Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆత్మాభిమానం

[డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు గారు రచించిన ‘ఆత్మాభిమానం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

న్నం కంచం ముందు కూర్చున్న మోహన్, పెద్ద పెద్ద ముద్దలు చేసుకొని ఆరాటంగా, ఇష్టంగా తినటాన్ని చెంపన చెయ్యి పెట్టుకొని చూస్తోంది చంద్రిక. భోజనప్రియుడు, అందులోనూ ఆమె చేసే వంట అంటే ఆయనకు ఇష్టం. ఆయనకు ఇష్టమయ్యేలా కూరలు చేసి పెట్టడమంటే చంద్రిక ఇష్టం.

తలవంచుకొని తింటున్న మొగుడి వంక తదేకంగా చూస్తుంటే లో నుంచి ప్రేమ పొంగుకొని వస్తోంది ఆమెకు.

కండలు తిరిగిన దేహం, కోటేరు తేలిన ముక్క, పెద్ద పెద్ద కళ్ళు. ఆ కళ్ళల్లో సూదంటురాయి చూపులు, సన్నటి మీసకట్టు చూస్తూ ‘ఎంత అందగాడు మా ఆయన’ అనుకుంది అతని విశాలమైన ఛాతీ వంక చూస్తూ.

ఏ భార్యకయినా మొగుడి అందం కళ్ళను ఊరించేదయితే – అతడు తన పట్ల చూపించే ప్రేమ మనసును ఊరించేదై వుంటుంది. అది ప్రతి రోజూ పుష్కలంగా అతని దగ్గరి నుంచి లభిస్తూ వుంటుంది చంద్రికకు. అంతే కాదు, ‘పుచ్చుకోవటమే గాక – ఇవ్వటమూ తెలిసిన’ చంద్రికకు అంతకు రెండింతలు చేర్చి భర్త మనసుకు ఎలా బదులివ్వాలో అది తెలుసు. అందుకే మొగుడంటే అంత ప్రేమ ఆమెలో.

ఉదయం పది గంటలకు ఠంచన్‌గా పనికి వెళ్ళిపోతాడు మోహన్. ఒక్క నిముషం గడియారం ముల్లును ఇటే గానీ అటు మాత్రం కానివ్వడు. రాజమౌళి గారికి ప్లాస్టిక్ వస్తు తయారీ వ్యాపారం ఉంది. దానికోసం ఒక పెద్ద వర్కషాపు, గోడౌను, అద్దెకు తీసుకున్న పెద్ద షెడ్డు ఉన్నాయి. ఆయన దగ్గర రెండువందల మంది దాకా అన్ని కేటగిరీలవాళ్లూ పని చేస్తుంటారు. అంతకు ముందు ప్లాస్టిర్ సామాన్లను కొని మారుబేరానికి అమ్మి ఒక మోస్తరు వ్యాపారం చేసిన ఆయన ఇప్పుడు స్వంతంగా వర్క్‌షాపు పెట్టి వస్తు తయారీ తనే చేసే స్థాయికి ఎదిగాడు. ఎమ్. బి.ఏ చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న మోహన్ ఒక రోజు అనుకోకుండా ఆయనకు తారసపడ్డాడు. ఆ మాటతీరు, ఆ తెలివితేటలు, ఆ సమయస్ఫూర్తి, ఆ కష్టపడే తత్వం చూసి చాకులాంటి కుర్రాడని కనిపెట్టి తన దగ్గర ఉద్యోగం ఇప్పించాడు. వంచిన తల ఎత్తకుండా పని చేస్తూ వాపారాభివృద్ధికి తగిన సూచనలు, సలహాలూ ఇస్తూ సిన్సియర్‍గా, నమ్మకంగా ఒళ్లు కూడా వంచి పని చేసే మోహన్ రాజమౌళికి తెగ నచ్చేసాడు. అతను వచ్చాక తన వ్యాపారం ఎంత అభివృద్ధి అయిందో లెక్కలేసుకుంటే ‘బాపురే’ అనిపించి లోలోపలే మురిసిపోయాడు. అతనిలోని క్వాలిటీస్ బయటకు పొక్కితే మరే వ్యాపారస్థుడైనా ఎక్కువ జీతం ఎర చూపి మోహన్‌ని ఎగరేసుకుపోతాడేమో అన్న భయం రాజమౌళికి మెంటల్ పీస్ లేకుండా చేసింది. అందుకే ఇరవైవేల నుంచి అకస్మాత్తుగా లక్ష రూపాయలు పెంచేసి, తన ఇంటి కాంపౌడ్  లోనే టూ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి అతన్ని తన దగ్గరే ఉంచేసుకున్నాడు. ఫాక్టరీ ఉద్యోగుల మీద అజమాయిషీని, వస్తు తయారీ మీద అన్ని బాధ్యతలనూ అతనికి అప్పచెప్పి నిశ్చింతగా కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు రాజుమాళి. లాభాల లెక్క చూసుకోవటం ఒక్కటే ఆయన పని అన్నట్టు అయిపోయింది.

