Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అచ్చమైన స్వదేశీయత సోమనాథుని కవిత-2

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘అచ్చమైన స్వదేశీయత సోమనాథుని కవిత’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది 2వ భాగము.]

ఏది దేశి కవిత?

ఆచార్య జి వి సుబ్రహ్మణ్యం “ఒక తెలుగు కవి తొలిసారిగా నిర్మించిన స్వతంత్ర పురాణం బసవపురాణం. ప్రప్రథమ ఆంధ్ర ద్విపద భారతి ఈ కృతి” అన్నారు వైదిక పురాణ సాహిత్యానికి వ్యతిరేకంగా మొదట జైన పురాణాలు వెలిశాయి. జైన తీర్ధంకరుల మహిమలను జోడిస్తూ, వైదిక పురాణాలను తమకు అనుకూలంగా తిరగ రాశారు.

9వ శతాబ్దిలో పంపమహాకవి ఆదిపురాణం పేరుతో ప్రథమ జైన తీర్ధంకరుడి చరిత్రను చంపూ పద్ధతిలో వ్రాశాడు. అదే కాలంలో తెలుగుభాషలో కూడా ఇలాంటి కావ్యాలు కొన్ని వెలువడే ఉంటాయి. అవి దొరకనంత మాత్రాన లేవనటానికి లేదు. క్రీ. శ 9వ శతాబ్ది నాటికి తెలుగు కన్నడ సరిహద్దు ఇంత స్పష్టంగా విడివడి ఉన్నదా.. అనే ప్రశ్నకు చరిత్రకారులు సమాధానం చెప్పాలి.

రాజులు రాజ్యాలు వేరుగా ఉన్నా భాషా జాతీయత పరంగా ఇప్పుడున్నంత భిన్నత్వం లేదని చెప్పవచ్చు. ఈనాటి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల హద్దుగా ఉన్న వేంగి రాజ్య పాలకులు వైదిక సాంప్రదాయబద్ధులు. వారి సామంతులుగా పాలిస్తున్న కాకతీయులు జైనంలోంచి శైవంలోకి మళ్ళారు.

గణపతి దేవుడు తిక్కన ద్వారా జైనులను ఓడింప చేసి “జిన సమయార్ధుల తలలు దునియె-విద్వేష బౌద్ధుల విలువమాడె (సిద్ధేశ్వర చరిత్ర)” అనే వాక్యాల సాక్ష్యంగా జైనులను, బౌద్ధులను నిశ్శేషం చేశాడు.

కాకతీయ సామ్రాజ్యం పతనమైనా సోమనాథుడి ప్రేరణతో సకల నియోగంబులు(అన్ని కుల వృత్తుల వారు), శైవ మార్గాన ఐక్యమై, జాతి ఐక్యతను నిలబెట్టుకున్నారు.

బసవ పురాణము, పండితారాధ్యుల చరిత్ర రచనలతో బాటు సోమనాథుడు వ్రాసిన అనుభవసారము, వృషాధిప శతకము, చతుర్వేద సారము, సోమనాథ భాష్యము, చెన్నమల్లు సీసములు పరిష్కృతమైనవి చాలావరకూ దొరుకుతున్నాయి. ఇంకా, కొన్ని ఉదాహరణ కవితలు, రగడలు, అష్టకాలు, నామావళులు, పంచరత్నాల్లాంటివెన్నో రచించాడు. వీరశైవులు కంఠోపాఠంగా వల్లించే శివస్తవం సోమనాథకృతమే!

శివకవుల మార్గాన రంగనాథ రామాయణం లాంటి మరికొన్ని విష్ణుకథలు జన సామాన్యంలోకి చొచ్చుకు పోయే ప్రయత్నం చేశాయి. శ్రీనాథుడి పల్నాటి వీరచరిత్ర దేశి కవితకు ఎంతటి గౌరవాన్ని తెచ్చిందో ప్రత్యేకంగా గుర్తు చేయనవసరం లేదు.

14వ శతాబ్దికి చెందిన గణపనారాధ్యుడు స్వర శాస్త్రము అనే యోగ శాస్త్రాన్ని ద్విపదలో రచించి ద్విపదకు కావ్యగౌరవం తెచ్చాడని జోగారావుగారన్నారు. పదకవితా పితామహుడు దేశికవిత ప్రవర్తకుడు అన్నమాచార్య చరిత్రను తాళ్లపాక చిన్నన్న ద్విపదలోనే వ్రాసి ప్రసిద్ధుడయ్యాడు. ప్రజల కోసమే సాహిత్యం అనే భావనకు వెయ్యేళ్ళ చరిత్ర ఉందని ఈ అంశాలు నిరూపిస్తున్నాయి.

