈ కొట్లో. ఆయన చనిపోయి మొన్నటికి మూడు సంవత్సరాలైంది. అప్పటి నుంచీ నేనే చూసుకుంటున్నాను.” అన్నాడు వివరంగా.

మనీష్‌కు అనుమానం వచ్చి, చుట్టూ చూసాడు ఇలాంటి టీ కొట్లు ఇంకెవైనా ఉన్నాయా? అని.

అతని అనుమానం గ్రహించి, “సార్ ఈ ఊర్లో ఇదొకటే సినిమా హాలు. నాదొకటే టీ కొట్టు.” గర్వంగా చెప్పాడు ఆ టీ కొట్టు కుర్రాడు.

‘అంటే.. ఆ రోజు చూసింది.. చచ్చిపోయిన వీళ్ళ తాతనా?’

కొట్టు లోపల, గోడమీద నవ్వుతూ ఉన్న ముసలాయన ఫోటో కనపడింది.

‘అవును.. ఆ రోజు చూసింది ఈయననే. ఆ నవ్వు మర్చిపోలేము.’

మనీష్ గుండె దడ దడ లాడింది. తాగేసిన టీ కప్పులక్కడ పెట్టేసి, గబగబా కారులోకి వచ్చి పడ్డాడు మనీష్.

ఈ సంభాషణంతా విన్న అభినవ్‌కు జరిగిందంతా అర్థమయింది. జరిగిందంతా వివరించి చెప్పాడు మనీష్.

“ఈ విషయాలేవీ మీ అక్కకు తెలియనివ్వకు.” అన్నాడు బావమరిదితో.

“నాకా మాత్రం తెలీదా బావా!” అన్నాడు ధైర్యం చెప్తూ.

***

ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు అభినవ్. వెంటనే ఇల్లు కూడా దొరికింది.. అది కూడా స్నిగ్ధ ఇంటికి దగ్గరలోనే.

ఆ విషయమే ఫోన్ చేసి తల్లిదండ్రులకు చెప్పి, వచ్చే శనివారం వస్తున్నానని, ఆదివారం అందరూ ఈ ఊరికి షిఫ్ట్ అవ్వాలని చెప్పాడు.

అందరూ ఆనందపడ్డారు.

***

సామానంతా లారీలోకి ఎక్కించి, వీళ్ళంతా కారులో బయలుదేరేటప్పటికీ చీకటి పడింది.

దారిలో కనిపించిన భవనం చూసిన స్నిగ్ధ శరీరం కొంచెం వణికింది. తల్లి చేయి గట్టిగా పట్టుకుంది.

ఆ భవనం దాటుతూ ఉండగా, ఆ వైపుకు చూసిన స్నిగ్ధకు, మళ్ళా ఆ భయంకర దృశ్యం కనబడింది.

భవనం బయట నుజ్జు నుజ్జయిన తలలతో, రక్తం ఓడుతూ, సగం విరిగిపోయిన చేతులతో లోపలికి రమ్మని పిలుస్తున్నారు.

కెవ్వున కేకేసింది స్నిగ్ధ.

“అమ్మా! అటు చూడు.” అన్నది. తల్లి తల తిప్పి చూసేంతలో కారు ఆ భవనం దాటి వెళ్ళిపోయింది.

“ఏమయిందమ్మా?” అన్నది కూతురి వీపు రుద్దుతూ.

“అహ! ఏం లేదమ్మా!” చుట్టూ అందరూ ఉండడంతో కొంచెం స్థిమితపడుతూ అన్నది.

దారిలో సినిమా టాకీసు దగ్గర కారు ఆపలేదు అభినవ్.

***

తరువాత, వాళ్లకు అసలు విషయం తెలిసిందేమిటంటే.. ఆ భవనం ఓనరు అయిన డాక్టర్ భార్య, ఆ ఇంటిని ఎవరికో అమ్మేసిందట. ఆ భవనం కూలదోసి, పెద్ద అపార్ట్‌మెంట్ కడుతున్నారట.

“బావా! మీరూ కొంటారేమిటి అక్కడ ఒక ఫ్లాటు?” నవ్వుతూ అడిగాడు.

“ఒద్దు బాబోయ్! ఆ రోడ్డుమీదకు అసలు వెళ్ళనే వెళ్ళము.” భయపడుతూ చెప్తున్న బావను చూసి పడీ పడి నవ్వాడు అభినవ్.

Exit mobile version