[శ్రీమతి భావరాజు పద్మినీ ప్రియదర్శిని గారి ‘ఆఁయ్! మాది నర్సాపురఁవండి’ కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
ప్రముఖ రచయిత్రి, ప్రచురణకర్త శ్రీమతి భావరాజు పద్మినీ ప్రియదర్శిని గారి తాజా కథాసంపుటి ‘ఆఁయ్! మాది నర్సాపురఁవండి’. ఈ పుస్తకానికి ‘మా నర్సాపురం కథలు’ ఉపశీర్షిక.
పేరుని బట్టే అర్థమవుతోంది, ఇది గోదావరీ తీర పట్టణం నర్సాపురం వాసుల కథలని!
గోదావరి ప్రాంతమనగానే – ఆప్యాయంగా పలకరించే మనుషులు.. మనుషుల మధ్య మమతలు, చక్కని ఆలయాలు, నోరూరించే టిఫిన్లూ.. ఓ ప్రత్యేకమైన యాస, సంభాషణా చాతుర్యం, కూస్తంత వెటకారం – స్ఫురిస్తాయి.
పైగా నర్సాపురం రేవు, అక్కడి ఓ భవంతి సినిమాల ద్వారా తెలుగువారికి చిరపరిచితమే.
ఈ సంపుటిలో 21 కథలున్నాయి. మొదటి కథ ‘ఆఁయ్! మాది నర్సాపురఁవండి’లో నరసాపురం ప్రాముఖ్యతనీ, చరిత్రని గత వైభవాన్ని చెప్తారు రచయిత్రి. కోనసీమకి ముఖద్వారం లాంటిదని అంటారు.
‘కిరసనాయిలు పంతులుగారు’ కథలో ఆ పేరుతో పిలవబడే ఆదూరి భాస్కర్రావు గారి కథ చెబుతారు. వారి ఆస్తులు, వారి ఇల్లు, పిల్లలు, ఒకప్పటి వైభోగం, కాలక్రమంలో చితికిపోవడం, కుటుంబంలో మగపిల్లల అకాల మరణాలు, కుటుంబం చెదిరిపోవడం – అన్నీ వివరిస్తారు. భాస్కర్రావు గారికి కిరసనాయిలు పంతులుగారనే పేరెందుకు వచ్చిందో తెలుసుకోడం ఆసక్తిగా ఉంటుంది. ఆ పంతులుగారు రచయిత్రికి మాతామహులు. పంతులుగారి ఇంటిని రచయిత్రి వర్ణించిన విధానం చదువుతుంటే, కళ్ళారా చూస్తున్నట్టే ఉంటుంది.
‘నరసన్న తీర్థం’ కథలో భార్య భ్రమర కోరిక మీద ఆమెను పట్టిసీమ నుంచి పాపికొండలకి వెళ్ళే లాంచీ ఎక్కిస్తాడు శివరావు. ఆ ప్రయాణాన్ని ఆమెంతగానో ఆస్వాదిస్తుంది. హనీమూన్‌కి విమానంలో వెళ్ళినప్పుడు కూడా ఆమెలో అంత ఆనందం తాను గమనించలేదంటాడు. అప్పుడు భ్రమర తనకి లాంచీ ప్రయాణమంటే ఎందుకంత ఇష్టమో చెప్తుంది. ఈ క్రమంలో లాంచి నిర్మాణం ఎలా ఉంటుందో భ్రమర చేత చెప్పిస్తారు రచయిత్రి. నరసన్న తీర్థం చరిత్ర తెలుసుకోదగ్గది. ఈ తీర్థంలో జరిగే హడావిడి చదువుతుంటే, మనం కూడా ఆ తీర్థంలో తిరుగాడినట్టుంటుంది.
‘గోదారమ్మ ఒడి’ చక్కని సందేశం నింపుకున్న కథ. గోపా అని పిలవబడే రాజగోపాలయ్యకి చిన్నప్పటి నుంచి గోదారంటే ప్రేమ కలుగుతుంది. ఎప్పుడు చూసిన నది దగ్గర ఉండేవాడు. నీటిలో పడితే ప్రమాదమని తల్లి భయపడితే, తండ్రి ఈత నేర్పి, ఈతలో కిటుకులు నేర్పి సుడిగుండాలనుంచి తప్పుంచుకునే చిట్కాలు చెప్పి గోపాని గజఈతగాడిని చేస్తాడు. పెరిగి పెద్దయిన గోపా పెళ్లి చేసుకుని కొడుకుని కంటాడు. ఆ కొడుకు పెద్దయి ఇంజనీరు అవుతాడు. కోడలు పద్మకి అభిజాత్యం ఎక్కువ. అత్తగారిని మామగారిని నానా మాటలు అంటుంది. భార్య చనిపోయాకా, ఒంటరివాడైపోతాడు గోపా. ఓ రోజు కోడలు అతన్ని మరీ వేధించి, గోదాట్లో దూకి చావరాదా అని కసురుకుంటుంది. అభిమానవంతుడైన గోపా వెళ్ళి గోదావరి గట్టు ముందు నిలబడతాడు. ఆ రోజు విపరీతమైన వాన కురుస్తూంటుంది. గోదారికి వరద వచ్చి పెద్ద అలలా నీరు ఉధృతంగా ఎదురొస్తుంది. గత ఈతగాడయిన గోపా ఆ క్షణంలో తనని తాను గోదావరికి అప్పగించేసుకుందామనుకుంటాడు. ఏం జరిగినా ఈదకూడదని అనుకుంటాడు. తర్వాత ఏం జరిగిందో, అమ్మలాంటి గోదావరి అతనికి ఏం సందేశమిచ్చిందో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే.
ఊరు ఊరంతా వెటకారంగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో ‘మరిడయ్య గారి ముటముటలు’ కథలో తెలుస్తుంది. ఆయుర్వేద వైద్యుడైన మరిడయ్యకి కాస్త చిరాకెక్కువ. మందులు కట్టడం కాస్త తాపీగా చేస్తాడు. జనాలు అంత నింపాదితనాన్ని తట్టుకోలేరు. సెటైర్లు వేస్తారు. ఆయనేం తక్కువ కాదుగా, మాటకి మాట అంటిస్తాడు. వెటకారంలోని ‘కారం’ మంట ఈ కథలో తెలుస్తుంది. గోదారోళ్ళకే సొంతమైన మాటతీరుతో నవ్వించడానికి కల్పించి అల్లిన కథ ఇది.
‘మూగమనసులు మేడ’ కథలో నర్సాపురంలో ప్రసిద్ధమైన డచ్ వాళ్ళ బిల్డింగ్ – డచ్చోళ్ళ బిల్డింగ్ గురించి ఓ పాత్రతో చెప్పిస్తారు. డచ్చోళ్ళ బిల్డింగ్ అనే కన్నా మూగమనసులు మేడ అంటే అందరికీ తెలిసిపోతుంది. మూగమనసులు సినిమాని ఎక్కువ భాగం షూటింగ్ ఆ ఇంట్లో చేశారు. ఆ సినిమా అసలెలా పుట్టిందో చెప్పిస్తారు. తరువాత ఆ భవంతిలో చిత్రీకరించిన సన్నివేశాల గురించి, ఆయా నటీనటులకు బస, ఆతిథ్యం సమకూర్చిన గృహస్థుల గురించి, గుర్రంబండి ఇచ్చిన కురిసేటి కృష్ణమూర్తి గారి గురించి, గోదావరి నదిలో, ఒడ్డున చిత్రీకరించిన సన్నివేశాల గురించి ఈ కథలో తెలుసుకోవచ్చు.
అమ్మ కాని అమ్మ అన్నవరం గురించి ‘మాతృత్వం’ కథలో చదవచ్చు. నిందలు మోస్తూనే ఊరివారికి ఎన్నో సేవలు చేస్తుందామె. మంచి కథ. ఆధునికత అంటే ఏమిటో, అది దేనిలో ఉండాలో సత్యవేణి తన కూతురు మంజుల చెప్పిన మాటలు అక్షరసత్యాలు.
లేనిపోని మాటలు చెప్పి మనుషుల మధ్య తంపులు పెట్టే గాలిరాజు లాంటి వాళ్ళని దూరం పెట్టాలని ‘సుడిగాలిరాజు’ కథ చెబుతుంది. అమెరికా వెళ్ళొచ్చిన మూర్తిగారిలో డాంబికం ఎలా మొదలయ్యిందో, ఎన్నారై మూర్తి ఎలా అయ్యాడో, కొన్ని సంఘటనలు జరిగిన మీదట మళ్ళీ నర్సాపురం మూర్తిగా ఎలా మారాడో ‘ఎన్నారై మూర్తి’ కథ చెబుతుంది. ఎన్ని యంత్రాలొచ్చినా మంచి చెడ్డా చెప్పుకోడానికి మనిషికి మనిషి అవసరం అని చెప్తుంది ‘కృష్ణవేణి’ కథ.