దేశికవితలో కూడా మార్గకవిత్వపు ఛాయలు కనిపించవచ్చు. వేదాదులనుంచి ఉన్నవి ఉన్నట్టుగా సంస్కృత వాక్యాలు దించటం, “అక్షయకీర్తి దృష్టాదృష్ట లోక సాక్షిక ప్రత్యయ మంగమూర్తి”లాంటి దీర్ఘ సంస్కృత సమాసాల ప్రయోగాలు సోమనాథుని కవిత్వంలో ఉన్నప్పటికీ జోగారావు గారన్నట్టు ఆయన కావ్యాలు నూటికి ఎనబై పాళ్ళు దేశితనాన్ని కలిగి ఉంటాయి.

“ఆరూఢ్య గద్యపద్యాది ప్రబంధ పూరిత సంస్కృత భూయిష్ట రచన

మానుగా సర్వ సామాన్యంబు గామిజాను తెనుగు విశేషము ప్రసన్నతకు” (పండితారాధ్య చరిత్ర)

అనే పద్యంలో సోమనాథుడు వాడిన భాషకీ,

“ఉరుతర గద్య పద్యోక్త్యుల కన్న/సరసమై పరగిన జాను తెనుంగు

చర్చింపగా సర్వ సామాన్యమగుట/గూర్చెద ద్విపదలు గోర్కె దైవార”

అనే పద్యంలో వాడిన భాషకీ (బసవపురాణం) తేడాని గమనిస్తే, సంస్కృత పాండిత్య ప్రతిభ గలిగిన ఒక కవి, జాను తెలుగులోకీ, దేశి సాహిత్యం లోకీ మళ్ళడం ఎంత కష్టమో అర్థం అవుతుంది. అందుకే, నేలటూరి వెంకటరమణయ్యగారు సోమన భాష అచ్చతెనుగు భాష అనే వాదంతో ఏకీభవించలేకపోయారు.

“సోమనాధుని వాక్యములు జానుదెనుగున నచ్చతెనుగను భ్రమను గలుగ జేయుచున్నను వాస్తవము విచారించగా జానుదెనుగునకు సరియైన యర్ధమది కాదని తోచుచున్నది. ఏలన, సోమనాథుని రచన లచ్చతెనుగు కబ్బములు కావు. ఇతరాంధ్ర కవులను బోలె ఇతడును సంస్కృతాంధ్ర మిశ్రబాషనే వాడియున్నాడు. తిక్కన సోమయాజి కవనమందుబోలె ఈతని కవనమందును సంస్కృత పదములకంటెను తెనుగు మాటలే యధికముగా గానవచ్చుచున్నవి. అంతమాత్రముననే ఇతని గ్రంధముల బాష యచ్చ తెనుగని చెప్పుట తగదు గదా!

జానుదెను గచ్చతెనుగే యైన పక్షమున నితడు జానుదెనుగున గ్రంధములను రచించితినని చెప్పినది పొల్లుమాట, దబ్బఱ యనుకొనవలసి వచ్చును. కాని, సోమనాథుడు దబ్బఱలాడెననుట విశ్వసింపదగిన విషయము కాదు. మరియు గద్యపద్యాది ప్రబంధపూరిత సంస్కృతభూయిష్టము గాని రచన జానుదెనుగని సోమనాథుడు నిర్వచించి చెప్పుచుండ, గద్యపద్యాత్మకము, సంస్కృత భూయిష్టమునగు కుమార సంభవమును దాను జానుదెనుగున రచియించితినని నన్నెచోడుడు దెల్పుచున్నాడు. దీనివల్ల వీరిరువురును ‘జానుదెనుగు’ నొక్కవిధముగ నర్ధము జేసికొనక భిన్నమార్గములను ద్రొక్కినట్లు తెల్లమగుచున్నది. ఒక్కమాట యర్ధమును చేసుకొనుట యందిరువురును పరస్పర విరుద్ధ మార్గములు ద్రొక్కుట చూడ జానుదెనుగునకీ రెండుమార్గములను సమన్వయ పరిచెడి సామాన్యార్ధమేదో యుండవలెయునని తోచుచున్నది” అని వ్యాఖ్యానించారు.

