Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అచ్చమైన స్వదేశీయత సోమనాథుని కవిత-1

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘అచ్చమైన స్వదేశీయత సోమనాథుని కవిత’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది 1వ భాగము.]

తెలుగు వారికి చరిత్రపట్ల ముందు నుంచీ చిన్న చూపే ఉంది. సాహిత్య చరిత్ర గురించి అంతకన్నా చిన్న చూపు మనకి. ఉన్న చరిత్రను కూడా రాగ ద్వేషాలు లేకుండా మౌలికంగా పరిశీలించి చెప్పింది కూడా తక్కువే! రెండు వేర్వేరు సిద్ధాంతాలకు అంకితమై, ఎన్నో కొత్త ఒరవడులకు కారకులైన ఇద్దరు గొప్ప కవులలో నన్నయ గురించి జరిగినంత అధ్యయనం పాల్కురికి సోమనాథుని విషయంలో జరగకపోవటానికి కారణాలు అనూహ్యం కాదు.

సోమనాథుడు ప్రారంభించిన సమాజ సంస్కరణోద్యమం గురించీ, అంటరానితనం, కుల వ్యవస్థల నిర్మూలన గురించీ చర్చించడానికి విశ్వవిద్యాలయాలు గానీ పరిశోధకులు గానీ అంతగా ఆసక్తి కనపరచకపోయినా, అభ్యుదయ వాదులు కూడా సోమన విషయంలో పెద్దగా స్పందించకపోవటమే చరిత్ర పట్ల మనకున్న చిన్నచూపును పెద్దది చేసి చూపిస్తోంది.

శివకవుల దేశీయతా భావాన్ని ఆవిష్కరించుకొనే ఈ సందర్భంలో సాహిత్య చరిత్రని అధ్యయనం చేసే వారికి సామాజిక దృష్టితో పాటు, జాత్యాభిమానం, భాషాభిమానం కూడా ఎంతో అవసరం అని మనం గమనించాలి. సోమనగారి స్వదేశీ కవిత్యోద్యమాన్ని గాంధీగారి స్వదేశీ మంత్రంతో మాత్రమే పోల్చగలం. గాంధీ, సోమనలిద్దరిదీ దాస్యభావజాలం నుంచి విముక్తిని సాధించటమే ఈ పోలికకు కారణం.

మార్గ-దేశీ కవితా రీతులు

“మును మార్గ కవిత లోకం/బున వెలయ (గ దేశి కవిత(బుట్టించి తెనుం/గును నిలిపిరంధ్ర విషయం/ బున) జన జాళుక్య రాజు మొదలగు పలువురు..” లోకం అంతా మార్గ కవిత వెలుగుతోంటే, చాళుక్య రాజులు ఇంకా మరికొందరు దేశికవితను తెలుగులో నిలిపారంటూ క్రీ.శ. 1128లో నన్నెచోడుడు మొదటిసారిగా దేశికవిత గురించి ప్రస్తావించాడు., పండరంగడి చేబ్రోలు శాసనంలో కూడా ‘మార్గ’, ‘దేశి’ పదాల ప్రస్తావన ఉంది. తిక్కన కాలం కూడా అప్పటిదే! జాయప సేనాని నృత్తరత్నావళి కూడా (క్రీ.శ. 1250?) కాకతీయ యుగం నాటిదే! ఆ రోజుల్లోనే సాంస్కృతికపరమైన స్వదేశీ ఉద్యమానికి మంచి ప్రారంభం జరిగింది. వీరి తరువాతి తరం వాడయినప్పటికీ, పాల్కురికి సోమనాథుడు ఈ దేశీయ భావానికి ఒక ఉద్యమ రూపాన్ని సంతరింపచేసి, నాయకత్వం వహించాడు.

‘మార్గ’, ‘దేశి’ అనేవి మౌలికంగా సంగీత నాట్యరీతులకు సంబంధించిన పదాలు. శారంగదేవుడు (క్రీశ.1230) సంగీత రత్నాకరంలో మార్గ, దేశీ భేదాలను పేర్కొన్నాడు. “మార్గ దేశీతి తద్ద్వేదా తత్ర మార్గ స ఉచ్యతే/యో మార్గో విరించాద్యైః ప్రయుక్తో భరతాదిభిః/దేవస్యపురతశ్శంభోర్నియతో~భ్యుదయప్రదః/ దేశేదేశే జనానాంయత్ రుచ్యా హృదయ రంజకం/గీతంచ వాదనం వృత్తం తద్దేశీత్యభిదీయతే” – గీతం, వాద్యం, నృత్తం – ఈ మూడింటినీ సంగీతం అంటారనీ, ఈ సంగీతం మార్గ, దేశీ భేదాలతో రెండు రకాలనీ, బ్రహ్మాదులచే మార్గితమై శంకర సమ్ముఖంలో భరతాదులచే సంస్కృతంలో ప్రయుక్త మైంది మార్గ సంగీతం అనీ, జనుల హృదయాలను రంజింపచేసే దాన్ని దేశీ అంటారనీ దీని భావం. (దేశి కవిత-ఆచార్య యస్వీ జోగారావు, ఆంధ్రా యూనివర్సిటీ ప్రెస్సు జనవరి 1979).

‘మార్గ’ ప్రస్తావన వాల్మీకి రామాయణంలో కూడా కనిపిస్తుంది. “తతస్తుతౌ రామవచః ప్రచోదితా/వ గాయతాం మార్గ విధాన సంపదా!/న చాపిరామః పరిషద్గతశ్మనై/ర్భుభూష యానక్తమనాభభూవహ!” గీతం, వాద్యం, నృత్తం ఈ మూడింటినీ సంగీతం అంటారు. ఈ సంగీతం ‘మార్గ’, ‘దేశి’ భేదాలతో రెండు రకాలుగా ఉంటుంది. మార్గ సంగీతం బ్రహ్మాదుల మార్గాన పండిత రంజకమైనదిగా ఉంటుంది. అలా కాకుండా కేవల సామాన్య జన రంజకమైనది ‘దేశి’ సంగీతం. పండితులకు మాత్రమే ఆనందం కలిగించే సంగీతానికి గౌరవం ఎక్కువ అనీ, పండితులు మెచ్చని, పామరులు మాత్రమే ఇష్టపడేది ‘దేశి’ అనే ఒక స్పష్టమైన విభజన ఈ శ్లోకాలలో కనిపిస్తుంది. ఆచార్య Hass లాంటి పాశాత్యులు ఈ నిర్వచనాల ఆధారంగా ‘మార్గ’ ను higher style అనీ, ‘దేశి’ని Lower style అనీ వ్యవహరించారు.

క్లాసికల్ అనే ఇంగ్లీషు పదానికి బెంగాలీలో ‘మార్గ’ అని వ్యవహరిస్తారు. బెంగాలీ భాషలో ‘మార్గ’ అంటే ఉత్తమమైనది. ఉన్మార్గ అంటే, నిషేధితం. హర్దేవ్ బహ్రి హిందీ నిఘంటువులో ‘మార్గ’ అంటే, దారి అనే అర్థంతో పాటు, తెలియనిది, కఠినమైనదీ, తికమకగా ఉన్నది లాంటి అర్థాలు కూడా కనిపిస్తాయి. జనసామాన్యంలో ‘మార్గ’ అంటే ఎలాంటి అబిప్రాయం ఉండేదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

నాట్యశాస్త్రంలో కూడా ఈ నిర్వచనాలు కనిపిస్తాయి. దశరూపకంలో ధనుంజయుడు (క్రీ.శ. 950) ప్రతీ పదానికీ భావాన్ని అభినయించే నృత్యాన్ని ‘మార్గ’ అనీ, నృత్తాన్ని ‘దేశి’ అనీ నిర్వచించాడు. నృత్త, నృత్య అభినయాలకు గల తేడాని ఈ నిర్వచనం చెప్తోంది.

నన్నెచోడుడు ‘మార్గ’, ‘దేశి’ పదాలను తెలుగు కవిత్వానికి ఆపాదించి, ఈ రెండు కవితారీతులకు గల తేడాలను విశ్లేషించాడు. హృదయ రంజకతనీ, హృదయోత్తేజాన్ని కూడా కలిగించటానికి ‘దేశికవిత’ ఉపయోగిస్తుందన్నవాడు నన్నెచోడుడు. ఆయన వాదాన్ని అందిపుచ్చుకొని, ‘దేశికవిత’ను ఉద్యమించి రాయాల్సిన అవసరం ఉందని భావించినవాడు పాల్కురికి సోమనాథుడు.

తెలుగులో దేశీయ సాంస్కృతిక ఉద్యమం

తమిళులు సంగ సాహిత్య సంపదనంతా తమ దేశి సంపదగానే చెప్పుకొంటారు. అది క్రీశ ఐదు లేక ఆరవ శతాబ్దాల నాటి సాహిత్య సంపదగా చరిత్రవేత్తలు భావిస్తారు. 9వ శతాబ్ది నాటి కన్నడ నృపతుంగుడి ‘కవిరాజ మార్గం’లో దేశికవితా ప్రసంగం ఉందనీ, నాగవర్మ కన్నడ ఛందోంబుధిలో మెల్వాడు, బాజనెగబ్బ, పాడుగబ్బా అనే దేశి రచనలు పేర్కొనబడ్డాయనీ ఆచార్య ఎస్వీ జోగారావు పేర్కొన్నారు. ఏ భాషలోనయినా మొదట ‘దేశి’ మాత్రమే ఉంటుంది. పండితుల కారణంగా ‘దేశి’ అడుగంటి ‘మార్గ’ వ్యాపిస్తుంది.

తెలుగునేల మీద ఊళ్ళ పేర్లను, మనుషుల పేర్లను సంస్కృతీకరించటం, చెన్నమల్లు అనే ద్రావిడ నామాన్ని శ్రీగిరీశ్వరుడుగా మార్చటం, గుంటూరును గర్తపురి చేయటం, ఏలూరుని ఏలాపురి చేయటం లాంటి వెన్నో జరిగాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే తెలుగు శబ్దాలు పూర్తిగా కనుమరుగై పోయి, సంస్కృతమయంగా మారిపోయే ప్రమాదం ఏర్పడిందానాడు.

మాకు తెలుగు రాదనటం ఇవ్వాళ ఎలా ఘనమైన విషయంగా చెప్పుకొంటున్నామో అలానే వెయ్యేళ్ళ క్రితం కూడా మనవాళ్ళు చెప్పుకొన్న పరిస్థితి. సంస్కృతం మధ్యతరగతి తెలుగు ప్రజలను అంతగా ప్రభావితం చేసింది. ఆ పరిస్థితుల్లో సంస్కరణ వాదులకు దేశి భావన కలిగి ఉండాలి.

కవి జనాశ్రయంలో: “వెలయంగ దెనుఁగు బాసకుఁ/దలమయ్యెడు సిసములును దర్వోజలు గీ/దులు నక్కరలును ద్విపదలు/పాలు పొందగ రేచఁడిష్టమున నొనరించున్” అనే పద్యం వలన తెలుగు భాషకు స్వదేశీ ఛందస్సు ఉందని అర్థం అవుతుంది.

బండారు తమ్మయ్యగారు ఛందస్సుని బట్టి ఏది దేశీ, ఏది మార్గ అనేది నిర్ణయించవచ్చన్నారు. కందం గీతం మొదలైన వృత్తాలు స్వదేశీయమని ఆయన పేర్కొన్నారు.

పండరంగని అద్దంకి శాసనం (క్రీ.శ. 848)లో కనిపించే తరువోజ పద్యాలు గుణగ విజయాదిత్యుని కందుకూరి శాసనం (క్రీ.శ. 9) లో సీసపద్యాలు, యుద్ధమల్లుడి బెజవాడ శాసనం (క్రీ.శ. 898-934)లో మధ్యాక్కర పద్యాలు ఒకే కాలంలో మనకు దొరకటం వలన క్రీ.శ. 9-10 శతాబ్దాల కాలంలో తెలుగు మాత్రా ఛందోబద్ధ రీతి గౌరవప్రదంగా జనాదరణ పొందిందని అర్థం అవుతోంది.

బహుశా జైన బౌద్ధాల పతనం తరువాత వైదిక ధర్మాల వ్యాప్తి, సంస్కృత ప్రాబల్యం జనసామాన్యాన్ని కూడా బాగా ప్రభావితం చేసిన కారణంగా తెలుగు ద్వితీయ స్థానానికి దిగి ఉంటుంది. సోమన కాలానికి నన్నయాదుల చంపూ రీతి బహుళ వ్యాప్తిలో ఉండి ఉంటుంది. అందుకు భిన్నంగా దేశీయ భాషేతివృత్త ఛందో రీతుల్నీ ద్విపద కావ్య మార్గాన్ని తీర్చి దిద్దే ప్రయత్నం పాల్కురికి సోమనాథుడు చేయవలసి వచ్చింది.

శాస్త్రాలనూ, శాస్త్రార్థాలనూ వివరించటానికి తెలుగు ఛందో రీతులు చాలవనే అభిప్రాయాన్ని ఖండించటానికే ద్విపదలో బసవపురాణం, పండితారాధ్యుల చరిత్రలను సోమన వెలువరించాడు. శ్రుతి స్మృతి పురాణేతిహాసాలలో అపారమైన పరిజ్ఞానం లేకుండా కేవల భాషాభిమానంతో చేసిన రచనలుగా వాటిని ఎవరూ భావించలేరు.

సొమనాదుల జానుతెనుగు

తెలుగు సాహిత్యంలో 11000 నుండి 1225 వరకు శివకవి యుగం అంటారు. నన్నయకు, తిక్కనకు ఇది సంధియుగం. తెలుగు నేల మీద కాకతీయుల పాలన సుస్థిరమౌతున్నకాలం. నన్నెచోడుడు, పాల్కురికి సోమనాధుడు, మల్లికార్జున పండితారాధ్యుడు ఈ యుగంలో శివకవిత్రయం. నన్నయ కాలంలో వచ్చిన సంస్కృత పద భూయిష్ట సాహిత్యానికి వ్యతిరేకంగా మొదట శంఖం పూరించిన వాడు నన్నెచోడుడు. దానిని ఉద్యమం చేసిన వాడు సోమనాథుడు

‘జానుతెనుగు’, ‘వస్తుకవిత’ అనే పదాలను పరిచయం చేసినవాడు నన్నెచోడుడే!

కన్నడ భాషలోంచి ‘జాణ్ నుడి’ (చమత్కారమైన నుడి) పదాన్ని తీసుకొని, జాను తెనుగు అనే ఒక కొత్త ఆలోచనను కవుల ముందుంచాడు. కన్నడంలో నాగవర్మ, గుణవర్మలు జాణ్ నుడి రచనకు ప్రసిద్ధులు. తిరుల్ కన్నడం (సారవంతమైన కన్నడం) గా జాన్నుడికి కన్నడిగులు కావ్యగౌరవం ఇచ్చారని జోగారావు గారు పేర్కొన్నారు. భాషా ఛందస్సులు, భావజాలం, వర్ణనలు, జాతీయాలు సంస్కృత ప్రభావానికి లోను కాకుండా వెలయించిన స్వచ్చమైన దేశికవిత ‘జానుతెనుగు కవిత’ అవుతుందని నన్నెచోడుడి నిర్వచనంగా కనిపిస్తుంది.

పండిత పాఠకులు చదివి మెచ్చేది మార్గ కవిత, పామర జనం విని మెచ్చేది దేశి లేదా జానుతెలుగు కవిత అనే భావనని వ్యాపింప చేసే ప్రయత్నం నన్నెచోడుడి ప్రేరణతో ఒక ఉద్యమంగా ప్రారంభమయ్యింది.

“సరళము కాగ భావనలు జాను తెనుంగున నింపు విరింగొన వర్ణన”లతో కుమార సంభవ కావ్యాన్ని తాను రచిస్తున్నట్టు ఆ కావ్య అవతారికలో నన్నెచోడుడు చెప్పుకొన్నాడు. అందరికీ అర్థం కావటం, అది ఇంపు పెంపుగా ఉండటం అనేవి జాను తెనుగు లక్షణాలుగా ఆయన భావించాడు. జనం మాట్లాడుకొనే భాష, జనం చెప్పుకొనే విషయాలతోనే జానుతెనుగులో చిత్రితమై దేశికవిత రూపొందుతుందన్నాడు. అటు ‘మార్గ’ ఇటు ‘దేశి’ రెండింటిలో ఏదో ఒకటే నిర్ణయించుకోవాలని కవులకు సూచించాడు. సంస్కృతం, తెలుగు పదాలతో సంకర సాహిత్యాన్ని సృష్టించేవారిని ‘దుర్మార్గ’ కవులుగా నిరసించాడు (కు. సం. 1-28). సంస్కృత పదాలను గుప్పించి చివర డు ము ఉ లు చేర్చే కవిత్వం ప్రజలకు చెందనిది అవుతుందని భావించాడు.

“తండులాలు గృహమందు నసంతి, దిండికైతే పదిమంది వసంతి” – అనే వ్యంగోక్తి తెలుగు సంస్కృత సంకరాలకు కావ్య గౌరవం దక్కే పరిస్థితులు ఏర్పడ్డాయి. “టెంపుల్‌కి వెళ్ళి కోకోనట్ బ్రేక్ చేసిరా” లాంటి సంకర వాక్యాలు ఇప్పుడు గొప్పవిగా చెలామణి అవుతున్నట్టే వెయ్యేళ్ళ క్రితం సంస్కృత వెర్రి వ్యామోహాలు తెలుగును హీనపరచటం మొదలు పెట్టాయి. సరిగ్గా నేటి పరిస్థితి నాటి పరిస్థితికి నకలుగా ఉంది.

ఆనాడు సంస్కృతవ్యామోహం, ఈనాడు ఇంగ్లీషు వ్యామోహం అంతే తేడా! ఇప్పుడీ నేరాన్ని గ్లోబలైజేషన్ మీదకు నెట్టేస్తున్నాం గానీ, మన తత్వంలోనే, మన రక్తంలోనే ఈ పరభాషాదాశ్యం అనేది అంతర్లీనంగా ఉన్నదనాలి.

‘మార్గ- దేశీ’ అనే వ్యాసంలో డా వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు “యీ మిశ్రభాషా కవితా కల్పనాసక్తికి మూలం బహుభాషా జ్ఞానమే కాని వేరు కాదు” అన్నారు. బహుభాషా జ్ఞానానికి పరబాషా వ్యామోహం కూడా తోడయ్యిందనే వాస్తవం దాస్తే దాగేది కాదుగదా!

వీరశైవ దీక్షితుడు సోమన

పాల్కురికి సోమనాథుడు 1160-1230 కాలంవాడు కావచ్చును. వరంగల్లు సమీపంలోని పాల్కురికి గ్రామంలో శ్రియా దేవి, విష్ణురామ దేవుడు అనే దంపతులకు జన్మించాడు. జన్మతహా బ్రాహ్మణుడైనా, వీరశైవ మతం మీద అనురాగంతో గురువు కట్టకూరి పోతిదేవర వద్ద శైవాగమ ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు, వీరశైవ దీక్షను తీసుకుని వీర మహేశ్వర వ్రతుడిగా మారాడు.

తల్లిదండ్రులు జన్మనిచ్చిన కులాన్ని వదలి శివపార్వతుల్నే తల్లిదండ్రులుగా భావించటం వీర మహేశ్వర వ్రతం. వీళ్ళని జంగమ దేవరలంటారు. కులగోత్రాల పట్టింపు ఉండదు. ఈ కారణంగానే అంటరాని తనాన్ని పాటించే అగ్రకులాలను కులం పేరుపెట్టి తిట్టగలిగాడు.

“కులజుండు నతడే యకులజుండు నతడె
కులము లేకయు నన్ని కులములు నతడే”

అని గట్టిగా నమ్మినవాడు సోమనాథుడు. “ప్రజలకోసం అతడు పుట్టాడు-ప్రజలే అతడిని అమరకవిని చేశారు” అంటారు సమగ్రాంధ్ర సాహిత్యంలో ఆరుద్ర!

సాంస్కృతికంగా అప్పటికే బౌద్ధం, బలహీనపడిన స్థితిలో ఉన్నాయి.

“జైన బౌద్ధ చార్వాక దుష్పథ సమయములు
మూడును నిర్మూలము జేయుదనుక
మూడు రాలను వైతు ముప్పొద్దు నిన్ను” అనీ,

“వసుధలో జినులనువారి నందరను/ నేలపాలుగజేసి”

అనీ సోమనాథుడు బసవపురాణంలో ముప్పేట దాడులు ఎలా చేయవలసి వచ్చిందో వివరించాడు.

