[డా. కోగంటి విజయ్ రచించిన ‘ఆట నీదే!’ అనే కవితని అందిస్తున్నాము.]
~
ఎప్పుడైనా పాము పటం ఆట ఆడావా
ఎన్ని నిచ్చెనలో ఎన్ని పాములో లెక్కెట్టావా
ఒకటే పెద్ద పాము
ఒకటే పెద్ద నిచ్చెన
చిన్న నిచ్చెనలతో పాటు ఇంకొన్ని చిన్న పాములు అడ్డదిడ్డంగా
ఎక్కడంటే అక్కడే
జీవితమే ఆట కదా
మొదటి పది గళ్ళు బాగానే ఉంటాయి
పదహారు తర్వాతనే గడి పైకో కిందకో దింపేస్తుంది
పందెపు అంకె వేయడం నీ చేతిలో ఉన్నట్టే
ఉంటుంది
కానీ లెక్కే తిరగబడుతుంది
పక్కనున్న వారు గేలిచేస్తుంటారు
అయ్యో ఓడిపోతున్నావే అంటారు
ఏది ఏమైనా పట్టించుకోకు
ఇంతేనా జీవితం అని నిరాశ పడకు
అపుడపుడూ నిన్నలరించే చిన్ని చిన్ని నిచ్చెన పిట్టలూ ఉండచ్చు
నిచ్చెన ఎక్కానని ఆనందపడకు
తదుపరి పందెంకై పాము కాచుకుని ఉంటుంది
ఒక్కోసారి నీ పక్కన కూడా కావచ్చు
ఎదురుపడే నిచ్చెన ఎవరో
పాము ఎవరో గుర్తించు
ఆట మాత్రం ఆపకు
పడినా లేచినా అనుభవమే
పందెపు విసురు గమనించి చూసుకో
నీ ఆట నువ్వే ఆడాలి గదా
విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. పాశ్చాత్య రచయితలను పరిచయం చేస్తూ ‘ పడమటి రాగం’ ఆనే వ్యాస సంపుటిని,
కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. ‘ ద స్పారో అండ్ ద కానన్’ అనే ఆంగ్ల కవితల సంపుటిని 2021 లో ప్రచురించిన డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ‘పైనాపిల్ జామ్’ (2023) ఈయన మొదటి కథా సంపుటి.
డా. కోగంటి విజయబాబు ప్రస్తుతం కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు.
drvijaykoganti2@gmail.com
8309596606