ఆ సామాన్యార్ధాన్ని అయన ఇలా వివరించారు:

“జాను శబ్దము దేశ్యమని సీతారామాచార్యులు గారు అభిప్రాయ పడిరి. ఇది జ్ఞానశబ్దభవ మనియు, ‘జాణ’కు దోబుట్టు వనియు నేను తలచెదను. దీనికి అందము, సౌందర్యము అని యర్ధము. ‘జానుదెను’గనగా సొంపైన నుడికారము గల తెనుగని యన్వయము చేసికొనవలయును” అన్నారు.

“లోకమ్ము వీడి రసమ్ము లేదు” వ్యాసంలో ఆచార్య కోవెల సుప్రసన్నులు మౌఖికమైనంత మాత్రాన సూత్ర భాష్యాదుల పాండిత్యం లేకుండా అన్నమయ సంకీర్తనలను అర్ధం చేసుకోగలమా..? అని ప్రశ్నించారు.

కఠినమైన శాస్త్ర విషయాలను సామాన్యుడి ముంగిటకు చేర్చగలగటం ఒక శైలి. అది రచయిత ప్రతిభకు తార్కాణం. పామర జన మోదాన్ని కలిగిస్తూనే ఎన్నో రహస్యాలు పండితులు వెదుక్కోగలిగేలా ఏర్పడి చెప్పగలగటం ఒక అన్నమయ్యకు తెలుసు, ఒక సోమనాథుడికి తెలుసు.

చెన్నమల్లు సీస పద్య శతకంలో “ఆడింప నోడింప నా హెచ్చు కుందులు ఠవణించి చూడనీయవియె కావె?” అంటాడు. “నిదానించి చూస్తే, ఆడించేవాడివీ, ఓడించేవాడివి, హెచ్చు తగ్గులు ఇచేవాడివి నువ్వే కదా – ఈ జీవితం ఒక నాటక రంగం” అనే భావన చెప్పటానికి దేశీయతను చక్కగా ఉపయోగించుకోవటాన్ని ఈ సీసపద్యంలో గమనించవచ్చు.

“కలనైన నిలిచిన నిలుకడ చలియింప నప్పుడ రూపకుం డయ్యెనేని” అనే ప్రయోగం కనిపిస్తుంది. శివుని మీద మనసు నిలుకడగా నిలిచి ఉన్నప్పుడే రూపకుడు శివైక్యం చెందడం మంచిదంటాడు. “యంత్రధారి చేత జంత్రమున్నటులు నీవాడినట్లు దేహమాడ వలదె..?” అని హితవు చెప్తాడు.

ఎన్నో తెలుగు పదాలను ఆయన అవలీలగా ప్రయోగించాడు,

“టగ్ ఆఫ్ వార్” అనే తాడాటను “రాగుంజుపోగుంజులాట” (పండితా.46) అన్నాడు. కొన్ని పదబంధాలను స్వయంగా రూపొందించాడేమోననిపిస్తుంది.

బసవని చూడటానికి జనసందోహం కదిలి వస్తుంటే, పందిళ్ళు వేసి, వాటి గుంజలకు గాలి ధారాళంగా వచ్చేలా ‘వ్యాసహస్తాలు’ అమర్చారంటాడు. సీమంగుఫ్యానుకు ఈ వ్యాసహస్తం అచ్చుగుద్దినట్టు సరిపోతుంది.

“ఒరేయి కుక్కా..!” అని కసితీరా తిట్టటానికి ఆయన గొంతు చించుకోలేదు. “ఉచ్చుచ్చిరే శంకరోచ్చిష్టు భోగి” అని ఊరుకున్నాడు. “పాపికా బ్రమసితే ప్రాణవల్లభుని ధూపొడ్వ గూడునే తుంపురుల్నిండ” (బసవ3-157) అనే వాక్యంలో థూ అని చీదరించటానికి థూపొడ్వ అని మృదువైన ప్రయోగం చేశాడు.

అలాగే ఛీ! ఛా! అని ఈసడించ దగిన వ్యక్తులను చాలా సౌమ్యంగా ‘చాకారులు’ అన్నాడు.

పరువు నష్టాన్ని ‘తూని చెడటం’ అన్నాడు.

పడిన మచ్చ మాసిపోదని హెచ్చరించటానికి ‘అలుకు పోదు’ అంటాడు.

వీసమంతదానికి కొండంత పాపాన్ని మూటగట్టుకొనేవాళ్లు అనే అర్ధంలో “వీసానికైనా ఎట్టి దోసానికైన చేసాచుకొను కర్మజీవులు..” అంటాడు.

నీచులను లెంగులు అంటాడు.

పేరాశని “కోలాస” అంటాడు.

చాలా మంచివాడు, అమాయకుడు అని చెప్పటానికి నునుపరి అని అందంగా ప్రయోగిస్తాడు.