తన శక్తి గురించి తనకు తెలియని ఆంజనేయుడిలా తనేంటో తనకు తెలియని మోహన్ అకస్మాత్తుగా తన యజమాని తనకు అంత జీతం పెంచేయటం, ఉండటానికి ఇల్లు కూడా ఇవ్వడంతో ఉబ్బితబ్బిబ్బయి పోయాడు. కనపడ్డ వాళ్ళందరికీ ‘నా శాలరీ ఎంతో తెల్పా లక్ష రూపాయలు- మా యజమాని చాలా మంచి మనిషి’ అని చెప్పుకొని మురిసిపోవటం మొదలుపెట్టాడు.

ఊళ్లో ఉండే తల్లిదండ్రులూ, సిటీలో కొడుకు చేస్తున్నది ‘అదెంత పెద్ద ఉద్యోగమో’ అనుకుంటూ వాళ్ళు ఊరంతా చెప్పుకొని మురిసిపోతున్నారు. ఆమధ్య బ్లాక్ ప్యాంటు, వైట్ షర్టు, మెళ్ళో టై వంటి డ్రస్ కోడ్ కూడా పెట్టి “నువ్వు ఈ కంపెనీ మేనేజరువి కనుక ఆ డిగ్నిటీని నువ్వు మెయిన్‍టెయిన్ చెయ్యాలి” అని చెప్పి అందలం ఎక్కించడంతో ఆ సూటూ బూటూ లోని దొరతనం చూసి ఊరి జనం కూడా గర్వపడిపోయారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ‘మేం పిల్లనిస్తాం అంటే – మేం పిల్ల నిస్తామ’ని ఇంటి చుట్టూ తిరిగారు. అందులో చంద్రిక తండ్రి కూడా ఉన్నాడు. చూసిన అందరి అమ్మాయిలలోనూ చంద్రిక అందంలో, అణకువతో మేలు అని అనిపించి తనతో పెళ్ళి నిశ్చయం చేసారు మోహన్ తల్లిదండ్రులు. వాళ్ళ పెళ్ళయి సంవత్సరం అయింది. సర్టిఫికెట్ల చదువులు ఎక్కువగా చదవక పోయినా లోకాన్ని – ఆ లోకం లోని మనుషులను బాగానే చదవటం వచ్చిన చంద్రిక వచ్చినప్పటి నుంచీ యజమాని రాజమౌళిలోని వ్యాపారస్థుణ్ణీ, ఆయన దగ్గర పని చేసే భర్త మోహన్ లోని తెలివితేటలను, చురుకుదనాన్ని, పనంటే ఉంటే ఇష్టాన్ని, కష్టపడే తత్వాన్ని అన్నీ గమనిస్తూనే వుంది. తన ఆలోచనలకు, అంచనాలకూ ఒక రూపాన్ని మనసులో తెస్తూనే వుంది.

