Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అభ్యాసం

[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘అభ్యాసం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

మానవత్వం నాలో అంకురించిన
క్షణం నుండే
సంఘాన్ని లోతుగా సందర్శించడం నేర్చుకున్నాను!

సామాజిక పరిసరాల
పారదర్శక పరిశీలన వలన
కవితాత్మ నాలో సంజనించిన
క్షణం నుండే
దుర్మార్గాలపై దురుసుగా గర్జిస్తూ
దురాచారాలతో నిర్భయంగా
ఘర్షిస్తూ
సధ్ధర్మాన్ని స్థాపించడం నేర్చుకున్నాను!
మంచిని ప్రోత్సహిస్తూ,
మంచికి ప్రోపు నిస్తూ,
కాపునిస్తూ
సత్ఫలితాలను సాధించడం నేర్చుకున్నాను!

అంతర్లోచనాల లోకనాల
అతులిత వేగవంత సంకల్పానికి
సమీపించలేని దూరాలేముంటాయి?
బాధితులు
ఏ దవ్వుల నెలవులలో ఉన్నా గుర్తించి
సహాయ సహకార అనునయ అక్షరాలతో
ప్రేమగా వారి హృదయాలను
స్పర్శించడం నేర్చుకున్నాను!

ప్రపంచ సంక్షేమం కోసం
ప్రాణుల సంతోషం కోసం
అనంత అక్షరమాలాకాశమై
శుభాలను వర్షించడం నేర్చుకున్నాను!

Exit mobile version