[డా. బాలాజీ దీక్షితులు పి.వి. రచించిన ‘అభిసారిక’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
విప్పారిన కలువలు
నీ చూపులు
నా ఎదమాటున చేసే
సందడి.. అంత.. ఇంత కాదు
గులాబీ రేకులు
నీ పెదవులు
ఏదో అమృతం ధారతో నను తడిపి
చేసే ఆనందం.. అంత.. ఇంత కాదు
నీలో
పొంగులు పాల ధారలా
వంపుల నుండి కారుతూ
నిప్పుల ఎదను
సొంపుల పొదను
నిలువెల్లా తడిపిన.. నిను చూస్తూ
నాలో జరిగే
యవ్వన సందడి.. అంత.. ఇంత కాదు
నీవు అభిసారికవని
నా భావ మరీచికవని
నీవు జలపాతపు జాతరవని
నా భావ చంద్రికవని
ఆనందపడి
ప్రేమ జాగారం చేస్తున్నా.. నీ కోసం
డా. బాలాజీ దీక్షితులు పి.వి. హోమియోపతి వైద్యునిగా, కవిగా, గెస్ట్ లెక్చరర్‌గా, వ్యక్తిత్వ వికాస నిపుణినిగా, కౌన్సిలింగ్ సైకాలజీస్ట్గా ఇలా ఎన్నో రంగాలలో విశిష్టత చాటుకున్నారు. డా. దీక్షితులు ఇప్పటి వరకు 58 జాతీయ,అంతర జాతీయ పరిశోధనా పత్రాలు ప్రచురించారు. ఇప్పటికి 10 పరిశోధనా సమావేశాలలో పాల్గొన్నారు, దాదాపు 90 తెలుగు రచనలు వివిధ పత్రికలలో ప్రచురితం అయినాయి. వీరి సేవ మరియు ప్రతిభను గుర్తించి యూనివర్సిటీ అఫ్ సోత్ అమెరికా డాక్టరేట్ 2016లో ఇచ్చింది. ఇవిగాక అనేక అవార్డ్స్, రివార్డ్స్ అనేక సంస్థలు అందించాయి.