[నెల్లుట్ల సునీత గారు రచించిన ‘ఆవిష్కృతి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆమె ఉనికి కోసం
మనుగడ కోసం
కళ్లెం వేసి నియంత్రించిన
కట్టుబాట్ల బంధనాలను
తెంచుకొని
తనను తాను ప్రతినిత్యం
చెక్కుకుంటూనే ఉంది
రెప్పల చాటున
దాగిన స్వప్నాల్ని
సాకారం చేసుకుంటూ
దిగంతాలను ఆవహించిన
శూన్యాన్ని ఛేదిస్తూ
ఖగోళ విస్ఫోటనమై
ప్రకంపిస్తూ
గగనతలానికి బాటలు వేసింది
ఆలోచన సాగరమై
ఆశయమే ఆలంబనగా
ప్రగతి రథచక్రాలు
చేతబూని
విజయ బావుట ఎగరవేసింది
ఆటుపోటుల అగ్ని పరీక్షల
సాములో పునీతమై
అన్నిరంగాల్లో అభినివేశమై
ఆకాశంలో సగమైన ఆమె
తనను తాను సరికొత్తగా
ఆవిష్కరించుకుంటుంది.
శ్రీమతి నెల్లుట్ల సునీత కథా రచయిత్రి, కవయిత్రి, సంపాదకురాలు. నూతన సాహిత్య ప్రక్రియ సున్నితం సరళ శతకం రూపకర్త్రి. విమెన్ రైటర్స్ అసోసియట్ వ్యవస్థాపకురాలు, సాహితీ బృందావన విహార జాతీయ వేదిక వ్యవస్థాపకురాలు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పాతర్ల పహాడ్ జన్మించిన సునీత గారి ప్రస్తుత నివాసం ఖమ్మం. యం. ఎ., యం.ఎడ్ (M A M.ed) చదివి, ఓ ప్రైవేటు విద్యా సంస్థలో తెలుగు అధ్యాపకురాలుగా పని చేస్తున్నారు.
సామాజిక, ఆధ్యాత్మిక వ్యాసాలు, కవితలు, కథలు, బాల గేయాలు, పాటలు, బాలల కథలు, మినీ నవల, సున్నితాలు, హైకూలు, నానీలు, పలు ప్రక్రియలలో పరిచయం ఉంది.
సేవలతో పాటు సాహిత్య సేవలు తెలుగు భాష కోసం సేవలందిస్తూ ఉత్తమ రచనలకు సన్మానాలు, అవార్డులు, నగదు బహుమతులు గెలుచుకున్నారు. యూఎస్ఏ ఎఫ్ఎం రేడియోలో కెనడా ఎఫ్ఎం రేడియోలో కవితలు ప్రసారమయ్యాయి. పలు యూట్యూబ్ ఛానల్స్‌లో పాటలు, కవితలు, కథలు ప్రసారమయ్యాయి. పత్రికలలో కథలు, కవితలు, సంకలనాలలో ప్రచురితమయ్యాయి. పలు పుస్తకాలకు ముందుమాటలు రాశారు. వివిధ సాహితీ సంస్థలు నిర్వహించిన కవిత పోటీలకు న్యాయ నిర్ణయితగా వ్యవహరించారు.