[శ్రీ ఎం.వి.ఎస్. రంగనాధం గారి ‘ఆవకాయ ప్రాశస్త్యము’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
కం.
ఆంధ్రప్రదేశ మందు పు
రంధ్రులు పెట్టున దనేక రకములను, ప్రవా
సాంధ్రులు సైతము మెచ్చెడి
యాంధ్రత్వమె యావకాయ యవసధ నిధిగన్.
(పురంధ్రి = కుటుంబమును పోషించు స్త్రీ, ప్రవాసాంధ్రుడు = ఇతర దేశాలలో ఇతర రాష్టాలలో నివాస ముంటున్న తెలుగువాడు, సైతము = కూడా, మెచ్చు = శ్లాఘించు, ఆంధ్రత్వము = తెలుగు జాతి వైశిష్ట్యము, అవసధము = గృహము, నిధి = నిక్షేపము)
ఆంధ్రప్రదేశంలో కుటుంబ స్త్రీలు అనేక రకాలుగా (పాతిక పైగా) పెట్టేది, ఇతర దేశాలలో ఇతర రాష్టాలలో ఉంటున్న తెలుగువాళ్ళు కూడా గృహములో నిధిగా మెచ్చుకునే తెలుగు జాతి వైశిష్ట్యమే ఆవకాయ. అంటే, భోగ భాగ్యాలు కలిగించి సంపన్నులను చేసే నవనిధులతో పాటు, ఆవకాయ పదియవ నిధి అన్నమాట.
కం.
మావిడి ముక్కల పులుపును,
యావల పొడి, యుప్పు, కార మాచ్ఛాదింపన్,
నూవుల నూనెను యూరగ
యావ గొలిపె, యావకాయయై యాణెమునన్.
(మావిడి = మామిడి, ఆవలు = ఆవాలు, ఆచ్ఛాదించు = కప్పు, నూవులు = నువ్వులు, ఊరు = నాను, యావ = మిక్కుటమైన ఆసక్తి, కొలుపు = పుట్టించు, ఆణెము = దేశము)
మామిడికాయ ముక్కలలో ఉన్న పుల్లని రుచిని ఆవాల పొడి, ఉప్పు, కారము కప్పివేయగా నువ్వులనూనెలో ఊరి ఆవకాయగా దేశంలో మిక్కుటమైన ఆసక్తి పుట్టించింది.
కం.
తృష్ణను దాచగ వశమా?
ఉష్ణము తగ్గించు మందు యుష్ణంబె యన్,
యుష్ణకమె యూరుగాయను
కృష్ణిక మధుదూతల రుచికి యదను గాదా?
(తృష్ణ = ఇచ్ఛ, దాచు = మాటుచేయు, వశము = స్వాధీనము, ఉష్ణము = వేడియైనది, ఉష్ణకము = గ్రీష్మఋతువు, కృష్ణిక = ఆవాలు, మధుదూత = మామిడి, అదను = తగిన సమయము)
కోరికను దాచిపెట్టడం కుదురుతుందా? ఉష్ణం తగ్గించడానికి ఉష్ణమే మందు అన్నట్లుగా గ్రీష్మఋతువే ఊరుగాయలో ఆవాల, మామిడికాయల రుచికి తగిన సమయము కాదా?
కం.
అన్నమున యావకాయను
విన్నాణముగాఁ గలుపుచు వేసవి యందున్
వెన్నను నంచుకొనగ రుచి
తిన్నగ స్వర్గంబుఁ జూపి తీర్చును కాకన్.
(విన్నాణము = తగినరీతి, నంచుకొను = కొద్దిగాతిను, తిన్నగ = సరాసరి, కాక = తాపము)
వేసం కాలంలో అన్నంలో ఆవకాయను నేర్పుగా కలుపుతూ వెన్న నంచుకు తింటే వచ్చే రుచి సరాసరి స్వర్గం చూపించి తాపము తీరుస్తుంది.
తే.గీ.
ఆవకాయను కనుగొన్న యాంధ్ర వనిత
యెవ్వరో, యామె ఘనతను యెన్న తరమె,
నోబెలు బహుమానము కూడ న్యూన మగును,
జగతి మరువదు యట్టి కౌశలము నెపుడు.
(ఘనత = గొప్పదనము, ఎన్ను = తెలిసికొను, తరము = శక్యము, న్యూనము = తక్కువైన, జగతి = లోకము, కౌశలము = నేర్పరితనము)
ఆవకాయను కనుక్కున్న ఆంధ్ర వనిత ఎవరో, ఆమె గొప్పదనము తెలుసుకోవడం కుదురుతుందా? నోబెలు బహుమతి కూడా ఆమెకు తక్కువే అవుతుంది. అలాంటి నేర్పరితనాన్ని లోకం ఎప్పుడూ మర్చిపోదు.
కం.
శీతల గిడ్డంగుల నా
బూతిని జాగ్రత్తచేయు భోగము లేలా?
