[‘ఆర్ష సంస్కృతి’ అనే శీర్షికతో 13 పద్య కవితలను అందిస్తున్నారు శ్రీ చిరువోలు విజయ నరసింహారావు.]
1.
ఆర్ష సంస్కృతి కాధార మగును వేద
బోధలును, పురాణములును, పూత చరిత
నీతి సూత్రాలు, ధర్మముల్ నెరుపు మనకు
భారతావని మేధస్సు ప్రతిభ తెలుపు
2.
మనసు ప్రాణికి ముఖ్యమౌ, జనులు దాని
నియమముల నియంత్రించగా, నయము కలిగి
దైవ సన్నిధి జేర్చు ప్రాధాన్య మొసగి
ముక్తి మార్గంబు జూపును భక్తి గఱపి
3.
మునులు నిత్య జప తపములను నెరపుచు
యోగ నిష్ఠులై ధ్యానంబు యుక్త రీతి
సలిపి, ఆత్మ విజ్ఞానంబు, సత్య దృష్టి
సత్త్వ గుణ వృద్ధి బడయరే శ్రద్ధ తోడ
4.
ఋషులు వేదముల్ దర్శించ కృషి నొనర్చి
సత్య ద్రష్టలై సాధించి జగతి కొసగి
బ్రహ్మ తత్త్వంబు గఱపిరి భావి తరము
వారు ఫలమంది, ముక్తికై పాటు పడగ
5.
సకల విజ్ఞాన సారంబు ,సత్య శాస్త్ర
విద్యల విశేష ధర్మముల్ విదిత పరచి
విలువ గల గ్రంథముల నిల వెలయ జేసి
మౌని పుంగవుల్ మనకెంతొ మాన్యు లైరి
6.
భారతము, భాగవత, గీత, భవ్య చరిత
రామ కథను, పురాణాది రమ్య గ్రంథ
చయము మన సంస్కృతిని దెల్పి, జయము గూర్చు
ధర్మ బోధ లొనర్చి సత్కర్మ గఱపు
7.
జగతి నున్న వన్నియు నిందు చాల గలవు
ఇందు లేనిది జగతిలో నెందు లేదు
శంక లన్నియు దీర్చగా శక్తి గలది
భారతామ్నాయమై యొప్పు భవ్య రీతి
8.
భక్తి,కర్మయు, జ్ఞానంబు బడయు కొరకు
యోగ విద్య గరప నుపయుక్త మగును
వేద బోధల యజ్ఞముల్ విహిత గతిని
ఆచరింపగ మంత్రాదు లంద జేయు
ముక్తి మార్గదాయిగ జనామోద మొసగు
9.
సంఘమున వ్యక్తి వ్యవహార సరళి గరపు
పతి, సతి, సుత, సంతతికి సంబంధములను
నైతికాచార వివరంబు లీ తరమున
నేర్పి, నడువగా శాస్త్రాలు నియతి దెలుపు
10.
దైవమును గురు భక్తి ప్రాధాన్యతలను
గురువె దైవమన్ సద్భావ మరయ జేసి
సకల పురుషార్థ సాధక సత్పథమున
నడువగా బోధ లొనరించి,నమ్మకమిడు
11.
సకల పరదేశ వాసులు సత్య ధర్మ
బోధలు మన నుండి గ్రహించి,పుణ్య మంద
మన మనీషుల వాక్కుల ఘనత నరయ
మనము నిర్లక్ష్య బుద్ధిచే మరచినాము
12.
జగతి కెల్లను ధర్మంబు ప్రగతి నిడగ
భారతీయ శాస్త్రము లవి ప్రథిత మయ్యె
వాని మాహాత్మ్య మెఱుగంగ పాటు పడక
నమిత నశ్రద్ధ బ్రతుకగా నధము లగుచు
పాపులము గాగ నిత్య దౌర్భాగ్య మగును
13.
మంచి పౌరుల మగుట సమ్మాన మగును
సంస్కృతీ పరులౌట సంస్కార మగును
భారతీయుల మగుట సద్భాగ్యమగును
జగతి కాదర్శ పాత్రులై జయము గనుడు
21 అక్టోబర్ 1939 న జన్మించిన శ్రీ చిరువోలు విజయ నరసింహారావు ప్రవృత్తి రీత్యా కవి. దుర్గా మహాలక్ష్మి, దుర్గా ప్రసాదరావు గార్లు తల్లిదండ్రులు. ఎం.ఎ. విద్యార్హత. రైల్వే మెయిల్ గార్డుగా ఉద్యోగ విరమణ చేశారు. భార్య సత్యప్రసూన. ముగ్గురు కుమారులు.
15 శతకములు ముద్రితములు. రెండు జీవితచరిత్ర గ్రంథాలు వెలువరించారు. అనువాదాలు చేశారు. నీతి శతకములు, సాయి శతకములు తదితర రచనలన్నీ కలిపి 73.