కుంభవృష్టి కురిసిందనటానికి అచ్చతెనుగులో “కుండకూలిన యట్టు” అంటాడు.

రాతిని శిల్పంగా మలచటాన్ని గండరించు అంటాడు. “పండిత లోచనాబ్జంబుల యందు గండరించినయట్టి” అని ప్రయోగిస్తాడు.

గ్రూపులు కట్టడాన్ని గుంపిడటం అని ఎత్తిపొడుస్తాడు.

తక్కువగా గౌరవించటాన్ని సోలవెలితి అన్నాడు.

చాలా కొద్ది సమయాన్ని గోరంతపొద్దు అంటాడు,

అసాధ్యం అనడానికి కుంచాలతో మంచుకొలవటం అనే చక్కని జాతీయాన్ని ప్రయోగిస్తాడు.

భరింఛటం అనే అర్థంలో “తనువెల్లా శిరమై” అంటాడు,

విత్తనాలు నాటడాన్ని“విత్తులలుకు” అనడంలోని పదలాలిత్యం అసాధారణమైనది

మేలము అంటే పరిహాసము (చెన్నమల్లు -5)

దుద్దెక్కుఅంటే పెద్దదగు, లావెక్కు: భక్తి దుద్దెక్కితనలోన దొట్రుకొనంగ (బసవ 1-217)

బుడిబుళులు అంటే గుసగుసలు: “నరుల్ బుడిబుడుల్వోవ, బుడిబుళ్ళు వోవుచు భూసురులెల్ల పుడమీశు కొలవుకు పోయి” (బసవ 7-180)

బిలిబిలి కృతులు: వేగంగా రాసేసిన పనికి మాలిన రచనలు.

బిలిబిలి కాయకంబులు: కొద్దికష్టంతో చేసే పనులు(బసవ5-131)

తొడితొడి: మొట్టమొదటగా: తొడితొడి జాగిలబడి మ్రొక్కి.. అంటాడు పండితారాధ్యుల చరిత్రలో (ద్వి.2610)

ధర్మకవిలె: చెప్పినట్టు వినే దాసుడు, నిజమైన భక్తుడు, అచంచల భక్తివిశ్వాసాలు కలిగినవాడు: “కతలేల మీ ధర్మకవిలెలము మేము” (పండితా175), “మీ దత్తి మీ ప్రాత మీధర్మకవిలె (బసవ-422), కవిల బసవ అంటే, కన్నడ దేశంలో శాస్త్రోకంగా ఉత్సర్జనము చేసిన వృషభము అని!

బయిసి: మర్యాద, ప్రతిష్ఠ. బైసిమాలినవాడు, మర్యాదలేనివాడు.” మాబోటి భక్తులకునికియు నులికి నీ/ బయిసియు కాదె నిలలో(బసవ5-134)

పొట్టపొరుగు: చాలాదగ్గిరగా ఉండటం: పొట్టపొర్పునగల్ప భూరుహంబుండ..” (బసవ-7-207)

పొట్టిడుకొను. కడుపులో దాచుకోవటం, రహస్యం కాయటం. బడబాగ్నియంతయు ఫాలమధ్యమున మృదుగణంబొకడు బొట్టిడికొనుటెట్లు? (పండితాద్వి. 406)

సోమనాథుని కవితలో పదలాలిత్యం, సంక్షిప్తతలతో పాటు, వైరి సమాసాలను కూడా స్వేచ్చగా ప్రయోగించటం అనే లక్షణాన్ని కూడా గమనించవచ్చు. పుష్పవిల్లు, భూమి తీరు, వేడి పయోధార లాంటి ప్రయోగాలు అలవోకగా చేసినవెన్నో కనిపిస్తాయి.

తిరుగుబాటు చేయటమే ఊపిరిగా పనిచేసే ఉద్యమకారుడు రూల్సు పాటిస్తాడా..!. బసవడు పట్ల, శివుడు పట్ల, సమాజంలోని అంటరానివారుగా అణగదొక్కబడిన వారి పట్ల, ఆయన తనది అతిలౌల్యం.. అని చెప్పుకొన్నాడు.

వర్ణవ్యవస్థ వ్యతిరేకత పట్ల, సంస్కృత భావజాల వ్యతిరేకత పట్లకూడా ఆయన అతిలౌల్యాన్నే ప్రదర్శించాడు.

తన ద్విపద కావ్యాన్ని “వేదములకొలదియు కొలువుడు” అని చెప్పుకోవటానికి ఒక కవికి ఎన్నెదలు కావాలీ..?

(సమాప్తం)

Exit mobile version