Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అబద్ధం

[మాయా ఏంజిలో రచించిన ‘The Lie’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు ప్రసిద్ధ కవయిత్రి హిమజ గారు. కొంతకాలపు సహజీవనం విచ్ఛిన్నం అవుతుంటే ఒక యువతిలో కలిగే భావోద్వేగం ఈ కవిత. తన స్వాభిమానం, అహం దెబ్బ తినకుండా మరొక ప్రేమికుడిని వెతుక్కునే క్రమంలో ఆ యువతి బాధ, ఆతృతని కొన్ని పంక్తుల్లో ఎంతో అర్థవంతంగా అందించిన కవిత ఇది.]

~

వాళ నువు నన్ను
విడిచిపెట్టి వెళ్ళిపోతానని
బెదిరించావు
తిట్లు, శాపనార్థాలు
నా నోటి నుంచి ప్రవహించకుండా
ఎలాగో నిగ్రహించుకున్నాను
లేదంటే నువ్వు వెళ్ళే దారంతా
మన మధ్యన ఏర్పడిన
ప్రేమ తడి ఎంత మాత్రం లేని
చీలికలు, అగాధాలన్నీ
నా వేదనతో, కోపంతో
నిండిపోయి ఉండేవి

నిన్ను దూషిస్తూ దాడి చేసి
చించి పోగులు పెట్టాలన్నంత ఆవేశాన్ని
పళ్ళబిగువువున,
పెదాల మాటున దాచేసాను

కన్నీళ్ళు పుష్కలంగా
వసంత మేఘాల్లాగా కురుస్తున్నాయ్
గొంతులో వేదన సుళ్ళు తిరిగి
బాధ ఏ మూలో గుడగుడలాడుతుంది

వెళ్ళిపోతున్నావా నువ్వు..?

అయ్యో.. ఏం చెప్పను
నువు సర్దుకోవడంలో
నీకు సహాయం చేస్తాను
కానీ.. ఆలస్యమవుతోంది
తొందరలో ఉన్నాను..
త్వరపడాలి నేను.. లేకుంటే అతన్ని కలవడం కుదరదు నాకు

నేను తిరిగొచ్చేసరికి
నువ్వెళ్ళిపోయావని తెలుస్తుంది నాకు
ఓ కాగితం ముక్క రాసి ఉంచు..!
ఓ ఫోన్ కాల్ అయినా..!!

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


‘Maya Angelou’ అమెరికన్ కవయిత్రి, సామాజిక కార్యకర్త, మానవ హక్కులకై పని చేసారు. ఆనాటి అమెరికన్ సమాజం, ఆఫ్రికన్ అమెరికన్ వేశ్యా వాటికల పట్ల చూపిన వివక్ష, నిరసన, ఏహ్య భావాన్ని నిలదీస్తూ, ధిక్కరిస్తూ, బాధితుల పక్షం వహించి Maya Angelou అనేక కవితలు వెలువరించారు.

ఏప్రిల్ 4, 1928 న Marguerite Annie Johnson గా జన్మించిన ఆమె, తన సోదరుడు ముద్దుగా పిలిచే ‘మాయ’ అనే పేరుకు ‘ఏంజిలో’ ని జత చేసి ‘మాయా ఏంజిలో’గా ప్రపంచ ప్రసిద్ధ రచయిత్రిగా రూపొందారు.

బాల్యంలో తాను అత్యాచారానికి గురైన విషయం, పేదరికం కారణంగా కొంతకాలం సెక్స్ వర్కర్‍గా పని చేసిన విషయం నిస్సంకోచంగా, నిర్భీతిగా తన రచనల ద్వారా తెలిపిన మాయా ఏంజిలో రచనలు – దార్శనిక ఆత్మకథా శైలిలో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈమె కవిత్వం సంభాషణా సరళిలో ఉండటం విశేషం.

రచయిత్రి, కవయిత్రి, నర్తకి, గాయని, ఉద్యమకారిణి, కథకురాలు, దర్శకురాలు ప్రతిభావంతమైన పాత్ర పోషించిన మాయా 2014లో మరణించారు.

Exit mobile version