Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అభిమానం వెర్రితలలు

[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘అభిమానం వెర్రితలలు’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

“ఏవండీ, పక్కింటి ఆవిడ గొప్పగా ఎదురింటిలోకి కొత్తగా వచ్చిన హాస్య రచయిత జలధర్ గారితో ఫోటో దిగి వాట్సాప్‌లో పెట్టింది. నా అభిమాన రచయిత అని మళ్ళీ ఆ ఫోటోతో పాటే వ్రాయడం ఒకటి. ఎలాగైనా ఆయనతో పాటు నేను కూడా ఫోటో దిగాలి” అంది ఉక్రోషంగా.

“సరే వెళ్లి పరిచయం చేసుకుని ఫోటో దిగు, నీకు కూడా ఆయన అభిమాన రచయితే కదా” అన్నాడు శేఖరం.

“ఇందాకే వెళ్లానండి. ఆయన లేరు, అతని శ్రీమతి ఉన్నారు. ఎక్కడికో సభకి వెళ్ళారట. ఓ అర్ధగంటలో వస్తారు అని చెప్పిందావిడ. లోనికి వచ్చి కూర్చోమంది గానీ, మళ్ళీ వస్తానని నేనే తిరిగి వచ్చేసాను. మీరు ఆ గుమ్మం వైపు ఒక కన్నేయండి, ఆయన కారు గానీ వస్తే, నాకు చెప్పండి, ఒక్క అంగలో వెళ్ళి వచ్చేస్తాను” అంది ఉత్సాహంగా.

“సరే లలితా, అలానే చూస్తాను. అతను రాగానే చెప్తానులే” అంటూ పేపర్‌లో తల దూర్చి చదువుతూ, అప్పుడప్పుడూ అలా ఒకసారి గుమ్మం వైపు వెళ్లి చూస్తున్నాడు, అతని కారు వచ్చిందేమోనని. తర్వాత కొద్ది నిమిషాలకి అతను రావడం గమనించి, “లలితా” అంటూ ఓ గావు కేక పెట్టాడు.

ఆ అరుపు విని అళ్ళిపోయి “ఏమైంది” అంటూ వంట గదిలోంచి హాల్లోకి పరిగెత్తుకుని వచ్చింది లలిత, చేతిలో గరిటతో సహా.

“ఏమీ లేదు, నీ అభిమాన రచయిత ఇప్పుడే బయటికి వెళ్లి వచ్చేసాడు. త్వరగా వెళ్ళు, లేదంటే అటు, ఇటు వెళ్లి పోగలడు” అని చెప్పగానే,

“అలాగే” అంటూ మొహం కర్చీఫ్‌తో కస కసా తుడుచుకుని, తప తపా కొంచెం పౌడర్ అద్దుకుని, టక, టకా అడుగులు వేస్తూ, చక చకా ఎదురింటికీ పరుగు తీసింది.

తర్వాత ఓ పది నిమిషాలకి, ఉత్సాహంగా గోడకి కొట్టిన బంతిలా తిరిగి గెంతుకుంటూ వస్తూ, “ఏవండీ, నేను రెండు ఆటోగ్రాఫ్‌లు, నాలుగు ఫోటోలు దిగాను. ఆవిడ కంటే రెట్టింపు. ఇప్పుడే ఫోటోలు వాట్సాప్‌లో కూడా పెట్టాను చూడండి.” అంది ఉబ్బితబ్బిబ్భైపోతూ.

“అలాగా, మంచిదే”. అన్నాడు శేఖరం.

తరువాతి రోజు పొద్దున్న, పక్కింటావిడ స్టేటస్ చూసి, “ఏవండీ” అని గావు కేక పెట్టి. “పక్కింటావిడ స్టేటస్ చూసారా” అడిగింది ఏడుపుగొట్టు మొహంతో.

“ఆ చూసాను. పొద్దున్నే వెళ్లి, ఆవిడ అభిమాన రచయితకి రాఖీ కట్టి వచ్చిందట. అది కూడా వెండి రాఖి ఇచ్చినట్టుగా, మన కాలనీ గ్రూప్లో గొప్పగా పెట్టింది. అలాగే ఆవిడ స్టేటస్ నిండా ఆ ఫొటోలే పెట్టిందిలే, చూసాను” అన్నాడు

లలిత అసహనంతో ఊగిపోతూ, “ఆవిడేనా పెట్టేది. నేను పెట్టలేనా, నేను రాఖీ కట్టలేనా, నేను కూడా వెళ్తాను” అని పరుగును వెళ్లి రాఖీ కట్టి వచ్చిన లలిత, తన వాట్సాప్ స్టేటస్‌లో, ఆమె రచయిత గారితో దిగిన ఫోటోలు పెట్టింది. అవి చూసిన శేఖరం, “స్టేటస్‌లో ఫోటోలు బావున్నాయి” అన్నాడు

ఆ మాటలకి ఇంకా పెట్రేగిపోతూ, “మరి ఏమనుకున్నారు? ఆవిడ వెండి రాఖీ కట్టి ఐదు తెచ్చుకుంటే, నేను బంగారు రాఖీ కట్టి పదివేలు తెచ్చుకున్నాను. ఆయన కూడా నన్ను ఎంతో అభిమానంగా పలకరించారు. ఆ తర్వాత, వస్తూ ఉండండి చెల్లెమ్మ అన్నారు. అది చాలదూ” అందామె గర్వంగా.

ఆ మరుసటి రోజు పొద్దున్న కళ్ళు నులుముకుంటూ, “లలితా టీ పట్టుకురా” అన్నాడు.

గిన్నెలు తోముతున్న పనమ్మాయి, “అమ్మగారు లేరండి, పొద్దున్నే ఎదురింటి రచయిత గారిని కలవడానికి వెళ్లారు. ఇవాళ స్వాతంత్ర దినోత్సవం అంట కదా, జాతీయ జెండా ఆయన జేబుకు గుచ్చి ఓ ఫోటో దిగి వస్తానని చెప్పి వెళ్లారు” చెప్పిందామె.

“సరే, సరే” అని శేఖరం అంటుండగానే, మెరుపు లేని ఉరుములా, పెద్ద గొంతుతో,

“ఏవండీ, ఒక చిన్న జెండా బొమ్మ ఆయన జేబుకి గుచ్చి, ఓ ఫోటో దిగి వచ్చాను. ఆయన కథా సంపుటి కూడా చేతిలో పెట్టారు. దాంతో కూడా ఫోటో దిగాను. ఫోటోలు అందంగా వచ్చాయి. లేకపోతే, ఎప్పుడూ ఆవిడే మొదట వెడుతుందా? ఈసారి నేను ముందు పెట్టాను” విజయ గర్వం తొంగి చూసింది ఆమె మాటల్లో.

“నీ వాట్సాప్ స్టేటస్ చూసి ఏమైపోతుందో”, తాన తందనాన పాడాడు శేఖరం.

ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ పక్కింటావిడ కూడా స్టేటస్‌లో నాలుగు ఫోటోలు అతని జేబుకు జెండా గుచ్చుతూ పెట్టింది .

నాలుగు రోజుల తర్వాత, “ఏవండీ రేపు మాత్రం మర్చిపోవద్దు. వినాయక చవితి రోజు, ఉండ్రాళ్ళు పట్టుకుని పొద్దున్నే వారి ఇంటికి వెళ్ళాలి. ఆ ఉండ్రాళ్ళు ఇచ్చేసి, ఆ తర్వాత వినాయక చవితి శుభాకాంక్షలు అవీ చెప్పేస్తాను. తర్వాత పూజకు మన ఇంటికి రమ్మని కూడా పిలుస్తాను. ఆల్రెడీ, ఈసారి పూజకు మన ఇంటికి రావాలని జెండా పండుగ రోజు మరీమరీ చెప్పాను లెండి” అంది.

“అలాగా! ఆయన మన ఎదురింటికి రావడం ఆయన దురదృష్టం. అందరికీ హాస్యం పంచే ఆయన, మీ బారినపడి ఇలా విషాదంలో” అంటూ లలిత ఎర్రబడిన మొహం చూసి టక్కున ఆపేసి ఒక చిన్న పిచ్చి నవ్వు నవ్వాడు శేఖరం.

అన్నట్టుగానే, ఆ మరుసటి రోజు పొద్దునే లేచి, అతనికని చేసిన కొన్ని ఉండ్రాళ్ళు పట్టుకుని, రచయిత వాళ్ళ ఫ్లాట్‌కి వెళ్ళింది. వాళ్ళింట్లో పనిచేస్తున్న పనిమనిషి, “అయ్యగారు లేరండి, నిన్న రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు” చెప్పింది.

“అదేమిటి ఇలా హఠాత్తుగా వెళ్ళిపోయారు. మరి అయన అడ్రస్సు ఉందా” అడిగింది.

“పొద్దున్న మీ ఇంటి పక్కనుండే ఆవిడ కూడా నన్ను అడ్రస్ అడిగింది. కానీ సార్ అడ్రస్ ఏమీ చెప్పలేదు”. చెప్పడంతో “నాకు ఆ మాత్రం తెలీదా, ఆయన ఏమైనా చిన్న రచయితా ఏంటి, నేను కనుక్కుంటానులే” అంటూ జడ విసురుగా విసిరి వెళ్ళిపోయింది.

“అంటే, ఆయనకు అక్కడ కూడా ప్రశాంతత ఉండనివ్వరా వీళ్ళిద్దరూ. అభిమానం వెర్రితలలు వేయడం అంటే ఇదే అనుకుంటాను” అని పనిమనిషి చీపురుతో ఆ ఇల్లు ఊడవడం కొనసాగించింది.

Exit mobile version