అలా వాటికి ఒక రూపం ఏర్పడినప్పటి నుంచీ చంద్రిక మనసులో ఏదో అశాంతి, అసంతృప్తి. వాటికి రోషం, పౌరుషం అభిమానం తోడై ఆమె మనసును అల్లకల్లోలం చేస్తున్నాయి. భర్తకు ‘ఏదో చెప్పాలి. ఏదో చెప్పాలి ‘ అని మనసు ముందడుగు వేస్తున్నా – ఎలా చెప్పాలి? ఏమని చెప్పాలి? ‘నేను చెప్పేది కడివెడు పాలలాంటి ఆ యజమాని, ఉద్యోగిల బంధంలో విషపు చుక్కగా మారి, మోహన్‌కి ఉన్న ఆశ్రయాన్ని పోగొట్టుకునే పరిస్థితిలో పడేస్తే, అప్పుడు ఉన్న అవకాశాన్ని నేనే చెయ్యిజార్చిన దాన్ని అవుతాను కదా – అసలు భర్తకు ఈ సున్నిత విషయాన్ని చెప్పడం ఎలా? చెబితే అర్థం చేసుకుంటాడా? నన్ను ఆయన శ్రేయోభిలాషిగా భావిస్తాడా లేక వాళ్ళిద్దరి మద్యా మనస్ఫర్థలు లేపటానికి వచ్చిన శత్రువుగా భావిస్తాడా?’ అన్న ఆలోచనలతో సతమతమవుతూ వుంది చంద్రిక,

***

ఆ రోజు చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నాడు మోహన్. చంద్రిక మౌనంగా, మితభాషిత్వంతో ఉంది.

ఆమె తల వంచుకొని పనిచేసుకుంటూ వుంటే అతను హుషారుగా చెప్పుకుంటూ పోతున్నాడు.

“చందూ – మా రాజమౌళి సార్ ఎంత మంచివాడో తెలుసా? నేనంటే ఎంత ఇష్టమో ఆయనకు. నా తెలివితేటలను, నా పనినైపుణ్యాన్ని ఎంత మెచ్చుకుంటూ వుంటాడో ఎప్పుడూ. ‘నువ్వు లేకుంటే ఈ నా బిజినెస్ లేదు మోహన్!’ అని అంటూ ఉంటాడు. నా కోసం మన ఇంటికి రేపు ఏ.సి. కూడా పెట్టిస్తున్నాడు మా రాజమౌళి సారు” అన్నాడు మోహన్.

“ఎప్పుడూ మీకు ఇక ఆ రాజమౌళి సార్ జపమేనా?” తనకు తెలియకుండా తనలో తలెత్తిన అసహనం, చిరాకులతో విసురుగా అంది చంద్రిక. ఆశ్చర్యపోయాడు మోహన్. అది చూసి కొంచెం తత్తరపడింది చంద్రిక.

“ఏమయింది నీకు సడన్‍గా ఎందుకలా అరిచావ్?”

“ఏం లేదు గానీ ఏ.సి. రేటు ఎంత వుంటుంది?”

“ముప్పయి వేలుండొచ్చు. “

“అందుకు త్రిబుల్ లాభమేదో ఆయనకు మీరు చేసిన పని వల్ల వచ్చివుంటుంది. అందుకే ఇస్తున్నాడు. వ్యాపారస్థులు వాళ్ళకు లాభం లేకుండా ఏ పని ఎవరికీ అప్పనంగా చెయ్యరు. అది తెలుసుకోండి.”

“అవునూ – నీకు మా సార్ అంటే ఎందుకు అకారణంగా అంత కోపం?”

“ఆయన మీద కాదు – మీ మీద!”

“నేనేం చేసాను? సిన్సియర్‌గా, హార్ట్‍వర్క్‌తో పని చెయ్యటం తప్పేనా? నాకు ఉపాధి కల్పించి మంచి జీతం ఇస్తున్న మా సార్ పట్ల కృతజ్ఞతను కలిగివుండటం తప్పేనా?”

“కృతజ్ఞత తప్పుకాదు – కానీ బానిస మనస్తత్వం కలిగివుండటం ‘తప్పు’ అని అనను గానీ ‘ఆత్మాభిమానం లేకపోవటం’ అంటాను. అది ఎదుటి వాళ్ళకు చిరాకు పుట్టిస్తుంది – ఆ ఎదుట వున్నది భార్య అయితే మరినూ!”అంది చంద్రిక కుండబద్దలు కొట్టేస్తూ.

“నువ్వేమంటున్నావో నాకు అర్థం కావటం లేదు!”

“ఆలోచించండి – మీకే అర్థమవుతుంది. అవునూ – నాకొక డౌట్. మీ కంపెనీలో ఎ టు జడ్ అన్ని పనులూ మీరే దగ్గరుండి చూసుకుంటారు కదా. ఏదయినా మిషన్ పాడయితే మెకానిక్ వచ్చే దాకా ఆగకుండా మీరే ప్రోబ్లమ్ ఏమిటో కనిపెట్టి రిపేర్ చేస్తారు కదా – ఆఖరికి కరెంట్ స్విచ్ బోర్డులో ప్యూజు ఏదయినా ఎగిరిపోతే ఎలక్ట్రిషియన్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే టైమ్ వేస్ట్ అవుతుందని స్క్రూడ్రైవర్ పెట్టి బాక్స్ ఓపెన్ చేసి ఫ్యూజు వైర్ మీరే వేస్తారు కదా A Z గారూ! మరి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్‌లో లాభనష్టాల లెక్కలు వేసుకునేటప్పుడూ మీరు అక్కడే ఉంటారా? ఈ సంవత్సరం మీ కంపెనీ ఎన్ని కోట్ల లేక లక్షల లాభాలు గడించిందో మీరు చెప్పగలరా?” అని సూటిగా భర్త కళ్ళలోకి చూస్తూ అడిగింది చంద్రిక. అనుకోకుండా ఎదురైన ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయాడు మోహన్.

“అది.. అది.. కంపెనీ CA లు చేసే పని. నేనెలా చేస్తాను?”

“మీరు చేస్తారా అని అడగలేదు నేను – ‘ఎంత లాభం వచ్చిందో మీ కంపెనీకి మీకు తెలుసా?’ అని అడిగుతున్నాను.”

“తెలవదు!”

“అదే వ్యాపార రహస్యం అంటే. కంపెనీ పనులన్నింటినీ మీ చేతుల్లో పెట్టిన మీ యజమాని కంపెనీ లాభనష్టాల బ్యాలన్స్ షీట్‍ని మాత్రం మీకు చూపించడు. చూపిస్తే లాభాలలో వాటా అడుగుతారేమోనని భయం. ‘నీ లాబాలకు నేనే కారణం’ అని ఎదురు తిరిగి ప్రశ్నిస్తారేమో, క్రెడిట్ మీరు కొట్టేస్తారేమో, ‘నాకేమిస్తావ్?’ అని అడుగుతారేమోనని భయం! అయినా అన్యాయం చేస్తున్నానన్న ఆలోచన, ఇది శ్రమదోపిడి అన్న అపరాధ భావం తనలో లేకుండా ఉండటం కోసం -మిమ్మల్ని కొంచెం సంతోషపెడితే మీరు ముందుముందు మరిన్ని లాభాలను, తెచ్చిపెడతారన్న తనలోని ఆశను తృప్తిపరచడం కోసం కుక్కకు బిస్కట్ వేసినట్లు – మీకు ఉండటానికి ఓ ఇల్లు, పెంచిన జీతం, ఏ.సి. వంటి మిషన్లు ఎరగా వేస్తున్నారు. దానికే మురిసి ముక్కలయ్యే అల్పసంతోషులైన మీరు కృతఘ్నత అనే స్వామిద్రోహం నాలో ఎక్కడ ప్రవేశిస్తుందోనని భయపడి ‘కృతజ్ఞులై’ పడివుంటున్నారు. ఏ విషయాన్నయినా లోతుకు దిగి లోపలి భావాన్ని, ఆలోచనలను కనిపెట్టకుండా పైపైన జీవితాన్ని, ఇతరుల మనస్తత్వాన్ని చూస్తూ పోతే ఫలితం ఇలాగే నాసిరకంగా ఉంటుంది. Life కు కావలిసింది Clarity, Quality. ఆ రెండు లోపిస్తే అంతా బాగున్నట్టే అనిపిస్తుంది. సర్దుబాటు తత్వం అనేది మనిషిలో ఉండాల్సింది పరిస్థితుల వల్ల, విధి పట్ల, అంతేగానీ స్వార్థపరుల దగ్గర కాదు. ఆ స్వార్థంతో మనుషుల జీవితాలను ఒక ఆట ఆడుకునేవాళ్ళ దగ్గర కాదు” అంది చంద్రిక ధాటిగా.

