[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘ఆత్మవిశ్వాసం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
విజయం
విడాకులు తీసుకుందని తెలిసి
అపజయం ఆలింగనం చేసుకుంది
కళ్ళకు వీడ్కోలు చెప్పేస్తూ
చెంపల దారులవెంట చెదిరిపోతూ
కన్నీళ్లు జలజలా జారిపోయాయి
మనసులోని బాధ
తన బాధ్యత ఇంకా ఉందనుకుందేమో
గొంతులో గూడు కట్టుకుని
డగ్గుత్తిక వేసింది
కాళ్ళకు పసరేదో పూసినట్లుగా
కదలకుండా నేలకు అతుక్కుపోయాయి
మోయలేని బరువేదో మోస్తున్నట్టుగా
భారంగా నేలవాలిపోయింది తల
మొహానికి సిగ్గురంగు పూసి
అవమానపు నలుపు ముసుగు వేసి
అందరికీ దూరంగా లాక్కు పోయింది
ఒళ్ళంతా ఆవహించిన ఒంటరితనం
అప్పుడొచ్చింది
వేలువిడిచి వెళ్ళిపోయిన ఆత్మవిశ్వాసం
“పద.. పద.. పద”మంటూ
పట్టుకొచ్చింది మళ్ళీ ప్రపంచంలోకి
“..విజయవేదిక నీకు దూరమైంది
సరే.. కానీ!
పోటీ రంగస్థలం తెరిచే ఉందిగా
ఇకమీదటా తెరిచే ఉంటుందిగా
నీలో నింపుకో నిండుగా నన్ను
మళ్ళీ మళ్ళీ చేద్దాం మనం కలిసి
మరింత మరింత ప్రయత్నం
విజయం సాధించేదాకా
గెలుపు శిఖరంపై నీ జెండా పాతేసేదాకా..”
అంటూ
గుండెల నిండా
ఉత్సాహపు ఊపిరులూదింది
చౌడారపు శ్రీధర్ చక్కని కవి. దీర్ఘ కవితలు వెలయించటంలో దిట్ట.