హేళలను, అవమానాలను ఎదుర్కుని, జీవితంలో ఎదిగి, మరికొందరికి ఉపాధి కల్పించిన వేదవతి ప్రస్థానాన్ని అత్యంత స్ఫూర్తిదాయకంగా చెబుతుంది ‘తుమ్మమొద్దు’ కథ. తిండిపుష్టి ఉన్న అత్తగారికి వండిపెట్టలేక విసుక్కునే కోడలు కళ్యాణి కథ ‘తినదగు నెయ్యది తట్టిన’. ఇంతకీ ఆ జిహ్వచాపల్యం ఉన్న అత్తగారి పేరేమిటో తెలుసా? మండోదరి!
పెపంచం మెచ్చాలంటే రీల్సాడాలని భ్రమపడిన రంగమ్మ రీల్స్ మాయలో పడి తనకు తాను చేసుకున్న నష్టాన్ని కువైట్ నుంచి తిరిగొచ్చిన ఆమె భర్త కనకయ్య కొంతైనా పూడ్చాలని చూస్తాడు. ‘రీల్స్ రంగమ్మ’ కథలో కనకయ్య పాత్ర ద్వారా కొన్ని జీవిత సత్యాలను చెప్తారు రచయిత్రి.
స్త్రీకి ఆర్థిక స్వతంత్ర్యం ఉండడం ఎంత అవసరమో, ‘ఆమెకూ అవసరాలుంటాయి!’ కథ చెబుతుంది. అసలైన ప్రేమంటే ఏమిటో, ఆ ప్రేమ ఎలా ఉంటుందో ‘కొన్ని ప్రేమలిలాక్కూడా’ కథ చెబుతుంది.
దైవానుగ్రహం ఉంటే, మనుషులు ఎంత హాని చేద్దామని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు వికటిస్తాయని, ఎదుటివారి ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని, తాము ప్రయోజనం పొందాలని చూసేవాళ్ళ పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని, ‘చిన్నమ్మలు’ కథ చెబుతుంది. పరాయిదేశానికెళ్ళి డబ్బు సంపాదించుకు రావచ్చని ఎవరైనా ఒత్తిడి చేస్తున్నప్పుడు – అప్పటికే ఆ ఊరెళ్ళి కొన్నాళ్ళు పనిచేసి వచ్చినవారి అనుభవాలు తెలుసుకోడం ఎంతో మేలు అని ఈ కథ సూచిస్తుంది.
అన్నం విలువ, అన్నం వండడం, వడ్డించడంలోని పవిత్రతని గొప్పగా చెప్పిన కథ ‘అన్నం పరబ్రహ్మం’. అమృతం లాంటి అన్నం విషతుల్యం ఎందుకవుతోందో అనుభవజ్ఞుడు గేదెల్రాజు గారు చెప్పిన విషయాలు అందరూ ఆలోచించదగ్గవి.
‘శ్రీనగజా తనయం’ కథలో ప్రసిద్ధ హరికథా భాగవతార్ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితులు గారి జీవితాన్ని, వారి కృషిని గొప్పగా వివరించారు రచయిత్రి.
~
స్వర్గీయ బి.వి. నాగేంద్రబాబు గారు, కూచి సాయి శంకర్ గారు వేసిన వర్ణచిత్రాలకు ఆయా కథలకు అద్భుతంగా నప్పాయి.
ఈ కథలు నవ్విస్తాయి, ఆలోచింపజేస్తాయి, ఆర్ద్రంగా హృదయాన్ని తాకుతాయి, కొండొకొచో కంటిలో చిరుచెమ్మని తెప్పిస్తాయి. మొదలుపెడితే ఆపలేం, unputdownable book అన్న మాట! రంగుల చిత్రాలు, గ్లాసీ కలర్ పేపర్ మీద ముద్రించిన ఈ పుస్తకం అత్యంత నాణ్యతతో కూడినదని చెప్పడంలో సందేహం లేదు.
***
రచన: భావరాజు పద్మినీ ప్రియదర్శిని
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
పేజీలు: 136
వెల: ₹ 350/-
ప్రతులకు:
అచ్చంగా తెలుగు ప్రచురణలు, హైదరాబాద్.
ఫోన్: 8558899478 (వాట్సప్ మాత్రమే)
~
నవోదయా బుక్‍హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000413413
~
ఆన్‌లైన్‌లో
https://www.amazon.in/gp/product/B0FS1913W6
~
శ్రీమతి భావరాజు పద్మినీ ప్రియదర్శిని గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-bhavaraju-padmini-priyadarshini/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.