భార్య ఒక్కో మాటా ఒక్కో సుత్తి దెబ్బ అయి గుండె లోపల ఎక్కడో తగులుతుంటే మోహన్‌లో అన్నాళ్లుగా కరుడు కట్టుకొని పోయిన ఆలోచనల గడ్డ తీగలు సాగటం మొదలుపెట్టింది.

***

ఈ మధ్య మాటలు తగ్గించి, ప్రభు ప్రశంస పక్కకు పెట్టి దీర్ఘాలోచనలో వుంటున్న భర్త మోహన్‌ను ఉద్దేశించి అంది చంద్రిక – “ఎందుకలా ముభావంగా ఉంటున్నారు నాతో, మీ మనసులో మీ బాస్ పట్ల విషబీజాన్ని నాటే వుద్దేశంతో నేనూ మాట్లాడలేదండీ! మీలోని ఆత్మన్యూనతను బయటికి పంపించటానికి, మీరంటే ఏమిటో మీకు తెలిసి రావటానికి మాత్రమే అలా మాట్లాడాను.

ఏమీ లేని వాడు యాచకుడిలా బతకొచ్చు. ఒకరి ముందు చెయ్యీ జాచొచ్చు తప్పులేదు. కానీ అన్నీ వున్నవాడు నలుగురిని పోషించే స్థాయికి ఎదగాలి గానీ బిచ్చగాడి స్థాయికి దిగజారి పోకూడదు అన్నది నా అభిప్రాయం.

రాజసం ఉట్టిపడే పర్సనాలిటీ, అద్భుతమైన తెలివితేటలు, నిర్వహణ సామర్థ్యం అన్ని ఉన్న మీరు ఇలా కుంచించుకపోయి జీవించటం నాకు నచ్చటం లేదు. నెలకు పది లక్షలు సంపాదించగల మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉన్నవాడు లక్ష రూపాయల జీతం చాలా పెద్ద జీతమనుకొని తృప్తి పడిపోతే, అదే గొప్ప అనుకొని గర్వపడిపోతే. ఇక ఈ ఆర్థిక, సామాజిక ప్రపంచంలో మేధావిస్థానం ఎక్కడ? అతనిలోని స్కిల్స్ ఒక యజమాని ఇంటి ముందు అలంకారప్రాయంగా వేళ్ళాడే బంగారు పంజరంలోని చిలకలైపోతే – రాబోయే యువ నిపుణల ఆలోచనా విహంగాలు ప్రపంచవ్యాప్తం కావటానికి తను మార్గదర్శకత్వాన్ని ఎలా నిర్వహించగలడు? ‘ఆకాశమే మీ హద్దు’ అంటూ గగనతలం వైపుకు ఎలా తన చూపుడు వేలును చూపించగలడు?” అని ఆవేశభరిత స్వరంతో చెప్పుకుంటూపోతోంది చంద్రిక.

ఆ మాటలను ఆశ్చర్యంతో చెవి ఒగ్గి వింటున్న మోహన్- ఇన్ని డిగ్రీలు, ఎన్నో సర్టిఫికెట్లు, ఎంతో ఆర్థికశాస్త్రజ్ఞానం వున్న తనకు రాని ఆలోచనలు తన భార్యకు రావడం; తనకు కనపడని.. ఆ అద్భుత దృక్పథాన్ని ఆమె చూడగలగటం చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె మాటల్లోని వాస్తవాన్ని, విశ్లేషణను పునః పరిశీలిస్తే ‘ఎంత నిజమో కదా’ అనిపించింది అతనికి. ‘ఇంత దూరం నేనెందుకు ఆలోచించలేకపోయాను. నా పుస్తక జ్ఞానం, నా తెలివి ఇందుకు పనికి రాలేదెందుకని?’ అన్న ఆలోచనలు అతని మనసును జోరీగల్లా కమ్మేసాయి. ‘ఒక్క చిన్న ఆలోచన ఎంతటి పరిణామాన్ని జీవితంలో తీసుకొని రాగలదో కదా – ఆ ఆలోచన అసలు మనసులోకి రావాలేగాని!’ అనుకున్నాడు.  తన జీవిత భాగస్వామిని అయిన చంద్రిక ఎంత పెద్ద భాగస్వామ్యాన్ని సంపాదించుకోగలిగింది కొద్ది రోజుల్లోనే. ‘ఇది కదా ఆ మాటకు అర్థం అంటే!’ అనుకుంటుంటే భార్య మీద మనసులో ప్రేమ పొంగుకొని రావటం మొదలు పెట్టింది మోహన్‌కి.

ప్రేమావేశంతో ఆమెను అక్కన చేర్చుకుంటూ, “నా జీవిత నావకు చుక్కానివి నీవే చంద్రికా” అన్నాడు.

“‘నా’ కాదు, ‘మన’. మీ ఎదుగుదలే నా ఎదుగుదల – మీ జీవితమే నా జీవితం. విరాట్రూపులయిన మిమ్మల్ని వామనుడిగా చూడలేకపోయాను ఇన్నాళ్ళూ. ఎవరో దయతలచి ఇచ్చిన ఈ ఇంట్లో మనం ఎందుకుండాలి? తన స్వార్థం కోసం, తన ఎదుగుదల కోసం మిమ్మల్ని ఎవరో మెట్టు చేసుకొని మీ మిద కాలుపెట్టి ఎక్కడికో అంతెత్తుకు ఎక్కుతుంటే, అది ఆయన మన కోసం చేస్తున్న మెహర్బానీగా భావించి ఆయన విదిల్చిన దానితో మనం ఎందుకు తృప్తిపడాలి? మనకంటూ ఒక అద్భుత జీవితాన్ని మనం నిర్మించుకోలేమా? అన్నీ వుండీ ఏమీ లేనట్లుండే ఈ శని మనకెందుకు? ఉన్నతంగా ఆలోచించకుండా నేలబారున మనం ఎందుకు ఆలోచించాలి!” అని ధారాళంగా మాట్లాడుతున్న భార్య వంక ఆరాధనా భావంతో చూసాడు మోహన్.

“ఇప్పుడే నేనూ ఒక నిర్ణయానికి వచ్చాను చందూ. రేపే మా కంపెనీ యజమానికి నేను ఉద్యోగం మానేస్తున్నానని చెప్పి రిజైన్ చేస్తాను. ఎల్లుండే ఈ ఇల్లు ఖాళీ చేసి ఒక అద్దె ఇంట్లోకి షిఫ్ట్ అయిపోదాం. -నేనే నా ఓన్‍గా ఓ కంపెనీ స్టార్ట్ చేస్తాను. నేనేంటో కొద్ది రోజుల్లోనే ప్రూవ్ చేస్తాను. ఈ బానిస బ్రతుకుకు ఈ రోజుతో స్వస్తి.” అన్నాడు మోహన్ భార్యను అక్కున చేర్చుకుంటూ.

“ఇప్పుడు మీరు నాకు నచ్చారు” అంది నవ్వుతూ, సిగ్గుతో భర్త గుండెల్లో ఒదిగిపోతూ చంద్రిక.

Exit mobile version