ఊర్లో అందరూ అడవి వైపు పరుగులు తీస్తున్నారు. అడవి మొదట్లో పులి చచ్చి పడి ఉంది అన్న వార్త తెలిసి అందరూ చూడటానికి బయలుదేరారు. అడవిని చేరుకున్నారు. నిజంగానే పులి చచ్చిపోయింది. ఏదో అనారోగ్యంతో చనిపోయినట్లుగా ఉన్నది. అందరూ పులిని ఆశ్చర్యంగా చూస్తున్నారు గానీ చచ్చిన పులి చుట్టు తిరుగుతున్న పులి కూనను ఎవరూ పట్టించుకోవటం లేదు.
రంగయ్య మాత్రం ఆ పసి కూనను తనతో పాటు తీసుకువచ్చాడు. రంగయ్య దగ్గర ఆవులు ఉన్నాయి. చిన్న పులి కూనను ఆవు దగ్గర వదిలి పెట్టాడు. ఆవు దగ్గరకు తీసుకున్నది. తన పాలు ఇచ్చింది. తన శత్రువైన పులి బిడ్డ అయినప్పటికీ తల్లిని కోల్పోయిన బాధలో ఉన్న పులికూనకు ఆకలి తీర్చింది.
పులి రోజు ఆవు దగ్గరే పాలు తాగుతున్నది. ఆవును తన తల్లి లానే భావిస్తున్నది. ఆవు కూడా తన బిడ్డ వలె ప్రేమిస్తున్నది. కొంత కాలానికి పులి కూన కొంచెం పెద్దదయింది. పాలు తాగే వయసు దాటింది. రంగయ్య పులికూనను అడవిలో వదిలే సమయం వచ్చిందని భావించాడు. దానికి తల్లి అవసరం తీరిపోయింది. ఒకనాడు పులికూనను అడవిలో వదిలి పెట్టి వచ్చాడు రంగయ్య.
కొంత కాలానికి రంగయ్య తన ఆర్థిక పరిస్థితి బాగా లేనందున తన ఆవును పక్కూరి రైతుకు అమ్మేశాడు. ఆవు పాలిచ్చినన్నాళ్ళు రైతు అవుకు గడ్డి పెట్టాడు. ఆ తర్వాత ఆవు ముసలిదై పోయిందని కటికోళ్ళకు అమ్మేశాడు రైతు.
కటికోళ్ళు ఆవుల్ని కోసే పాక ఊరి వెలపల ఉన్నది. ఈ ఆవును అక్కడకు చేర్చారు. రెండు రోజుల్లో ఈ ఆవును నరికి ముక్కలు చేసి మాంసం అమ్ముకోవాలని అనుకున్నారు. దీనంగా ఆ పాకలో పడి ఉన్నది ఆవు.
ఆ రాత్రి వేళ అడవి నుంచి ఒక పులి ఈ పక్కకు వచ్చింది. ఏదైనా ఆహారం దొరుకుతుందేమోనని. అక్కడ ఆవు నీరసంగా పడుకొని ఉంది. పులి వచ్చి ఈ ఆవును చూసి గుర్తు పట్టింది. తన చిన్ననాడు తనకు పాలిచ్చిన ఆవు ఇదే. పులి ఎంతో ప్రేమగా ఆవును పలకరించింది. ఆవు ఎంతో సంతోషపడింది.
పులి ఆవు కట్లు విప్పింది. తనతో పాటు ఆవును అడవికి తీసుకెళ్ళింది. ఆవును తల్లిలా ప్రేమగా చూసుకున్నది. రోజు ఆవు కోసం గడ్డి తెచ్చేది. ఆవు బతికున్నంత కాలం పులి చక్కగా ఆకలి దీర్చింది. రక్షణగా ఉన్నది తనను చిన్నతనంలో ఆదుకున్నందుకు కృతజ్ఞతతో అవును తల్లిలా పోషించింది. క్రూర జంతువైన ధర్మాన్ని వీడలేదు.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.