“జైనులు, బౌద్ధులు రంగంనుంచి దిగజారిపోయిన తర్వాత మతోన్మాద గదాయుద్ధానికి వీరశైవ, వీరవైష్ణవులే మిగిలిరి. వీరు పరస్పరము తిట్టుకున్న తిట్లే ఒక చేట భారతమగును” అని సురవరం ప్రతాపరెడ్డిగారు సోమన కాలంనాటి పరిస్థితులను వివరించారు. కర్మచండాలురు, వ్రతభ్రష్టులు, దుర్జాతులు, పశుకర్ములు, బాపన కూళలు,.. ఇవన్నీ వైష్ణవులను తిట్టడానికి ఉద్దేశించినవే.

కాకతీయప్రభువుల మద్దతు శైవులపక్షాన ఉంది. రాజాదరణతో గోలకీ మఠాలను సాధించుకున్నారు. శివదీక్షను స్వీకరించిన బ్రాహ్మణులు గురుస్థానాలు పొందారు.

కానీ, అప్పటిదాకా శివాలయాల్లో పూజారులుగా ఉన్న తంబళ్లను తొలగింపచేసి, వారి స్థానంలో ఈ బ్రాహ్మణ గురువులు పూజారులయ్యారని సురవరం వారు పేర్కొన్నారు.

సోమన కాలానికి ఈ భాషాదాస్యం మరింత ముదిరింది. అప్పటికే సువ్యవస్థితమైన ఛందోరీతులు తెలుగులో అనేకం ఉన్నప్పటికీ, అవి నిరాదరణకు గురి కావటం వలన, భాషాభిమానంతో పూనుకోకపోతే తెలుగును కాపాడు కోవటం కష్టం అనే పరిస్థితి వచ్చేసింది. “అల్పాక్షరముల ననల్పార్థరచన కల్పించుటయు కాదె కవి వివేకంబు..?” అని మరో అడుగు ముందుకేసి ప్రశ్నించాడు సోమన.

“బలుపోడతోలు సీరమును బాపసరుల్ గిలుపారు కన్ను వె
న్నెలతల సేదుకుత్తుకయు నిండిన వేలుపుటేరు వల్గుపూ
సల గల రేని లెంకనని జానుదెనుంగున విన్నవించెదన్
వలపు మదిం దలిప్ప బసవా బసవా బసవా వృషాధిపా”

వృషాధిపశతకంలో సోమనాథుడు స్వదేశీ జానుతెనుగు స్వరూపం ఎలా ఉంటుందో రుచి చూపించాడు. నన్నయది ధ్వని ప్రధాన కవిత. సోమనది రస ప్రధాన కవిత. సోమన, శివునిపట్ల ముగ్ధభక్తి ప్రచారం చేస్తే, సమాంతరంగా వైష్ణవులు మధురభక్తిని ప్రచారం చేశారు.

దేశిభాషలో ప్రజాసాహిత్యోద్యమం

పొట్టయిన రత్నంబు చుట్టును పసిడి కట్టిన భావనగా సోమన ద్విపదకు కావ్య గౌరవాన్ని సాధించాడు.

అప్రమాణమనీ, అనాద్యమనీ, ముదిలంజ దిడ్డికంతలనీ ద్విపదను ఎవరెంత ఈసడించినా ఆ దేశిఛందస్సులోనే ఆయన పెద్ద కావ్యాలను నిర్మించాడు.

సంస్కృత భావ జాలంలోచి బయట పడగలిగితేనే దేశి భాష బాగు పడుతుందని ప్రబోధించాడు.

మన పెళ్ళీ, పేరంటాలకూ, పుట్టుకకూ, చావుకూ దేనికీ తెలుగుని పనికి రాకుండా చేయటాన్ని ఖండించాడు.

దేవుణ్ణి స్వంత భాషలో స్వంత పద్ధతిలో ఆరాధించుకోవాలని సూచించాడు. అందుకు అడ్డుపడే బ్రాహ్మణవర్గం పట్ల తన వ్యతిరేకతను స్పష్టంగానే ప్రకటించాడు.

తన భావాలను వెల్లడించటానికీ, పరమత ఖండనానికి, స్వమత స్థాపనకూ జనభాషలో సాహిత్య సృష్టిచేయటం ఒక సాధనంగా చేసుకున్నాడు.

“దెలుగు మాటలనగ వలదు, వేదముల కొలదియు కాజూడుడిల నెట్టులనిన..” అంటూ తెలుగు మాటలు వేదములతో సమానమన్నాడు.