మూతికి గుడ్డనుఁ గట్టెడి
చాతురి మన యావకాయ జాడీఁ జూపన్.
(శీతల = చల్లదనము ఉన్న, గిడ్డంగి = గోదాము, ఆబూతి = ఎక్కువ ఆహారము, జాగ్రత్తచేయు = భద్రపరచు, భోగము = సుఖము, చాతురి = నేర్పు)
మూతికి గుడ్డ కట్టే నేర్పు మన ఆవకాయ జాడీ చూపగా, శీతల గిడ్డంగులలో (cold storage) భారీగా ఆహారము భద్రపరిచే భోగాలు ఎందుకు?
తే.గీ.
ఆవకాయ వెన్న తినిన యవయని యది,
అందుచేతనే, వెన్నుడు యాల మందు
గీత బోధించె చెవియొగ్గ క్రీడి, కాని,
యూరుగాయల నావకాయై రుచింతు,
పాలలోన నవని నేనె, పార్థ! యనక
యుండుటే వెలితి విభూతి యోగ మందు.
(అవయని = శరీరము, వెన్నుడు = శ్రీకృష్ణుడు, కదనము = యుద్ధము, చెవియొగ్గు = శ్రద్ధతో విను, క్రీడి = అర్జునుడు, నవని = వెన్న, పార్థుడు = అర్జునుడు, ఉంట = ఉండుట, వెలితి = లోపము)
ఆవకాయ, వెన్న తిన్న శరీరం అది. అందుకే, శ్రీకృష్ణుడు యుద్ధంలో అర్జునుడు శ్రద్ధతో వినగా భగవద్గీత బోధించాడు. కానీ, ఊరగాయల్లో ఆవకాయ రుచిని నేనే, పాలల్లో వెన్నను నేనే అర్జునా! అని విభూతి యోగంలో అనకుండా ఉండడమే లోపము.
భగవద్గీత 10వ అధ్యాయంలో (విభూతి యోగం) కృష్ణుడు అర్జునునికి తన దివ్య విభూతులలో ముఖ్యమైన వాటిని చెప్పాడు. ఆదిత్యులలో విష్ణువుని, వెలిగించే వాళ్ళలో సూర్యుడిని, మరుత్తులలో మరీచినీ, నక్షత్రాలలో చంద్రుడిని, వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుడిని, ఇంద్రియాలలో మనస్సుని, ప్రాణులలో చేతనత్వాన్ని, రుద్రులలో శంకరుణ్ణి, యక్ష రాక్షసులలో కుబేరుడిని, వసువులలో పావకుడిని, పర్వతాలలో మేరువుని, పురోహితులలో బృహస్పతిని, సేనానాయకులలో కుమారస్వామిని, సరసులలో సాగరాన్ని, మహర్షులలో భ్రుగువుని, శబ్దాలలో ఓంకారాన్ని, యజ్ఞాలలో జపయజ్ఞాన్ని, స్థావరాలలో హిమాలయాన్ని, వృక్షాలలో రావి చెట్టుని, దేవర్షులలో నారదుణ్ణి, గంధర్వులలో చిత్రరధుణ్ణి, సిద్ధులలో కపిల మునిని, గుర్రాలలో ఉచ్చైశ్రవాన్ని, ఏనుగులలో ఇరావతాన్ని, మనుష్యులలో రాజుని, ఆయుధాలలో వజ్రాన్ని, గోవులలో కామధేనువుని, దైత్యులలో ప్రహ్లాదుడిని, మృగాలలో సింహాన్ని, పక్షులలో గరుత్మంతుడిని, పావనం చేసేవాళ్ళల్లో వాయువుని, శస్త్రధారులలో రాముడిని, జలచరాలలో మొసలిని, నదులలో గంగని, విద్యలలో ఆధ్యాత్మ విద్యని, వాదించే వాళ్ళల్లో వాదాన్ని, అక్షరాలలో అకారాన్ని, సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని, నాశనంలేని కాలాన్ని, సర్వతోముఖంగా ఉండే ఈశ్వరుడిని, సర్వాన్ని హరించే మృత్యువుని, ఛందస్సులలో గాయత్రిని, మాసాలలో మార్గశీర్షాన్ని, ఋతువులలో వసంత ఋతువుని, వృష్టి వంశస్తులలో వాసుదేవుడిని, పాండవులలో అర్జునుడిని, మునులలో వ్యాసుడిని, కవులలో శుక్రాచార్యుడిని, నేనే అంటూ ఇలాంటివి ఇంకా చేర్చి పెద్ద పట్టిక చెప్పాడు. కాని, ఆవకాయ, వెన్న గురించి మరిచిపోవడం పెద్ద లోపమే. అందునా, అవి తినడం వల్ల వచ్చిన జ్ఞానంతోనే కదా భగవద్గీత చెప్పగలిగాడు.
ఎం.వి.ఎస్. రంగనాధం గారు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్‌లో డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు.