[మణి గారు రచించిన ‘ఆత్మ విలాపం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


నీ దర్బారులో,
నీ ముందు కూర్చుని,
హృదయ వీణ తంత్రులు సరి చేసి, రాగం ఆలాపించాలని!
ఏ రాగమని పాడను?! ఏ రాగం నీ కిష్టం?!.. అనుకునే లోపు,
నేను! నేను! అంటూ అన్ని రాగాలు,
అలజడి చేస్తూంటే
సందిగ్ధంలో నేను!
నువ్వు ఏదయినా చెప్తావేమో అని,
నీకేసి ఆశగా చూస్తాను!
నీ మొహంలో చెరగని చిరునవ్వు!
అది నా ప్రశ్నకా?..
అదే నీ సమాధానమా?..
అర్థం కాక రోజులు గడిచి పోతున్నాయి!
దిక్కు తోచని ఆత్మ విలాపం, జ్వలించి
అగ్ని అయి,
ప్రశ్నలని, సమాధానాలని దహించింది!
అమృతం అయి వర్షించింది!
సందిగ్ధాలకి చోటు ఇవ్వని
సత్యమూ, శివమూ సుందరమూ, అయిన ఆనందాన్ని
ఆవిష్కరించింది!
నిశ్శబ్దాన్ని రాగం చేసుకుని
హృదయ తంత్రులని మీటింది!
నన్ను లయం చేసుకుని,
నీ చిరునవ్వులో సంగీతమై పలికింది!