తెలుగే దేవభాషగా ఆయన సంభావించాడు.

జన వశీకరణకు అమ్మభాషే శరణ్యం అన్నాడు.

అసలైన ప్రసన్న కథా కలితార్థ యుక్తి కలగలసిన రీతిలో కథ చెప్పే విధానాన్ని అవలంభించాడు.

దేశి భావ జాలాన్ని, దేశి జీవన విధానాన్ని, దేశిభాషను ప్రతిబింబించే ప్రజా సాహిత్య ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు.

వస్తువులో కొత్తదనం తీసుకువచ్చాడు. తెలుగు నుడికారాన్ని, తెలుగు ఛందస్సును, తెలుగు శబ్దజాలాన్ని కలిగి ఉండటం మాత్రమే కాదు, అందులో సామాన్యుడు వస్తువుగా ఉన్నప్పుడే అది దేశి కవిత అవుతుందన్నాడు.

అత్యంత సామాన్యుల్లో అసామాన్యులైన శివభక్తుల జీవితాలను భక్తి సూత్రాలతో బంధించి చిత్రించే ప్రయత్నం చేశాడు.

తెలుగుదనాన్ని తేట తెల్లంచేస్తూ, “జాతులు రీతులు నేతులుట్టంగ” దేశికవితను తీర్చిదిద్దాడు.

దుర్గవ్వ, కిన్నెర బ్రహ్మయ్య, బెజవాడ కుమ్మరి గుండయ్య, మడివాలు మాచిదేవయ్య, కన్నప్పగా ప్రసిద్ధుడయిన తిన్నడు, మౌళిగ మారయ్య, ముసిడి చెన్నయ్య, మాల శివనాగుమయ్య, మేదర క్షేత్రయ్య, చెన్న మల్లన్న లాంటి సామాన్యు లెందరినో ప్రధాన పాత్రలుగా చిత్రించి వారి చరిత్రలు వెలుగులోకి తేవటానికి ఈ స్వదేశీ భావనని ఉపయోగించుకొన్నాడు.

వర్ణవ్యవస్థని కోరే సంస్కృత సాహిత్యాన్ని నిరసించాడు.

అసమాక్షు కొలవని అగ్రజుండైనా వసుధ మాలల మాలవాడు కాకెట్టు? అని ప్రశ్నించాడు.

శివుని కొలవడం అంటే కులమతాలు పాటించకపోవటం, వర్ణవైషమ్యాలు వదిలేసుకోవటం, వైదిక క్రతువులను అంగీకరించకపోవటంగా ఆయన ప్రచారం చేశాడు.

“వేద భరాక్రంతులనగబడిన బ్రాహ్మణ గార్ధబంబులతోడ ప్రతిసేసి యాడిన పాపంబు వచ్చు”నంటాడు.

అంటరానితనాన్ని పాటించే బ్రాహ్మణులను మెడలో త్రాడు మాలలుగా ఉన్న-తాటిమాలలు-అని నిరసించాడు.

పాల్కురికి సోమనాధుడు శివుని ప్రమధ గణాలలో ‘భృంగి’ అవతారమని నమ్ముతారు. ఇతర బ్రాహ్మణ శివకవులకు భిన్నంగా పాల్కురికి సోమనాధుడు బ్రాహ్మణుల ఆచార వ్యవహారాలను నిశితంగా విమర్శించాడు. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి “శివకవులు భవికవులను గర్హించిరి. కవితలో కూడా వారు వేరు మతము వారయిరి.” అని వ్యాఖ్యానించారు.

నన్నయ, వైదిక మతోద్ధరణ తన గురుతర బాధ్యతగా భావిస్తే,. సోమన వైదిక ధర్మాలను తుదముట్టించి కుల వర్ణ బేదాలు లేని సమ సమాజ నిర్మాణాన్ని తలపెట్టాడు. వ్యక్తిగా, పాలకుడిగా కన్నడ ప్రాంతాలలో బసవన్న సాధించిన విజయాలను, తెలుగు నేలమీద సోమన తన సాహిత్యం ద్వారా సాధించాడు. పాడుకునేందుకు తెలుగువారికి ద్విపద, ఛందస్సును కానుకగా ఇచ్చాడు.

(సశేషం)

Exit mobile version